బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

    ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవాలి, మన పాలకుల విషయంలో. మంచం మీదనుండి దింపేసి, చాప మీద పడుక్కో పెట్టేసిన తరువాత కూడా, ” ఫరవాలేదు.. ధైర్యంగా ఉండండి.. మన ప్రయత్నం మనం చేద్దాం..” అన్నట్టే, పార్లమెంటులొ, ఎటువంటి సందేహాలూ లేకుండా, ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదూ.. అని నొక్కి వక్కాణించి చెప్పినా సరే, మన అధికార పక్ష నాయకులు మాత్రం.. ” అబ్బే ప్రణాలికాసంఘం కదండీ చెప్పిందీ, మరేం పరవాలేదు, ప్రధానమంత్రిగారు కాదు కదా చెప్పిందీ.. మన నాయకుడు, నెలకోసారి ఢిల్లీ వెళ్ళి మాట్టాడుతున్నారుగా.. పనిలో పని మొన్నోసారి సింగపూర్, చైనా, కూడా వెళ్ళొచ్చారూ.. ధైర్యంగా ఉండండి..” మీకెందుకు చూస్తూ ఉండండి.. ఏ దేశం వెళ్తే, వెంటనే తిరిగొచ్చేసి, మన రాష్ట్రాన్నికూడా తను చూసొచ్చిన దేశం లా తయారుచేసేద్దామనడం లేదూ? ఏమిటో మీరు మరీనూ.. కొద్దిగా సహనం ఉండాలండి..” అంటారు. ఓ నాలుగేళ్ళు ఇలా లాగించేస్తే సరీ.. रात गयी बात गयी.. తరువాత మీరెవరో మేమెవరో.. ఈలోపులో ఇంకోటేదో దొరకదా ఏమిటీ? ఒకాయనేమో ” స్వర్ణాంధ్ర” అంటారు. ఇఁకొకాయనేమో పోటీగా “బంగారు తెలంగాణా” అంటారు. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, ఇద్దరిలోనూ ఉన్న సుగుణం- ఇద్దరూ తమ పుత్రరత్నాలని వారసులుగా ప్రకటించేశారు. ఇన్నాళ్ళూ, నెహ్రూ గారి కూతురూ, ఆవిడ కొడుకూ దేశాన్ని భ్రష్టు పట్టించేశారూ అని గొడవచేశారు. మరి వీళ్ళు చేసేదేమిటో? అదృష్టం బాగుండి, దేశం ఓ “పుత్రరత్నం,” రాష్ట్రం ఇంకో ” పుత్ర్రరత్నం ” చేతుల్లోకీ వెళ్ళలేదు. దేశప్రజలు చేసికున్న ఏ పూర్వజన్మ పుణ్యమో కానీ, మన ప్రధానమంత్రిగారికి అసలు ఆ గొడవే లేదు.

    బతికున్న వాళ్ళ సంగతి తరువాత చూసుకోవచ్చూ అనుకుని, “పోయిన” వాళ్ళతో సంపర్కం ఉంచుకోవచ్చుననేమో, భాగ్యనగరం లోని శ్మశానాలని ఆధునీకరణించేసి, అందులో wi-fi కూడా పెట్టేస్తున్నారుట.EENADU – Ts-state News. వాటిని కూడా modernise చేసేస్తున్నారు. ఇన్నాళ్ళూ, ఏ అంత్యక్రియలకైనా వెళ్ళాల్సొస్తే, ఏదో ఆ పోయిన వ్యక్తి గురించి, బాధ వ్యక్తపరచి, సాబుభూతి వాతావరణం పాటించాలనుకునే వారం, ఇప్పుడు ఆ గొడవ లేదు. హాయిగా net browsing చేసికుంటూ గడిపేయొచ్చు. పైగా పక్కనే ఇంకొన్ని సదుపాయాలుకూడా కలుగ చేస్తారుట ! అద్గదీ అలా ఉండాలి.

    బతికున్న రైతులు ఆత్మహత్యలు చేసికుంటున్నా పట్టించుకునే నాధుడు లేదు.ఓవైపున, కేజ్రీవాల్ గారు స్టేజి మీద ప్రసంగం చేస్తూనే ఉన్నారు, ఇంకోవైపున ఓ చెట్టుమీద ఓ రైతు సావకాశంగా ఓ చెట్టు మీదకెక్కి, ఉరి వేసికున్నాడు. మొత్తం, ఈ దురదృష్టకర సంఘటన జరగడానికి ఓ గంట దాకా పట్టిందిట. అంతసేపూ చుట్టూ ఉన్నవారు, ఏదో తమాషా చూస్తున్నట్టున్నారే కానీ, పోలీసులు కానీ, జనం కానీ, ఆ రైతు చేస్తూన్న పనిని ఆపాలని అనుకోలేదుట. అన్నిటిలోకీ నికృష్టం ఏమిటంటే, ఈ పూర్తి సంఘటనని, మన మీడియా ప్రబుధ్ధులు, తమ వీడియో కెమేరాల్లో భద్ర పరుచుకోవడం. అప్పుడెప్పుడో జరిగిన నిర్భయ కేసుకి సంబంధించిన సంఘటన మీద, ఆవిడెవరో బిబిసి తరపున, ఓ డాక్యుమెంటరీ చిత్రిస్తే, మన దేశ పరువు బజారు పాలైపోతుందని, మన చానెళ్ళ మీద ఆంక్షలు పెట్టడం గుర్తొచ్చిందేమో, అలా కాకుండా, మనమే ప్రస్తుత సంఘటనని వీడియో తీసేస్తేనె బాగుంటుందనుకున్నారు. మరి ఇప్పుడు మన దేశ పరువు ఎక్కడకివెళ్తోందీ? మామూలుగా జరిగినట్టే, మర్నాడు పార్లమెంటులో మన వాళ్ళందరూ హడావిడి చేసి, ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. ఓవైపున ఈ చర్చలు వాటిదారిన అవి జరుగుతూనే ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసికుంటూనే ఉన్నారు. పైగా గత అరవై ఏళ్ళనుండీ జరుగుతున్నవే కదా, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందీ అనే సమర్ధింపోటీ. దేశ రాజధానిలో అందరి ఎదుటా జరిగింది కాబట్టి ఇంత హడావిడి చేశారు. లేకపోతే, ఏరోజు పేపరు చూసినా దేశమంతా ఇవే వార్తలు.

    ఇదివరకటిరోజుల్లోనూ ఉండేవి, వర్షాలూ, తుఫానులూనూ, కానీ వాటికీ ఓ సమయం సందర్భమూ ఉండేది. ఈ ఆత్మహత్యలూ, పంట భీమాలూ అవీ ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో నెలకో వాయుగుండం, అకాల వర్షాలూ, ఉపరితల ద్రోణులూ, వాటికో ప్రత్యేకమైన ముద్దుపేరూ. వీటన్నిటికీ కారణం- Global warming అని అందరికీ తెలుసు. కానీ వాటి గురించి ఎవడూ పట్టించుకోడు. పైగా అదేదో EARTH DAY అని సభలూ, సమావేశాలూ, స్లోగన్లూ… వీటితోనే సరిపోతోంది.

    మేరా భారత్ మహాన్…

%d bloggers like this: