బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– keeping fingers crossed…

    ఈ టపా కి పెట్టిన శీర్షిక చిత్రంగా ఉంది కదూ.. ఏం చేస్తాను.. ఏ దిక్కూ లేకపోతే చేయగలిగిందల్లా అంతకంటే ఉండదు. గత పదేళ్ళుగా, ప్రతీ ఏడాదీ, పెన్షను బట్వాడా చేసే మా SBI కి నవంబరు నెలొచ్చేసరికల్లా, వెళ్ళడమూ, ” బతికే ఉన్నాను మహాప్రభో..” అని మొరపెట్టుకోవడమూ, తిరిగి ఓ ఏడాది దాకా నిరాటంకంగా( అదృష్టం బాగుంటే ) ప్రతీ నెలా పెన్షన్ తీసికోవడమూనూ. ఈ ప్రక్రియకు నేను పెట్టుకున్న ముద్దు పేరు..thaద్దినం. దీనిమీద ఓసారి ఓ టపా కూడా వ్రాశాను. ఒకటేమిటీ ప్రతీ ఏడూ వ్రాసేవాడిని. శ్రీ మోదీగారి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇందులో కొంత వెసులుబాటు కల్పించారు. ప్రతీ నవంబరులోనూ, పెన్షనర్లందరూ బ్యాంకులకి వెళ్ళనక్కరలేదూ, online లో బతికే ఉన్నామని ఋజువు చేస్తే చాలూ అన్నారు. అమ్మయ్యా బతికామురా బాబూ అనుకున్నాను. ఈ తతంగం అంతా ఏం చేస్తారూ, ఎలా చేస్తారూ అన్నది ఇన్నాళ్ళూ ప్రకటించలేదు. పోనిస్తూ.. ఇంకా 7 నెలల పుణ్యకాలం ఉందిగా ఆ తతంగానికి అనుకున్నాను. కానీ, ఆ ముహూర్తం కూడా వచ్చేసింది.

    ఈవేళ నా మొబైల్ లో ఓ సందేశం…నా పేరూ, నా ppo నెంబరూ, ఓ లింకూ అందులో నా ఆధార్ నెంబరు నమోదు చేసికోడానికి ఓ పాస్ వర్డూ..”అంతవరకూ బాగానే ఉంది. వెంటనే నా సిస్టం లో ఆ లింకుకి వెళ్ళి, వారిచ్చిన సమాచారం ఉపయోగించి, నా ఆధార్ నెంబర్ నమోదు చేసేసికున్నాను. అంతవరకూ కూడా బాగానే ఉంది. మనం బతికుండడమే కాకుండా, దానికి ఓ సర్టిఫికెట్ ఒకటి ఉండొద్దూ. అదేదో సంపాదించడానికి, ఆ సైట్ లో సైన్ అప్ చేసికోమన్నారు. అక్కడ వివరాలన్నీ, నింపినా, అదేదో డౌన్ లోడ్ చేసికుని, దానిమీద ఓ స్టాంపు వేయించి అప్ లోడ్ చేయమన్నారు. పోనీ చేద్దామని తీరా చూస్తే, దాని లింకు మెయిల్లో పంపుతామన్నారు. చాలాసేపు చూసి, రాకపోతే, వారిచ్చిన నెంబరుకి ఫోను చేయడం దగ్గర మొదలయింది, ఈ టపాకి పెట్టిన శీర్షిక. ఓ పదినిముషాలు వెయిట్ చేసిన తరువాత ఒకతను లైనులోకి వచ్చి, నా గోల విని, మీకు ఇచ్చిన కోడ్ చెప్పమన్నాడు. అది చెప్పగానే, ఓ నిముషం ఆగి, ” మీ పని అయిందీ, ఆధార్ నెంబరుతో అనుసంధానం పూర్తయిందీ.. హాయిగా కూర్చోండీ..” అన్నాడు. సరే, తరువాత ఏం చేయాలీ అని అడిగితే, ఏమీ చేయనక్కరలేదూ అన్నాడు. మరి నవంబరు సంగతి ఏమిటయ్యా అంటే, ఫరవాలేదూ, మీరు బతికున్నట్టే లెఖ్ఖా అంటాడు. అలా కాదూ, ఈలోపులో టపా కట్టేస్తే.. ఫరవా లేదూ అంటాడు. మరి చెప్పండి, బతికున్నట్టా లేదా.. అంటే డిశంబరులో పెన్షను వస్తే బతికున్నట్టూ, లేకపోతే, లక్షణంగా బ్యాంకుకి వెళ్ళి ఇదివరకటిలాగే సంతకం పెట్టి, మన అస్థిత్వాన్ని ఋజువు చేసికోడమూ.. ఇదేదో కొత్తగా మొదలెట్టి, లేనిపోని కొత్త సమస్యలు మొదలెట్టారు. ఇప్పుడు అర్ధం అయిందా ఈ టపాకి అలా శీర్షిక పెట్టానో?

    కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత, మన ప్రధాన మంత్రిగారు, పాస్ పోర్టులూ, వీసాల విషయంలో నిమిషాలమీద పనైపోతుందన్నారు. ఎంత తొందరగా అవుతుందో చెప్పడానికి, మా అనుభవం ఒకటి చెప్తాను– మా కోడలు తను అమెరికా Carneigie Mellon University కి వెళ్ళాల్సిన సందర్భంలో, Passport renewal కి తత్కాల్ లో 1500 కట్టి ఎప్లై చేసింది. ఫలానా తేదీ న రమ్మన్నారు. కాగితాలన్నీ తీసికెళ్తే, అదేదో సర్టిఫికేట్ లేదూ, గవర్నమెంటులో ఫలానా జీతం పైబడ్డవారిదగ్గరనుండి సర్టిఫికెట్ తెమ్మన్నారు. సరే అని, నాకు తెలిసిన ఒక డాక్టరు గారి దగ్గర తీసికుని, రెండో సారి వెళ్ళింది. అందులో మా అబ్బాయి పేరు పూర్తిగా రాయలేదూ అని పంపించేశారు. మూడో సారి వెళ్ళినప్పుడు ఫొటో మీద సరీగ్గా సంతకం లేదూ అన్నారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే, మూడు సార్లు వెనక్కి పంపించేస్తే , మళ్ళీ 1500 లూ కట్టాలి. తిరిగి 1500 కట్టి, మూడో సారి వెళ్తే, ఆ సర్టిఫికెట్ ఇచ్చినాయన జీతం అంతుందా అంటారు. మా కోడలికి చిర్రెత్తుకొచ్చేసి, ఇప్పటికి మూడు సార్లు వెనక్కి పంపేసి, తిరిగి 1500 కట్టించుకున్నారూ, ఈ విషయాలన్నీ మొదటిసారో, రెండోసారో చెప్పడానికేంరోగం అని గయ్యిమంది. మీఈష్టం వచ్చినట్టు చేసికోండీ, నేనిక్కడనుండి కదలనూ అని ఝణాయించేసరికి, నోరుమూసుకుని, ఆ విషయాలన్నీ వాళ్ళే verify చేసికుని, మొత్తానికి సంతకం పెట్టింది. అందుకేనేమో అంటారు.. ” అమ్మ పెట్టేవన్నీ పెడితే కానీ…” అని. ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఇదో మార్గం అనుకుంటా. ఏదో కారణం చూపడమూ, మూడు సార్లు reject చేసేయడమూనూ. రైల్వేల్లో చూడండి, ఓ రెండు గంటల్లో waiting list కొల్లేరు చాంతాడంత అయిపోతుంది. పెళ్ళాం పిల్లలతో వెళ్ళేవారు చచ్చినట్టు ” తత్కాల్ ” లో తీసికుంటారనే కదా…

    అఛ్ఛే దిన్ అంటే ఇవేనేమో… ఆ భగవంతుడికే తెలియాలి...