బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    మగాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఎంతో ఉంటుందనే సామెత అందరూ వినే ఉంటారు. అది నూటికి నూరుపాళ్ళూ నిజం అనడానికి, మన దైనందిక జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఇంటి ఇల్లాలుని బట్టే కదండీ, మన అస్థిత్వం ! వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి పురుషాహంకారం అడ్డొస్తూంటుంది. అయినా నిజం నిజమేగా.. సాధారణంగా చాలామందికి ఒక passion అనేదుంటుంది. ఆ passion కొన్నిసార్లు, ఇంట్లోవారికి, ముఖ్యంగా ఇంటి ఇల్లాలుకి కొంచం, చిరాగ్గాకూడా ఉంటూంటుంది. అయినా ఏదోలా సద్దుకుపోతూంటారు. అదేకదా మనక్కావాల్సిందీనూ. ఏదోలా సహించేస్తోందికదా అని, మనం కూడా హద్దులు దాటకూడదు. కొంతమందికి విహారయాత్రలు చేయడం ఇష్టం, కొంతమందికి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం ఇష్టంగా ఉంటుంది. కానీ, ప్రతీసారీ ఇంటాయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంటి ఇల్లాలుకి వీలవకపోవచ్చు. అయినా సరే, ఇంటివిషయాలు తను చూసుకుంటానని చెప్పి, భర్త ఉత్సాహంమీద నీళ్ళు చల్లలేక, ” సరే.. ఈసారికి మీరెళ్ళొచ్చేయండి.. ఇక్కడ నేను చూసుకుంటానులెండి..” అని భర్తకు భరోసా ఇస్తుంది. మరి ఇదేకదా ప్రతీభర్త విజయం వెనుకా ఓ స్త్రీ పాత్ర ఉందంటే. ఏదో ఉదాహరణకి చెప్పాను. కానీ ఇలాటివే , ఎటువంటి passion ఉన్నా సరే, భార్య సహకరిస్తేనే, విజయవంతం అవుతాయన్నది పదహారణాల నిజం.

    కానీ, చిత్రంగా దంపతులిద్దరికీ ఒకే వ్యాపకం ఉంటే ” సోనేపే సుహాగా ” కదూ. అలాటి దంపతులే, మా స్నేహితులు శ్రీమతి రమణ గారూ, శ్రీ కృష్ణమూర్తిగారూనూ. మా పరిచయం ఓ రెండేళ్ళ క్రితం జరిగింది.. మేము 2014 మే నెలలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు, శ్రీ కృష్ణమూర్తిగారు, మా దంపతులని, తమ స్వగృహానికి తీసికెళ్ళి అతిథిసత్కారం చేశారు. ఆ సందర్భంలో ఒక టపా వ్రాశాను. వారింటికి వెళ్ళినప్పుడు, శ్రీమతి రమణ గారు చూపించిన ఆప్యాయత, అభిమానం జీవితంలో మర్చిపోలేము. అక్కడ అప్పుడు గడిపిన మధురక్షణాలు ( 4 గంటలు) ఇప్పటికీ, ఎవరిని కలిసినా పంచుకుంటూంటాము. అచ్చ తెలుగు , షడ్రసోపేతమైన విందు, కొసరికొసరి వడ్డించడమూ, ఆవిడ మాతో మాట్టాడిన పధ్ధతీ ( ఎటువంటి భేషజాలకీ పోకుండా ) ఎప్పటికీ మరువలేనివి. ఓ మంచి స్నేహితులతో పరిచయమయిన సంతృప్తి కలిగింది. ఈ వయసులో ఇలాటివే కదండీ కావాల్సినవి.

    ఈవేళ మధ్యాన్నం, మా అబ్బాయి ఫోను చేసి చెప్పాడు– ఒక విషాద వార్త– శ్రీమతి రమణ గారు ఇక లేరని. నమ్మలేకపోయాను. ఆవిడ మాతో చెప్పిన కబుర్లు ఇప్పటికీ గుర్తున్నాయి.
వెంటనే శ్రీకృష్ణమూర్తి గారికి ఫోను చేసి, పరామర్శించాను. అంతకంటే ఏమీ చేయలేక. ఆయనకి ఈ వయసులో, జీవిత భాగస్వామిని కోల్పోడమంటే చాలా పెద్ద దెబ్బ. జీవితంలో ఆయన కష్టసుఖాలలో పాలుపంచుకోవడం , సాధారణంగా అందరూ చేసేదే. కానీ ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే కళాఖండాలని, స్వంత బిడ్డల్లా సాకడం చాలా గొప్ప విషయం. ఆవిడకే చెల్లింది.
ఈవిషాద సమయంలో శ్రీ కృష్ణమూర్తి గారికి, ఆ భగవంతుడు, శక్తినీయాలని ప్రార్ధిస్తున్నాను. శ్రీమతి రమణ గారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ.

%d bloggers like this: