బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అయ్యో… పాపం…


    మనకు తెలిసిన వ్యక్తైనా, సంస్థ అయినా కనుమరుగైపోయినట్టు తెలిస్తే, అయ్యో ..పాపం .. అనుకోవడం జరుగుతూంటుంది కదూ. అంతదాకా ఎందుకూ, ఆరోజుల్లో మన ఇళ్ళల్లో ఉండే చెట్టో, చేమో, ఏ గాలివానైనా వచ్చి కూకటి వేళ్ళతో లేచిపోయినా అంతే బాధగా ఉండేది. పెంపుడు జంతువుల విషయంలోనూ అలాగే ఉంటుంది కదూ..ఈ ఆధునిక యుగంలో, అలాటి బంధాలూ, అనుబంధాలూ అంతగా కనిపించడం లేదు. మనుషులకే దిక్కులేదు, ఇంక సంస్థలూ, చెట్లూ చేమల మాటెవడికి పడుతుంది? ఇంక సంస్థలంటారా, రోజుకో సంస్థ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూన్న ఈ రోజుల్లో, మహ అయితే, రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలనే దురాశ తో ఆ ఫైనాన్సు కంపెనీలోనో, బ్యాంకులోనో డబ్బులు “పొదుపు” చేసికున్నవారు మాత్రం, ఆ “సంస్థలు” జెండా ఎత్తేసినప్పుడు మాత్రం అయ్యో..అయ్యయ్యో.. అని నెత్తీ నోరూ బాదుకుంటారు, కనీసం వాళ్ళు దాచుకున్న డబ్బులొచ్చేవరకూ

ఇంక చెట్టూ పుట్టా అంటారా, ఈరోజుల్లో పెరుగుతూన్న జనాభా దృష్ట్యా రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమంలో, ఈరోజుల్లో ప్రతీ చోటా అడ్డం వచ్చిన చెట్లన్నీ కొట్టిపారేస్తున్నారు. “అభివృధ్ధి” కావాలంటే ఆమాత్రం ” త్యాగాలు ” చేయాలిగా !! ప్రతీదానికీ సెంటిమెంటు పెట్టుకోలేముగా మరి! చెప్పేనుగా మనుషులకే ఠికాణా లేదు. ఏదో ఆ కట్టుకున్నవాడో, కట్టుకున్నదో తప్ప, మిగిలినవారికి అంతగా పట్టింపు ఉండడంలేదు. ఏదో ఆ పదిరోజులూ కార్యక్రమాలు చేసేసి చేతులు దులిపేసికోవడం. ఆ తరువాత గుర్తుండి, వీలుంటే మాసికాలూ, తద్దినాలూ పెట్టడం. లేకపోతే ఓ దండం పెట్టేయడం. చేసికున్నవాడికి చేసికున్నంతా. పైగా ఇంకో విషయం, ప్రతీదానినీ సమర్ధించుకోవడం– ” ఈరోజుల్లో అంత టైమెక్కడిదండీ..” అని. మరి ఆరోజుల్లో టైముండే చేసేవారా, ఉన్న అనుబంధాన్ని బట్టి ప్రతీదానికీ టైము కేటాయించేవారు. కనీసం సంవత్సరంలో ఒకసారైనా గుర్తుచేసికుని, ఆ వ్యక్తి గురించి నాలుగు మంచిమాటలు చెప్పుకునేవారు. కానీ ఈరోజుల్లో , ఓ ప్రముఖ వ్యక్తై పోయాడంటే, ఆ ఒక్కరోజుకీ మాత్రం, మీడియా ధర్మమా అని, ఆ కుటుంబ సభ్యులకే కాదు, దేశం/ రాష్ట్రం లో , ఎవడు టివీ పెట్టినా అతన్ని హాస్పిటల్ నుండి, అంత్యక్రియలదాకా జరిగే కార్యక్రమాలని చూడాల్సిందే. ఆ వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టి “అయ్యో..పాపం ” అనుకుంటాము.
పైన ఉదహరించినవన్నీ, ఎవరి అనుబంధాన్ని బట్టి వారు అనుభవిస్తూంటారు. ఒకరికి నచ్చింది ఇంకోరికి నచ్చాలని లేదు. ఓ వ్యక్తున్నాడనుకోండి, అందరికీ ఉపకారాలు చేసుండకపోవచ్చు, ” పోన్లెద్దూ ఓ గొడవొదిలిందీ.. ” అనుకోవచ్చు. ఓ చెట్టు కొట్టేసినా, పోనిద్దూ ప్రతీరోజూ ఆకులెత్తుకోలేక చచ్చేవాళ్ళం అని అనుకునేవారున్నా ఆశ్చర్యం లేదు. అలాగే ఓ పెంపుడుజంతువు గురించి కూడా, ఆ పెంచుకున్నవాడికుండొచ్చేమో కానీ, చుట్టుపక్కలున్నవాళ్ళు ” అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ, ఎప్పుడు చూసినా భొయ్యిమంటూ అరవడమే, ఎప్పుడు మీదపడుతుందో తెలిసేది కాదు..” అన్నవారే ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు.

కానీ కొన్ని సంవత్సరాలపాటు, అందరి జీవితాలతో ఓ “బంధం” పెనవేసికుని, ఎందరో ఎందరెందరో మొహాలలో, ఓ సంతోషం చేకూర్చిన ఓ సంస్థ, ఒక వ్యవస్థ కనుమరుగైపోతూందని చదివినప్పుడు మాత్రం, ” అయ్యో.. అలాగా..” అని అనుకోని వారుండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇరవయ్యో శతాబ్దంలో పై ఊళ్ళకి చదువులకోసం, వెళ్ళినవారనండి, ఎక్కడో దూరప్రదేశాల్లో ఉద్యోగరీత్యా ఉంటూ, స్వగ్రామంలో ఉండే తల్లితండ్రులనండి, లేదా ఆరోజుల్లో తమ రచనలు ఏ పత్రిక్కో పంపినవారనండి, చిన్నచిన్న గ్రామాల్లో గ్రంధాలయాలకి నాగా లేకుండా, పత్రికలు తెప్పించుకునేవారనండి… ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది మనుషులకి, తోడునీడగా ఉండే ఆ ” మనీ ఆర్డరు ” వ్యవస్థ కనుమరుగపోతూందని ఈవేళ పేపర్లో చదివేసరికి, నిజంగా గుండె చెరువైపోయిందంటే నమ్మండి.MO

MO Form

అలాగని నాకు ఈ మనీఆర్డర్లతో పెద్దగా అనుబంధం లేదు.ఊళ్ళోనే స్కూలుఫైనలు దాకా స్కూలూ, ఇంటి దగ్గరలోనే డిగ్రీ సంపాదించుకోడానికి ఓ కాలేజీ, ఆ డిగ్రీ ఏదో సంపాదించగానే, అదృష్టం కొద్దీ పూనా లో ఉద్యోగమూ. మొదటిజీతం వచ్చేలోగా, కావాల్సిన డబ్బులేవో, ట్రైనెక్కేముందే చేతిలో పెట్టేశారు.ఇంక మళ్ళీ మనీఆర్డర్లంటే, కాళ్ళిరక్కొట్టేవారేమో. దేనికైనా పెట్టిపుట్టాలంటారందుకేనేమో..అబ్బ మా పెద్దన్నయ్యగారిలా మెడ్రాసులోనో, చిన్నన్నయ్యగారిలా ఏ కాకినాడలోనో, వాల్తేరులోనో , హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎంత హాయిగా ఉండేదో, నాక్కూడా ఈ మనీఆర్డర్లు వచ్చేవేమో అని ఊహించేసికుని సంతోషపడడంతోనే సరిపోయింది. పొట్టకోస్తే అక్షరమ్ముక్కొస్తేనేకదా, పైచదువులకి పైఊళ్ళకి పంపడం? అదేమో లేదాయె, మరి ఈ మనీఅర్డర్లూ అవీ ఎక్కణ్ణుంచొస్తాయీ? పోనిద్దురూ, ఆ మనిఆర్డరేదో, టైముకి రాకపోతే పడే ” కష్టాలు” భరించాల్సిన అవసరం లేకపోయింది. అలా సరిపెట్టేసికుంటే హాయి కదా. టైముకి ఇంటిదగ్గరనుండి, మనీఆర్డరు రాకపోతే, పడే కష్టాలలో పాలుమాత్రం పంచుకున్నానండోయ్.. ఆరోజుల్లో మా స్నేహితుడొకరు ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుకునేవారు. మరి ఆరోజుల్లో అప్పటికే ” భవదీయుడు” ఉద్యోగస్థుడుగా, ( కాలరెత్తికుని తిరిగే వ్యవహారం మరి ! ), అప్పుడప్పుడు, తనకి మనీఆర్డరు రాకపోతే, ఓ పదో, పాతికో చేబదులడిగేవారు ! తరువాత్తరువాత నేనే చేబదుళ్ళడిగే పరిస్థితికి చేరిపోయాననుకోండి, అది వేరే సంగతి. మనీఆర్డర్లతో నా అనుబంధంగురించి ప్రస్తావించడానికి చెప్పేను.

పైఊళ్ళకి పైచదువులకి పంపేటప్పుడు, ఆ ఊళ్ళో తెలిసినవారికి పరిచయం చేసేవారు తప్పకుండా. కారణం మరేమీ కాదూ, ఏ కారణం చేతైనా టైముకి మనీఆర్డరు అందకపోతే, ఆ పరిచయం ఉన్నాయన దగ్గరకి వెళ్ళి, పని కానిచ్చుకోవచ్చని. అసలు ఆ మనీఆర్డర్ల ప్రక్రియే తమాషాగా ఉండేది. మా కాలేజీలో బుల్లబ్బాయిగారని ఓ పోస్టుమాస్టారుండేవారు. శలవల్లో ఆ పోస్టాఫీసుకి వెళ్ళి ఆయనతో కబుర్లు చెప్పేవాడిని. అప్పుడు చూసేవాడిని. కిటికీలోంచి, డబ్బూ, నింపిన మనీ ఆర్డరు ఫారమ్మూ ఇవ్వగానే, ఆ ఫారం వెనక్కాల ఎర్ర సిరాతో పెద్దగా ఓ నెంబరువేయడం, రెండు కార్బన్ పేపర్లు, అందులో ఒకటి తిరగేసి, రసీదుపుస్తకంలో ఎడ్రసు వ్రాసేసి, ఆ రసీదునెంబరు మళ్ళీ ఆ ఫారంమీద వ్రాయడమూ, అందులో రాసింది కానిపించని ఓ కాపీ మీద ఓ పెద్ద స్టాంపు కొట్టి, చేతిలో పెట్టడమూ. క్షేమసమాచారాలో, విశేషాలో వ్రాసుకోడానికి, ఓ జాగా ఉండేది. కావాల్సినన్ని విశేషాలు వ్రాసేసేవారు, ఆ కాగితం వెనక్కాలా, ముందు భాగాల్లోనూ. ఎప్పుడైనా మనీఆర్డరు వచ్చిందంటే, పోస్టుమాన్ ఓ సంతకం పెట్టించుకుని, ఆ ” సందేశ” కాగితం చింపి మనకిచ్చేవాడు. సంతకం పెట్టించుకున్న భాగం , ఎవరైతే పంపారో వారికి తిరిగిపంపేవారు. అంతకుముందు డబ్బుపంపిన రసీదూ, సంతకం పెట్టిన ఎం.ఓ. రసీదూ ఉంటే చాలు , ఆ రెండిటినీ ఓ తీగకు గుచ్చేయడంతో పని పూర్తైపోయినట్టే. ఈ మనీఆర్డర్ల బట్వాడా ద్వారా, బోర్డర్లలో ఉండే జవాన్లు, వారివారి కుటుంబాలకి డబ్బులు పంపేవారు.

e-transfers వచ్చిన ఈ యుగంలో మరింక ఈ మనిఆర్డర్లతో పనుండదు, నిజమే. కానీ లక్షలాదిమంది ముఖాలలో నెలకోసారైనా, ఓ “మెరుపు” మెరిపించిన ఆ మనీఆర్డర్ల ప్రక్రియ, ఇంక చూడలేమంటే, మరి బాధగానే ఉంది…

This is my humble tribute to the Good Old MONEY ORDER… R.I.P

5 Responses

 1. అయితే “మనీ అర్డర్” కి కూడా మంగళం పాడేసారన్నమాట. bygone era కి మరొక చిహ్నం జేరింది. yes, RIP.
  సెల్ ఫోన్లు విరివిగా వాడకంలోకి వచ్చాయి అనే ఓ కారణం వల్ల ఆమధ్య “టెలిగ్రాం” పద్ధతిని ఆపేసారు, సరే అనుకున్నాం (విచారం కలిగినప్పటికీ). కాని ఈరోజు “మనీ ఆర్డర్” ని ఆపేసారు కదా, అయితే “e~transfer” పద్ధతి “బ్యాంకింగ్ సేవలు” ఎంతగా అభివృద్ధి చెందినా కూడా ఈ సౌకర్యాలు ఇంకా విస్తరించని మారుమూల గ్రామాలు అనేకం వున్నాయి కదా, మరి ఆ వూళ్ళ ప్రజలకి డబ్బు అందటం ఎలాగా అని ఓ చిన్న సందేహం. ఏలిన వారికే తెలియాలి.

  Like

 2. దాదాపు నలభై ఏళ్ళ క్రిందట అమెరికా నుండి నా మొదటి జీతం పల్లెటూర్లలో ఉన్న పదిమందికి ఒక్కొక్కళ్ళ కి 10 డాలర్ల చొప్పున “మనీయార్దర్లు” పంపించాను . కిష్టప్ప డబ్బులు పంపించాడురోయ్ అనే పోస్ట్మాన్ ద్వారా సంతోషంతో డబ్బులు తీసుకున్నారు. పల్లెటూర్లకి డబ్బులు పంపాలంటే అంతకన్న వేరే మార్గం అప్పుడూ ఇప్పుడూ ఇంకోటి లేదనుకుంటాను. మరి ఏం చేస్తారో.
  అమెరికాలో ఇదివరకు “ఇన్లాండ్” లెటర్ లాంటివి “ఏరోగ్రాం” అని ఉండేవి. మొన్న వాటికోసం పోస్టాఫీస్ కి వెళ్ళి అడిగితే తెల్ల మొఖం పెట్టారు. కొన్ని అలా కాలగమనంలో కలిసిపోతూ ఉంటాయి.

  Like

 3. This news is partially correct.
  The traditional money order might have been withdrawn, insted e MO is introduced and it is faster. This MO can be sent to any where in INDIA. Allmost all sub post offices of the Posts department were now connected with internet. The MO will be sent to the nearest S.O and by normal course sent to the village.
  Only traditional money order might have been withdrawn in some places only

  Like

 4. This news is partially correct.
  The traditional MONEY order might have been withdrawn, insted e MO is introduced and it is faster. This MO can be sent to any where in INDIA. Allmost all sub post offices of the Posts department were now connected with internet. The MO will be sent to the nearest S.O and by normal course sent to the village.
  Only traditional money order might have been withdrawn in some places only

  Like

 5. నరసింహారావు గారూ, లక్కరాజు రావు గారూ, శర్మ గారూ,

  ఆలశ్యంగా జవాబు ఇస్తున్నందుకు క్షమించండి.

  నరసింహారావు గారూ,
  అన్ని సంవత్సరాల పాటు, సామాన్యుల జీవితాలతో అనుబంధం ఏర్పరుచుకున్న మనీ ఆర్డరు కనుమరుగైపోతుందంటే, ఏదో దగ్గరవారు, పోయినంత బాధ కలిగింది.

  రావుగారూ,

  మీరన్నట్టు ఎన్నో ఎన్నెన్నో గుర్తులు నెమరు వేసుకుంటూంటాము. ఇంకా ఏరోగ్రామూ, ఇన్లాండ్ కవరూ ఉన్నాయి. ఈమధ్యనే చూశాను. ఎప్పుడో వాటికీ కాలదోషం పట్టేస్తుంది.

  శర్మగారూ,

  ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది అలనాటి మనీఆర్డరు గురించి మాస్టారూ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: