బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– హాస్యానికి పట్టిన దౌర్భాగ్యం….

    మార్చ్ 15, తెలుగులో హాస్యానికి పెద్ద పీట వేసిన శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి 117 వ జయంతి. కానీ ఆనాటికీ, ఈనాటికీ హాస్యానికున్న నిర్వచనమే మారిపోయింది. సున్నితమైన హాస్యం అంటే ఏమిటో, ఆనాటి తెలుగు రచయితలు ఎందరో..ఎందరెందరో తమ రచనల్లో పొందు పరిచారు. హాస్యం అన్నది, అవతలివారిలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపడం కాదు. కానీ దురదృష్టవశాత్తూ, ఈ రోజుల్లో వచ్చే so called హాస్యం, అవతలివారిలో కనిపించే , ఏ కొద్ది లోటుపాటునో , cash చేసికుని , దానినే ” హాస్యం” అనే పేరుతో, టీవీల్లోనూ, సినిమాల్లోనూ, ప్రేక్షకుల నెత్తిమీద రుద్దుతున్నారు. ఇదంతా మన దృష్టికోణం లో వచ్చిన మార్పా, లేక ఆయాకార్యక్రమాల రచయిత/త్రి లలో ఎండిపోయిన సృజనాత్మక శక్తంటారా? ఏదీ ఏమైనా, మనసారా నవ్వుకోవడమనేది has gone for a toss.
ఒక్కొక్కప్పుడు, టివీల్లో వస్తూన్న కార్యక్రమాలు చూస్తూంటే, పైగా ఆ కార్యక్రమాలకి వచ్చే జడ్జీల స్పందన చూస్తూంటే, అసహ్యం వేస్తోంది. వాళ్ళకి ఆ వేదిక మీద చేసే నటుడిలో అంతగా నవ్వాల్సినంత విషయమేమిటో, ఛస్తే అర్ధం అవదు. వాడెవడో ఓ చెత్త జోకు వేసినా, హావభావాలు ప్రదర్శించినా, ఇక్కడ ఈ జడ్జీలు ఎగిరెగిరి నవ్వడం. ద్వందార్ధాలు వచ్చేటట్టు డయలాగు చెప్పడం, హాస్యానికి నిర్వచనం అనుకుంటారు. అలాగే ఏదో ఓ కులం వారినీ, వారి ఆచారవ్యవహారాలనీ, వేళాకోళం చేసి, చులకన చేయడమే పరమావధిగా పెట్టుకుంటారు, కొంతమంది రచయితలు. అదో దౌర్భాగ్యం. అయినా ఈ రచయితలని అని లాభం ఏమిటిలెండి, ” మన బంగారం బాగుంటే…” అనే సామెత తెలుసుగా? వీళ్ళు అలవోకగా చేస్తున్నవే, వాళ్ళూ ప్రదర్శిస్తున్నారు. అందువలన ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు.

ఈ ” హాస్యం ” అనేదేమీ కొత్తగా వచ్చిందా ఏమిటీ, ఇదివరకటి సినిమాల్లో ఏ సినిమా తీసినా, అందులో ఒక హాస్య జంట తప్పకుండా ఉండేది. పైగా, వారు కూడా ఎంత dignified గా నటించేవారూ? పైగా వారి పాత్రలు కూడా, కథాగమనానికి ఎక్కడా అడ్డు రాకుండా, కథలోనే కలిసిపోయేవి. మరీ సినిమా సీరియస్సుగా ఉన్నా, మధ్య మధ్యలో సరదా సన్నివేశాలని జోడించి, తీసేవారు.పైగా ఆ హాస్యజంటకి ఒక duet తప్పకుండా ఉండేది. పైగా, ఆరోజుల్లో హాస్య నటులు, ఏమీ వెకిలి వేషాలు వేసేవారు కాదు. కానీ ఈ రోజుల్లో హాస్యం పేరుతో వస్తూన్న దృశ్యాలని చూస్తూంటే అసహ్యం వేస్తోంది. దీనికి సాయం, సినిమాలో వచ్చే ప్రతీవాడూ, ఈ హస్యనటుణ్ణి కనీసం ఒకసారైనా చెంపదెబ్బ కొట్టకుండా ఉండరు. చెంప దెబ్బలు తినడం, హాస్యంలో ఓ భాగం అనుకునే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చారు తెలుగు సినిమా ప్రేక్షకులు. ఆ మాయదారి రచయిత పోనీ తనకున్న తెలివితేటలతో ఏదో వ్రాశాడే అనుకోండి, ఈ హాస్యనటుల మానాభిమానాలు ఎక్కడికి పోయాయి? Or is it that ఓ చెంపదెబ్బ తినకపోతే పారితోషికం ఇవ్వనంటారా? ఏం దరిద్రమండి బాబూ?

ఇదివరకటి రోజుల్లో ఓ సినిమా చూస్తే, అందులో కనీసం ఒక్కటైనా సందేశంలాటిదుండేది. కానీ ఈరోజుల్లో స్కూళ్ళలో ఉపాధ్యాయులని, అలాగే కాలేజీల్లో లెక్చెరర్లనీ, ఆఖరికి ప్రిన్సిపాల్ నీ కూడా, ఏడిపించడం హాస్యం లోకి వచ్చేసింది. అలాగే, తల్లితండ్రుల గురించికూడా.. అదేదో కార్యక్రమం వచ్చేది–అందులో అతిచిన్న వయసులో ఉండే పిల్లలని, యాంకరు ఏదో అర్ధం పర్ధం లేని ప్రశ్న వేయడం, దానికి ఈ పిల్లో, పిల్లాడో ఓ అసందర్భపు సమాధానం, తన తల్లితండ్రులగురించి చెప్పడం, దానికి ప్రేక్షకులు ఆ తల్లీ తండ్రీతోసహా గొల్లుమని నవ్వడం, పైగా తమ బిడ్డ ఘనకార్యం మెచ్చుకోడం. దానితో ఏమౌతోఁదంటే, అర్ధంపర్ధం లేకుండా, అయినదానికీ, కానిదానికీ వెకిలి సమాధానాలు చెప్పడం.

జీవితంలో “హాస్యం ” అనేదే ఉండకూడదనడంలేదు. ఉన్నదేదో మోతాదులో, ఎవరి మనోభావాలూ కించపరచకుండా ఉండాలి. ఎవరికైనా ఓ లోపం ఉందనుకోండి, ఉదాహరణకి stammering ( నత్తి), అదేదో కొంపలు ముంచేదేమీ కాదు. కానీ అదే పనిగా గేలిచేస్తే అతని మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించాలి. ఆ మధ్యన పూణె లో ఆంధ్రసంఘం వారు, ఓ ప్రముఖ హాస్యనటుడిని ఆహ్వానించి, స్టేజ్ మీదకు పిలిస్తే, ఆ మహామహుడు తెచ్చిపెట్టుకున్న “నత్తి ” తో ఓ స్కిట్ చేశారు. ఎంత బాధేసిందో. అంత పెద్దమనిషికి , ఒక లోపాన్ని హాస్యాస్పదంగా ప్రదర్శించడానికి అసలు బుధ్ధెలా వచ్చిందో? దానికి సాయం ప్రేక్షకులుకూడా కరతాళాలోటి.

హాస్యమనేది, చాలా ఆరోగ్యకరమంటారు. కానీ ఈ రోజుల్లో వచ్చే చవకబారు హాస్యమూ కాదూ, లాఫింగు క్లబ్బుల్లో వచ్చే కృత్రిమ నవ్వూ కాదు. స్వతసిధ్ధంగా రావాలి.ఎప్పటికి బాగుపడతారో.. ఆ భగవంతుడికే తెలియాలి.ఈ చవకబారు పరిస్థితి చూసే శ్రీ జంధ్యాల, శ్రీ బాపూ గారూ, శ్రీ ముళ్ళపూడి వారూ, శ్రీ ఆర్.కే.లక్ష్మణ్ గారూ ఇంక చాలూ అనుకుని స్వర్గానికి వెళ్ళిపోయారేమో. ఇంకో చిత్రం ఏమిటంటే, ఆరోజుల్లో హాస్యనటుల విషయం సరేసరి, సూర్యకాంతమ్మగారూ, ఛాయాదేవీ లాటి పాత్రలు ఎంత సీరియస్సువైనా కూడా నవ్వొచ్చేటట్టు చేసేవారు.

శ్రీ మునిమాణిక్యం వారి జయంతి సందర్భంలో , ఇప్పటికే చదివేసినా సరే ఇంకోమారు చదవండి..నేనూ-మాకాంతం..2020010006477 – neenu_makontham

%d bloggers like this: