బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు వచ్చిన గొడవల్లా..

    సాధారణంగా మొగాళ్ళలో, ఉన్న విషయానికొచ్చేసరికి నిజం ఒప్పుకోడానికి నామోషీ. “అహం” అనండి లేదా ఇంగ్లీషులో ” ego ” అనండి, ఏ రాయైతేనేమిటీ, అడ్డం వచ్చేస్తుంది. అందరిముందరా చులకనైపోతామేమో అనే భయం ఒకటీ, ఇవన్నీ కలిపి మొత్తానికి సంఘంలో image , (తను సృష్టించుకున్నదే) కాపాడుకోడానికి నానా తిప్పలూ పడడం. పేకమేడలాటి image ఉంటేనేమిటి, ఊడితేనేమిటి అని ఒక్కసారి నికార్శైన నిజాన్ని ఒప్పేసికుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది…

ఉద్యోగంలో ఉన్నంతకాలమూ, అసలు ఈ సంసార నౌకని మనమే నడిపించేస్తున్నామూ అనేది ఒక అపోహ. మగవారు చేస్తున్నది డబ్బు సంపాదించడం వరకే. మిగిలిన సాధకబాధకాలన్నీ భార్యే చూసుకుంటుంది. పిల్లల బాధ్యత , వాళ్ళని ఓ క్రమశిక్షణలో పెంచడంలో భర్తకంటే, భార్యదే గొప్ప contribution అనడంలో సందేహం లేదు. ఈ భర్తగారు, ప్రొద్దుటినుండీ ఆఫీసులో, పని చేసి, సాయంత్రం ఇంటికొచ్చి , పిల్లలతో గడిపే సమయం ఎంతటా? మహా అయితే, ఓ రెండుమూడు గంటలు. కానీ మిగిలిన ఇరవై గంటలూ భార్యే కదా చూసుకునేదీ? అయినా సంఘంలో అందరూ, ఫలానా వారి అమ్మాయనో, అబ్బాయనే కదా చెప్పేదీ? దానితో ఈ భర్తగారు “కాలరు” ఎత్తేసికుని, పోజులు పెట్టేస్తాడు. ఆ మధ్యన ఓ వ్యాపార ప్రకటన చూశాను– అందులో ఓ పిల్లాడీకి దేంట్లోనో ఫస్టొచ్చేటప్పటికి, స్కూల్లో మాస్టారి దగ్గరనుండి, ప్రతీ వారూ, తండ్రితో సహా , ఎవరికివారు ఘనతంతా తమదే అనుకుంటారు. కానీ, ఆ పిల్లాడు మాత్రం, తెరవెనుక ఉండి, తనని గైడ్ చేసిన ” అమ్మ” కి థాంక్సమ్మా అంటాడు. That is the bottom line.

నిజం చెప్పాలంటే, మనం తల్లితండ్రుల పెంపకంలో ఉండేది, మహా అయితే మైనారిటీ తీరేవరకూనూ. ఆ తరువాత ఏదో కాలేజీ చదువులకొచ్చేక, వాళ్ళు చెప్పిన మాటే వింటున్నట్టుగా ” నటించడం”. అప్పటికే ” స్వాతంత్రోద్యమ బీజాలు ” నాటుకుంటాయి. అవి మెల్లిగా, పెరిగి పెద్దయి, కాలేజీ చదువు పూర్తయి, అదృష్టం బాగుంటే, ఉద్యోగం వచ్చేకా, కాపోతే campus placements లో select అయేకా ” స్వతంత్రం” ప్రకటించేసికుంటారు. ఫలానా అమ్మాయిని చేసికుంటానని అబ్బాయో, ఫలానా అబ్బాయి నచ్చాడని అమ్మాయో చెప్తారు. Ofcourse ఇలాటివన్నీ ఈరోజుల్లో అనుకోండీ, ఇదివరకటి రోజుల్లో, బుధ్ధిమంతుడిలా, అమ్మా నాన్నా తెచ్చిన సంబంధం చేసికోడమూ, చేసేదేదో ఆ తరువాతే చూసుకోడమూ. చివరకు రెండూ ఒకటే, కానీ టైమింగే తేడా. చెప్పొచ్చేదేమిటంటే, మనల్ని ” mould” చేసే పధ్ధతీ, చాకచక్యం అంతా భార్యచేతిలోనే.ఒక్కొప్పుడు, ఇది మగాడి తల్లితండ్రులకి నచ్చదు. దానికీ కారణాలు ఎన్నో ఎన్నెన్నో… ప్రశాంతంగా ఆలోచించి చూస్తే మనకే తెలుస్తుంది, తల్లి తన తండ్రి జీవితంలోకి వచ్చేక, వారి జీవితాల్లో వచ్చిన ” మార్పు” మంచిదే అయినప్పుడు, తన జీవితంలోకి ఇంకో ఆడమనిషి వచ్చిన తరువాత, అదే “మార్పు” చెడ్డదెలా అవుతుందీ? వారికో రూలూ, మనకో రూలూ అంటే ఎలా కుదురుతుందీ?

ఉభయశాసనసభలనీ ఉద్దేశించి, గవర్నరుగారి ప్రసంగం, ఆయన స్వంతమేమీ కాదు, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఉద్దేశాలూ, విధానాలూ , ఏదో మర్యాద కోసం ఈయననోటి ద్వారా చెప్పించడం.అలాగే, మన గృహసంబంధిత పాలసీలన్నీ, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, భార్య దిశానిర్దేశంతోనే జరుగుతాయి. అలాగని అవన్నీ తప్పనడంలేదు. నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు సరీగ్గానే ఉంటాయి, ఆలోచించి చూస్తే. కానీ ఆ మిగిలిన ఒక్క శాతంలోనే గొడవలొచ్చేవి. ఓసారి గయ్యిమనేస్తే గొడవుండదు. అయినా, సంసారంలో చిటపటలు లేకపోతే చప్పగా ఉండదూ? ప్రతీరోజూ తీపే తింటామంటే, మొహం మొత్తదూ? అప్పుడప్పుడు, మిరపకాయ బజ్జీలూ ఉండాలి, అల్లం పచ్చిమిర్చీ దట్టించిన పెసరట్టూ ఉండాలి.

ఉదాహరణకి, మనింటికి ఎవరైనా వచ్చినప్పుడో, ఎవరింటికైనా వెళ్ళినప్పుడో, సాధారణంగా మగవారు ఓ foot in the mouth ప్రేలాపనేదో పేల్తారు. మన నోటిక్కూడా ఓ హద్దూ పద్దూ ఉండొద్దూ, అదిగో అలాటి “నియంత్రణే” భార్య… ఇంటికొచ్చిన తరువాత సున్నితంగా చెప్తుంది, ” మరీ అలా మాట్లాడేస్తే ఎలాగండీ..” అని. ఆ పాఠం ఆజన్మాంతమూ గుర్తుంటుంది. అలాగే, ఇంటికెవరైనా చుట్టాలొస్తే, వాళ్ళకి ఓ చీరపెట్టాలంటుంది. ఆర్ధిక పరిస్థితిని బట్టి భర్తగారికి కోపం రావొచ్చు. అలాటప్పుడు, ” ఈసారికి నేనే ఎలాగో ఎడ్జస్టు చేసి, నా దగ్గరున్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేస్తాను కానీ, ఓ రెండు మూడు చీరలు తెచ్చి ఉంచండి” అన్నప్పుడు తప్పుపడితే ఎలా, పనిఎలాగోలాగ కానిచ్చేసిందని సంతోషించాలి కానీ.

అలాగే ఎవరికి వారు, తాము ఇద్దరు పిల్లలని ఎలా పెంచిపెద్దచేశాడో, వారి పెళ్ళిళ్లకి ఎంత శ్రమపడ్డాడో చెప్పుకుంటూ, ఏదో మొహమ్మాటానికి, మరీ బాగుండదేమో అని, ” ఇందులో నా భార్యా, పిల్లల సహకారం కూడా ఉందనుకోండీ..” అని, ఓ also ran లా చెప్తూంటారు. అసలు ముఖ్యపాత్రంతా భార్యదే. “పుట్టింటారి గురించి మేనమామ దగ్గరా..” అన్నట్టు, భర్తగారి సత్తా, ఏ భార్యకు తెలియదూ? ఆ విషయం దృష్టిలో పెట్టుకునే, పిల్లలకీ, తనకీ ఎన్నేసి “కలలు” ఉన్నా, అదుపులో పెట్టుకుని భర్తని వీధిలో పెట్టకుండా ఉంచినది భార్యే అని, గుర్తించడానికి కొంచం టైము పడుతుంది.

ఎవరికి వారే, ఆరోగ్యం ఎలా ఉందండీ అని అడగ్గానే, ఏదో భగవంతుడి ధర్మమా అని, సుగరూ, బీపీ లేకుండా లాగించేస్తున్నానండీ, అంటాడే కానీ, అసలు ఇలాటివి రాకపోవడానికి కనిపించని దేవుడి కంటే, ప్రతీరోజూ కనిపించే భార్యే కారణంఅని గుర్తించిన నాడు అసలు సమస్యే లేదు. అసలు ఈ సుగరూ, బీపీ సమస్యలు రావడానికి ముఖ్యకారణం ఒత్తిడి. సాధించలేదని బక్కకోపం, ఆ కోపాన్ని ప్రదర్శించలేని అశక్తతా… ఇవేకదా ఈ సమస్యలకి మూలం ? అలాటి పరిస్థితి రాలేదంటే మరి ఆ credit భార్యకే కదా చెందాల్సిందీ? ఇన్నాళ్ళూ ఆడుతూ పాడుతూనే ఉండడం సాధ్యమేమిటీ అనుకోవచ్చు. నిజమే మొదట్లో సెంటు వాసనలూ, మల్లెపువ్వులతోనూ ఘుమఘుమలు ఉండేవి. కాలక్రమేణా ఐడెక్సులూ, మూవ్ లూ నూ.. అంతే కదా తేడా ఆరోజుల్లో సువాసనలూ ఈరోజుల్లో ” మూవ్వాసనలూ..” మన దృష్టికోణం మీద ఆధారపడుంటుంది…

అసలు ఈ గొడవంతా ఎందుకు మాస్టారూ అనుకుంటున్నారా, మొన్న ఫిబ్రవరి 28 న మా వైవాహిక జీవితానికి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఒక status report అన్నమాట.

ఈసందర్భంలో వైవాహికజీవితం గురించి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఇక్కడ చూడండి, ఇక్కడ రెండవ భాగం వినండి.

%d bloggers like this: