బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…


    ఈమధ్యన రోజుకో పేద్ద న్యూసు ! నిన్న సుప్రీంకోర్టువారు ,మన క్రికెట్ సామ్రాజ్యాధినేతల భాగోతం కాస్తా బయటపెట్టేశారు. ఆ మిగిలినదేదో కూడా పూర్తిచేసి, ఆటగాళ్ళ పేర్లు కూడా బయటపెట్టి పుణ్యం కట్టుకుంటే, కొద్దిలో కొద్దిమందైనా క్రికెట్ “వ్యామోహం” నుండి బయటపడతారని ఆశిద్దాం.అలాగే బెంగాల్ లో అదేదో శార్దా స్కాం.. ఆయనెవరో ఆత్మహత్య చేసికుంటానని ముందరే చెప్పేశాడో, లేదా ఎవరైనా చెప్పించారో కానీ, మొత్తానికి ఆయనకి కావాల్సినన్ని నిద్రమాత్రలు మాత్రం చేరేశారు, వాటినికాస్తా మింగేశాడు, అదీ ఎక్కడా అంటే జైల్లోట. మరి ఈయన ఆత్మహత్యంటూ చేసికుంటే, ఎవరు “బయట పడకుండా” ఉంటారో ఆ దేవుడికే తెలియాలి.

    ఈ మధ్యన ఓ కొత్త ఒరవడి ప్రారంభం అయింది…Voice Vote ట ! నెగ్గలేమని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు, దీన్ని ఉపయోగించేసి నెగ్గేస్తూంటారు. ఆ దౌర్భాగ్యం కాంగ్రెసువారే నేర్పారు రాష్ట్రవిభజన టైములో, దాన్నే ప్రస్థుత రూలింగు పార్టీవారు అనుకరించేస్తున్నారు. ఈమధ్యన మహారాష్ట్రలో జరిగిన భాగోతం ఒక ఉదాహరణ. శరద్పవార్ గారు అన్ని కబుర్లూ చెప్పి మొత్తానికి, ప్రస్తుతానికైతే స్కామ్ములనుండి బయటపడ్డట్టే.కాఫిడెన్సు వోట్ లో సమర్ధత ప్రకటింఛిన “పుణ్యానికి” ఆమాత్రమైనా బెనిఫిట్ లేకపోతే ఎలా మరి? ఎంతైనా ” ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు” గా శరద్ పవార్ కిరీటంలో మరో కలికి తురాయి ! ఆదర్శ్ స్కాం, అజీత్ పవార్ గారి ఇరిగేషన్ స్కాం లకి ఓ అయిదేళ్ళపాటు ఊరట ! మరీ ఒక్కడైపోయాడుగానీ, సురేష్ కల్మాడీ మిగిలాడు, ఎటూ కాకుండాపోయాడు పాపం !

    ఇంక so called biography లూ, auto biography ల విషయానికొస్తే , ఇదివరకటి రోజుల్లో ఓ ఆత్మకథ ని చదివితే కొత్త కొత్త విషయాలూ, జీవిత పాఠాలూ నేర్చుకునే వాళ్ళం. ఫలానావారి పుస్తకమూ అంటే అందులో ఎన్నో మనకి తెలియని విషయాలుండేవి. కానీ ఈరోజుల్లో వచ్చే పుస్తకాలలో , ఏదో ఒక సెన్సేషన్ సృష్టించేసి, డబ్బు చేసికోవడమే ముఖ్యోద్దేశంగా మారిపోయింది. ప్రభుత్వంలోని ఏ పెద్ద అధికారో రిటైరవగానే ఓ పుస్తకం వ్రాసేయడం, దాంట్లో తను పదవిలో ఉండగా ఏమేం ఘనకార్యాలు చేశాడో వ్రాస్తే అదో సంగతి, కానీ,తాను ఎంత “నీతిమంతుడో” పాపం ఎంతగా పైవారివలన ఎంతగా pressurise అయాడో వగైరా..వగైరాలు చిలవలూ పలువలూ చేసేస్తే ఆ పుస్తకం కాస్తా best seller అయిపోతోంది.ఇంక ఆ పుస్తకం గురించి చర్చలూ. మధ్యలో సందట్లో సడేమియాల్లాగ, కొంతమంది తందానతాన అనడం ఫ్యాషనైపోయింది. ఎవడికి వాడే తానో martyr అనుకోడం.

    ఈమధ్యన మా చుట్టం ఒకాయన, ” స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దేశానికి వచ్చేస్తుందిట, ఎంత మంచిపనిచేశారో కదూ, మన ప్రభుత్వం ..” అంటూ నా స్పందన ఆశించారు. ఔనండీ ఇదేమైనా కొత్తగా తెలిసిందా, ప్రభుత్వాలకి తెలిసి అయిదేళ్ళు అయింది, ఆ డబ్బేదో వచ్చినప్పుడు కదా, ఈలోపులో ఎన్నెన్ని “నాటకాలు ” జరగాలీ.. అయినా వచ్చిందే అనుకోండి, సాధారణ జనజీవనానికి కలిగే ఉపయోగం ఏమిటిటా? పెట్రోల్, డీసిలూ. గ్యాస్సూ ఓవారం తగ్గించడమూ, రెండో వారం పెంచడమూనూ. అతావేతా “ అచ్చే దిన్” వచ్చాయీ అంటే ఒక్క sensex కి మాత్రమే. అదిమాత్రం రోజురోజుకీ పాదరసంలా పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుముఖం పట్టేయీ అంటున్నారే కానీ, దేంట్లో తగ్గేయిట? మాకు పూణెలో బస్సు రేట్లు 25 % పెంచుతారుట.ఎపార్టుమెంట్ల ధరలు చూస్తే , ఐటీ కంపెనీల్లో పనిచేసేవారికే అందడం లేదు. మరి ఈ “అచ్చే దిన్ ” ఎక్కడ వెదకాలి?

    పైగా ఏమైనా అంటే కొత్తతరం వారు , రాజకీయనాయకులూ ఇళ్ళకప్పులెక్కి భాషణ్ ఇచ్చేస్తూంటారు..” దేశం మాకిచ్చిందేమిటీ అని కాదూ, దేశానికి మనమేమిచ్చామూ..” అని. వీళ్ళు మాత్రం చేస్తూన్నదేమిటిట? “స్వచ్చ్ భారత్” పేరు చెప్పి ఓ చీపురుచ్చుకుని ఫొటోలకి దిగితే సరిపోతుందా? ఉంటున్న కొంప స్వచ్చంగా ఉంచుకోగలిగితే దేశాన్ని బాగుచేసినంత, ఒక్కరోజు పనిమనిషి రాకపోతే, అంట్ల గిన్నెలు ఎక్కడివక్కడే ఉంచేసి, ఏ హొటల్లోనో లాగించేసే వాళ్ళు ఎన్నికబుర్లైనా చెప్తారు. కిందటేడాది అన్నాహజారే గారూ, అదేదో ” కరప్షన్ కూకటి వేళ్ళతో పీకేయాలని” ఓ పెద్ద హడావిడి చేశారు. మన యువతరం అంతా టోపీలూ, అవీ పెట్టేసికుని నానా హడావిడీ చేశారు, సోషల్ మీడియా నిండా హోరెత్తించేశారు.. ఆ వేడి లో కేజ్రీవాల్ కొంతకాలం ముఖ్యమంత్రికూడా అయ్యాదు. మళ్ళీ ఆ జనాలే తమిళనాడు ముఖ్యమంత్రిని , జైల్లో పెడితే గుండెలు బాదుకున్నారు..

    ఇంక మన కేంద్ర క్యాబినెట్టులో HRD శాఖ ఓ పెద్ద జోక్ గా మారిపోయింది.ఒకావిడకి అసలు చదువే లేదన్నారు. ఇప్పుడు ఆవిడగారి డెప్యూటీ మార్కుల లిస్టు లో ఏదో గడబిడ చేసిన శాల్తీట ! వీళ్ళిద్దరూ మన దేశ విద్యావిధానాన్ని శాసించే ప్రబుధ్ధులుట !వీళ్ళు చేసిన ఘనకార్యం ఏమిటయ్యా అంటే, కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ తీసేసి, సంస్కృతం పెట్టడం. పెట్టొద్దనెవడన్నాడు, కానీ దానికీ ఓ వారం వర్జ్యం ఉంటాయి. యకడెమిక్ సంవత్సరం మధ్యలో మారుస్తారా ఎవరైనా? వచ్చే విద్యాసంవత్సరంలో మారిస్తే, ఏమైనా వేదవ్యాసుడికి కోపం వస్తుందా? వీరిద్దరి జోడీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నెన్ని చిత్రాలు చూడాలో పాపం మన పిల్లలు !!

    మేరా భారత్ మహాన్…

8 Responses

  1. నేటి “కాల” వైపరీత్యాల పైన మీ మేరాభారత్ “కాలం” అమోఘం ఫణిబాబు గారూ

    Like

  2. ఇండియా దిస్ వీక్ లా అన్నీ భలే కవర్ చేసారండి.

    Like

  3. శాస్త్రిగారూ,

    నా టపా మీకు నచ్చినందుకు సంతోషం. మీ స్పందనకు ధన్యవాదాలు..

    బోనగిరిగారూ,

    చిన్నప్పుడు మా అమ్మాయిని ప్రతీరోజూ న్యూస్ పేపరు చదవవమ్మా అంటే, ” డాడీ వారానికోసారి టీవీలో Pranay Roy గారి, “India this week” వస్తుందిగా అది చూసేస్తే చాలదా “అనేది….అందుకే నెలకోసారి అన్నీ కవర్ చేస్తే చాలనిపించింది…

    సాయినాథ్ గారూ,

    ధన్యవాదాలు.

    Like

  4. “భం” ‘డీ’ ‘ఫటాఫట్’ వారు,

    అవునండోయ్, మీ టపా చదివేక గాని అన్నా హజారే అన్న మానవుడు ఒకడున్నాడు అన్న సంగతే గుర్తుకు రాలేదుటుస్మీ !!

    ఇంతకీ ఈ అన్నా హజారే ఏమైనారు చెప్మా !!

    జిలేబి

    Like

  5. జిలేబీ,

    ఏమిటో… కొత్త కొత్త సంబోధనలు మొదలెట్టారు…ఇంక అన్నా గారిగురించంటారా, ఆయన ఈమధ్యన ఎక్కడా కనిపించడంలేదు…ఎంతైనా మహారాష్ట్రలో ఉన్నాముకదా అని ఓసారి గుర్తుచేసికున్నాను. మీకెక్కడైనా తటస్థపడితే చెప్పండి…

    Like

  6. పేరును అపభ్రంశం చేయడం లో కొందరికి ఎన లేని ఆనందం.
    డాక్టర్ మల్లంపాటి శేషగిరి రావు గారని ఆధునిక వైద్య విధానం లో
    పేరెన్నిక గల భారతీయులు తెలుగు వారు. ఆయన ఇంటి పేరు రోజూ
    కొన్ని లక్షల పర్యాయాలు ప్రపంచమంతా వైద్యం లో తలుచు కుంటూ ఉంటారు.
    కానీ, అపభ్రంశం చేసి, మల్లంపట్టి అని వ్రాసి, పలికి మన దేశం వాళ్ళే బ్రష్టు పట్టిస్తూఉంటారు.
    (తా. క. పట్టి అంటే మలయాలం లో కుక్క అని అర్థం)

    Like

  7. డాక్టరుగారూ,

    ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడిని. మనవాళ్ళకి ఉన్న పెద్ద ” రోగం “ఇద. అయినా పట్టించుకోపోతేనే సుఖం.

    Like

Leave a comment