బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” తోడు దొంగలు “…


    నేను మొన్న ఆదివారం సాయంత్రం నా ప్రత్యక్షదైవాలలో ఒకరైన శ్రీ బాపు గారు, స్వర్గస్థులయారని తెలిసినప్పటినుండీ అసలు ఏమి వ్రాయాలో, ఎలా స్పందించాలోకూడా తెలియక, అంతర్జాలంలోకి కూడా రాలేకపోయాను. ముందుగా, అలాటి మహనీయుడి గురించి వ్రాసే అర్హత ఉందా లేదా, అనేది కూడా ఆలోచించుకోవాలిగా ! కానీ, ఈ రెండురోజులూ వార్తాపత్రికలలో వచ్చిన విషయాలు చదివి, తెలిసికున్నదేమిటంటే, శ్రీ బాపు గారు గత ఆరునెలలగా అస్వస్థతో బాధ పడుతున్నారని “సాక్షి ” పేపరులో దర్శకుడు శ్రీ త్రివిక్రం శ్రీనివాస్ గారి శ్రధ్ధాంజలి ద్వారా.) మరి ఆయన అంతగా అస్వస్థతగా ఉన్న వార్త రెండో కంటికి తెలియకుండా కాపాడారు, దానికి కారణం, ఈ విషయం తెలిసుంటే వారి అభిమానులు తండోపతండాలుగా శ్రీ బాపు గారిని disturb చేసుండేవారుకదా . ఏది ఏమైనా, శ్రీ బాపుగారు వారి దేహబాధనుండి విముక్తిచెంది, వారి ప్రియసఖుడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారినీ, ప్రియసఖి శ్రీమతి భాగ్యవతిగారినీ కలవడానికి స్వర్గానికి వెళ్ళిపోయారంటే ఒక విధంగా సంతోషపడాలి కానీ, ఇంకా ఆయన, వారి వియోగంతో బాధపడాలంటారా?

    భౌతికంగా శ్రీ బాపు గారు, మనల్నందరినీ విడిచివెళ్ళిపోయారే కానీ, ఆయన తీసిన సినిమాలూ, ఆయన వేసిన ” గీత “లూ చాలవండీ ఆయనని గుర్తుంచుకోవాలంటే ? దానికి సాయం ఏ డిక్షనరీ తీసినా, స్నేహం పదానికి అర్ధం కావాలంటే “బాపు రమణ “,” నిరాడంబరత “ అంటే “బాపు రమణ “, హాస్యం అంటే ” బాపు రమణ “ ఇలా చెప్పుకుంటూపోవాలంటే, ఎన్నో ఎన్నెన్నో పదాలకి నిర్వచనం ” బాపు రమణ”. అంతదాకా ఎందుకూ, గూగులమ్మ తెలుగు శోధనలో ” బా..” అని వ్రాయడం తరవాయి “బాపురమణ” అని వచ్చేస్తున్నంత ఎత్తుకి ఎదిగిపోయారు బాపురమణలు. అలాటప్పుడు, వాళ్ళిద్దరూ ఎక్కడికో మనకి కనిపించకుండా వెళ్ళిపోయారని బాధపడడం అర్ధంలేదు. తెలుగు చదవడం , వ్రాయడం వచ్చిన ప్రతీవాడూ ఏదో ఒక సందర్భంలో డిక్షనరీయో, గూగులమ్మ నో చూస్తారుగా, రోజుకోసారి ” బా..” అని టైపుచేయగానే వారిద్దరిగురించీ వందలాది పేజీలు ప్రత్యక్షం అవుతాయి. ఎక్కడో అక్కడ మనిషికి “సంతృప్తి ” అనేది ఉండాలిగా, మనం బతికున్నంతకాలమూ, మనకు నచ్చినవారూ, మనం అభిమానించేవారూ జీవించి ఉండాలంటే ఎలా కుదురుతుందీ ? అది స్వార్ధం అవుతుంది.మనం బతికినంతకాలమూ చదివి మనసారా నవ్వుకోడానికి శ్రీముళ్ళపూడి వారు పుంఖానుపుంఖాలుగా కథలు వ్రాశారు. ఇంక శ్రీబాపు గారైతే అదేమిటో ఆయన ఓ గీత గీశారంటే నవ్వొచ్చేస్తుందాయె.

    గత రెండుమూడు రోజులుగా టీవీల్లో గానీ, పత్రికల్లోకానీ, అంతర్జాల పత్రికల్లో కానీ, ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆయనతోటి గడిపిన మధురక్షణాల గురించి వ్రాసేవారే, మాట్టాడేవారే. ఎవరికివారే శ్రీబాపుగారికి తమతోనే ఎక్కువ స్నేహం ఉన్నట్టుగా చెప్పేరు. ఎవరికివారే తామే ఏదో శ్రీబాపుగారికి దగ్గరవారైనట్టు చెప్పారు. నిజమే కావొచ్చు, వారిమాట ఎందుకు కాదనాలీ, మనమేమైనా చూశామా పెట్టామా? కానీ ఇందులోకూడా ఓ పెద్ద రహస్యం ఉంది. శ్రీకృషుడు బృందావనం లో రాసలీలలు చేసినప్పుడు, పదహారువేలమంది గోపికలూ కూడా అలాగే అనుకున్నట్టు శ్రీ చాగంటివారి ప్రవచనాల్లో విన్నాము.మరిప్పుడు అర్ధంఅయిందా అందరూ అలా ఎందుకు భావిస్తున్నారో ? శ్రీబాపుగారు, రమణ గారూ తోడుదొంగలండి బాబూ, శ్రీకృష్ణపరమాత్మ లాగే తెలుగువారి హృదయాలన్నీ “దొంగిలించేశారు “. అలాటి వారిగురించా బాధపడడం ?వీళ్ళు కూడా, శరీరాలు వేరయినా అభిమన్యుడిలాగ, ” పద్మవ్యూహం ” లోకి వెళ్ళడమే కానీ, బయటపడడం రాదు. మరి తెలుగువారి గుండెల్లొకి అలా చొచ్చుకుపోయారే, బయటకి ఎలా వెళ్తారమ్మా ? మనం బతికున్నంతకాలమూ, వారిద్దరూ అక్కడే. భలే..భలే.. బాగా అయ్యింది ! తెలుగువారితో పెట్టుకుంటారా.. మజాకాయా..మరోటా..

    శ్రీ బాపుగారు స్వర్గస్థులయిన రోజున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, ఏమిటేమిటో ప్రకటనలు చేసేశారు–ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలన్నారు, ఎప్పుడో నిర్మించబోయే రాజధానిలో కట్టబోయే “కళాక్షేత్రానికి” బాపురమణల పేరన్నారు, విజయవాడలో దేనికో వారి పేరుపెడతామన్నారు. పాఠ్యాంశాల్లో వీరిగురించి పాఠాలు పెడతానన్నారు. అంత్యక్రియలకి “ప్ర్రభుత్వలాంఛనాలకే” దిక్కులేదు. ఇంక రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేసిన ఎన్ని నిలబెట్టుకుంటారో చూడాలి.ప్రభుత్వం ఏగంగలోనైనా దిగనీయండి, మనలాటి సాధారణ పౌరుల హృదయాల్లోంచి, బాపు రమణలని ఎవ్వరూ విడదీయలేరుగా? వారిద్దరూ మనలాటి సాదాసీదా మనుషుల గురించే అంత శ్రమ పడ్డారు.కేంద్రప్రభుత్వం అదేదో పద్మశ్రీని శ్రీ బాపు గారికే ప్రదానం చేసినప్పుడు, అయ్యో రమణగారుకూడా ఉంటే బాగుండేదికదా అనుకున్నాము. శ్రీ ముళ్ళపూడివారు స్వర్గస్థులైన తరువాత, ఆయనపేరులేకుండా, ఉత్తినే బాపు అనడం ఏదోలా ఉండేది ఇన్నాళ్ళూ. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇదివరకటిరోజుల్లోలాగ బాపురమణ అనే తలుచుకోవచ్చు.

    నామట్టుకునేను, ఎప్పుడైనా మనసుబాగోపోతే, 2010 లో బాపురమణ లతో గడిపిన మధురమైన మూడున్నరగంటలూ తలుచుకుంటే చాలు… జీవితానికి సరిపడేటన్ని అమూల్య క్షణాలు..

    బాపురమణ లు ఎప్పటికీ చిరంజీవులే…

8 Responses

 1. బాపూ రమణలు అమరజీవులు,చిరంజీవులు. ఎంత చెప్పినా తరుగులేనిదే, ప్రతి తెనుగువాని గుండె లయ తప్పిందో క్షణం

  Like

 2. నింపాదిగా వ్రాసినా, చాలా చాలా బాగా బాగా వ్రాసారు!!

  Like

 3. మూడో పేరా లో ఉదహరించిన వ్యాఖ్యానము నూరుపాళ్ళు సత్యమే.
  నాకు ధవళేశ్వరం మా బ్యాంకు లో బాపు రమణ గార్లకు ఎకౌంటు ప్రారంభించే అదృష్టం కలిగింది
  అలాగే ప్రతీ తెలుగోడు బాపు రమణ లను వ్యక్తిగతముగా కలిసేవుంటాడు అని నా నమ్మకము
  ఇక్కడ పూణే లో మీరు అక్కడ రాజమండ్రి లో మన మిత్రులు అప్పారావు గారు అలాగే హనుమంతరావు గారు బాపు రమణ గార్లను కల్సినట్టుగా.

  Like

 4. One of the best I read on bapu garu.

  >>శ్రీ బాపుగారు స్వర్గస్థులయిన రోజున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, ఏమిటేమిటో ప్రకటనలు చేసేశారు–ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలన్నారు, ఎప్పుడో నిర్మించబోయే రాజధానిలో కట్టబోయే “కళాక్షేత్రానికి” బాపురమణల పేరన్నారు, విజయవాడలో దేనికో వారి పేరుపెడతామన్నారు. పాఠ్యాంశాల్లో వీరిగురించి పాఠాలు పెడతానన్నారు

  ఎవరెవరో ఏమిటేమిటో చెప్పారు ఆయన పోయాకా.అందరూ ఒకెత్తు..ఒకాయన తల పక్కకి వాల్చి సంతాప సందేశం ఇస్తే భయమేసింది కొంపదీసి ఓదారుస్తాడేమో వెళ్ళి అని..

  ఆయన ఫోటోలు చూస్తోంటే ఏడుపొచ్చేసింది..ఈ గదిలోనే కదా ఆయనని కలవటానికి ఉద్విగ్నం గా ఎదురుచూసింది అని..ఆయన అక్కడే అలా నిర్జీవం గా పడుకుని..

  Like

 5. ఒక రమణీయ అధ్యాయం ముగిసింది.

  Like

 6. >>ఒక రమణీయ అధ్యాయం ముగిసింది.

  మరో బాపు-రమణీయం మొదలయింది!

  Like

  • @ మరో బాపు-రమణీయం మొదలయింది!

   బోధపడలేదు రహ్మానుద్దీన్ గారు.

   Like

 7. శర్మగారూ,

  లయ తప్పుతూనే ఉందండీ..

  డాక్టరుగారూ,

  మీ స్పందనకు ధన్యవాదాలు..

  శాస్త్రిగారూ,

  అదేకదా వచ్చిన గొడవా !! ఎవరికివారే బాపురమణల తో అనుబంధం తమకే స్వంతమయినట్టుగా భావిస్తారు. అంతలా వారు ప్రతీ హాస్యప్రియులైన తెలుగువారి గుండెల్లోకి చొచ్చుకుపోయారు…

  వాత్సల్యా,

  శ్రీబాపు గారిని, ఆరోజు కలవడం నీవు చేసికున్న అదృష్టం. ఆ తీపి గుర్తులే ప్రతీ రోజూ నెమరువేసికోవడం తప్ప చేసేదేమీ లేదు…

  నరసింహరావుగారూ,

  నిజం. అందులో సందేహమేమీ లేదు..

  రెహమానూ,

  అవును…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: