బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” తోడు దొంగలు “…

    నేను మొన్న ఆదివారం సాయంత్రం నా ప్రత్యక్షదైవాలలో ఒకరైన శ్రీ బాపు గారు, స్వర్గస్థులయారని తెలిసినప్పటినుండీ అసలు ఏమి వ్రాయాలో, ఎలా స్పందించాలోకూడా తెలియక, అంతర్జాలంలోకి కూడా రాలేకపోయాను. ముందుగా, అలాటి మహనీయుడి గురించి వ్రాసే అర్హత ఉందా లేదా, అనేది కూడా ఆలోచించుకోవాలిగా ! కానీ, ఈ రెండురోజులూ వార్తాపత్రికలలో వచ్చిన విషయాలు చదివి, తెలిసికున్నదేమిటంటే, శ్రీ బాపు గారు గత ఆరునెలలగా అస్వస్థతో బాధ పడుతున్నారని “సాక్షి ” పేపరులో దర్శకుడు శ్రీ త్రివిక్రం శ్రీనివాస్ గారి శ్రధ్ధాంజలి ద్వారా.) మరి ఆయన అంతగా అస్వస్థతగా ఉన్న వార్త రెండో కంటికి తెలియకుండా కాపాడారు, దానికి కారణం, ఈ విషయం తెలిసుంటే వారి అభిమానులు తండోపతండాలుగా శ్రీ బాపు గారిని disturb చేసుండేవారుకదా . ఏది ఏమైనా, శ్రీ బాపుగారు వారి దేహబాధనుండి విముక్తిచెంది, వారి ప్రియసఖుడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారినీ, ప్రియసఖి శ్రీమతి భాగ్యవతిగారినీ కలవడానికి స్వర్గానికి వెళ్ళిపోయారంటే ఒక విధంగా సంతోషపడాలి కానీ, ఇంకా ఆయన, వారి వియోగంతో బాధపడాలంటారా?

    భౌతికంగా శ్రీ బాపు గారు, మనల్నందరినీ విడిచివెళ్ళిపోయారే కానీ, ఆయన తీసిన సినిమాలూ, ఆయన వేసిన ” గీత “లూ చాలవండీ ఆయనని గుర్తుంచుకోవాలంటే ? దానికి సాయం ఏ డిక్షనరీ తీసినా, స్నేహం పదానికి అర్ధం కావాలంటే “బాపు రమణ “,” నిరాడంబరత “ అంటే “బాపు రమణ “, హాస్యం అంటే ” బాపు రమణ “ ఇలా చెప్పుకుంటూపోవాలంటే, ఎన్నో ఎన్నెన్నో పదాలకి నిర్వచనం ” బాపు రమణ”. అంతదాకా ఎందుకూ, గూగులమ్మ తెలుగు శోధనలో ” బా..” అని వ్రాయడం తరవాయి “బాపురమణ” అని వచ్చేస్తున్నంత ఎత్తుకి ఎదిగిపోయారు బాపురమణలు. అలాటప్పుడు, వాళ్ళిద్దరూ ఎక్కడికో మనకి కనిపించకుండా వెళ్ళిపోయారని బాధపడడం అర్ధంలేదు. తెలుగు చదవడం , వ్రాయడం వచ్చిన ప్రతీవాడూ ఏదో ఒక సందర్భంలో డిక్షనరీయో, గూగులమ్మ నో చూస్తారుగా, రోజుకోసారి ” బా..” అని టైపుచేయగానే వారిద్దరిగురించీ వందలాది పేజీలు ప్రత్యక్షం అవుతాయి. ఎక్కడో అక్కడ మనిషికి “సంతృప్తి ” అనేది ఉండాలిగా, మనం బతికున్నంతకాలమూ, మనకు నచ్చినవారూ, మనం అభిమానించేవారూ జీవించి ఉండాలంటే ఎలా కుదురుతుందీ ? అది స్వార్ధం అవుతుంది.మనం బతికినంతకాలమూ చదివి మనసారా నవ్వుకోడానికి శ్రీముళ్ళపూడి వారు పుంఖానుపుంఖాలుగా కథలు వ్రాశారు. ఇంక శ్రీబాపు గారైతే అదేమిటో ఆయన ఓ గీత గీశారంటే నవ్వొచ్చేస్తుందాయె.

    గత రెండుమూడు రోజులుగా టీవీల్లో గానీ, పత్రికల్లోకానీ, అంతర్జాల పత్రికల్లో కానీ, ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆయనతోటి గడిపిన మధురక్షణాల గురించి వ్రాసేవారే, మాట్టాడేవారే. ఎవరికివారే శ్రీబాపుగారికి తమతోనే ఎక్కువ స్నేహం ఉన్నట్టుగా చెప్పేరు. ఎవరికివారే తామే ఏదో శ్రీబాపుగారికి దగ్గరవారైనట్టు చెప్పారు. నిజమే కావొచ్చు, వారిమాట ఎందుకు కాదనాలీ, మనమేమైనా చూశామా పెట్టామా? కానీ ఇందులోకూడా ఓ పెద్ద రహస్యం ఉంది. శ్రీకృషుడు బృందావనం లో రాసలీలలు చేసినప్పుడు, పదహారువేలమంది గోపికలూ కూడా అలాగే అనుకున్నట్టు శ్రీ చాగంటివారి ప్రవచనాల్లో విన్నాము.మరిప్పుడు అర్ధంఅయిందా అందరూ అలా ఎందుకు భావిస్తున్నారో ? శ్రీబాపుగారు, రమణ గారూ తోడుదొంగలండి బాబూ, శ్రీకృష్ణపరమాత్మ లాగే తెలుగువారి హృదయాలన్నీ “దొంగిలించేశారు “. అలాటి వారిగురించా బాధపడడం ?వీళ్ళు కూడా, శరీరాలు వేరయినా అభిమన్యుడిలాగ, ” పద్మవ్యూహం ” లోకి వెళ్ళడమే కానీ, బయటపడడం రాదు. మరి తెలుగువారి గుండెల్లొకి అలా చొచ్చుకుపోయారే, బయటకి ఎలా వెళ్తారమ్మా ? మనం బతికున్నంతకాలమూ, వారిద్దరూ అక్కడే. భలే..భలే.. బాగా అయ్యింది ! తెలుగువారితో పెట్టుకుంటారా.. మజాకాయా..మరోటా..

    శ్రీ బాపుగారు స్వర్గస్థులయిన రోజున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, ఏమిటేమిటో ప్రకటనలు చేసేశారు–ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలన్నారు, ఎప్పుడో నిర్మించబోయే రాజధానిలో కట్టబోయే “కళాక్షేత్రానికి” బాపురమణల పేరన్నారు, విజయవాడలో దేనికో వారి పేరుపెడతామన్నారు. పాఠ్యాంశాల్లో వీరిగురించి పాఠాలు పెడతానన్నారు. అంత్యక్రియలకి “ప్ర్రభుత్వలాంఛనాలకే” దిక్కులేదు. ఇంక రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేసిన ఎన్ని నిలబెట్టుకుంటారో చూడాలి.ప్రభుత్వం ఏగంగలోనైనా దిగనీయండి, మనలాటి సాధారణ పౌరుల హృదయాల్లోంచి, బాపు రమణలని ఎవ్వరూ విడదీయలేరుగా? వారిద్దరూ మనలాటి సాదాసీదా మనుషుల గురించే అంత శ్రమ పడ్డారు.కేంద్రప్రభుత్వం అదేదో పద్మశ్రీని శ్రీ బాపు గారికే ప్రదానం చేసినప్పుడు, అయ్యో రమణగారుకూడా ఉంటే బాగుండేదికదా అనుకున్నాము. శ్రీ ముళ్ళపూడివారు స్వర్గస్థులైన తరువాత, ఆయనపేరులేకుండా, ఉత్తినే బాపు అనడం ఏదోలా ఉండేది ఇన్నాళ్ళూ. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇదివరకటిరోజుల్లోలాగ బాపురమణ అనే తలుచుకోవచ్చు.

    నామట్టుకునేను, ఎప్పుడైనా మనసుబాగోపోతే, 2010 లో బాపురమణ లతో గడిపిన మధురమైన మూడున్నరగంటలూ తలుచుకుంటే చాలు… జీవితానికి సరిపడేటన్ని అమూల్య క్షణాలు..

    బాపురమణ లు ఎప్పటికీ చిరంజీవులే…

%d bloggers like this: