బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఒళ్ళు మండిందంటే మండదూ మరీ ?


    ప్రపంచంలో చాలా మందిని చూస్తూంటాం, వాళ్ళే చాలా తెలివైనవాళ్ళూ, అవతలి వారంతా శుధ్ధ శుంఠలూ అని ఓ పెద్ద అభిప్రాయం ఉంటూంటుంది. కానీ వారి ” అతితెలివితేటలు ” అవతలివారికి ఎంత అసహ్యం కలిగిస్తుందో వారికి తెలియదు. పోనీ చెప్దామా అనుకున్నా, ఏదో ఒక వంక పెట్టి సమర్ధించుకుంటారే కానీ, తప్పైపోయిందనిమాత్రం ఛస్తే ఒప్పుకోరు. అలాటి ఓ ” ప్రాణి ” నాకు తగిలేరు.

    ఈమధ్యన హైదరాబాదు వెళ్ళి, తిరిగి పూణె శతాబ్దిలో ప్రయాణం చేశాను. నాకు మొదటినుండీ తెలుగు వార పత్రికలు కొత్తవి కొనడం అలవాటు. మా ఇంటావిడకి తెలుగు పుస్తకాలన్నా, పత్రికలన్నా ప్రాణం. పుస్తకం తెచ్చేనంటే చాలు, దాన్ని పూర్తిగా చదివేదాకా నిద్ర పట్టదు. పైగా తను చదివినదేదో ఇంకోరితో పంచుకుంటే అదో ఆనందం. నేనొక్కడినే దొరికేను, నాకేమో అవి చదివే ఓపిక లేదాయె. పోనిద్దురూ ఎప్పుడూ ఉండే గొడవే ఇది. పుస్తకాల మాట అటుంచి, కొత్త పత్రికలు వచ్చేయంటే చాలు, వాటిలో ఉండే పజిల్స్ నింపడం అంటే, ఇంక నిద్రా తిండీ ఉండవు. వాటిని పూరిస్తేనే కానీ, స్టొవ్ మీద కుక్కరు కూడా పెట్టదు. అందుకే ఆదివారాలు సాక్షి, ఈనాడు అనుబంధాలు, పదకొండింటికి కానీ ఇంటికి తీసికుని రాకుండా జాగ్రత్త పడుతూంటాను, కనీసం అప్పటికి స్నానం, పూజా పూర్తిచేసికుని కుక్కరు పెట్టేస్తుంది !! ఇదంతా ప్రింటు విభాగం వరకూనూ. ఇంక అంతర్జాల పత్రికలు అదృష్టం కొద్దీ నెలకొకసారే కనుక బ్రతికి పోయాను. ఆ పజిలేదో, ఓ printout తీసి ఆవిడకిచ్చేస్తే చాలు తన పనేదో తను చేసికుంటుంది. అప్పుడప్పుడు నన్నూ సలహాలడుగుతూంటుంది. ఆ మధ్యనెప్పుడో నన్ను ఓ సందేహం అడిగింది. ఒకటే అక్షరంట…మత్తుపానీయం ట.. ఏదో నాకు తెలుస్తుందేమో అని అడిగితే, నాకు తెలిసిన ఒకేఒక డ్రింక్ “రమ్” అన్నాను. తను వ్రాసేసింది. తీరా ఫలితాలు వచ్చినతరువాత చూస్తే, తను వ్రాశిన దాంట్లో అదొక్కటే ” తప్పు “, ప్రైజు వెంట్రుకవాసిలో తప్పిపోయింది ! అప్పటినుంచీ నన్ను సలహాలడగడం మానేసింది, బతికిపోయాను. అంతర్జాల పత్రిక నిర్వహించే నెల నెలా వచ్చే పజిల్ లో ఇప్పటికి చాలాసార్లు ప్రైజు సంపాదించిందిలెండి. ఈ గొడవంతా ఎందుకు వ్రాశానంటే, మ ఇంటావిడకి పజిల్స్ అంటే ఎంత ప్రాణమో చెప్పడానికి . ఆదివారం అనుబంధాల్లో అప్పుడప్పుడు నేను కూడా వేలు పెడుతూంటాను. కానీ వచ్చిందికదా అని చివరకి పెన్సిల్ తో కూడా వ్రాయడానికి ధైర్యం చేయను. అక్కడికేదో తను కోప్పడుతుందని కాదు..just to respect her passion. ఆ పజిల్స్ నింపడంలో ఉండే ఆనందం నాకూ తెలుసును. ఒకానొకప్పుడు, గుప్తుల స్వర్ణయుగం లో నేనూ, ప్రతీరోజూ ఇంగ్లీషు crossword నింపేవాడిని. తరువాత్తరువాత ఆ అలవాటు తప్పింది.

    ఆ పజిల్స్ నింపడం ఒక addiction లాటిది, ఒకసారి పట్టుకుంటే వదలదు. చూస్తూంటానుగా బయటకి వెళ్ళినప్పుడు, చాలామంది ఏదో ఒక పజిల్ నింపుతూనేఉంటారు. దానికి వయసుతో సంబంధం కూడా లేదు. అదో అలౌకికానందం. ఒకటిమాత్రం నిజం ఈ పజిలు నింపడం అనేది ఒక ఆరోగ్యకరమైన వ్యసనం. అలాగని, ఎవరి పేపరు పడితే వాళ్ళ పేపరులో మన talent చూపించుకోకూడదు. అంతగా చేయాలంటే, ఓ పేపరో పత్రికో కొనుక్కోవడం, వాళ్ళిష్టంవచ్చినంతసేపు నింపుకోమనండి, అంతేకానీ, ఎవరో కొనుక్కున్న పుస్తకమో, పత్రికో చదవడానికి తీసికుని, దాంట్లో వాళ్ళ ప్రతిభా పాటవాలు ప్రదర్శించుకుంటే ఒళ్ళు మండుతుంది.

    సరీగ్గా అలాటి అనుభవమే నాకు జరిగింది- శతాబ్ది లో.సికిందరాబాదు లో రైల్వే బుక్ స్టాల్ లో , మాకు ఇక్కడ పూణె లో దొరకని, ” నది ” పత్రిక కొనుక్కున్నాను. ఒకసారి తిరగేసి, సంచీలో పెట్టేశాను.నాకు రెండు సీట్లకి అవతల ( అదే లైనులో) ఓ ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు. వారు తెలుగులోనే మాట్టాడుకుంటున్నట్టనిపించింది. నా అలవాటు ప్రకారమైతే పరిచయం చేసికుందును, కానీ అదేమిటో పరిచయం చేసికోవాలనిపించలేదు. నా దారిన నేను ఇంగ్లీషు పేపరు చూస్తూ కూర్చున్నాను. ఇంతలో ఆ పెద్దావిడ, ” ఇందాకా మీరు చదువుతూన్న పత్రిక ఓసారి ఇస్తారా..” అనగానే, పోనీ కాలక్షేపానికి చదువుకుంటారులే అనుకుని, సంచీలోంచి తీసి ఇచ్చాను. క్యాటరింగువాడిచ్చినదేదో తిని, కొద్దిగా కళ్ళు మూశాను. ఏదో మాట వినిపించి అకస్మాత్తుగా మెళుకువ వచ్చింది. నా చెవిలో పడ్డదేమిటయ్యా అంటే, ఆ పెద్దావిడ, రెండో అమ్మాయిని అడుగుతున్నారు..ఏదో క్లూ లాటిది చదివి, ఫలానాకాదేమోనే.. ఇదేఅయుంటుంది అని. వాళ్ళు మాట్టాడుతుంది ఏదో పజిల్ గురించే అని తెలుస్తోంది. తీరా చూస్తే ఏముందీ? నా దగ్గర తీసికున్న “నది ” లో ఇచ్చిన పజిల్ కాస్తా నింపేస్తోంది. అంతకంటే sacrilegious ఏమైనా ఉందా అసలు? పైగా పెన్సిలు కూడా కాదు, పెన్నుతో.. ఒళ్ళు మండిందంటే మండదూ మరి? వెంటనే ” హలో.. ఎవరిని అడిగి చేస్తున్నారండీ అలాగ? పుస్తకం ఎరువు అడగడమే కాక, మీ ఇష్టం వచ్చినట్టు దాంట్లో వ్రాయడానికి మీరెవరసలూ? అడిగుంటే అప్పుడే చెప్పేవాడిని అలాటివి చేయొద్దని. మీ ఇష్టం వచ్చినట్టు వ్రాసేయడమే, అంత వయసు వచ్చినా సంస్కారం లేకపోవడం దురదృష్టకరం.. ” అని చెడా మడా కడిగేశాను. చాలా..చాలా ఆలోచించి మరీ అన్నాను.దానిక్కారణం ఆవిడ చేసినదాంట్లో తప్పేమీ కనిపించలేదు ఆవిడకి. అప్పటికీ పక్కనున్న అమ్మాయి అంటూనే ఉందిట– అలా రాసేస్తే బాగుండదేమో.. అని.ఈవిడే అతి తెలివితేటలకి వెళ్ళి చేసిన ఘనకార్యం ! పైగా, తను చేసినదానికి sorry అని చెప్పాల్సిన సంస్కారం కూడా లేదు. పోనీ ఇంత జరిగేకేనా, పుస్తకం తిరిగి ఇచ్చేరా అంటే అదీ లేదూ, నేనే సిగ్గు విడిచి అడగాల్సొచ్చింది. ప్రయాణాల్లో ఇలాటి అనుభవాలు కూడా జరుగుతూంటాయి.అలాగని లోకంలో అందరూ అలాగే ఉంటారా అంటే అదీకాదూ, నూటికీ కోటికీ ఒక్కో శాంపిల్ తటస్థ పడుతూంటారు, అలాటివారితో to call spade a spade గా ఉంటేనే తప్ప వాళ్ళు బాగుపడరు.

    అంత చిన్నవిషయానికి అంతలా రాధ్ధాంతం చేయడం అవసరమా అని మీరు అనుకోవచ్చు.కానీ మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నేను సాధారణంగా, బయటి వారితో అంతలా react అవను. ప్రయాణాల్లో ఏమిటి, ఎక్కడా కూడా, నేను కొన్న పుస్తకాలు/పత్రికలు ఎవరితోనూ పంచుకోను, ఇంకొకరిదగ్గరనుండి తీసికోను. నాక్కావాల్సినవి నేను కొంటాను. అది ఏదో అతిశయం,అహంకారం అనుకుంటే చేసేదేమీలేదు. పోనీ ఓ ” విచిత్ర పక్షి ” అనుకోండి.

Advertisements

7 Responses

 1. మీరు చేసింది సమర్ధనీయం, శ్లాఘనీయం

  Like

 2. నిష్కర్షగా ఉండడము తప్పేమీ కాదు .ఆ విధంగా మరోసారి ఇంకెప్పడూ చెయ్యకుండా హెచ్చరించారు .
  మొహమాటానికి పోకుండా అమ్మా మీరు చేసిన పనేమీ బాగాలేదు అని తెలిసేటట్టు చెప్పారు శభాష్

  Like

 3. ఇలాటివాళ్ళు తగులుతూనే ఉంటారు.

  Like

 4. What you did is right uncle.

  Like

 5. డాక్టరుగారూ,శాస్త్రి గారూ,శర్మ గారూ, స్నేహ గారూ,

  నేను కొంచం అతిగా react అయానేమో అనుకున్నాను. కానీ , మీ స్పందనతో కొద్దిగా ఊరట కలిగించారు.. ధన్యవాదాలు..

  Like

 6. ఇప్పుడు ఇలాంటి మనస్తత్వం కల పిల్లలే నాకు బాగా కనిపిస్తునారు. ఆత్మ విశ్వాసం పేరు మీద డబ్బున్న స్కూళ్ళలో నేర్పుతున్న పొగరు అది. ఈ జాడ్యం పెద్దోల్లకి కూడా ఉందన్నమాట.

  Like

 7. బాపు గారి పై భమిడిపాటి ఫణిబాబు గారి వ్యాసం
  http://apmediakaburlu.blogspot.in/2014/09/blog-post.html

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: