బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఏదైనా సరే, ఉన్నన్నాళ్ళూ విలువ తెలియదు. ఒకసారి, ఏ కారణం చేతైనా కనుమరుగైపోతే నెత్తీ, నోరూ బాదుకోవడం, మామూలేగా. ఉదాహరణకి ఆటో వాళ్ళనే తీసికోండి, ప్రతీ వీధి చివరో, సందుమొగలోనో, ఆటోలు వరసలో నిలబెట్టి ఉంచుతారు. ఏదో ఫలానా చోటుకి వెళ్ళాలీ వస్తావా అంటే, ఏదో రేటు చెబుతాడు. మీటరు మీద ఛస్తే రాడు. ఏవేవో కారణాలు చెప్తాడు, కేబిల్ తెగిందంటాడు, తప్పు చూపిస్తోందీ అంటాడు, ఏదైతేనేం మొత్తానికి వాడికీ, మనకీ బేరం కుదరదు. పోనీ ఎవడికైనా రిపోర్టుచేద్దామా అనుకుంటే, పక్కనే ఉండే ఇంటావిడ, ” పోనిద్దురూ ఎందుకూ వాడితో గొడవా? మన సందు మొగలోనే ఉంటాడు, రేపేదైనా అవసరం వస్తే వాడే దిక్కు..” అనేయడంతో, మనమూ, మన పౌరహక్కులూ గోదాట్లోకి వెళ్ళిపోతాయి. మహ అయితే, ఇటుపైన వాడి ఆటో ఎక్కకూడదని ఓ “ఒట్టు” పెట్టేసికోవడం. ఇంకో ఆటో దొరికేదాకా, మీటరు మీద రాని ఆటోవాళ్ళందరినీ తిట్టుకోవడం ( అదీ వాడికి అర్ధం కాని భాషలో !), అర్ధం అయితే మళ్ళీ అదో గొడవా ! ఏ ఊళ్ళోనైనా ఇదే పరిస్థితి.

అలాగే “సిటీ బస్సులు” కూడా ఇదే కోవలోకి వస్తాయి. మనక్కావాల్సినప్పుడు గంటలకొద్దీ ఆగినా, కనుచూపుమేరలో బస్సనేది కనిపించదు. బస్సులమీదా, బస్సుల యాజమాన్యం మీదా శాపనార్ధాలు పెట్టేయడం. జీవితంలో మళ్ళీ సిటీబస్సు ఎక్కకూడదనే ఓ మహత్తర నిర్ణయం కూడా తీసేసికోవచ్చు.

వర్షాలొస్తున్నంతసేపూ వాటిమీద విసుక్కోవడం. పోనీ మిగిలిన సీజన్లలో ఏమైనా సంతోషిస్తామా అంటే అదీ లేదూ, ఏ సీజను కా సీజన్నే తిట్టుకోవడం.ఇంక రైళ్ళ విషయాలకొస్తే, వాటిని తిట్టకుండా ఉండేవారు బహుతక్కువ . టైముకి రావడంలేదనో, వచ్చినా రిజర్వేషన్ బోగీలో కూడా, బయటివారెక్కేస్తున్నారనో, ఏదో ఒకటి, కారణాలకేముందీ, కావాల్సినన్ని.అలా చెప్పుకుంటూపోతే, మనకి సులభంగా అందుబాటులో ఉండే ప్రతీ దానిమీదా ఏదో ఒక కంప్లైంటు.

ఉదాహరణకి పైన చెప్పిన ఆటోవాళ్ళూ, సిటీబస్సులవాళ్ళూ, రైళ్ళవాళ్ళూ , ఏదో వారి వారి హక్కులకోసం ఓ నాలుగురోజులు సమ్మే చేసేరంటే, మనందరి పనీ గోవిందా ! అప్పుడు గుర్తొస్తారు అందరూ. అలాగే మన రోడ్లు శుభ్రంచేసేవాళ్ళూ, పాలవాళ్ళూ, ఒకరేమిటి రోజువారీఅవసరాలకి సంబంధించిన ఎవరైనా సరే. ఇంకో వర్గంవాళ్ళున్నారండోయ్, ప్రభుత్వోద్యోగులు, పాపం వీళ్ళని కూడా ఆడిపోసుకోనివాళ్ళుండరు. ఇదివరకటి రోజుల్లో బ్యాంకు వాళ్ళు సమ్మె చేసినప్పుడల్లా వాళ్ళని తిట్టుకోనివాడుండేవాడు లేడు. కానీ ఎక్కడపడితే అక్కడ ఉండే ఏ.టి.ఎం ల ధర్మమా అని, ఇప్పుడు అంతగా తిట్టడం లేదు.

వీటిల్లో ఇంకో చిత్రం చూస్తూంటాం.. మొదట్లో ఎవరైనా సమ్మెలోకి వెళ్ళినప్పుడల్లా, ప్రభుత్వం మొదటి రెండు మూడు రోజులూ ఏవేవో బెదిరింపులు చేస్తూంటారు. అదేదో ఎస్మా అంటారు, ఇంకోటేదో అంటారు. చివరకి వాళ్ళూ వీళ్ళూ ఏదో చర్చలు జరిపి మొత్తానికి కథ సుఖాంతం అవుతూంటుంది. పైగా సమ్మెకాలాన్ని జీతంతో శలవుగా కూడా ఒప్పుకుంటారు. ఎలాగూ ఒప్పుకునేదానికి మళ్ళీ ఈ వేషాలెందుకో అర్ధం అవదు. చివరకి తేలేదేమిటయ్యా అంటే ఫలానా సమ్మె వల్ల జరిగిన నష్టం ఇంతా అని చెప్పుకుని, మళ్ళీ వాటి ధరలు పెంచేయడం. అతావేతా మట్టికొట్టుకుపోయేవాడు సాధారణ పౌరుడు.

వంట్లో అన్నీ బాగున్నంత కాలమూ, ఉన్నవేవో తినడానికి వేషాలేస్తాం, ఎక్కడలేని సుకరాలూనూ. తీరా తిందామని మనసుపడేసమయానికి తినడానికి వీలుండదు. ఉదాహరణకి, పళ్ళున్నంతకాలమూ, వేరుశనగపప్పంటే చిరాకాయె, ఇప్పుడేమో తిందామని మనసుపడేటప్పటికి అసలు పళ్ళే లేవు !అంతే చేసికున్నవాడికి చేసికున్నంత !!

ఇంకొంతమందుంటారు ఇళ్ళల్లో ఉండే వృధ్ధులైన తల్లితండ్రులని విసుక్కునేవారు, వాళ్ళు బతికున్నంతకాలమూ, ఏదో ఒకదానికి విసుక్కుంటూనేఉంటారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరూ? తీరా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయేసరికి, ఏ చాగంటి వారి ప్రవచనమో వినేసరికి ఎక్కడలేని బాధా పడడం…అయ్యో వాళ్ళ విలువ తెలిసికోలేకపోయామే..అంటూ..

Advertisements

3 Responses

 1. ఈ మధ్య మీ బ్లాగ్స్ లో ఏదో తక్కువ అయిందేమో అనిపిస్తోంది సారూ
  కొన్నిపాళ్ళు మోతాదులు తగ్గాయేమో అనిపిస్తోంది

  Like

 2. ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళ కు !!

  జిలేబి

  Like

 3. శాస్త్రిగారూ,

  మీరన్నది నిజమే.. నాకూ అలాగే అనిపించింది, చాలారోజుల తరువాత కదూ… తిరిగి Track లో పడడానికి ప్రయత్నం చేస్తున్నాను…

  జిలేబీ,

  మిమ్మల్నందరినీ వదిలి వెళ్ళడానికి మనసొప్పలేదు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: