బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమిటో.. బిజీ బిజీ అయిపోయింది..


    ఎప్పటికప్పుడు ఓ టపా పెట్టాలనిపించడం, వ్రాద్దామంటే టైమే ఉండకపోవడమూనూ. ” చెప్తార్లెండి కబుర్లు.. రిటైరయిన తరువాత చేతినిండా టైమే టైమూ.. పనా పాటా , చదివేవాళ్ళుంటే వ్రాయడానికి కావలిసినన్ని కబుర్లూ..” అనికూడా మీరు భావించొచ్చు. కానీ సత్తెప్రమాణికంగా క్రిందటి నెలలో అసలు కుదరనే లేదు. నా మిస్టరీ షాపింగు ఎసైన్మెంట్లు ఓ పదిదాకా చేశాను. ఏదో నాలుగు డబ్బులిస్తూంటారుకదా, ఆ చేసేదేదో శుభ్రంగా చేసి, ఆ రిపోర్టేదో పంపేస్తే వాళ్ళకీ బాగుంటుంది, నాకూ సంతృప్తిగా ఉంటుంది. నేను ఎప్లై చేయకపోయినా వాళ్ళే ఫోన్లు చేస్తూంటారు ఫలానాది మాకు అర్జెంటూ అని.ఇదేదో గొప్పకి చెప్పుకుంటున్నదికాదు, నా సామర్ధ్యం మీద వారికి ఉన్న నమ్మకం. ఇలాటి సందర్భాలు మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని వృధ్ధి చేస్తాయి.

    కార్తీక మాసంలో బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాల ప్రత్యక్ష ప్రసారాలు సరేసరి. ఏదైనా మిస్ అవొచ్చుకానీ, ఆ ప్రవచనాలు మిస్సవడమే.. అబ్బే సాధ్యం కాదు.వీటన్నిటికీ తోడు, క్రిందటి నెలలో నామీద ఎంతో అభిమానంతో నన్ను కలవడానికి వచ్చిన స్నేహితులు. అందులో ముందుగా ప్రస్తావించాల్సింది, స్నేహితులు మోహన్ గారు. ఇక్కడ పూణె లో ఏదో ముఖ్యమైన పనిమీద వచ్చి, ముందుగా నన్ను కలిసి, అదీ ఎక్కడా ఖడ్కీ రైల్వేస్టేషను వెనక్కాల ఉండే న్యూసు పేపరు కొట్టుదగ్గర,Friends 001 నా కోరికమేరకు అంత బిజీ షెడ్యూల్ లోనూ, మా ఇంటికి కూడా వచ్చి, మా ఇద్దరినీ కలియడం ఓ గొప్ప అనుభవం. ఆయనకీ నాకూ పరిచయం నా బ్లాగుద్వారానే. నేను వ్రాసే కాలక్షేపం కబుర్లు, నా అదృష్టంకొద్దీ వారికి నచ్చడం, ప్రతీ టపాకీ తప్పకుండగా ఓ వ్యాఖ్య పెట్టి నన్ను ప్రోత్సాహ పరచడం. ఏదో నచ్చడం వేరూ, కానీ అత్యంత విలువైన సమయాన్ని నాకుకూడా కేటాయించడం చాలా సంతోషమనిపించింది.Thank you Doctor gaaru.You made my day..

    క్రిందటి నెల ఆంధ్రభూమి మాసపత్రికలో ఒక మినీ నవల ” శ్రీరామదూతం శిరసానమామి” మొదటిభాగం ప్రచురించారు. రచయిత శ్రీ ఉప్పులూరి కామేశ్వరరావుగారు. “సుందరకాండ” లోని విషయాలు ప్రస్థుత పరిస్థితులకి అన్వయిస్తూ వ్రాసిన కథ. కథ మాట ఎలా ఉన్నా, ఆ నవలలో , మా కోనసీమలోని ఇందుపల్లి గ్రామం, అమలాపురం గురించి ప్రస్తావనా వ్రాస్తే నేనూరుకోగలనా? అసలే “కోనసీమా” , గోదావరీ నా “బలహీనత”లాయె, పైగా ఆ రచయిత ఫోను నెంబరుకూడా ఇచ్చారు, నేనా అలాటి అవకాశం వదిలేదీ. వెంటనే ఫోను చేసేసి ఆయనతో మాట్టాడి పరిచయం చేసికునేదాకా ఉండలేకపోయాను. మా ఇంటావిడ నా ఈ వెర్రి చూసి అంటూంటుంది, ” ఊరికే అలా ఫోన్లు చేస్తే ఏమైనా అనుకుంటారేమోనండీ, మీ వెర్రిమీదీ..” అని. ఫోను నెంబర్లు ఇచ్చేది, ఎవరైనా ఫోను చేస్తారనేకదా, చేసి చూద్దాం, నచ్చితే మాట్టాడతారు, లేకపోతే పొడిపొడిగా నాలుగు మాటలు మాట్టాడి పెట్టేస్తారు, మహ అయితే ఓ ఫోనుకాలు ఖర్చు. కాకపోతే ఓ కొత్తపరిచయం జరిగినట్టు మనకీ సంతోషమే కదా అని నా పాలసీ. చెప్పొచ్చేదేమిటంటే ఆ తరువాత ఆయనే ఫోను చేసి ఓ అరగంట మాట్టాడారు. అంటే నచ్చినట్టే కదా ! శుభం !

    రోజులో నాలుగేసి గంటలు ఆన్ లైన్లో ఉండడంతో ఒక్కొక్కప్పుడు చిత్రమైన పరిచయాలుకూడా కలుగుతూంటాయి.ఎవరిదో ఒక పేరు చూశాను ఆన్ లైన్లో ఉన్నట్టు. ఆవిడ, మా ఇంటావిడ స్నేహితురాలేమో అని అనుకుని, ఆవిడతో చాటింగు మొదలెట్టాను. ఆవిడతో ఉన్న చనువుకారణంగా, కొద్దిగా వ్యంగ్యంగా కూడా చాట్ చేయడం మొదలెట్టాను. కానీ ఆవిడ ఇచ్చే సమాధానాలలో ఎక్కడో తేడా కనిపించింది. చివరకి అడిగేశాను మీరు ఫలానాయే కదూ అని. “మీరనుకుంటున్న నేను, నేను కాదూ..” అని అష్టాచెమ్మా సినిమాలోని డయలాగ్గు చెప్పేశారు. పైగా నా బ్లాగుకూడా చదువుతానూ అన్నారు. అదిచాలదూ నాకూ ! ఆవిడ ఫోను నెంబరు అడిగి, వెంటనే ఓ అరగంట మాట్టాడాను. ఫోనులో మాట్టాడినప్పుడు చాలాచాలావిషయాలే మాట్టాడుకున్నాము.ఏమనుకున్నారో ఏమో? ఆవిడ ఐడి తీసికుని ఓ మెయిల్ కూడా పంపాను, ఇంకా సమాధానం రాలేదు.

   ఇవన్నీ ఒక ఎత్తూ, 1963 లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు కలిసి పనిచేసిన స్నేహితులని యాభై సంవత్సరాల తరువాత కలవడం మరో అద్భుత అనుభవం. నేను పధ్ధెనిమిదో ఏటనే, చదువూ సంధ్యా అంతగా అబ్బక ఉద్యోగంలో చేరిపోయాను, ఇంక చదువు గొడవ ఉండదుగా అనుకుని.మరీ అంత చిన్నవయసులో ఉన్న ఊరు వదిలి ఎక్కడో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒక్కడినీ ఉండడమంటే ఏదో “బెంగ” గానే ఉండేది.పోనీ బెంగ అందామా అంటే మళ్ళీ వెనక్కిపిలిచి ఏ చదువులోనైనా పెట్టేస్తారేమో అని ఓ భయమూ, ఎలాగోలాగ సెటిలయిపోదామని నిశ్చయించేసికున్నాను. అంతా కొత్తా, భాష కూడా అంతంత మాత్రమే. హిందీ మరాఠీ అయితే అడగొద్దు. ఏదో హిందీ సినిమాలూ, బినాకా గీత్ మాలాలూ మాత్రమే నాకు హిందీతో ఉన్న పరిచయం. అలాటి పరిస్థితుల్లో తెలుగు మాట్టాడేవారు, అదీ గోదావరి జిల్లాలవారి పరిచయం అంటే నేనెంత అదృష్టం చేసికున్నానో కదూ? అప్పటికే ఉద్యోగంలో ఉన్న తెలుగు వారందరూ, నాకంటె వయసులో పెద్దవారే. నేనేమో ఇంకా మీసమైనా మొలవని కుర్రగాడినీ.నన్ను అందరూ ఓ చిన్న తమ్ముడిలా భావించి, నాకున్న బెంగ పోగొట్టారు.ఫరవాలేదూ అని ఓ భరోసా ఇచ్చి నన్ను చూసుకున్నవారిని ఎప్పటికీ మరువలేముకదూ. అలా పరిచయం అయినవారిలో ఇద్దరు స్నేహితులు శ్రీ సుందరరామయ్య, మోహనరావూ అన్నవారు రెండురోజులక్రితం పూణె వచ్చారు. ఇంకొక స్నేహితుడి ద్వారా నన్ను మొత్తానికి కలిసి, మా ఇంటికి వచ్చి సమయం గడిపారు. ఒకటా రెండా యాభై సంవత్సరాల కబుర్లు. ఆరోజుల్లో మేమందరమూ కలిసి లొనావలా వెళ్ళినప్పటి బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలుంటే, అవి చూసికుని ఒక్కసారగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాము.
Friends in 1963IMG_20131203_112303

    ఇంత హడావిడి అయింది, మరి బిజీ బిజీగా ఉన్నట్టుకాదూ మరి?

Advertisements

3 Responses

 1. విశ్వ వ్యాప్త విచిత్ర జాలం (www)లో,
  విచిత్ర పరిచయాలు,విచిత్ర అనుబంధాలు!!
  మనమిద్దరం కలిసి ఉన్న ఫొటొకి, మీ మ్యుసింగ్ లో
  చోటు కలిపించినందుకు, ఙ్ఞాపకం తాజా చేసినందుకు
  శత కోటి ధన్యవాదాలు

  Like

 2. Sorry Uncle (Phani babu garu), me mail ku reply ivvaledu inkaa.. nenu konchem kastapadi meku elagaina telugu lo reply ivvalani decide ayyanu,anduke late. me parichayam naku chaala anandakaram. I am blessed. Thank you sir again for your valuable time.

  say my hi to Aunty.

  Rgds
  Santhi

  Like

 3. డాక్టరుగారూ,

  నేను వ్రాసే టపాలో మన ఫొటో పెట్టుకోవడం నేను చేసికున్న అదృష్టం. అలాటి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు.

  శాంతీ,

  మీ జవాబు ( తెలుగులో) కొరకు వేచి ఉంటాను… థాంక్స్..( నేను మిమ్మల్ని బోరుకొట్టలేదన్నందుకు !!)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: