బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్..

    ఈమధ్యన టీవీ పెట్టాలన్నా, ఓ వార్తాపత్రిక చదువుదామన్నా చిరాకెత్తుకొచ్చేస్తోంది. అప్పుడెప్పుడో కొత్త భారతరత్న రావుగారు, మన రాజకీయనాయకులందరూ ఒఠ్ఠి idiots అని శలవిచ్చి ఇరవైనాలుగ్గంటలు గడిచిందో లేదో, అబ్బెబ్బే నేనలాగనలేదూ అన్నారు. అనుకున్నదేలెండి. ఆయన్ని ఎవరైనా అడిగారో లేక, భారతరత్న వచ్చేసిందికదా అని నోటికొచ్చినట్టు మాట్టాడచ్చనుకున్నారో, ఇస్రో వారు రాకెట్లు గగనంలోకి పంపేముందర, తిరుమలేశుని ఆశీర్వచనం తీసికోడం మూఢాచారం అని కొట్టిపారేశారు. అదే ప్రక్రియ- శ్రీవెంకటేశ్వరుని ఆశీర్వచనం తీసికోడం,ఆయుధపూజనాడు సరస్వతీదేవిని పూజించినట్టూ అని బ్రహ్మశ్రీ చాగంటి వారు శలవిచ్చారు. ఏమిటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది.వార్తలు చూద్దామన్నా, చదువుదామన్నా ఒకటే గొడవ. హాయిగా ప్రవచనాలు వింటే హాయీ అనుకుంటే,వాటికీ ఏదో గొడవే. ఆ శ్రీవెంకటేశ్వరా చానెల్ వాళ్ళైనా, చాగంటివారి ప్రవచనాలు ,”పంచనదులు” అయిదురోజులూ ప్రత్యక్షప్రసారాలు చేస్తారా అంటే, చెప్పా పెట్టకుండా చివరి రోజున మానేశారు. కారణాలు ఆ తిరుమలేశునికే ఎరుక !

    రోజుకో గొడవ- ఒకరోజునేమో కంచి స్వాములారు అదేదో కేసులో, తొమ్మిది సంవత్సరాల తరువాత నిర్దోషులుగా బయటపడ్డారుట. సాక్షుల్లో సగానికి సగం మంది hostile అయిపోయారుట, దానితో కేసు కొట్టేశారుట. అసలు పరమపవిత్రమని భావించే శంకరమఠాలకి ఈ గొడవలెందుకో?జయలలిత గారు పోనిద్దూ అని ఊరుకుంటుందా, లేక పైకోర్టుకి ఎపీల్ చేయిస్తుందా? ఇంక ఆ ఆసారామ్మో ఎవరో ఆయన గొడవ ఇంకోరకం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అంతా అగమ్యగోచరంగా ఉంది.
మధ్యలో ఎన్నికలోటీ. భవిష్య ప్రధానమంత్రి గారైతే చెప్పఖ్ఖర్లేదు. ఏదో అధికారపార్టీవాళ్ళని నాలుగు కడిగేయడంతో సరిపెట్టుకోక, చరిత్రలోకి వెళ్ళడం ఎందుకో? ఒక్కటీ సరీగ్గా తెలియదు. నోటికెంతొస్తే మాట్టాడేయడమే. తనుచెప్పేదేదో సరీగ్గా చెప్తున్నాడా లేదా అనేది అసలు చూసుకోకపోడం. వినేవాళ్ళూ అలాగే ఉన్నారులెండి, ఈయనేం మాట్టాడితే దానికి హర్షధ్వానాలు చేసేయడం. ఏదో పప్పులో కాలేయడం, దానికేమో అధికారపార్టీవాళ్ళు గేలిచేయడం. ఎందుకొచ్చిన గొడవంటారూ? ఈమధ్యన ఎన్నికల్లో నుంచుండే కాండిడేట్ల ఆస్థి వివరాలు చదువుతూంటే , కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రతీవాడూ కోటీశ్వరుడే. పైగా కొంతమందైతే క్రిందటి ఎన్నికలనుండి, ఈ ఎన్నికలలోపులో ఆస్థి వందనుండి వెయ్యి రెట్లు అభివృధ్ధ్ది చెందిన కేసులే. ఏదో అయిదేళ్ళలోనూ, దేశాన్ని అభివృధ్ధి చేస్తారనుకున్నాము.

    ఇంక మన రాష్ట్రం సంగతి చూస్తూంటే, అడక్కండి. ఏం జరుగుతూందో ఎవరికీ తెలియదు.మధ్యలో తుఫాన్లోటీ, వాటికేమో చిత్రాతిచిత్రములైన పేర్లోటీ. ఇదివరకటి రోజుల్లోనే హాయి, ఏదో ఏడాదికోసారి గాలివాన అనేవారు, దానికో పేరుండేది కాదు, ఉన్నా విన్న జ్ఞాపకంలేదు. అసలు వీటికి పేర్లెందుకూ అని, వెదికితే గూగుల్ లో కనిపించింది.cycname ఏడాదికీ నాలుగైదుసార్లు వచ్చేస్తూంటే మరి పేర్లుండొద్దూ?

    రోజుకో sensational news, అదేదో పేపరుండేది తెహల్కా అని. ఉండేదని ఎందుకన్నానంటే, ఇంక ఆ పేపరుకి అయుద్దాయం రోజుల్లోకి వచ్చేసింది. దాని ఎడిటర్ గారు, అక్కడ పనిచేసే అమ్మాయితో ఏదో వెర్రివేషాలేశాడట, వీధిన పడ్డాడు. పడ్డవాడు ఊరికే ఉన్నాడా, గోవాలో బిజేపీ అధికారంలో ఉందీ, వాళ్ళకి నేనంటే ఎక్కడలేని కోపమూ, అందుకే నన్ను అరెస్టు చేస్తామంటున్నారూ అని మొదలెట్టడంతో, ఈవేళ ఢిల్లీ లో బిజేపీ వాళ్ళందరూ గొడవ చేశారు. ఈవిషయంలో బిజేపీ వారైతే మహాత్ముల్లాగ కబుర్లు చెప్పేస్తున్నారు. ఒకవైపున గుజరాత్ లో అప్పుడెప్పుడో ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవ పక్కకు పెట్టేశారు. ఏమైనా అంటే అదివేరూ, ఇదివేరూ అనడం. ఇంక బెంగాల్ లో అయితే , చిట్ ఫండు గొటాలాలో మమతమ్మ చెయ్యుందని ఆయనెవడో శలవిచ్చాడు.

   అయిదుసంవత్సరాలక్రితం, Noida లో జరిగిన ఖూనీ కేసులో, తల్లితండ్రులే దోషులూ అన్నారు.వాళ్ళేమో కాదూ అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలిసేదేమిటంటే, దేశంలో జరిగే ఎటువంటి సంఘటనైనా సరే, మన మీడియా, (especially visual media) ముందుగా ఓ ట్రయల్ చేసేస్తుంది. ఎవరికివారే జరిగినదానిమీద వారి వారి అభిప్రాయాలూ, నిర్ణయాలూ చెప్పేస్తూంటారు. ప్రజల్లోకూడా ఓ రకమైన అభిప్రాయం ఏర్పడిపోతూంటుంది. పైగా ఒక్కో చానెల్ దీ ఒక్కో అభిప్రాయం. ఎవడు రైటో తెలియదు.

   అసలు ప్రతీ విషయాన్నీ మీడియాలో చర్చించడం ఎందుకో అర్ధం అవదు.అందుకే టివీ చూడాలన్నా, పేపరు చదవాలన్నా చిరాకేసికొస్తోంది. హాయిగా నెట్ లో వివిధ సైట్లకీ వెళ్ళి కాలక్షేపం చేస్తేనే సుఖంగా ఉందనిపిస్తోంది. ఆ సందర్భం లోనే మాగంటి. ఆర్గ్ , శ్రీ వంశీమోహన్ గారు, తన సైట్టుకి ఈమధ్యన చేసిన ఇంప్రూవ్మెంట్లు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తోంది. ప్రత్యేకంగా ఆడియో లింకుల విషయంలో, ఎక్కడెక్కడా దొరకని ఆకాశవాణి కార్యక్రమాలు నిక్షేప పరిచారు. చూసి/విని ఆనందించండి.

%d bloggers like this: