బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Moral of the story i……s….

    ఏదైనా అనుభవం మీదే తెలుస్తుందని ఇంకొకసారి ఋజువయింది. మా అబ్బాయి మూడు సంవత్సరాల క్రితం ఉద్యోగం మానుకుని, తనకి పుస్తకాలమీద ఉండే passion తో ఒక online library ప్రారంభించాడు. ముందుగా తెలుగు పుస్తకాల గురించి నేనూ, ఇంగ్లీషు పుస్తకాల గురించి తనూ చేయాల్సిన “సర్వే” లాటిది చేసే మొదలుపెట్టాము. తను ఆ గ్రంధాలయంలో వీలున్నన్ని సదుపాయాలు– ఇంటిగుమ్మంలోకే పుస్తకాలు వచ్చేటట్టూ, ఆలశ్యం అయినా late fee అనేది లేకుండేటట్టూ, ఫలానా పుస్తకం మాదగ్గరలేనిది ఏదైనా కావాల్సొస్తే ఒక wish list చెప్తే, వీలైనంత తొందరగా ఆ పుస్తకం తెప్పించడం వగైరా-– కలగచేశాడు. పుస్తకాలే కాకుండగా , మిగిలిన కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. తను చేసిన కార్యక్రమాల విశేషాలు నేను ఒకటి రెండు టపాలు కూడా వ్రాశాను. మధ్యలో ఒకసారి ఇక్కడ ఉండే స్కూలు పిల్లలచేత కథలు వ్రాయించి, వాటికి ఒక పుస్తకరూపం తెచ్చాడు. ఇవన్నీ నేనేదో గొప్పకోసం చెప్పుకుంటున్నవి కావు. తను ఎంత whole hearted గా ఇందులో involve అయ్యాడో చెప్పడానికి మాత్రమే. ఈ కార్యక్రమాల వలన అనండి, లేదా తన పాప్యులారిటీ అనండి, మొత్తానికి ఇంగ్లీషు పుస్తకాలకి సభ్యులు బాగానే చేరారు. పుస్తకాలు కూడా ఓ 10,000 దాకా పెట్టాడు. పుస్తకాలు ఇంటింటికీ బట్వాడా చేయడానికి ఓ అయిదుగురు కుర్రాళ్ళూ, ఆఫీసులో ఎప్పటికప్పుడు పనులు చూసుకోడానికి ఇంకో అయిదుగురూ మొత్తం ఓ పదిమందిదాకా పనిచేసేవారు. వీళ్ళందరికీ పనికి తగ్గట్టు జీతాలూ అవీ ఇవ్వాలా వద్దా? మరి వీటన్నిటికీ డబ్బు ఖర్చవుతుంది కదా, ఆ ఖర్చుల నిమిత్తమే సభ్యులనుండి నెలకీ, రెండు మూడు వందలదాకా సభ్యత్వ రుసుము లాటిది పెట్టాడు. మనదేమీ ఓ Charitable Institution కాదుకదా.

    పూణె లో ఉండే అయిదులక్షల తెలుగువారికీ సదుపాయంగా ఉంటుందని ఓ 700 తెలుగుపుస్తకాలు ( in all genres) కూడా పెట్టాడు. నాకు వీలున్నంతవరకూ ఊరంతా తిరిగి చేయాల్సినంత ప్రచారం చేశాను. మెయిల్స్ ద్వారానైతేనేమిటి, తెలిసినవారి ద్వారానైతేనేమిటి , Pamphlets, Book Marks రంగుల్లో ప్రింటు చేసి పుణె లో ఉండే వివిధప్రాంతాలకీ స్వయంగా శనాదివారాలు వెళ్ళి చేయకలిగినంత చేశాను. చిత్రం ఏమిటంటే, నేను స్వయంగా కలిసిన ప్రతీవారూ, ఎంతో ఉత్సాహం చూపించేసి… ” అలాగాండీ, తెలుగు పుస్తకాలు కూడా దొరుకుతాయన్నమాట, తప్పకుండా చూస్తామండీ..” అనేవారే. కానీక్రియారూపం మాత్రం రాలేదు. సభ్యత్వం తీసికున్న పది పదిహేనుమందీ కూడా నా ప్రోద్బలం లేకుండగానే చేరారు, వారికి ఉన్న పఠనాసక్తి వలన. నేను చేసిందల్లా, అలా చేరినవారితో వీలునుబట్టి వారింటికి వెళ్ళి కలవడమో, లేదా ఫోనులో పలకరించడమో

    ఈ కార్యక్రమమంతా ఏదో సమాజ సేవ చేయాలనే కాదు, పుస్తకపఠనం మీద ఆసక్తి ఉన్నవారికి వీలైనంత చవకలో పుస్తకాలు అందుబాటులో తేవాలనే ఉద్దేశ్యంతోనే చేశాడు. కొంతమంది దీన్ని వ్యాపారం అని కూడా అనొచ్చు. ఏ వ్యాపారమైనా financially viable అయితేనే కదా చేసేదీ? ఏదో కొంతవరకూ భరించొచ్చు. ఆసక్తి ఉందీ, మొదలెట్టాడు, ఓ మూడేళ్ళు చేశాడు, కుదరలేదూ, మూసేశాడు. ఆ సందర్భంలో తను ఎంతో బాధపడుతూ ఒక టపా పెట్టాడు. అయ్యో పాపం తన ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్టయిందే అని మేమూ బాధ పడ్డాము. మహా మహా ఫౌండేషన్ల వారే ఇంటింటికీ పుస్తకాలు బట్వాడా చేయడానికి కొంత రుసుము వసూలు చేస్తున్నారు. అలాటిది ఒక ఉత్సాహవంతుడైన వ్యక్తి, సాధ్యమైనంతవరకూ తనకు తోచినదేదో చేయడానికి కొంత రుసుము వసూలు చేయడం అంత తప్పనుకోను. అలాగని ఉచితంగా సేవ చేసేటంత ఆర్ధిక స్థోమత కూడా ఉండాలిగా.

    ఇందులో తను నష్టపోయిందేమీ లేదు. చేతిలో శుభ్రమైన చదువుందీ, అనుకూలవతి అయిన భార్య ఉందీ. ఇంకో వ్యాపకం పెట్టుకుంటాడు. పెట్టుకోవడమేమిటీ, అప్పుడే ఇంకో వ్యాపకం లోకి దిగిపోయాడు కూడానూ. అద్భుతమైన అవకాశం ఉండికూడా ఉపయోగించుకోలేని పూణె లోని తెలుగువారి గురించే నా బాధంతానూ. తెలుగు పుస్తకం చదవాలంటే ఎప్పుడైనా మన రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కొనుక్కోవడమో, లేదా ఏ పోస్టులోనో తెప్పించుకోడమో.

    అతావేతా Moral of the story i……s…

   1) Passion అనేది ఉంటేనే చాలదు. చేతినిండా డబ్బేనా ఉండాలి, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా సేవైనా చేయాలి.

   2) ఊరికే కబుర్లు చెప్పేవారిని నమ్మి దేంట్లోనూ అడుగెట్టకూడదు. ఫలానా లైబ్రరీ మొదలెడుతున్నామని చెప్పగానే, మొదలెట్టగానే చెప్పండేం, పుస్తకాలకి మొహం వాచిపోయున్నాం మీ లైబ్రరీ ధర్మాన్నైనా పుస్తకాలు చదువుకోవచ్చు అన్నవారే, తీరా మొదలెట్టిన తరువాత మొహం చాటేసికోడం.

   3) పుస్తక పఠనం అనేది జన్మతహా రావాలి కానీ, అప్పటికప్పుడు తెచ్చుకుంటే వచ్చేది కాదు. అన్నిటిలోకీ ముఖ్యం , అందుతున్న సేవకి తృణమో పణమో ఖర్చుపెట్టడానికి సిధ్ధపడాలి. ఏదో ఎవరింటికో వెళ్ళినప్పుడు ఓ పుస్తకమో, పత్రికో చూసి ,” ఓసారి చదివిచ్చేస్తాను” అని తెచ్చేసికుని,మళ్ళీ వాళ్ళు అడిగేదాకా ఇవ్వకపోవడం లాటిది కాదు.

   4) తెలుసుకున్నదేమిటంటే, వార్తాపత్రికల్లో, సినిమాలకీ, పుస్తకాలకీ review వ్రాసేవారి మీద ఎంతో సదభిప్రాయం ఉండేది ఇదివరకటి రోజుల్లో, కానీ ఇప్పుడు అర్ధం అయిందేమిటయ్యా అంటే, ఏదో ప్రచారం కోసం పత్రికా యాజమాన్యం వారికి ఉచితంగా ఇచ్చే పుస్తకాలకి మాత్రమే రివ్యూలు వస్తాయి. ఎవరూ పుస్తకం కొని వ్రాసేటంత ఉదారహృదయులు ఉండరని. అలాగే సినిమాలూనూ ఏదో కాంప్లిమెంటరీ పాసులు వస్తే చూడ్డం కానీ, స్వంత డబ్బులు ఖర్చుపెట్టి చూసే త్యాగాలు ఎవరూ చేయరని.

   Irony ఏమిటంటే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ గ్రంధపఠనం పెంచాలనే ఉద్దేశ్యంతో ఊరూరా గ్రంధాలయాలు తెరిచి , ప్రతీ సంవత్సరమూ గ్రంధాలయ వారోత్సవాలు జరుపుకుంటూన్న నవంబరు నెలలోనే మా గ్రంధాలయానికి ” అల్విదా..” చెప్పడం.

    ఏదో అబ్బాయి ప్రారంభించిన గ్రంధాలయం మూసేయడం వలన ఏదో దుగ్ధ కొద్దీ వ్రాసింది కాదు. అవకాశం వచ్చినా అందుకోలేని దురదృష్టవంతుల గురించి బాధపడుతూ వ్రాసిన టపా ఇది. అందుకే అంటారు దేనికైనా పెట్టిపుట్టాలీ అని. ఏమో బాబూ నేనూ మా ఇంటావిడా అయితే అక్కడ ఉండే తెలుగు పుస్తకాలన్నీ చదివేశాము.

%d bloggers like this: