బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Thank God….

    దేశంలోని చాలా మంది అదృష్టం బాగుండో, ఆ భగవంతుడే అందరూ కొన్ని నెలలనుండి అనుభవిస్తూన్న హడావిడి ఇక చాలనుకున్నాడో ఏమో, మొత్తానికి భారతప్రభుత్వమూ సరైన సమయానికి స్పందించో, మన పేపర్లూ, టీవీ చానెళ్ళూ, బ్లాగులూ, సాధారణ జనజీవితంలోకి ఇంక అడుగెట్టొచ్చు.”దైవత్వం” ఆపాదించబడ్డ ఒక వ్యక్తి గుణగానాలకు ఇంక ఒక విశ్రాంతి లభిస్తుంది. నిజమే అతను మనదేశంలోని చాలామంది ఆటగాళ్ళకంటే, గొప్పవాడే, ఆ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. గుర్తుందా అప్పుడెప్పుడో సైనా మహీవాల్ ని అందరూ పొగిడేస్తూంటే, ఇంకో ఆట ఆడే సానియామీర్జా ఏమందో? “ఆ.. పోదూ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళెందరూ ప్రపంచ దేశాల్లోనూ, ఆడితే నాలాగ టెన్నిస్ లో పేరు తెచ్చుకోవాలి కానీ..”. అదే arguement ప్రస్తుతానికీ అన్వయిస్తే, క్రికెట్ ప్రపంచంలో ఆడే దేశాలెన్నిట? ఆడిన ప్రతీసారీ ఏదో ఒక ప్రపంచ రికార్డే మరి !అఛ్ఛా పోనీ ఒప్పుకుందాం, క్రికెట్టే గొప్పదీ, దాంట్లోనే హాయిగా ఫిక్సింగులూ గట్రా చేసికోవచ్చూ, దాంట్లోకే ఎక్కడలేని డాన్ లూ ఆసక్తి చూపుతారూ. దేశంలోని ప్రతీవాడూ ఓ గొప్ప క్రికెటరైపోదామని కలలు కంటాడూ, ప్రతీ రాజకీయనాయకుడూ ఏదో ఒక రాష్ట్ర క్రికెట్ ఎసోసిఏషన్ కి అద్యక్షపదవి కొట్టేయాలని అనుకుంటాడూ, ఫిక్సింగులూ వగైరాలు చేశారన్న ఆరోపణలు వచ్చినా, అవన్నీ పక్కన పెట్టేసి పార్లమెంటు సభ్యులైపోవచ్చూ, లేదా టీవీ వ్యాఖ్యాతలైపోవచ్చూ, ఒకటేమిటి ఎన్నెన్ని సువిధాలు, క్రికెట్ లో ఒక్కసారి ప్రవేశం లభిస్తే చాలు— డబ్బులే డబ్బులు.. దురదృష్టంకొద్దీ ఈ క్రికెట్ మనకి so called యువతకి స్పూర్తినిచ్చే ఆట ట. స్పూర్తి అనేకంటే National obsession అంటే రైటేమో. పోనీ ఎంతమంది యువతకి అంతంత అదృష్టం కలుగుతోందీ? పోనీ కలిగిందే అనుకుందాం, ఆ ప్రబుధ్ధుడు ఏదో ఒకటి రెండు సెంచరీలి చేశాడంటే చాలు, ప్రతీ product కీ యాడ్లివ్వడం, వాడుచెప్పే అవాకులూ చవాకులూ వినడం. రాజకీయరంగంలోలాగ ఇంకొన్ని సంవత్సరాలలో ఈ ఆటగాళ్ళ కొడుకులు ప్రవేశిస్తారు. ఇప్పటికే వాళ్ళ ప్రవేశానికీ పావులు కదుపుతున్నారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఇందులో కొన్ని రాజకీయావసరాలు కొన్నుంటూంటాయి, అప్పుడెప్పుడో జమ్మూ కాశ్మీరునుండి ఒకతన్ని సెలెక్టుచేశారు, కారణం అదేదో diplomatic exigency అని వాళ్ళే ఒప్పుకున్నారు.ఆ ఆటగాడేమైపోయాడో ఎవరికీ తెలియదు.

    పోనీ ఈ నాటకరంగాన్ని నిర్వహిస్తూన్న BCCI ఏమైనా లక్షణంగా పనిచేస్తోందా అంటే అదీ లేదు.ఆయనెవరినో కొన్నేళ్ళ క్రితం అధ్యక్షపదవినుండి తరిమేసి, మళ్ళీఈ ఆయన్నే తాత్కాలిక అధ్యక్షపదవిలో కూర్చోపెట్టారు. ఇంక ప్రస్థుత అద్యక్షుడైతే less said the better.అల్లుడేమో జైలుపాలయ్యాడు. ఇంకో మేధావి లలిత్ మోడీ అయితే దేశాలు పట్టి తిరుగుతున్నాడు.పోనీ తను ప్రారంభించిన IPL ఏమైనా సరీగ్గా ఉందా అంటే అదీ లేదూ. ఎవరూ పట్టించుకోరేమో అనుకుని, ఓ రెండు మూడు నెలలక్రితమే ఫలానా రెండువందలో టెస్టు పూర్తయిన తరువాత రిటైరవుతానని చెప్పడం తరవాయి, సన్నాహాలు మొదలయ్యాయి. 199 ది ఎక్కడా, 200 ది ఎక్కడా అని. ఒకానొకప్పుడు క్రికెట్ రంగంలో దిగ్గజాల్లా ఉన్న వెస్టిండీస్ దొరికేరు. వాళ్ళకీ రోజులు బాగోలేవు, ఒప్పుకున్నారు, వచ్చేరు, వెళ్ళేరు. మన ఎకౌంటులో ఇంకో విజయం.అసలు మిగిలిన వాళ్ళు ఎలా ఆడారూ, ఏం చేశారూ అనే ప్రశ్నే లేదు.ప్రకటన వెలువడ్డదగ్గరనుంచీ, ఆ “దేవుడు” గారి మీడియా మానేజర్లు పేట్రేగిపోయారు. ఓ ఫలానా చానెల్ అని లేదు, ఫలానా భాష అని లేదు, ఏ పేపరు చూసినా, ఏ చానెల్ త్రిప్పినా ఒకటే ఘోష. ఎంతదాకా వచ్చిందీ అంటే , ఈ గొడవ ఎప్పుడు వదులుతుందిరా బాబూ అని విసుగొచ్చేటంత !

    మొత్తానికి విముక్తి లభించింది. అయినా అక్కడక్కడ ఇంకా కొన్ని పేపర్లవాళ్ళు ఆ “యావ” లోంచి బయట పడలేదు. ఇంకా ఈవేళ కూడా, ఆయన ఏంచేశాడూ, చాయ్ పెట్టుకుని త్రాగేడూ, కొడుకుని స్కూలుకి తీసికెళ్ళేడూ వగైరా వివరాలు. దానికేముందిలెండి, ఇంకో రెండు మూడు రోజులు భరించాలి.అయినా మన మీడియా వాళ్ళకి అలవాటే కదా, ఓ సంజయ్ దత్తు జైలుకెళ్తే వాడికేం నెంబరిచ్చారో, జైలుకూడా, లేక ఇంటినుంచి వచ్చిందా, అలాగే లాలూ జైలుకెళ్ళినప్పుడూ అంతే. ఏదో ఓ నాలుగైదురోజులుంటుంది ప్రభావం.

    అఛ్ఛా ఇంక భారత రత్న దగ్గరకు వద్దాం. మన ప్రభుత్వ policy ప్రకారం క్రీడాకారులకి ఇన్నాళ్ళూ చేసేవారేకాదు. చేయడం అంటూ మొదలెడితే, భారత దేశాన్ని క్రీడారంగంలో అత్యున్నత స్థానం లో నుంచోబెట్టిన Hockey wizard ధ్యాన్ చంద్ తో శ్రీకారం చుట్టిఉండుంటే ఎంతో బాగుండేది.పాపం ఆయనగురించి lobbying చేసేవారే లేరాయె. ఉన్న వాళ్ళ మాటవినేవాళ్ళే లేరాయె. అయినా ఇస్తేనేమిటి, ఇవ్వకపోతేనేమిటి, ఏమైనా ఎన్నికల్లో ఓట్లొస్తాయా ఏమిటీ? ఈ భారతరత్న ప్రకటన ఇప్పుడే చేయడంలో ఎన్ని మతలబులున్నాయో ఆ పెరుమాళ్ళకే ఎరుక! మరీ ఒక్కరికే ప్రదానం చేస్తున్నట్టు ప్రకటిస్తే బాగుండదేమో అని, ఆయనెవరో రావు గారి పేరు కూడా చేర్చారు. ఆయనేమన్నారూ రాజకీయనాయకులందరూ ఒఠ్ఠి idiots అని. ఒదిలింది రోగం ! అయినా ఇదేమైనా కొత్తవిషయమా ఏమిటీ, శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టు, ఓ “భారతరత్న” గారు చెప్పేరు కాబట్టి అది వేదం.

    మధ్యలో బిజేపీ వాళ్ళు కొత్తగొడవోటి మొదలెట్టారు, పటేల్ గారికీ, వాజపేయీ గారికీ ఎందుకివ్వలేదూ అని. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయారా?అరే మర్చేపోయాము పటేల్ గారు కాంగ్రెస్ వారు కదూ, ఏదో ఇప్పుడంటే రాజకీయకారణాల ధర్మమా అని సర్దార్ పటేల్ గుర్తుకొచ్చారు కానీ ఆయన ఎప్పుడో కనుమరుగైపోయారు.

   . ఇదివరకూ క్రికెట్ లో చాలామంది ఆటగాళ్ళు వచ్చారూ, ఇటుపైనా వస్తారు.ప్రస్తుత ఈ అంశంమీద healthy discussion చేయడానికి ఎంతమంది ప్రయత్నించారో తెలియదు. పోనిద్దురూ ఏదో ఒకటీ,మొత్తానికి ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా ఈ మీడియా హైప్పులో, ఎన్నెన్ని విషయాలు తెరవెనక్కి వెళ్ళిపోయాయో ఆలోచించారా? మన జోకర్లు అంటే రాజకీయనాయకులు, పేలే అవాకులూ చవాకులూ వినే, చదివే అదృష్టాన్ని కోల్పోయాము.