బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“Out of the Blue”

    మళ్ళీ ఈవేళ ఏం వచ్చిందీ అనుకోకండి శీర్షిక చూసి. పైన పెట్టిన శీర్షిక పూణె లోని esquare లో ఉన్న ఒక restaurant పేరు. నాకైతే అలాటి రెస్టారెంట్లకి వెళ్ళే అలవాటులేదు. అది ఒక multiplex లో ఉండడం ఒకకారణం. ఇక్కడ ఏదో అప్పుడప్పుడు ఏ మంచి తెలుగు సినిమాయో వచ్చినప్పుడు తప్ప, వారానికోసారి మారిపోయే హిందీ సినిమాలు చూసేటంత ఓపికా, స్థోమతా లేకపోవడం మరో కారణం.ఎలాగూ కొత్త హిందీ సినిమాలు ఓ రెండుమూడు నెలల్లో ఏదో ఒక టీవీ చానెల్ లో వచ్చేస్తున్నాయి,తెలుగు సినిమాల పరిస్థితీ అలాగే ఉందీ, అంత పెద్దస్క్రీను మీద అంతంత శబ్దకాలుష్యాల హింస భరించలేకపోవడం మరో కారణం.

    ఈమధ్యన indiblogger.in లో ఒక ప్రకటన చూశాను. పుణె లో ఉండే బ్లాగర్లు సమావేశం అవుతున్నారూ 10 వ తారీకు ఆదివారం నాడు అని. వెన్యూ కూడా నాకు వెళ్ళడానికి సదుపాయంగా ఉండబట్టి, నేనూ రిజిస్టరు చేసికున్నాను. కానీ తీరా చేసికున్నతరువాత ఓ పెద్ద సందేహం వచ్చింది. నేనేమో తెలుగులో వ్రాస్తానాయె, పైగా వయసులో కొద్దిగా పెద్దవాడినీ, అంతగా బాగుండదేమో అని.అక్కడకి వచ్చేవారందరూ వయసులో చిన్నవారూ, పైగా ఇంగ్లీషులో వ్రాస్తారు కూడానూ, ఓ వ్యాఖ్య పెట్టాను నా సందేహం తెలుపుతూ. వెంటనే జవాబొచ్చింది. మీరు అలాటి సందేహాలు పెట్టుకోవద్దూ, తప్పకుండా రండి అని. సరే చూద్దాం, అంతగా నచ్చకపోతే కొంచంసేపు ఉండి వచ్చేయొచ్చూ అనుకుని 11 గంటలకి మీటింగైతే 10.45 కి చేరాను. అప్పటికే రావాల్సిన 40 మందిలోనూ ఓ అరడజను మంది వచ్చేశారు. నా పరిచయం చేసికుని, కూర్చున్నాను. మెల్లిమెల్లిగా మిగతావారూ రావడం ప్రారంభం అయింది.

    ఒక్కొక్కరూ పరిచయాలు చేసికోవడం ప్రారంభించారు. నేనైతే ముందుగా నా ప్రవర చెప్పుకుని. తరువాత అసలు ఈ బ్లాగులోకంలోకి ఎందుకు ప్రవేశించానో చెప్పి, నా పాఠకుల అభిమానం గురించి చెప్పుకొచ్చాను. మిగిలిన వారందరూ కూడా తమతమ పరిచయాలు చేసికున్నారు. ఈ మధ్యలో బ్రేక్ ఫాస్టు ఒకటీ. ఒకసారి కబుర్లు చెప్పడం ప్రారంభించేక నన్ను ఎవరు పట్టుకుంటారు? నా మిస్టరీ షాపింగుగురించి కూడా చెప్పేను.వాళ్ళకి అందులో ఉండే ఉపయోగాలు తెలియచేయడానికి, నాకు ఈ మిస్టరీ షాపింగుద్వారా లభించిన హ్యాట్టూ(Espirit), షర్టూ(Vanheusen), ప్యాంటూ(Allen Solly), కళ్ళజోడూ(Lawrence Mayo), షూసూ (Puma), సాక్సూ(Nike) వేసికుని మరీ వెళ్ళాను. అంతే, వివరాలడగడం మొదలెట్టారు. ఇంకో చిత్రం ఏమిటంటే, నేను ఇప్పటికే 800 పైగా టపాలు వ్రాశానని, అదీ తెలుగులో వ్రాశాననీ విని ఆశ్చర్యపడ్డారు. ఏదైనా సాఫ్ట్ వేర్ తీసికున్నారా అని అడిగితే, నేను రెగ్యులర్ గా వ్రాసే యంత్రం.కాం గురించి చెప్పాను.

    రెండు గంటలకి లంచి ( బఫే) కి లేవమన్నారు. నాకేమో వెజ్జికీ, నాన్ వెజ్జికీ తేడా తెలియదూ, పాపం ఒక తెలుగబ్బాయి సహాయం చేశారు. మొత్తానికి ఓ అరగంట ఉండి వచ్చేద్దామనుకున్నవాడిని, అక్కడి వాతావరణం, అక్కడకు వచ్చినవారు చూపించిన అభిమానమూ, వారు, నాకూ నా వయస్సుకీ ఇచ్చిన గౌరవమూ, నన్ను నాలుగ్గంటలు అక్కడే ఉండేటట్టు చేశాయి. స్నేహపూరిత వాతావరణంలో నాలుగ్గంటలు గడిపే అవకాశం వచ్చింది. ఈ లంచీ, బ్రేక్ ఫాస్టూ ఖర్చులెవరివీ అని అడిగితే తెలిసింది. ఆ restaurant యాజమాన్యమే స్పాన్సర్ చేశారని.

    ఇలాటి సమావేశాలకి వెళ్ళడానికి సంకోచిస్తాము కానీ, వెళ్తే మాత్రం కొత్తకొత్త విశేషాలు ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. మూడేళ్ళ క్రితం తెలుగుభాషా దినోత్సవానికి భాగ్యనగరం వచ్చినప్పుడూ ఇలాటి అనుభవమే కలిగింది. ఎందరో కొత్త స్నేహితులు లభించారు. నిన్నటి రోజున మళ్ళీ ఆ రోజునే గుర్తుచేసికున్నాను. కొన్ని ఫొటోలు తీశాను.
Bloggers Meet 007Bloggers Meet

%d bloggers like this: