బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఎప్పుడు బాగుపడతారో కానీ…


    పదవీవిరమణ చేసిన ప్రభుత్వోగస్థులందరికీ నవంబరు నెల వచ్చిందంటే, కావాల్సినంత కాలక్షేపం. రిటైరయిన మరు సంవత్సరంనుండీ ప్రారంభం అవుతుంది ఈ భాగోతం. బ్రతికేఉన్నట్టు పెన్షను తీసికునే బ్యాంకు కి వెళ్ళి ఓ Life Certificate సమర్పించుకోవాలి. ఈ కార్యక్రమం ఎన్నో ఏళ్ళనుండీ జరుగుతోందీ, బతికున్నన్నాళ్ళూ జరుగుతుంది, దానికైతే సందేహమే లేదు. ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోతే, పెన్షనర్ల సంగతి గోవిందా… ఏదో దగ్గరలోఉండే బ్యాంకుల్లో ఓ ఎకౌంటూ ఓపెన్ చేసికుని, వాళ్ళిచ్చిన ఏటీఎం కార్డుతో లాగించేస్తున్నారు. అయినా పాపం చాలామంది బ్యాంకులకే వెళ్ళి వారి వారి పెన్షన్లు తీసికుంటూంటారు. ఏటీఎం కార్డులు ఉపయోగించుకోవడం తెలియకవొచ్చు, లేదా ఎవరితోనైతే ఉంటున్నారో, కొడుకో, కూతురో ఇంకోరెవరో, వీళ్ళ కార్డులు దుర్వినియోగం చేసేస్తారేమో అనే భయం అయుండొచ్చు, హాయిగా నెలలో ఒకసారైనా పెన్షన్ వంక పెట్టి, బయటకి వెళ్ళొచ్చనో,కారణాలకేమిటిలెండి కావాల్సినన్ని.ఎప్పుడైనా బ్యాంకులకి మొదటివారంలో వెళ్తే , పెద్ద పెద్ద క్యూలు కనబడుతూంటాయి. అలాటి అవసరంలేక, నెట్ బ్యాంకింగులోనే పేమెంట్లు చేసేవారూ, ఏటీఎం కార్డులు ఉపయోగించుకునేవారూ, ఇలాటి దృశ్యాలు చూసి నవ్వుకుంటూంటారు. ఏవిటో హాయిగా ఓ ఏటీఎం కార్డుతీసేసికుంటే గొడవుండదుగా అనుకుని.సంవత్సరం పొడుగునా హాయిగా వెళ్ళిపోయినా, నవంబరొచ్చిందంటే చాలు, ఈ “ఆంఆద్మీ” లతోపాటు తనూ క్యూలో నుంచోవాల్సొస్తుంది. అందుకే ఎప్పుడూ, ఎవరినీ చూసి నవ్వుకోకూడదు.
ప్రతీ ఏడూ జరిగేదేకదా, పోనీ బ్యాంకులవాళ్ళైనా లక్షణంగా చేస్తారా అంటే, ఒక్కో బ్యాంకుదీ ఒక్కో పధ్ధతి.పోనీ అందులోనైనా uniformity ఉందా అంటే అదీలేదూ. ఈ ఏడాది ఉపయోగించిన ఫారం, వచ్చే ఏడాదికి ఉపయోగించదుట.ఏడాదేడాదికీ, ఆ బ్యాంకులవాళ్ళరూల్స్ మారిపోతూంటాయి. మళ్ళీ క్యూల్లో నిలబడ్డం ఎందుకులే అనుకుని, ఒకేసారి ఓ నాలుగు ఫారాలు తీసికుంటే, అవి చెల్లవంటారు మళ్ళీ ఏడాదికి. పేద్ద తేడా ఉంటుందా అంటే అదీ ఉండదు. అదో సరదా బ్యాంకులవాళ్ళకి. పెన్షనర్లని హింసించడంలో ఓ పైశాచికానందం ఈ బ్యాంకులకి. వాళ్ళకి కావలిసిన సమాచారం ఏవిటీ– పెన్షనర్ బతికున్నాడా లేదా, అంతే కదా.అయినా , వివిధ బ్యాంకులవాళ్ల proforma లకి ఓ పోలికకానీ, సాపత్యంకానీ ఉండదు.

    ఓ బ్యాంకువాడు ఫొటో కావాలంటాడు, ఇంకోడు ఎడ్రస్ proof కావాలంటాడు,ఇంకోడు PPO కావాలంటాడు.ఇంకోడైతే వీటన్నిటి కాపీలూ జతచేసి, ఎవడిచేతో attest చేయించమంటాడు. అదృష్టం కొద్దీ ఇంకా affidavit కూడా కావాలనే దిక్కుమాలిన ఆలోచన ఇంకా రాలేదు. అదీ ఎప్పుడో వస్తుంది.పోనీ ఇవైనా ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతూంటే నవంబరొచ్చేసరికి వీటన్నిటితోనూ సిధ్ధపడిఉంటారు.అబ్బే అలా చేస్తే సుఖపడిపోరూ.ఏడాదేడాదీ మార్చడంలోనే మ.రా.శ్రీ. ప్రభుత్వం వారికి సంతోషదాయకం. బ్యాంకుకి వెళ్లి ఎదురుగా నుంచుని, సంతకం చేస్తున్నాడే, మళ్ళీ ఈ గోలంతా దేనికండి బాబూ? గంటసేపు క్యూలో నుంచుని, తీరా తనవంతు వచ్చేటప్పటికి అక్కడ కూర్చున్నవాడు చిద్విలాసంగా “ఇది కుదరదండీ..” అనేసి, next.. అంటాడు.తాను బ్రతికే ఉన్నానని మాత్రం, మొదటి షాట్ లో నిరూపించుకోవడం జరగదు. నానా తిప్పలూ పడి నాలుగైదు ప్రయత్నాలు పడుతూంటాయి.అదికూడా మనం లేచినవేళమీదే ఆధారపడిఉంటుంది.

    ఇదోరకమైన చిత్రహింసైతే, SBI వారిది ఇంకోతంతు.గత చేదు అనుభవాల ధర్మమా అని ఒకటో తారీకుకే బ్యాంకుకి వెళ్ళడం ప్రారంభించాను. ఈనెల వెళ్ళగానే, ఇంకా ఫారాలు రాలేదూ, మధ్యలో రెండు రోజులు దీపావళి శలవలూ, అతావేతా ఆరో తారీకుకి రమ్మన్నారు. సరే ఆ ఫారం ఏదో, నేనుండే ప్రాంతంలో ఉన్న SBI బ్రాంచీకి వెళ్ళి, తెచ్చుకున్నాను. దానిమీద బ్రాంచి పేరు కూడా ప్రింటుచేశారు. ఏదో దాన్ని కొట్టేసి, నేను పెన్షన్ తీసికునే బ్రాంచ్ పేరు వ్రాస్తే సరిపోతుందిలే అనుకుని, ఇంట్లో వివరాలు వ్రాసి, నిన్న బ్యాంకు తెరిచే సమయానికి, ఆటోలో వెళ్ళి, మొత్తానికి క్యూలో నాలుగోవాడిగా నుంచున్నాను.అయిదు నిమిషాల్లో క్యూ కొల్లేరు చాంతాడులా పెరిగిపోయింది.ఆటోలో రావడం మంచిదయింది. నా ముందరి ముగ్గురినీ ఏవేవో కారణాలు చెప్పి మళ్ళీ రమ్మన్నారు. నా వంతొచ్చేటప్పటికి, 1. ఈ ఫారం కుదరదూ, మా బ్రాంచి ఫారమే ఉండాలి. 2. నీ ఎడ్రసు, సిస్టంలో లేదూ.అన్నాడు. మొదటిదానికి చెప్పేనూ– మీ SBI ఇంకో బ్రాంచిదేనూ, ఇంకో బ్యాంకుది కాదూ. రెండో దానికి ఈమధ్య ఒక లెటరు పంపేరుకదా, నా ఎడ్రసులేకుండా ఎలా పంపగలిగేరూ అని అడగ్గానే వీడితో కుదరదూ అనుకున్నాడేమో కానీ, సరే అని ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు ,సణుక్కుంటూమొత్తానికి ఒప్పుకున్నాడు.అయినా ఓ మెలిక పెట్టేడు, నేను తెచ్చిన SBI ఇంకో బ్రాంచి ఫారంలో అన్నీ పూర్తిచేసిన తరువాత సాక్షి సంతకాలుండాలి, ఇక్కడి బ్రాంచి ఫారానికి ఇంకోటెవో వివరాలు కావాలి. అదండి తేడా. ఇన్నితిప్పలూ పడి మళ్ళీ సాక్ష్యాలెక్కడ తేగలనూ? ఏదో తెలిసినవాడే కాబట్టి, మొత్తానికి ఒప్పేసుకుని పని కానిచ్చేశాడు.

    నాకు అర్ధం కానిదేమిటంటే, ఒకే బ్యాంకు వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండే వివిధ బ్రాంచీలకీ వేరు వేరు ఫారాలు ఎందుకు పెడతారు? అదేమైనా ఆస్థివీలునామాలా ఏమిటీ? ప్రపంచం లో అన్ని లావాదేవీలూ simplify చేస్తూంటే, ఈ బ్యాంకులవాళ్ళు మాత్రం సాధ్యమైనంతకష్టతరంచేస్తున్నారు. ఎప్పటికి బాగుపడతారో ఆ భగవంతుడికే తెలియాలి.పైగా ఎవరినీ– అన్నేసి సంవత్సరాలు విధినిర్వహణ చేసి, జీవిత చరమాంకంలో విశ్రాంతి తీసికునే సమయంలో ఇంత చిత్రహింస అవసరమంటారా? ఎప్పటికైనా ఈ వ్యవస్థ బాగుపడే సూచన ఉందంటారా…లేక, పోనిద్దూ ఈ పెన్షనర్ల వల్ల ఏగాణీ ఉపయోగంలేదూ, సరదాగా ఓసారి ఆడుకుందాము అనే ఉద్దేశ్యం అంటారా? ఏదో నాలుగక్షరాలు తెలుసుకాబట్టి పని కానిచ్చేసుకుంటాము కానీ, అసలు ఏమీ తెలియనివారి గతి ఏమిటీ?

12 Responses

 1. “ఈ ఫారం కుదరదూ, మా బ్రాంచి ఫారమే ఉండాలి. ”
  Guruvu Garu, this is heights of stupidity.

  “ఈమధ్య ఒక లెటరు పంపేరుకదా, నా ఎడ్రసులేకుండా ఎలా పంపగలిగేరూ”
  Note this point your honor. 🙂 🙂

  But, I felt very sad on reading this. Pension-systems and rules should be simplified..

  Like

 2. చాలా చాలా బాగా చెప్పారు
  పించనీ దారుల కష్టాలు

  Like

 3. annee anta simpul ga,suluvugaa aipote,mari memendukandee ikkadaundadam -adee adhikaarula aalochana!

  Like

 4. చందూ,

  కానీ ఏం చేస్తాం. తేరగా దొరికేది ఈ పింఛనీదారులే…

  డాక్టరుగారూ,

  ధన్యవాదాలు..

  రమణరావుగారూ,

  అదే కదా వచ్చిన గొడవంతా. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఎప్పటికోఅప్పటికి వాళ్ళకీ జరుగుతుంది ఇలాటి చేదు అనుభవం…

  Like

 5. పెన్షనర్లంటే లోకువ. వీళ్ళకి ఊరికే డబ్బులిచ్చేస్తున్నాం అనుకుంటారు, ఇచ్చేవారు, తిప్పలు పెట్టాలని అనుకుంటారు.

  Like

 6. అత్తయ్యని తీసుకెళ్ళిన ప్రతిసారీ నాకు పిచ్చెక్కేది. ఇదేం బాధరా భగవంతుడా అని!. “నేను బతికే ఉన్నాను. వచ్చింది నేనే ఆత్మను కాదు” అన్నట్టుంటుంది వ్యవహారం.

  Like

  • “నేను బతికే ఉన్నాను. వచ్చింది నేనే ఆత్మను కాదు” అన్నట్టుంటుంది వ్యవహారం. 🙂

   Like

 7. sir
  am sure there are lot of pensioners around and you must have some kind of union or society
  why cant you ask them to change / pressure through government/politics. you pensioners are still voters right 🙂

  Like

 8. శర్మగారూ,

  మీరన్నది చాలావరకూ నిజమే….

  ఎన్నెల గారూ,

  నేను వ్రాసినదాంట్లో అతిశయోక్తి లేదని ఒప్పుకుంటున్నారా…

  శ్రావ్య గారూ,

  ఏదో నవ్వుతాలుకి చెప్పలేదు ఎన్నెల గారు, నిజంగా జరిగేది అదే…

  krish,

  Yes there are few associations as you mentioned. This process is going on for years, you mean to say they are unaware of the situation? Problem is the office bearers are mostly Class I officers and the British legacy of saying Salaam still goes on. They may not be facing these problems. As for the voting rights .. less said the better. My name disappeared from the Voters list. Anyway thanks for your concern for the oldies…

  Like

 9. ఫణిబాబు గారూ, మీ ఆవేదన అర్ధమవుతోంది. మీకు తెలియదని కాదు గాని, ఇక్కడ నేను ఒకటి రెండు విషయాలు చెప్పదల్చుకున్నాను. మీ టపా లో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల గురించి కంప్లైంట్ ఏమీ లేదని నాకు తెలుసు. కాని పెన్షన్ ల గురించి జనరల్ గా బ్లాగ్లోక మిత్రుల కోసం కొంత విశదీకరణ చేసే ప్రయత్నం. ఎందుకంటే – నేటి ఉద్యోగే రేపటి పెన్షనర్ కదా.

  మొదటిది – ఈ Life Certificate అనేది ప్రభుత్వంవారి నిబంధన మాత్రమే గాని, బాంక్ లు పెట్టిన / పెట్టుకున్న రూలు కాదు. పెన్షన్లకి సంబంధించినంత వరకూ బాంక్ లు ప్రభుత్వం వారి ఏజెంట్లు మాత్రమే (ఇదివరలో – అంటే బ్రిటిష్ వారి రోజులనుంచీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాల వరకూ – ప్రభుత్వ పెన్షన్ చెల్లింపులు ట్రెజరీల ద్వారా మాత్రమే జరిగేవి. తర్వాత ఈ పనిని జాతీయ బాంక్ లకు అప్పగించారు ప్రభుత్వం వారు. ఆ ప్రకారం బాంక్ లు ప్రభుత్వం వారి ఏజెంట్ల హోదాలో వ్యవహరిస్తున్నాయి. అదికూడా నెల నెలా పెన్షన్ల చెల్లింపు విషయంలో మాత్రమే. పెన్షన్ శాంక్షన్ చెయ్యటం లాంటి వ్యవహారాలన్నీ సంబంధిత ప్రభుత్వ శాఖలే చూస్తాయి). ఇహ, ఏజెంట్ అంటే యజమాని చెప్పినట్లు చెయ్యవలసినవాడే కదా.

  రెండోది – ఈ Life Certificate కావాలి, దానిని పెన్షనరే స్వయంగా ఇవ్వాలి అనే రూల్స్ యొక్క ముఖ్యోద్దేశం ప్రభుత్వ పెన్షన్ చెల్లింపుల్లో మూడో వ్యక్తుల ద్వారా ఫ్రాడ్ లు జరగకుండా నివారించే ప్రయత్నం కూడా. మీకు నేను చెప్పనక్కరలేదు గాని, ఉద్యోగంలో ఉన్నప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది; ఉద్యోగి చనిపోతే ఆ కబురు ఆఫీసుకు తెలుస్తుంది. అదే పెన్షనర్ చనిపోతే ఆ విషయం ఎవరైనా చెప్తేగాని ప్రభుత్వం వారికి తెలిసే అవకాశం లేదు కదా. ఇంకోటి, పెన్షనర్ యొక్క తదనంతరం అప్పటి వరకూ ఇచ్చిన పెన్షన్ ని ఆ తర్వాత – రూల్స్ ఒప్పుకుంటే – ఫామిలీ పెన్షన్ గా మార్చే సదుపాయం (కాని అమౌంట్ తగ్గుతుంది), దానికి చెయ్యవలసిన ప్రొసీజర్ కూడా కారణాలు. అందువల్ల పెన్షనర్ జీవించి ఉన్నారా లేదా అనే విషయం పెన్షన్ ఇచ్చేవారికి తెలియవలసిన ఆవశ్యకత ఉన్నది. అలాగే, Remarriage Certificate కూడా.

  ఇక ఒకే బాంక్ లో వేరే వేరే శాఖలలో వేరే వేరే ఫారాలు ఉపయోగించటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. బాంక్ వారి రీజినల్ ఆఫీస్ / హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చెయ్యవచ్చు. ట్రెజరీ చెల్లింపు రోజుల్లో పెన్షనర్ల బాధ వర్ణనాతీతంగా ఉండేదని, చాలాసార్లు లంచాల బారిన గూడా పడవలసి వచ్చేదని అంటారు. ఇప్పుడు బాంక్ లలో అటువంటి ఇబ్బందులు లేవు గాని, బాంక్ లు వయోవృద్ధులైన పెన్షనర్ల పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించవచ్చేమో అన్నది నిజం.

  Like

 10. అవునండీ, పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులకు ఇది ఒక శిక్ష.
  కేంద్రం వారికి ప్రత్యేకం మరో శిక్ష ఉంది. వైద్య సంబంధమైన రాయితీలు/మందులు అందుకోవటానికి కూడా వ్యక్తిగతం గా హాజరు కావాలి

  Like

 11. నరసింహరావుగారూ,

  “ఇక ఒకే బాంక్ లో వేరే వేరే శాఖలలో వేరే వేరే ఫారాలు ఉపయోగించటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. బాంక్ వారి రీజినల్ ఆఫీస్ / హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చెయ్యవచ్చు” సరీగ్గా అదేనండి నేను చేసిన పని. ఈవేళ ఆ విషయమై ఒక టపా వ్రాశాను. మీరు వివరించిన రెండు విషయాల గురించీ, నాకు అవగాహన ఉంది. ఇంకో విషయం, నాకు ఏమాత్రం అసౌకర్యమూ కలగలేదు. నా బాధల్లా క్యూలో నుంచున్న మిగిలినవారిగురించే.

  ఊకదంపుడు గారూ,

  ఉద్యోగంలో ఉన్నంతకాలమే , ఆ తరువాత అడగనిదే ఎవరూ పట్టించుకోరు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: