బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఎప్పుడు బాగుపడతారో కానీ…

    పదవీవిరమణ చేసిన ప్రభుత్వోగస్థులందరికీ నవంబరు నెల వచ్చిందంటే, కావాల్సినంత కాలక్షేపం. రిటైరయిన మరు సంవత్సరంనుండీ ప్రారంభం అవుతుంది ఈ భాగోతం. బ్రతికేఉన్నట్టు పెన్షను తీసికునే బ్యాంకు కి వెళ్ళి ఓ Life Certificate సమర్పించుకోవాలి. ఈ కార్యక్రమం ఎన్నో ఏళ్ళనుండీ జరుగుతోందీ, బతికున్నన్నాళ్ళూ జరుగుతుంది, దానికైతే సందేహమే లేదు. ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోతే, పెన్షనర్ల సంగతి గోవిందా… ఏదో దగ్గరలోఉండే బ్యాంకుల్లో ఓ ఎకౌంటూ ఓపెన్ చేసికుని, వాళ్ళిచ్చిన ఏటీఎం కార్డుతో లాగించేస్తున్నారు. అయినా పాపం చాలామంది బ్యాంకులకే వెళ్ళి వారి వారి పెన్షన్లు తీసికుంటూంటారు. ఏటీఎం కార్డులు ఉపయోగించుకోవడం తెలియకవొచ్చు, లేదా ఎవరితోనైతే ఉంటున్నారో, కొడుకో, కూతురో ఇంకోరెవరో, వీళ్ళ కార్డులు దుర్వినియోగం చేసేస్తారేమో అనే భయం అయుండొచ్చు, హాయిగా నెలలో ఒకసారైనా పెన్షన్ వంక పెట్టి, బయటకి వెళ్ళొచ్చనో,కారణాలకేమిటిలెండి కావాల్సినన్ని.ఎప్పుడైనా బ్యాంకులకి మొదటివారంలో వెళ్తే , పెద్ద పెద్ద క్యూలు కనబడుతూంటాయి. అలాటి అవసరంలేక, నెట్ బ్యాంకింగులోనే పేమెంట్లు చేసేవారూ, ఏటీఎం కార్డులు ఉపయోగించుకునేవారూ, ఇలాటి దృశ్యాలు చూసి నవ్వుకుంటూంటారు. ఏవిటో హాయిగా ఓ ఏటీఎం కార్డుతీసేసికుంటే గొడవుండదుగా అనుకుని.సంవత్సరం పొడుగునా హాయిగా వెళ్ళిపోయినా, నవంబరొచ్చిందంటే చాలు, ఈ “ఆంఆద్మీ” లతోపాటు తనూ క్యూలో నుంచోవాల్సొస్తుంది. అందుకే ఎప్పుడూ, ఎవరినీ చూసి నవ్వుకోకూడదు.
ప్రతీ ఏడూ జరిగేదేకదా, పోనీ బ్యాంకులవాళ్ళైనా లక్షణంగా చేస్తారా అంటే, ఒక్కో బ్యాంకుదీ ఒక్కో పధ్ధతి.పోనీ అందులోనైనా uniformity ఉందా అంటే అదీలేదూ. ఈ ఏడాది ఉపయోగించిన ఫారం, వచ్చే ఏడాదికి ఉపయోగించదుట.ఏడాదేడాదికీ, ఆ బ్యాంకులవాళ్ళరూల్స్ మారిపోతూంటాయి. మళ్ళీ క్యూల్లో నిలబడ్డం ఎందుకులే అనుకుని, ఒకేసారి ఓ నాలుగు ఫారాలు తీసికుంటే, అవి చెల్లవంటారు మళ్ళీ ఏడాదికి. పేద్ద తేడా ఉంటుందా అంటే అదీ ఉండదు. అదో సరదా బ్యాంకులవాళ్ళకి. పెన్షనర్లని హింసించడంలో ఓ పైశాచికానందం ఈ బ్యాంకులకి. వాళ్ళకి కావలిసిన సమాచారం ఏవిటీ– పెన్షనర్ బతికున్నాడా లేదా, అంతే కదా.అయినా , వివిధ బ్యాంకులవాళ్ల proforma లకి ఓ పోలికకానీ, సాపత్యంకానీ ఉండదు.

    ఓ బ్యాంకువాడు ఫొటో కావాలంటాడు, ఇంకోడు ఎడ్రస్ proof కావాలంటాడు,ఇంకోడు PPO కావాలంటాడు.ఇంకోడైతే వీటన్నిటి కాపీలూ జతచేసి, ఎవడిచేతో attest చేయించమంటాడు. అదృష్టం కొద్దీ ఇంకా affidavit కూడా కావాలనే దిక్కుమాలిన ఆలోచన ఇంకా రాలేదు. అదీ ఎప్పుడో వస్తుంది.పోనీ ఇవైనా ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతూంటే నవంబరొచ్చేసరికి వీటన్నిటితోనూ సిధ్ధపడిఉంటారు.అబ్బే అలా చేస్తే సుఖపడిపోరూ.ఏడాదేడాదీ మార్చడంలోనే మ.రా.శ్రీ. ప్రభుత్వం వారికి సంతోషదాయకం. బ్యాంకుకి వెళ్లి ఎదురుగా నుంచుని, సంతకం చేస్తున్నాడే, మళ్ళీ ఈ గోలంతా దేనికండి బాబూ? గంటసేపు క్యూలో నుంచుని, తీరా తనవంతు వచ్చేటప్పటికి అక్కడ కూర్చున్నవాడు చిద్విలాసంగా “ఇది కుదరదండీ..” అనేసి, next.. అంటాడు.తాను బ్రతికే ఉన్నానని మాత్రం, మొదటి షాట్ లో నిరూపించుకోవడం జరగదు. నానా తిప్పలూ పడి నాలుగైదు ప్రయత్నాలు పడుతూంటాయి.అదికూడా మనం లేచినవేళమీదే ఆధారపడిఉంటుంది.

    ఇదోరకమైన చిత్రహింసైతే, SBI వారిది ఇంకోతంతు.గత చేదు అనుభవాల ధర్మమా అని ఒకటో తారీకుకే బ్యాంకుకి వెళ్ళడం ప్రారంభించాను. ఈనెల వెళ్ళగానే, ఇంకా ఫారాలు రాలేదూ, మధ్యలో రెండు రోజులు దీపావళి శలవలూ, అతావేతా ఆరో తారీకుకి రమ్మన్నారు. సరే ఆ ఫారం ఏదో, నేనుండే ప్రాంతంలో ఉన్న SBI బ్రాంచీకి వెళ్ళి, తెచ్చుకున్నాను. దానిమీద బ్రాంచి పేరు కూడా ప్రింటుచేశారు. ఏదో దాన్ని కొట్టేసి, నేను పెన్షన్ తీసికునే బ్రాంచ్ పేరు వ్రాస్తే సరిపోతుందిలే అనుకుని, ఇంట్లో వివరాలు వ్రాసి, నిన్న బ్యాంకు తెరిచే సమయానికి, ఆటోలో వెళ్ళి, మొత్తానికి క్యూలో నాలుగోవాడిగా నుంచున్నాను.అయిదు నిమిషాల్లో క్యూ కొల్లేరు చాంతాడులా పెరిగిపోయింది.ఆటోలో రావడం మంచిదయింది. నా ముందరి ముగ్గురినీ ఏవేవో కారణాలు చెప్పి మళ్ళీ రమ్మన్నారు. నా వంతొచ్చేటప్పటికి, 1. ఈ ఫారం కుదరదూ, మా బ్రాంచి ఫారమే ఉండాలి. 2. నీ ఎడ్రసు, సిస్టంలో లేదూ.అన్నాడు. మొదటిదానికి చెప్పేనూ– మీ SBI ఇంకో బ్రాంచిదేనూ, ఇంకో బ్యాంకుది కాదూ. రెండో దానికి ఈమధ్య ఒక లెటరు పంపేరుకదా, నా ఎడ్రసులేకుండా ఎలా పంపగలిగేరూ అని అడగ్గానే వీడితో కుదరదూ అనుకున్నాడేమో కానీ, సరే అని ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు ,సణుక్కుంటూమొత్తానికి ఒప్పుకున్నాడు.అయినా ఓ మెలిక పెట్టేడు, నేను తెచ్చిన SBI ఇంకో బ్రాంచి ఫారంలో అన్నీ పూర్తిచేసిన తరువాత సాక్షి సంతకాలుండాలి, ఇక్కడి బ్రాంచి ఫారానికి ఇంకోటెవో వివరాలు కావాలి. అదండి తేడా. ఇన్నితిప్పలూ పడి మళ్ళీ సాక్ష్యాలెక్కడ తేగలనూ? ఏదో తెలిసినవాడే కాబట్టి, మొత్తానికి ఒప్పేసుకుని పని కానిచ్చేశాడు.

    నాకు అర్ధం కానిదేమిటంటే, ఒకే బ్యాంకు వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండే వివిధ బ్రాంచీలకీ వేరు వేరు ఫారాలు ఎందుకు పెడతారు? అదేమైనా ఆస్థివీలునామాలా ఏమిటీ? ప్రపంచం లో అన్ని లావాదేవీలూ simplify చేస్తూంటే, ఈ బ్యాంకులవాళ్ళు మాత్రం సాధ్యమైనంతకష్టతరంచేస్తున్నారు. ఎప్పటికి బాగుపడతారో ఆ భగవంతుడికే తెలియాలి.పైగా ఎవరినీ– అన్నేసి సంవత్సరాలు విధినిర్వహణ చేసి, జీవిత చరమాంకంలో విశ్రాంతి తీసికునే సమయంలో ఇంత చిత్రహింస అవసరమంటారా? ఎప్పటికైనా ఈ వ్యవస్థ బాగుపడే సూచన ఉందంటారా…లేక, పోనిద్దూ ఈ పెన్షనర్ల వల్ల ఏగాణీ ఉపయోగంలేదూ, సరదాగా ఓసారి ఆడుకుందాము అనే ఉద్దేశ్యం అంటారా? ఏదో నాలుగక్షరాలు తెలుసుకాబట్టి పని కానిచ్చేసుకుంటాము కానీ, అసలు ఏమీ తెలియనివారి గతి ఏమిటీ?

%d bloggers like this: