బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఫొటోలు పెట్టుకోడం ఎందుకు?

    కొంతమందికి తమ ఫొటో పబ్లిగ్గా పెట్టుకోవడమంటే ఓ ఎలర్జీ అనుకుంటా. తమ నిజస్వరూపం అందరికీ తెలిస్తే వచ్చే నష్టం ఏమిటో? Public domain లో ఉంటున్నప్పుడు అలాటి అభ్యంతరాలకి అర్ధం లేదు. ప్రతీ పోలీసు స్టేషనులోనూ కనిపిస్తూంటాయి seasoned criminals ల ఫొటోలు, మరీ అలాటి ప్రదేశాల్లో మన ఫొటోలు ఉండాలని కాదుకానీ, బ్లాగు ప్రొఫైలులో కానీ, ఫేస్ బుక్ ప్రొఫైలులో కానీ, తమ తమ నిజం ఫొటోలు పెట్టుకోడానికి చాలామంది, ఎందుకు సందేహిస్తారో నాకైతే అర్ధం అవదు. అంత అజ్ఞాతంగా ఉండవలసిన కర్మేం పట్టిందో తెలియదు.ఒకసారి ఎవరిదైనా ఫొటో చూస్తేనే కదా, ఓహో .. ఆయనా.. ఆవిడా.. మా ఇంటిప్రక్కనే ఉంటారనో, మా నాన్నగారి స్నేహితుడనో గుర్తుపట్టేది. బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ తమతమ నిజస్వరూపాలు చూపించుకోకూడదన్నదాని వెనక ఉండే rationale ఏమిటో నాకు అర్ధం అవదు. ఎవరిదైనా ఫొటో చూస్తేనేకదా, వారిమీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకునేదీ? వాళ్ళు వ్రాసేవన్నీ చదవాలా, కానీ వాళ్ళెలాఉంటారో తెలియకూడదా? మనిషిని గుర్తించడానికి ఉన్న సాధనాల్లో ఈ ఫొటోలొకటీ, వేలిముద్రలోటీ. ఈమధ్యన అవేవో DNA test లూ అవీ కూడా చేస్తున్నారనుకోండి. ఏదో ఎన్డి తివారీల్లాగ వెధవపనులు చేస్తే ఏమో కానీ, లక్షణంగా ఓ ఫొటో పెట్టుకుంటే ఎవరో కొందరైనా చూసి సంతోషిస్తారుకదా.

అదేమిటో కానీ, ఇలా తమ అసలు ఐడెంటిటీ దాచుకోవాల్సిన వారిని చూస్తే, పోలీసులు పట్టుకున్నప్పుడు, అవేవో నల్లగుడ్డలు మొహాలకి కట్టుకుంటారే వాళ్ళే గుర్తుకొస్తారు నాకు. కొంతమంది సినిమా స్టార్ల బొమ్మలూ, కొంతమందైతే అవేవో ప్రకృతి దృశ్యాలూ, ఇంకా కొంతమందైతే …. ఎందుకులెండి….ఈ virtual world ఇలా ఉండడంలో పోనీ ఏదో సరదా అనుకుందాం, కానీ ఆయనెవరో ప్రఖ్యాత రచయిత, తన ఫొటోలు పెడతారన్నారని అసలు ఆ పత్రికలకే వ్రాయడం మానుకున్నారుట ! ఇప్పటిదాకా తన అసలు ఇడెంటిటీ ఏదో , తన రచనలు చదివేవారికి తెలియకపోవడం అదో ఘనతగా భావిస్తున్నారు. ఏమైనా అంటే ప్రైవసీ.. నా మొహం, నా ఇష్టం అంటారు. నిజమేకదా ఎవరెలా ఉంటే మనకెందుకూ? ఫొటోలు ప్రపంచానికి తెలిసేటట్టు పెట్టడమనేది, వారు వ్రాసే వ్రాతలతో మనం connect చేసుకోగలడానికే కానీ, వాళ్ళ కొంపలు కూల్చడానికి కాదూ అని ఎప్పుడు తెలిసికుంటారో? ఒక విషయం ఒప్పుకుంటాను, ఈరోజుల్లో నెట్లో ఆడపిల్లలు ఫొటోలు పెడితే , వాటిని దుర్వినియోగం చేసికోడానికి చాలామందికి అవకాశం ఉంది, కాదనను, కానీ సంవత్సరాలనుండీ వ్రాస్తూన్నవారికి కూడా అలాటి సందేహాలుంటాయంటే మాత్రం ఒప్పుకోను. అయినా ఎక్కడో ఎవడో ఏదో చేస్తాడేమో అని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతామూ?

ఈమధ్యన మా చుట్టం ఒకబ్బాయి నన్ను కలియడానికి వస్తానని ఫోనుచేశాడు., మా పెదనాన్నగారి మనవడు. ఫలానా చోటులో ఉన్నామూ, ఫలానా బస్సులో వస్తే ఇక్కడకు రావొచ్చూ, నేను బస్ స్టాప్ లో నుంచుంటానూ అని చెప్పేను. బయలుదేరేముందు ఫోను చేయీ, నాకూ ఓ పదినిముషాలు పడుతుందీ, రావడానికీ అని చెప్పేను. ఎంత సేపు ఆగినా ఫోనే రాలేదు. బహుశా ఇంతదూరం శ్రమ పడి వేళ్ళేదేమిటిలే అనుకున్నాడేమో, పోనీ పలకరించాడు అదే పదివేలూ అనుకున్నాను కానీ, బస్ స్టాప్ కి వెళ్ళనేవెళ్ళేను. సంగతేమిటో తెలిసికోవాలని ఫోను చేస్తే, ఇంకో పావుగంటలో చేరతానన్నాడు.మేముండే చోటుకి, అతనుండే ప్రదేశం కనీసం ఇరవై కిలోమీటర్లు. అయినా ఎవరెవరినో అడిగి, మొత్తానికి చేరేడు. బస్సుదీగీదిగగానే నన్ను చూసి హలో అని పలకరించాడు. అరే ఎప్పుడూ చూడనేలేదూ, నన్నెలా గుర్తుపట్టకలిగేడూ అనుకుని అడిగితే, మీరు ఫేసుబుక్కులో మీ ఫొటో పెట్టేరుగా, అది చూసి గుర్తుపట్టానూ అన్నాడు. ఓహో ఇలా ఫొటోలు పెట్టడం వల్ల ఇలాటి ఉపయోగాలూ ఉంటాయన్నమాట అనుకున్నాను.

పురాణాల్లొ చదివిన దేవతామూర్తులని మనవేమైనా చూశామా పెట్టేమా, ఏదో మహారాజా రవివర్మ గారి ధర్మమా అని, ఆయన ఊహించి వేసిన చిత్రాలతో ఆ దేవుళ్ళని identify చేసికుని, ఓహో రాముడంటే అలా ఉండేవారా అనో, శివుడంటే అలాగా, అమ్మవారంటే ఇలా ఉండేవారన్నమాట అని మనం తెలిసికోవడమూ, మన పిల్లలకి చెప్పడమూ కదా.

అంతదాకా ఎందుకూ, ప్రతీ మాట్రిమోనియల్ సైట్లలోనూ, ఫొటోలతోనే కదా అసలు కథ ప్రారంభం అయేదీ? ముందుగా ఫొటో చూసి, ఫరవాలేదూ, అనుకున్నతరువాతే కదా next step వేసేదీ? మన తాతముత్తాతలగురించి మన తల్లితండ్రులు ఎన్నెన్నో విషయాలు చెప్తారు, కానీ ఆ రోజుల్లో ఫొటోలూ గట్రా సదుపాయాలు లేకపోవడం వలన, వారి అసలు రూపాలు చూసుకొనే అదృష్టం కలగలేదు. నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మగారి ఫొటో ప్రక్కనే సింహాసనం మీద పెట్టుకుని బ్రిటిష్ మహారాజు పట్టాభిషేకం చేసికున్నారని చదివేము. ఏదో అదృష్టంకొద్దీ ఒక్కటంటే ఒక్క ఫొటో ఆవిడది లభ్యం అయింది. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఫొటో ఒకటి దొరికింది ఈమధ్య.శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు

ఫొటోలు పెట్టుకోనివారికీ, అజ్ఞాతంగా ఉండి ఏదో ఉధ్ధరించేద్దామనుకునేవారికీ ఈ టపా నచ్చకపోవచ్చు.

%d bloggers like this: