బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– గుర్తుంచుకోడం…


    ఏదో ఓపిగ్గా చదువుతున్నారుకదా అని, అర్ధం పర్ధంలేని విషయాలమీద ఈయనేమిటీ ఊరికే “సుత్తి” కొట్టేస్తున్నాడూ అని అనుకోకపోతే, నాకు గుర్తొచ్చిన ఓ విషయం వ్రాస్తాను. “గుర్తింపు” కీ “గుర్తుంచుకోడం” కీ సహస్రాలు తేడా ఉంది, నా ఉద్దేశ్యంలో. “గుర్తింపు” అనే మాట, ఏ మహత్తరకార్యమో చేస్తే వాడతారనుకుంటా. వెధవపనులు చేసినా ఓ “గుర్తింపు” లాటిది వస్తూంటుంది, అది వేరేవిషయం. అయినా ఇప్పుడు మనం మాట్టాడేది “గుర్తుంచుకోడం” గురించి.

ప్రతీరోజూ చూస్తూంటే ఓ మనిషి రూపం గుర్తుండిపోతుంది. అలాగని టీవీల్లోనూ, సినిమాల్లోనూ చూసేవాళ్ళు గుర్తుండిపోతారని కాదు, కారణం screen మీద కనిపించేవారు, అందంగా కనిపించడానికి నానారకాల తిప్పలూ పడతారు, ఎప్పుడో యాదృఛ్ఛికంగా ఏ ట్రైనులోనో కనిపించినా మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ట్రైనని ఎందుకన్నానంటే నేనెప్పుడూ ఏరోప్లేను ఎక్కలేదూ, ఎక్కిన ఒకేఒక్కసారి భయంతో కళ్ళుమూసుకుని కూర్చోడంతోనే సరిపోయింది.ఏ కొద్దిమందో తప్ప సాధారణంగా మగవాళ్ళు మేకప్పూ గట్రా లేకుండా ఉండడంతో గుర్తుపట్టలేకపోతామన్నమాట. అయినా కొంతమంది ఎంత బట్టతలైనా, విగ్గులేకుండా బయటకి రారనుకోండి. అయినా నేను వ్రాసేది సాదాసీదా మనుష్యులగురించి. వాళ్ళ అసలు రూపాలతో మనకెక్కడ పరిచయమూ, గుర్తించలేదని హో..బాధపడిపోతారు. అంత పెద్ద హీరోనీ అసలు పలకరించనైనా లేదే అని.

ఉదాహరణకి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళింట్లో ఉండే పసిపిల్లాడినో పసిపిల్లనో దగ్గరకు తీసికోవాలని ప్రయత్నిస్తే కెవ్వున కేకపెట్టి , గొల్లున ఏడుపు మొదలెడతారు. ఎంతదాకా వెళ్తారంటే మనమేదో గిల్లినంతగా…” మా వాడికి కొత్త తెలుస్తోంది..” అంటారు. వదిలేయడం ఆరోగ్యకరం. అలాగే వాళ్ళింట్లో ఉండే కుక్క కూడా భౌవ్వుమంటుంది. దానికీ గుర్తే మరి, కొత్తమొహమేదో వచ్చిందని. కానీ రెగ్యులర్ గా వాళ్ళింటికి వెళ్ళే పనిమనిషినీ మాత్రం గుర్తుంచుకుంటుంది. ఇంట్లోవాళ్ళైతే సరేసరనుకోండి.

అలాగే మనం ఉండే సొసైటీలో గేటుదగ్గరుండే సెక్యూరిటీవాడు, ప్రతీరోజూ మన మొహం చూస్తూంటాడుకాబట్టి ,మనం కనిపించగానే ఒకసారి నవ్వడమో, ఎప్పుడైనా దీపావళి మామూళ్ళిస్తే ఓ సలాంలాటిది పెట్టడమోకూడా చేస్తూంటాడు. ఈ విషయం ఎందుకువ్రాశానంటే, మా ఇంటావిడ ఎప్పుడో వారానికో, పదిహేనురోజులకో ఒకసారి బయటకు వెళ్తూంటుంది. ఈవెనింగు వాక్కు కూడా ఇంట్లోనే కానిచ్చెస్తోంది. ఆమధ్యన ఎప్పుడో ఒకసారి ఒక్కర్తీ బయటకువెళ్ళివస్తూంటే , ” ఆప్ కౌన్ హై..కిధర్ జానేకా..” అని అడ్డుపెట్టేడుట. తన ఐడెంటిటీ చెప్పుకుని మొత్తానికి కొంపలోకి వచ్చిందనుకోండి. అలాగే మా అమ్మాయి ఎప్పుడు మమ్మల్ని చూడ్డానికి వచ్చినా తనని అడుగుతూనేఉంటాడు. వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. ఈ సొసైటీలో ఉండే ఎపార్టుమెంటుకి నేనే యజమానిని మొర్రో అని విన్నవించుకుంటూంటుంది.

నేను ఉద్యోగం చేసేరోజుల్లో మా ఫాక్టరీ గేటుదగ్గరుండే సెక్యూరిటీ వాళ్ళు నన్నుచూడగానే ఓ సలాంలాటిది పెట్టేవారు, కారణం నన్ను ప్రతీరోజూ షిఫ్టుల్లోకూడా చూసేవారొకటీ, వాళ్ళని అప్పుడప్పుడు పలకరించడం బట్టీ. ఒకరోజున నేనూ, మా సెక్షన్ హెడ్డూ ఒకేసారి గేటులోంచి వెళ్ళడం సంభవించింది. నన్నుసలాం కొట్టి మామూలుగా వదిలేయడంతో లోపలకి వెళ్ళిపోయాను, కానీ మా పెద్దాయన్ని ఐడి చూపించమన్నాడుట. అంతే లోపలకొచ్చి ఒకటే గింజుకోడం. హాత్తెరీ నీకు సలాం కొడతాడా, పైగా నన్ను ఐడీ అడుగుతాడా అంటూ..

ఎప్పుడో సంవత్సరాలక్రితం జరిగిన ఆ సంఘటన ఎందుకు గుర్తొచ్చిందంటే ఈవేళ బస్సులో జరిగినదానికీ, ఎప్పుడో జరిగినదానికీ పోలికలుండబట్టి. ఎప్పుడో తప్పించి, ప్రతీరోజూ నేను బస్సులో వెళ్తూనేఉంటాను. నా మొహం చూడగానే తెలుస్తుందనుకోండి వీడు concession pass వాడూ అని. అయినా నేను ప్రతీరోజూ ప్రయాణం చేసే చాలామంది కండక్టర్లకి నా మొహం గుర్తే. అదేకాకుండగా వాళ్ళ పేర్లు అడిగి, క్షేమసమాచారాలు అడుగుతూంటాను.ఈవేళ ప్రొద్దుటే బస్సులో చాలా రద్దీగా ఉంది. కండక్టరు టిక్కెట్లిచ్చుకుంటూ మా దగ్గరకు వచ్చి, నన్ను చూసి “నమస్తే అంకుల్..” అన్నాడు. పక్కాయనకేమో టిక్కెట్టిచ్చాడు. ఆ విషయం ఆయనకంతగా నచ్చినట్టులేదు. కండక్టరు వెళ్ళిపోయినతరువాత అడిగేడు, మీకు కండక్టరు తెలిసినవాడా టిక్కెట్టడగలేదూ అంటూ….. కాదు మహాప్రభో నెలమొత్తానికి ఒకేసారి పాస్ కొనుక్కుంటూంటానూ అదీ విషయం అన్నాను.

రాత్రనకా పగలనకా ఒకేచోట పనిచేస్తూంటే, ప్రతీదీ గుర్తుండిపోతుంది. మెడికల్ షాప్పుల్లో చూడండి, ఏ మందడిగినా ఠక్కున ఏ షెల్ఫ్ లో ఉందో చూసి తెచ్చిచ్చేస్తాడు. ఏ కిరాణా కొట్టులోనైనా ఇదే పరిస్థితి. మా ఆఫీసులో ఒకతను సంవత్సరాలకొద్దీ అక్కడే పనిచేసినందువలన, ప్రతీ ఫైలూ గుర్తే. పై ఆఫీసర్లు ఎప్పుడు అడిగినా ఫైలునెంబరుతోసహా చెప్పేవాడు. అసలు అతను లేకపోతే పనే జరగదేమోఅన్నంతగా చెప్పుకునేవారు. పైగా నేను ఆ ఆఫీసుకి బదిలీఅయినప్పుడు, అతన్ని చూసి నేర్చుకోవాలీ అని కూడా జ్ఞానబోధచేశారు. ఓ నాలుగురోజులు పనిచేసేటప్పటికి నాకూ వంటబట్టేసిందనుకోండి, ఛస్తామా ఏమిటీ ఎప్పుడుచూసినా వాటితోనే. లైబ్రరీల్లో చూడండి, ఓ పుస్తకం అడిగేమంటే ఉందో లేదో వెంటనే చెప్పేస్తాడు. దీన్నన్నమాట గుర్తుంచుకోడం అంటారు.

ఆమధ్యన అభినవ భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి ఒక కథ పెట్టేను. ఆ సందర్భంలోనే మా ఇంటావిడ ఇంకో వ్యాసం వెదికి పట్టుకుంది. ఒకసారి మీరుకూడా చదివి ఆస్వాదించండి.ఆనకట్టకి పూర్వం కబుర్లు

7 Responses

 1. >అలాగని టీవీల్లోనూ, సినిమాల్లోనూ చూసేవాళ్ళు గుర్తుండిపోతారని కాదు……మేకప్పూ గట్రా లేకుండా ఉండడంతో గుర్తుపట్టలేకపోతామన్నమాట.

  అవునండీ. ఒకసారి కాదు రెండు మూడు సార్లు సీనియర్ NTR నాకు పదడుగుల దూరంలో ఉన్నా గుర్తుపట్టలేకపోయాను. మా నాన్నగారైతే ఇంకా అన్యాయం, అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుని పేరు చెప్పుకున్నా గుర్తుపట్టలేదు! అలాగని వాళ్ళ ముఖాలు తెలియవనా. ఏమిటో మరి సినిమాల్లో మారువేషాల్లో ఉంటే కూడా ఎంచక్కా గుర్తుపట్టేస్తూ ఉండేవాళ్ళమే మరి! ఐనా ఏ మాట కామాట చెప్పుకోవాలి. మన హీరోల మారువేషాలు ఎంత గొప్పగా ఉంటాయంటే రెండేళ్ళపిల్లలూ చప్పున గుర్తుపట్టేస్తారు. ఐనా విలనూ వాడి చెంచాలూ చస్తే గుర్తుపట్తలేరు. అక్కడికీ ఆ మారువేషపు హీరోగారూ ఆయన తాలూకు మనిషీ వీడే నీ మొగుడురా అంటూ శుభ్రంగా వివరంగా చెప్పుతూ‌ ఆటలు పాటలు గట్రా చేస్తున్నా సరే.

  Like

 2. గురువుగారూ, నమస్తే. మీరు బస్ పాస్ గురించి చెబుతుంటే, ఇంతకుముందే బస్‌పాస్ మీదే చదివిన ఒక నీతికథ గుర్తుకువచ్చింది. దానిని ఈ లింక్‌లో చదవండి – http://goo.gl/BZsDQe.

  Like

 3. శ్యామలరావుగారూ,

  మీ స్పందనకు ధన్యవాదాలు. ఎన్ టి ఆర్ తో మీ అనుభవమూ, ఏఎన్నార్ తో మీ నాన్నగారి అనుభవమూ, ఇప్పటివారికెవరికైనా చెప్పినా నమ్మరుకూడానూ. కానీ అవి నిశ్చయంగా నిజమే అయుంటాయి. ఎంతైనా మనం “నటులు” కాముగా…

  తేజస్వీ,

  మీరిచ్చిన లింకు చూశాను. ఎందుకు గుర్తొచ్చిందో కూడా తెలిసింది !!!

  Like

 4. ఇందుకే నా అండి, అప్పుడప్పుడు వచ్చి కామెంటు కొట్టి విచారించి పోతూ ఉండాలి !
  పుటుక్కుమని జిలేబి ఎవరని ఎవరైనా అడిగితే ఓ మా కు బాగా తెలిసిన వారే నని చెప్ప వచ్చన్న మాట ! దీన్నన్నమాట గుర్తుంచుకోడం అంటారు!

  మాటా పలకరింపు ఉంటే గుర్తుండి పోతారు అని మా బాగా చెప్పారు !

  చీర్స్
  జిలేబి

  Like

 5. జిలేబీ,

  “మాటా పలకరింపు ఉంటే గుర్తుండి పోతారు”—-టపా పూర్తిగా between the lines చదివి వ్రాసినవారి “మనోభావాలు పట్టుకోవడంలో మీకు మీరే సాటి…hats off and thanks

  Like

 6. ప్రత్యేక గుర్తింపు ఎక్కడ వచ్చినా
  హృదయానందంగా ఉంటుంది మరి.
  మా హాస్పిటల్ సెక్యురిటీ లోని ఎక్స్ ఆర్మీ వాళ్ళు,
  ఈ విశ్రాంత బ్రిగేడియర్ కు స్మార్ట్ సెల్యూట్
  ఇచ్చి గౌరవించినప్పుడు నాకూ అదే –మరి
  మిగిలిన వారికి కొంచెం —మెర మెరే.

  Like

 7. డాక్టరుగారూ,

  మీరన్నది నిజం. అలాటి అనుభవం కలిగినప్పుడు కలిగే ఆనందమే వేరు. మీరన్నట్టుగా కొంతమందికి అది నచ్చకపోవచ్చు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: