ఏవిటో కానీ, నాకు తెలుగు దేశం ( పార్టీ కాదండోయ్!!) అన్నా,తెలుగు భాషన్నా, తెలుగువంటకాలన్నా, తెలుగు వేషభూషణాలన్నా చెప్పలేనంత ఇష్టం.అందులోనూ తెలుగు కూరలంటే మరీ ఇష్టం. ఇందులో కూరలకి భాషేమిటీ అనుకోవచ్చు.అక్కడే ఉంది అసలు మజా అంతానూ. మనవైపు దొరికే గుండ్రటి ఆనపకాయా, నీటివంకాయా, దొండకాయా, బీరకాయా, పనసపొట్టూ , పొట్లకాయా, దోసకాయా — వీటితోపాటే కదా పెరిగిపెద్దయింది.ఇవికాకుండా ఆకుకూరలు గోంగూరా, బచ్చలికూరా, తోటకూరా
ఇలాటివి– వీటన్నిటినీ తెలుగు కూరల్లోకి వేద్దాం. ఇంగ్లీషు కూరలంటే క్యాబేజీ, కాలీఫ్లవరూ, క్యాప్సికమ్మూ, బీట్టురూట్టూ
లాటివి.మరి మా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడచూశామూ? ఈరోజుల్లో పిల్లలకి పాతకూరలు అంతలా నచ్చవు. వాటిల్లోఉండే రుచి తెలియాలంటే , తింటేనేకదా తెలిసేదీ? ఇళ్ళల్లో తినడానికి సుకరాలూ, హోటళ్ళకెళ్తే ఆ పైన చెప్పిన ఇంగ్లీషు కూరలే కదా దొరికేదీ?
ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళకి త్రిశంకుస్వర్గం లా తయారౌతుంది పరిస్థితి. కలిసే ఉన్నప్పుడైతే మరీనూ. ఇంటి పెద్దాయన్ని కూరలు తెమ్మని బయటకి పంపారా, మార్కెట్ లో నేను పైన చెప్పేనే ఆ “తెలుగు కూరల” మీదే పడుతుంది దృష్టంతా. ఉద్యోగాల్లో ఉండేటప్పుడైతే ఏదో ఒకకూరలెద్దూ అని సరిపెట్టేసుకునేవారు. ఉత్తి తిండే కాదుకదా, మిగిలిన వ్యవహారాలుండేవి. పైగా సంసారం ఈదడమనేదొకటుండేదిగా. కానీ ఉద్యోగంలోంచి రిటైరయినతరువాత , ఆ చిన్ననాటి కూరలమీదకి మనసు వెళ్తుంది.అసలుకారణం అదన్నమాట పెద్దాయన్ని మార్కెట్ కి పంపితే ఆ “పాత కూరలే” తేవడానికి. ఓ నెలరోజులు చూస్తారు, enough is enough అనుకుని, “ఎందుకు డాడీ మీరు మార్కెట్ కి వెళ్ళి శ్రమ పడడమూ, ఆఫీసునుంచి వచ్చేటప్పుడే మేమే ఏదో ఒకటి తెచ్చేస్తాములే..” అని సున్నితంగా చెప్పేస్తారు. అసలు కారణం ఇంటావిడద్వారా తెలుస్తుంది. సరే ఇంక మనకింతే ప్రాప్తం అని ఓ మెట్టవేదాంతంలో పడిపోతాడు.
పైన చెప్పినవన్నీ ఆంధ్రదేశంలో ఉంటున్నవారిగురించికాదు నేను చెప్పేది, మాలాగ పరాయిరాష్ట్రాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిపోయిన ప్రవాసాంధ్రుల(NRA s) గురించి. తినాలని యావుంటుందీ, కానీ తినడమెలా? ఏదో అదృష్టంకొద్దీ ఈరోజుల్లో ఇతర రాష్ట్రాల్లోకూడా మన “తెలుగు కూరలు” దొరుకుతున్నాయి. వీధివీధికీ పుట్టుకొచ్చిన మాల్స్ ధర్మమా అని. ఒక్కొక్కపుడు సాదాసీదా మార్కెట్ లోకూడా దొరుకుతూంటాయి. వాటిని చూస్తే ప్రాణం లేచొస్తూంటుంది. నా అదృష్టమనండి, లేకపోతే పెట్టిపుట్టాననండి, వారానికి ఓ రెండు మూడు రోజులకైనా దొరుకుతూంటాయి. వచ్చిన గొడవల్లా మా ఇంటావిడకే. బయటకి వెళ్ళి ఏంకూర తీసికొస్తాడో ఈయనా అని బితుకు బితుకుమంటూనే ఉంటుంది. అయినా పాపం నా “వేవిళ్ళ కోరికలు” తీరుస్తూనే ఉంటుందిలెండి.God bless her.
నిన్న రిలయన్సు కి వెళ్ళినప్పుడు మనవైపు కూర అరటికాయలు నవనవలాడుతూ కనిపించాయి, వారం తిరక్కుండా మళ్ళీ తీసికెళ్తే ఇంటావిడ గయ్యిమంటుందేమో అని భయం. మొన్నటికిమొన్నే ఆవపెట్టి కూరచేసింది. అందువలన descrition ఉపయోగించి, వారంలో ఓ రెండురోజులైనా తెలుగుకూరలు తేవడానికి అలవాటు పడిపోయాను. కందా బచ్చలికూర,నువుపప్పు వేసి బీరకాయకూరా, పొట్లకాయకూరా తింటే ఉండే రుచి, ఈరోజుల్లో మసాళాలు దట్టించి చేసే ఇంగ్లీషు కూరల్లో ఎక్కడుందండీ?
అసలు ఈ గొడవంతా ఎందుకంటే ఈవేళ ప్రొద్దుటే పేపరుకోసం వెళ్తే, “గోంగూర” దొరికింది.ఓ నాలుగు రోజులపాటు ఈ గోంగూర పచ్చడి తో వెళ్ళిపోతుంది. అయినా ఈ కబుర్లన్నీ, అనుకున్నప్పుడల్లా దొరకవని వాటిమీద అంతంత వ్యామోహం పెంచేసికోవడం. చిన్నప్పుడు, పెరట్లో కావలిసినన్ని దొరికేవి. అమ్మకూడా ఓ తాజాగా నాలుగు బీరకాయలతో ఓ కూరా, ఆనపకాయ ముక్కలు వేసి ఓ పులుసూ, సాయంకాలానికి దొండకాయ వేపుడూ, పెట్టినప్పుడల్లా వెధవ్వేషాలు వేసేవాళ్ళం, రోజూ ఈ కూరలేనా అని ! ఇప్పుడేమో కావాలంటే దొరకవాయె.
చిన్నప్పుడు మన ఇళ్ళల్లో యాదాలాపంగా ఉపయోగించే మాటల్లో “జీలకఱ్ఱ సింగినాదం” అని ఒకటి వాడేవారు, ఇది గోదావరిజిల్లాలలో ఎక్కువగా ఉండేది. దాని అర్ధం మాత్రం తెలిసేది కాదు. కానీ తెలుగుభాషాభిమానం ధర్మమా అని నేనూ వాడుతూంటాను. మొత్తానికి నా “వెదుకులాట” లో దొరికింది, ఆ సామెత పుట్టుపూర్వోత్తరం. మీరుకూడా చదవండి.జీలకఱ్ఱ సింగినాదం
Filed under: Uncategorized |
మంచి లింక్ ఇచ్చారు, అంటే టపా బాగోలేదనికాదు, తెలుగు కూరలు దొరకడం కష్టమా, అక్కడ? ప్రత్యేకంగా తెలుగు కూరలున్నాయా? గోంగూర మాత్రమే ఆంధ్రమాత!
LikeLike
ఇక్కడ బెంగుళూరు మూల మూల వెతికినా దొరకట్లేదు మన ఆంధ్ర దోసకాయ.
LikeLike
శర్మగారూ,
ప్రత్యేకం తెలుగుకూరలంటే, వాటికి తెలుగొచ్చునని కాదు మాస్టారూ. నా చిన్నతనంలో విసుక్కుంటూ తిన్న కూరలన్నీ దొరుకుతున్నాయని.లింకైనా నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు…
కౌటిల్య గారూ,
ఆ విషయంలో మా పుణె చాలా బెటరండి. వెదికితే ఎక్కడోఅక్కడ కనిపిస్తూంటాయి…
LikeLike
కూరగాయలు దొరకటం బానేవుందికాని బాబాయి గారు , వాటి రేట్లు వింటే కొనటమా మానటమా తెలీటం లేదు….పట్టుమని పది ఆకులు వుండవు,కరివెపాకు ఒకటిన్నర డాలరు..మా పెరట్లొ చెట్టు నుంచి గుప్పెడు గుప్పెడు ఆకులు ఫ్రెష్ గా దూసి ప్రతిదాంత్లొ పోపు వెసుకుతినే మేము, ఇకడ అసలు కొనటమే మానెసాం….మీలాగే ఎప్పుడన్నా ఆ పాత రుచులకి తపించిపోతే కొనుక్కోవటం…లేదంటే ఒక పేకెట్ కొని,ఒక్క ఆకుని పది ముక్కలు చేసి వాడుకోటం…హ్మ్మ్మ్….మా అమ్మ ఒక్కసారి వచ్చిన కొథలో, పేకెట్ కరివెపాకు మొత్తం ఒక్కసారి పోపు పెట్టింది….u reminded me all that…
LikeLike
సింగినాదం జీలకర్ర కాబూలీ వాలా లు
తెచ్చిన వాడకం అన్నమాట !!
చిన్నతనంలో మసాలాలు అమ్మే కాబూలీ వాలా,
ముఖ జోష్యం చెప్పే సర్దార్జీలు గుర్తుకొచ్చారు.
ధరలు చూడకుండా కొనుక్కోవాలే గానీ బెంగుళూరు లో
ఫునా లో లాగే అన్నీ దొరుకుతాయి.
LikeLike
మాస్టరు మీరు రాసే విషయం చిన్నది పెద్దదా పక్కన పెడితే… హ్రుదయంతో రాస్తారు. అది మా హ్రుదయాలను తాకుతూ ఉంటుంది
LikeLike
నిరుపమా,
“ఆకుని పది ముక్కలు చేసి వాడుకోటం..” మీరన్నదీ నిజమే. ఆమధ్యన ఇక్కడ “కొత్తిమిర” కట్ట 40 రూపాయలకీ, ములక్కాడలు పావు 40 రూపాయలకీ అమ్మారు. ఇప్పుడిప్పుడే ధరలు దిగడం మొదలెట్టి, కిలో 40 లోకి వచ్చాయి.
డాక్టరుగారూ,
నిజమే కదా… ధరలేనా మర్చిపోవాలి ..లేదా ఆ కూరల సంగతైనా మర్చిపోవాలి…
వెన్నెల రాజ్యం గారూ,
థాంక్యూ…
LikeLike
ఫణిబాబుగారూ,
నమస్కారం. “సింగినాదం జీలకఱ్ఱ” గురించి చిన్నప్పుడు ఎప్పుడో ఒక అష్టావధానంలో విన్నట్టు గుర్తు. చాన్నాళ్ళకి మళ్ళీ గుర్తు చేశారు, ధన్యవాదాలు.
మీరు వ్రాసిన తెలుగుకూరల్లో దాదాపుగా అన్నీ మా పెరట్లో పండిస్తున్నాను 🙂 ఈరోజే కూర అరటి గెల దింపి, చెట్టు కొట్టి దూట కూడా తీసాను:) రేపు లొట్టలు వేసుకుంటూ తినడమే తరువాయి. గోగూరైతే దిట్టంగా బస్తాల్లెక్కనే కాసింది, ఎంతమందికి ఇచ్చానో నాకే తెలీదు.
నిరుపమ గారూ,
మీరు ఎక్కడ ఉన్నారో తెలీదు, మా ఊరు (లాస్ ఏంజిల్స్) వచ్చి, మా పెరట్లో కరివేపాకు చెట్టు మీక్కావలసినంత దూసుకు వెళ్ళండి 🙂
భవదీయుడు
వర్మ
LikeLike
వర్మగారూ,
ఏమిటీ చిరకాల దర్శనం? మన దేశవాళీ కూరలు అన్నీ పండించి ఆస్వాదించడానికి ఎంతో పెట్టిపుట్టుండాలి.ఎంతైనా అదృష్టవంతులు..నిరుపమ గారికి మీరు ఇచ్చిన ఆఫర్ ఆవిడ స్వీకరిస్తారనే ఆశిద్దాం..
LikeLike