బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం

    ఏవిటో కానీ, నాకు తెలుగు దేశం ( పార్టీ కాదండోయ్!!) అన్నా,తెలుగు భాషన్నా, తెలుగువంటకాలన్నా, తెలుగు వేషభూషణాలన్నా చెప్పలేనంత ఇష్టం.అందులోనూ తెలుగు కూరలంటే మరీ ఇష్టం. ఇందులో కూరలకి భాషేమిటీ అనుకోవచ్చు.అక్కడే ఉంది అసలు మజా అంతానూ. మనవైపు దొరికే గుండ్రటి ఆనపకాయా, నీటివంకాయా, దొండకాయా, బీరకాయా, పనసపొట్టూ , పొట్లకాయా, దోసకాయాకూరగాయలు — వీటితోపాటే కదా పెరిగిపెద్దయింది.ఇవికాకుండా ఆకుకూరలు గోంగూరా, బచ్చలికూరా, తోటకూరా గోంగూరబచ్చలికూరఇలాటివి– వీటన్నిటినీ తెలుగు కూరల్లోకి వేద్దాం. ఇంగ్లీషు కూరలంటే క్యాబేజీ, కాలీఫ్లవరూ, క్యాప్సికమ్మూ, బీట్టురూట్టూVegetables 3 లాటివి.మరి మా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడచూశామూ? ఈరోజుల్లో పిల్లలకి పాతకూరలు అంతలా నచ్చవు. వాటిల్లోఉండే రుచి తెలియాలంటే , తింటేనేకదా తెలిసేదీ? ఇళ్ళల్లో తినడానికి సుకరాలూ, హోటళ్ళకెళ్తే ఆ పైన చెప్పిన ఇంగ్లీషు కూరలే కదా దొరికేదీ?

    ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళకి త్రిశంకుస్వర్గం లా తయారౌతుంది పరిస్థితి. కలిసే ఉన్నప్పుడైతే మరీనూ. ఇంటి పెద్దాయన్ని కూరలు తెమ్మని బయటకి పంపారా, మార్కెట్ లో నేను పైన చెప్పేనే ఆ “తెలుగు కూరల” మీదే పడుతుంది దృష్టంతా. ఉద్యోగాల్లో ఉండేటప్పుడైతే ఏదో ఒకకూరలెద్దూ అని సరిపెట్టేసుకునేవారు. ఉత్తి తిండే కాదుకదా, మిగిలిన వ్యవహారాలుండేవి. పైగా సంసారం ఈదడమనేదొకటుండేదిగా. కానీ ఉద్యోగంలోంచి రిటైరయినతరువాత , ఆ చిన్ననాటి కూరలమీదకి మనసు వెళ్తుంది.అసలుకారణం అదన్నమాట పెద్దాయన్ని మార్కెట్ కి పంపితే ఆ “పాత కూరలే” తేవడానికి. ఓ నెలరోజులు చూస్తారు, enough is enough అనుకుని, “ఎందుకు డాడీ మీరు మార్కెట్ కి వెళ్ళి శ్రమ పడడమూ, ఆఫీసునుంచి వచ్చేటప్పుడే మేమే ఏదో ఒకటి తెచ్చేస్తాములే..” అని సున్నితంగా చెప్పేస్తారు. అసలు కారణం ఇంటావిడద్వారా తెలుస్తుంది. సరే ఇంక మనకింతే ప్రాప్తం అని ఓ మెట్టవేదాంతంలో పడిపోతాడు.

    పైన చెప్పినవన్నీ ఆంధ్రదేశంలో ఉంటున్నవారిగురించికాదు నేను చెప్పేది, మాలాగ పరాయిరాష్ట్రాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిపోయిన ప్రవాసాంధ్రుల(NRA s) గురించి. తినాలని యావుంటుందీ, కానీ తినడమెలా? ఏదో అదృష్టంకొద్దీ ఈరోజుల్లో ఇతర రాష్ట్రాల్లోకూడా మన “తెలుగు కూరలు” దొరుకుతున్నాయి. వీధివీధికీ పుట్టుకొచ్చిన మాల్స్ ధర్మమా అని. ఒక్కొక్కపుడు సాదాసీదా మార్కెట్ లోకూడా దొరుకుతూంటాయి. వాటిని చూస్తే ప్రాణం లేచొస్తూంటుంది. నా అదృష్టమనండి, లేకపోతే పెట్టిపుట్టాననండి, వారానికి ఓ రెండు మూడు రోజులకైనా దొరుకుతూంటాయి. వచ్చిన గొడవల్లా మా ఇంటావిడకే. బయటకి వెళ్ళి ఏంకూర తీసికొస్తాడో ఈయనా అని బితుకు బితుకుమంటూనే ఉంటుంది. అయినా పాపం నా “వేవిళ్ళ కోరికలు” తీరుస్తూనే ఉంటుందిలెండి.God bless her.
నిన్న రిలయన్సు కి వెళ్ళినప్పుడు మనవైపు కూర అరటికాయలు నవనవలాడుతూ కనిపించాయి, వారం తిరక్కుండా మళ్ళీ తీసికెళ్తే ఇంటావిడ గయ్యిమంటుందేమో అని భయం. మొన్నటికిమొన్నే ఆవపెట్టి కూరచేసింది. అందువలన descrition ఉపయోగించి, వారంలో ఓ రెండురోజులైనా తెలుగుకూరలు తేవడానికి అలవాటు పడిపోయాను. కందా బచ్చలికూర,నువుపప్పు వేసి బీరకాయకూరా, పొట్లకాయకూరా తింటే ఉండే రుచి, ఈరోజుల్లో మసాళాలు దట్టించి చేసే ఇంగ్లీషు కూరల్లో ఎక్కడుందండీ?

    అసలు ఈ గొడవంతా ఎందుకంటే ఈవేళ ప్రొద్దుటే పేపరుకోసం వెళ్తే, “గోంగూర” దొరికింది.ఓ నాలుగు రోజులపాటు ఈ గోంగూర పచ్చడిగోంగూర పచ్చడి తో వెళ్ళిపోతుంది. అయినా ఈ కబుర్లన్నీ, అనుకున్నప్పుడల్లా దొరకవని వాటిమీద అంతంత వ్యామోహం పెంచేసికోవడం. చిన్నప్పుడు, పెరట్లో కావలిసినన్ని దొరికేవి. అమ్మకూడా ఓ తాజాగా నాలుగు బీరకాయలతో ఓ కూరా, ఆనపకాయ ముక్కలు వేసి ఓ పులుసూ, సాయంకాలానికి దొండకాయ వేపుడూ, పెట్టినప్పుడల్లా వెధవ్వేషాలు వేసేవాళ్ళం, రోజూ ఈ కూరలేనా అని ! ఇప్పుడేమో కావాలంటే దొరకవాయె.

    చిన్నప్పుడు మన ఇళ్ళల్లో యాదాలాపంగా ఉపయోగించే మాటల్లో “జీలకఱ్ఱ సింగినాదం” అని ఒకటి వాడేవారు, ఇది గోదావరిజిల్లాలలో ఎక్కువగా ఉండేది. దాని అర్ధం మాత్రం తెలిసేది కాదు. కానీ తెలుగుభాషాభిమానం ధర్మమా అని నేనూ వాడుతూంటాను. మొత్తానికి నా “వెదుకులాట” లో దొరికింది, ఆ సామెత పుట్టుపూర్వోత్తరం. మీరుకూడా చదవండి.జీలకఱ్ఱ సింగినాదం

%d bloggers like this: