బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    “మా” టివీ వారు ప్రతీ రోజూ ఉదయం 8 గంటలనుండి, ఒక అరగంట బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ప్రసారం చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలుసు. ఆ పరంపరలో , “ప్రశ్నోత్తరాల” తరువాత భారతీయ సాంస్కృతిక వైభవం గురించి ప్రసంగిస్తున్నారు. ఆ పరంపరలో నిన్నా, ఈవేళా త్యాగరాజ విరచిత “నాద తనుమనిశం” అనే కీర్తన వైభవాన్ని గురించి చెప్పారు. ఏదో వినడానికి బాగుంది కదా అని, వినడమే కానీ, ఆ కీర్తనలోని ఆర్తి, భక్తి, బ్రహ్మశ్రీ చాగంటి వారి ద్వారానే తెలిసింది. అంత ఘనంగా వర్ణించిన త్యాగరాజకీర్తన ” నాదతనుమనిశం” చిత్తరంజని రాగంలో శ్రీమతి ఎం.ఎస్ .పాడగా, అదే కీర్తన శ్రీమతి ఎం.ఎల్.వి పాడగానూ , వినేసి ఒకసారి ఆస్వాదించేయండి మరి..

    1966 లో ఐక్యరాజ్యసమితి లో శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గానకచేరీ, ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమైన తరువాత నుండీ , కర్ణాటక సంగీతం మీద అభిమానం ఏర్పడింది. ఏదో విని ఆనందించడమే కానీ, ఆ కీర్తనలలోని nuances తెలిసికునేటంత “సంగీత జ్ఞానం” ఎక్కడుందీ? అయినా ఆ తరువాత ఓ HMV వారి రికార్డు ప్లేయరొకటి కొని, నెలకి రెండు LP ల చొప్పునా, కర్ణాటక సంగీతం లోని అతిరథమహారథుల LP లు సేకరించేవాడిని. పూనా లో కానీ, దగ్గరలో ఉండే బొంబైలో కానీ, ఎప్పుడైనా సంగీత కచేరీలు ఉంటే, అక్కడకి వెళ్ళి ఆ కార్యక్రమాలు వినేవాడిని.వెళ్ళేటప్పుడు, నేను కొనుక్కున్న LP లు తీసికెళ్ళి, వారి “ఆటోగ్రాఫులు” కూడా తీసికునేవాడిని.శ్రీమతి ఎమ్.ఎస్, శ్రీమతి ఎం.ఎల్.వి, శ్రీ శమ్మంగుడి,శ్రీ చెంబై, శ్రీ చిట్టిబాబు, శ్రీ లాల్ గుడి, శ్రీ నామగిరిపెట్టై,శ్రీ మంగళంపల్లి లాటి ప్రముఖుల కచేరీలు వినే అదృష్టం కలిగింది.

    ఆ సందర్భంలోనే భాగ్యనగరం లోని రవీంద్రభారతి లో జరిగిన ఒక సంఘటన ఎప్పుడూ మర్చిపోలేను. ఆరోజు శ్రీ చిట్టిబాబు గారి వీణ కచేరీ జరిగిన తరువాత, as usual నేనూ, నా ఎల్పీలూ, చేతిలో ఓ పెన్నూ పట్టుకుని స్టేజి మీదకు వెళ్ళగానే, శ్రీ చిట్టిబాబుగారు, “మీరు పూనాలో కూడా వచ్చి నాసంతకం తీసికున్నట్టున్నారూ, కొత్తదికూడా తీసేసికున్నారన్నమాట..” అని, నా రికార్డుమీద సంతకం పెట్టడం. ఎంత సంతోషమనిపించిందో . ఇంతలో ఒకాయన వచ్చి,’ఈ రికార్డు కొత్తగా వచ్చిందాండీ… ఒక్కసారి రాత్రికి విని ఇచ్చేస్తాను, ఇవ్వగలరా..” అని అడగడంతో ముందర కొద్దిగా సంశయించాను. అయినా , మన రికార్డు ఉంచేసికుని ఈయనేం బాగుపడ్డాడులే అనుకుని , సరే అని ఆ రికార్డు ఆయనకిచ్చేను.” మా ఇల్లు ఈ ఆడిటోరియం కి ఎదురుగానే ఉందీ అన్నారు. మర్నాడు సాయంత్రం వారింటికి వెళ్తే తెలిసింది ఆయన ఆనాటి ఆంధ్రప్రదేష్ పోలీసు ఐజి అని.పేరు గుర్తులేదు. ఈరోజుల్లోలాగ, అప్పుడు రాష్ట్రానికి ఓ పదిమంది ఐజీలూ, ఓ డజనుమంది డీజీపీలూ కాదుగా. రాష్ట్రం అంతటికీ ఒక్కరే ఐజి.

    పెళ్ళైన తరువాత,మా ఇంటావిడకి కూడా ఏదో సంగీతం మీద ఇంటరెస్టు ఉన్నా లేకపోయినా, నాతో కచేరీలకి వచ్చేది. వినగా వినగా తనకీ ఓ అనుభూతి కలగడం మొదలెట్టిందనుకోండి. ఎంతదాకా వెళ్ళిందీ అంటే , మా అమ్మాయి చి.రేణు కి సంగీతం నేర్పించేదాకా. ఆరోజుల్లో పూనాలో శ్రీమతి వడ్లమాని సుభద్రగారి దగ్గర నేర్చుకునేది. ఆ సంగీతాభిమానమే మేము వరంగాం లో ఉన్నంతకాలమూ, స్కూల్లో పాటలపోటీల్లో ఎప్పుడూ తనే ప్రథమ స్థానంలో ఉండేది.

   ఆరోజుల్లో నా దగ్గర ఉన్న రికార్డులు అన్నీ టేప్ రికార్డరులో రికార్డు చేసికునేవారు.పైగా ఇప్పటిలాగ కాదుకదా,ఓ మైక్కూ, దాంట్లోంచి వినబడే పాటలు ఓ టేప్ లో రికార్డు చేసికోవడం.రికార్డింగు జరుగుతున్నంతసేపూ , బయటి ధ్వనులు వినిపించకుండా, కిటికీలు మూసేయడం. దగ్గకూడదు, నవ్వకూడదు, చప్పుడనేది చేయకూడదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎవరో ఒకరు వచ్చేసి పాటలు, కీర్తనలూ రికార్డు చేసికోవడం. చిత్రం ఏమిటంటే ఎవరిద్వారానో నా దగ్గర రికార్డుల సంగతీ, వాటిని రికార్డింగు చేయడమూ విని, 40 సంవత్సరాలుగా నా గురించి ఖోజ్ చేస్తూ..చేస్తూ . చివరకి నన్ను కలిశారు ఈమధ్యన. ఇంకా చిత్రం ఏమిటంటే వారిదీ మా అమలాపురమే.. ఆయన అడిగిన మొదటి ప్రశ్న..” ఆ రికార్డులు మీ దగ్గర ఇంకా ఉన్నాయా..” అని. అదృష్టం కొద్దీ మా అబ్బాయి ఆ జాగ్రత్త తీసికున్నాడు.

    అసలు ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావించానంటే , దానికీ ఓ కారణం ఉంది. వినే ఉంటారు బ్రహ్మశ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మగారని గాయత్రీ ఉపాసకులు, అలాటి బ్రహ్మజ్ఞానితో మాకు బంధుత్వం ఉండడం మేము ఏజన్మలోనో చేసికున్న పుణ్యం అయుంటుంది. మా సంగతెలా ఉన్నాకానీ, మా పూర్వీకులైనా పుణ్యం చేసికునుంటారు. దాని ఫలితమేలెండి ఈరోజు రెండుపూటలా తిండి తినే భాగ్యం కలగడం. చెప్పొచ్చేదేమిటంటే, ఓగిరాల వారి కుమార్తె శ్రీమతి విమల గారు మాకు దగ్గర చుట్టం. ఎలాగా అంటారా, మా పెదనాన్నగారు శ్రీ భమిడిపాటి రామచంద్రుడిగారి, మనవడు శ్రీ బులుసు రామచంద్రుడు, ఈ విమల గారికి భర్త. అంటే మాకు కుమార్తె వరసన్నమాట.. చూశారా ఎంత అదృష్టమో మరి.

    అవకాశం దొరికినప్పుడు ఇలా name dropping చేసేసికుంటూంటేనే బాగుంటుంది కదూ.. ఈ విషయం ఏనాడో తెలియచేయవలసింది, కానీ సందర్భం కుదరలేదు. నిన్న మా “మేనల్లుడు” ( వరసకే లెండి, వయసులో ఆయన నాకన్నా పెద్దవారూ, పూజ్యనీయులూనూ) ఫోను చేసి ఈమధ్యన శ్రీమతి విమలగారు వాద్య సహకారం లేకుండగా, వారి నాన్నగారి కీర్తనలు పాడగా, నెట్ లో పెట్టారు. మీరూ విని ఆనందించండి.

1 శ్రీమతి విమల

2. బ్రహ్మశ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మ గారు.

%d bloggers like this: