బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అరవై ఏళ్ళ క్రితం…(60 +)

Ammadu

    ఆంధ్రదేశంలో అరవై ఏళ్ళ క్రితం కొన్ని మరపురాని సంఘటనలు జరిగేయి. ఆగస్టు నెలలో గోదావరి నదికి పెద్ద వరద వచ్చి, రాజమండ్రీకి చాలా నష్టం వచ్చింది. ఆ తరువాత అక్టోబరు 1 న శ్రీ పొట్టిశ్రీరాములుగారి నిరాహారదీక్ష ధర్మమా అని, కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అదే సంవత్సరంలో అక్టోబరు 15 న , నా జీవితానికి సంబంధించినంతవరకూ, మా ఇంటావిడ ఈభూమ్మీద కి వచ్చింది !క్రిందటేడాది తన “ప్రవర” కూడా వ్రాసుకుంది.

    ఇంటావిడ పుట్టినరోజూ అని చెప్పుకోడానికి ఇంత build up అవసరమా మాస్టారూ అనొచ్చు. ఏం చేయమంటారూ, తన పుట్టినరోజని తనకు తానై చెప్పుకోదు.ఇదివరకటి రోజుల్లో ఇంటి ఇల్లాలికి షష్టిపూర్తి సమయానికి, ఇంకా కొన్ని కొన్ని బాధ్యతలు మిగిలిపోయేవి, ఉదాహరణకి మా అమ్మగారి షష్టిపూర్తీ, మా ఇంటావిడ శ్రీమంతమూ ఒకేరోజున జరిగేయి. కానీ మా ఇంటావిడ విషయంలో తను కోడలిగా, తల్లిగా, అత్తగారిగా, అమ్మమ్మగా, నానమ్మగా అన్ని బాధ్యతలూ నిర్వర్తించినట్టే,to the best of her ability.
తన రెండో దశకంలో నాజీవితంలోకి వచ్చింది. మూడో దశకానికల్లా ఇద్దరు పిల్లలని నాకు అందించింది.నాలుగో దశకానికి పిల్లల చదువులు పూర్తయాయి.అయిదో దశకానికి పిల్లల పెళ్ళిళ్ళూ, వాళ్ళ పిల్లలకి రెండుపర్యాయాలు అమ్మమ్మగానూ, ఇంకో రెండు సార్లు నానమ్మగానూ బాధ్యత నెరవేర్చింది.ఆరవ దశకానికి మొదట్లో కోడలిగా బాధ్యతలు పూర్తిచేసికుంది.అప్పటినుండీ నా “బాగోగులు” చూసుకుంటోంది.ఈమధ్యలో ఈ నలభైరెండేళ్ళూ నాసంగతి పట్టించుకోలేదనికాదు…ఆవిడేలేకపోతే ….

    ఈ అరవయ్యో జన్మదినం తిరుపతి కొండమీద చేసికుదామనుకున్నాము మొదట్లో. కానీ రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, ఆ కార్యక్రమం మానుకుని , మాకు దగ్గరలోని నారాయణపూర్ మా అమ్మాయీ అల్లుడూ తీసికెళ్ళగా శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని వచ్చేము. మిగిలిన వారందరితోనూ సాయంత్రం హొటల్ లో భోజనం.

    ఆ మధ్యన అరవై ఏళ్ళక్రిందటి ఆంధ్రసచిత్రవారపత్రిక చూస్తూంటే ఆ దసరాసంచిక coincidental గా 14-10-1953 న ప్రచురించారు.పైగా అది బాలల ప్రత్యేక సంచిక కూడానూ. ఆ సంచికలో ప్రచురించిన కొన్ని బొమ్మలు మీతో పంచుకోవాలనుకున్నాను. విశేషమేమిటంటే, ఆ బొమ్మలు వేసిన బాలల వయస్సు కూడా ప్రచురించారు. అంటే ఆనాటి బాలలందరూ ఇప్పుడు 60 + లోకే వస్తారుగా !! ఎక్కడెక్కడున్నారో ఏం చేస్తున్నారో.. జీవితంలోని బాధ్యతలన్నీ నిర్వర్తించి హాయిగా ఉండే ఉంటారు. ఆ పేర్లలో మీకెవరైనా పరిచయం ఉంటే వ్యాఖ్యలరూపంలో తెలియచేయ ప్రార్ధన…

చిత్రములు 1చిత్రములు 2చిత్రములు 3
చిత్రములు 5చిత్రములు 6చిత్రములు 7

%d bloggers like this: