బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం


    గత వారంరోజులుగా, నాకై నేను తెచ్చుకోని సమస్యతో అవస్థ పడుతున్నాను. కొన్ని కారణాలవలన నా మిస్టరీ షాపింగు కొంచెం తగ్గించుకున్నాను. అలాగని పూర్తిగా మానేయనూలేదు. నా అంతట నేను ఎప్లై చేయడం తగ్గించుకున్నాను, మరీ బాగుంటేనేతప్ప. మనం తగ్గించుకుందామనుకున్నా, బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా, అవి మనల్ని వదలవుగా. ఆయన చెప్పినదానిలో ఎంత యదార్ధముందో ఇప్పుడు అర్ధం అయింది.

    ఒకసారి ఒక రంగంలోకి అడుగెట్టిన తరువాత , వాటిల్లోంచి బయట పడడం అంత సుళువుకాదు. నేను ఎప్లై చేయడం అంటే మానేశానుకానీ, నా అదేదో ఇంగ్లీషులో అంటారే reputation ఓటి సంపాదించానుగా, దానికారణం చేత, ఆ ఏజన్సీలవాళ్ళకి పూణే లో ఏదైనా అర్జంటుది ఉంటే, ఓ ఫోను చేస్తూంటారు, నేనూ కాదనలేక ఒప్పేసుకుంటూంటాను. ఇలాటి మొహమ్మాటాలే ఒక్కొక్కప్పుడు సమస్యలు తెస్తూంటాయి. అలాటిదే, ఓ పదిపదిహేను రోజుల క్రింద, ఒక ట్రావెల్ ఏజన్సీది చేయమన్నారు. మామూలుగా అయితే, అక్కడకి వెళ్ళడం, ఏవో కబుర్లుచెప్పేసి, ఓ కాఫీ త్రాగేసి, వాళ్ళిచ్చిన బ్రోచర్ తీసికుని, ఆ మాట్టాడిన అమ్మాయో, అబ్బాయో వాళ్ళ విజిటింగ్ కార్డొకటి తీసికుని, ఇంటికొచ్చి, వాళ్ళిచ్చిన బ్రోచరూ, విజిటింగ్ కార్దూ స్కాన్ చేసి, వాళ్ళిచ్చిన ప్రశ్నలకు జవాబులిచ్చేసి, చేతులు దులిపేసికోవడమే. ఓ రెండు నెలల్లో వాళ్ళిచ్చే డబ్బులేవో మన ఎకౌంటులోకి వచ్చేస్తాయి, సర్వేజనా సుఖినోభవంతూ.

   అలాటివి ఓ పాతికదాకా చేశాను, వాళ్ళకీ నచ్చినట్టుందీ, ఈసారికూడా అలాటిదే చేస్తావా అని అడుగుతూ, అందులో ఓ మెలిక పెట్టేరు. ఊరికే కబుర్లు చెప్పేయడమే కాకుండా, అదేదో ప్యాకేజీ కి ఎడ్వాన్స్ బుకింగ్ కూడా చెయ్యాలిట. పైగా అదేమో ఓ పాతికవేలు, రెండు రోజుల్లో reimburse చేసేస్తారుట. అదేదో సామెత చెప్పినట్టు ” ఆయనే ఉంటే…..” అంతంత డబ్బులే ఉంటే , ఇంక అడిగేదేముందీ? పైగా పెన్షనర్నీ. ఏదో సరదాగా ఏ బ్రాండెడ్ బట్టో ఏదో కొనుక్కుంటే, కనీసం ఆ సరుకైనా మనం కొన్నట్టుంటుంది. వాళ్ళు డబ్బులిచ్చేరా మహబాగు, లేదా పోనీ మనమే కొనుక్కున్నామనుకుంటాం, వదిలేస్తాం.ofcourse ఇప్పటిదాకా చేసిన రెండువందల పైగా ఎసైన్మెంట్లకి డబ్బులు ఇచ్చారు. మోసం ఎప్పుడూ లేదు. అలాగని మరీ పాతికవేలు ముందుగా కట్టేసి, వాళ్ళు డబ్బు ఎప్పుడు తిరిగిస్తారా అనుకుంటూ వేచి ఉండడం, ప్రతీ రోజూ ఇంటావిడ చేత క్లాసులు తీయించుకోవడమూ అంత అవసరమంటారా? ఏదో ఇంటాయన ఏదో సరదా పడుతున్నాడూ, అప్పుడప్పుడు మాక్కూడా ఏవేవో తెస్తూంటారూ, ఆ మాత్రం కాలక్షేపంకూడా లేకపోతే, రోజంతా ఇంట్లోనే కూర్చుని, నాప్రాణం విసిగిస్తారూ అనుకుని, కొత్తపెళ్ళికొడుకులా బ్రాండెడ్ బట్టలు వేసికుని నిగనిగలాడిపోతున్నారూ, పోనిద్దూ, అనే ఒక్కకారణం చేత ఇన్ని సంవత్సరాలూ చేయనిచ్చింది. నా లిమిట్ మూడువేలు. అంతేకానీ తాహతుకిమించి ఏదో ఉధ్ధరించేద్దామనుకోవడం బుధ్ధితక్కువ పని. ఎవరో అంటారేమో అని కాకపోయినా, మనం కూడా మన హద్దుల్లో మనం ఉండాలి. అలా ఉంటేనేకదా, అందరూ సంతోషించేదీ?

    రెండు మూడు సంవత్సరాలక్రితం కూడా, ఇదే ఏజన్సీ, అదే ట్రావెల్స్ వాళ్ళదగ్గరకు వెళ్ళి అదే పధ్ధతిలో ఎడ్వాన్సు ఇరవై వేలూ ఇచ్చి రమ్మంటే, అప్పుడుకూడా, ఠాఠ్ కుదరదని చెప్పేను. వాళ్ళు ఆ డబ్బు ముందర నేను అడిగినట్టుగా, నా ఎకౌంటులోకి మార్చనూ, మార్చారూ, నేను కూడా బుధ్ధిమంతుడిలా ఏటీఎం కి వెళ్ళి, డ్రా చేసి, ఆ డబ్బు కట్టేశాను. చెప్పొచ్చేదేమిటంటే, అప్పుడూ నేనే, ఇప్పుడూ నేనే, మారింది ఆ ఏజన్సీలోని ఉద్యోగస్థులు మాత్రమే. అదే విషయం వాళ్ళకి చెప్పి, చూడండమ్మా ఇదీ సంగతీ, మీరు డబ్బు ముందుగా ఇస్తే, నేను వాళ్ళకి కట్టొస్తానుకానీ, నాదగ్గర అంతంత డబ్బులుండవూ, మీమీద నమ్మకం మాట అటుంచండీ, మీరు తీరిగ్గా నా డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవరకూ వేచిఉండే ఓపిక లేదూ, ఇదివరకటిలాగే మీరు ముందుగా డబ్బు ఇవ్వండీ, నేను మీ పని చేసిపెడతానూ అని చెప్పేను. సరే ,we will come back to you, అనేసి ఊరుకున్నారు.

    క్రిందటివారం ఓ ఫోను వచ్చింది. మీరు అడిగినట్టుగా డబ్బు ముందరే ట్రాన్స్ఫర్ చేస్తామూ, ఈవేళ వెళ్ళి, ఫస్ట్ రౌండ్ ఎవాల్యుఏషన్ చేసి రమ్మన్నారు. అంటే ఆ ట్రావెల్స్ కి వెళ్ళి ఊసుబోక కబుర్లు చెప్పి, ఫలానా ప్యాకేజీకి ఎంత ఖర్చూ.. వగైరాలు అడిగి రావడం. వీటిల్లో ఓ గొడవుంటుంది, మన వివరాలు వాళ్ళు నోట్ చేసికుంటారుగా, రోజువిడిచి రోజు ఫోనొస్తూంటుంది, ఎప్పుడు బుక్ చేస్తున్నారూ అంటూ. ఇదివరకైతే ఇంకా ఆలోచిస్తున్నామూ అని ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడిని. పైగా ఊళ్ళో ఉన్న చాలా ప్రముఖ ట్రావెల్స్ కి కూడా వెళ్ళాను. అస్తమానూ మన పేరే చెప్తే, వీళ్ళు వదిలేటట్టుగా లేరూ అనుకుని, మా చుట్టం కోసమూ అని చెప్పేవాడిని. వాళ్ళు ఎప్పుడైనా ఫోను చేసినా “మా చుట్టం ఇంకా ఏమీ చెప్పలేదూ..” అనేసేవాడిని. గొడవుండేది కాదు.

    ఈసారి అలా కుదరదుగా నా పేరే చెప్పాల్సొచ్చింది.అనుకున్నట్టుగానే మర్నాటినుండీ ఫోన్లూ, మర్నాటిలోపులో బుక్ చేసేసికుంటే అదేదో డిస్కౌంటూ, ఆలశించిన ఆశాభంగం అంటూ. నాకేమిటీ, వెళ్ళేనా పెట్టేనా ఏదో కాలక్షేపం. చివరకి చెప్పాల్సొచ్చింది, నాయనా నాకైతే చేయాలనే ఉందీ, కానీ డబ్బులు ఇంకా రాలేదూ అని . వదలడే, మీరు చెప్తే మా రెప్ ని పంపుతానూ అంటాడు, అక్కణ్ణించేమో డబ్బులు రావాయే, ఇక్కడ ఈ ట్రావెల్స్ వాడేమో నన్ను ఊరికే మొహమ్మాటపెట్టేస్తున్నాడు. ఆ ఏజన్సీ వాళ్ళదగ్గరనుంచి ఫోనూ, డబ్బు ట్రాన్స్ఫర్ చేసేశామూ అని, తీరా చెక్ చేస్తే డబ్బూ లేదూ, దస్కమూ లేదూ. ఇలా వారంరోజులనుండీ, వాళ్ళు చేసేశామనడం, నేనేమో ఇంకా రాలేదు మొర్రో అనడంతో గడిచిపోయింది.
అసలు తిరకాసంతా ఎక్కడొచ్చిందంటే ఇదివరకు వాళ్ళు ముందుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసి, తరువాత నా దగ్గర ఓ అండర్ టేకింగ్ తీసికున్నారు, “ఫలానా డబ్బు ఫలానా పనికే ఉపయోగిస్తానూ, స్వంత ఖర్చులకి ఉపయోగించనూ..” అని, ఈసారి కొంచం తెలివి మీరారు, వాళ్ళు డబ్బు పంపడానికి ముందే, నాకు ఒక డాక్యుమెంటు పంపి, అది సంతకం చేసి పంపమన్నారు. ఫరవాలేదూ, ఒక్కరోజే కదా అని నేనూ వాళ్ళడిగినట్టే పంపేశాను. చివరకి వాళ్ళదగ్గర నా రసీదుందికానీ, వాళ్ళ డబ్బులుమాత్రం రాలేదు. మరీ గొడవేమీ రాదనుకోండి, బ్యాంకు వాళ్ళ హిస్టరీ ఉంటుందిగా, అయినా లేనిపోని చికాకూ. ఇంటావిడకి సంఝాయిషీ చెప్పుకోవద్దూ, కాళ్ళూ చేతులూ కట్టేసి ఇంట్లో కూర్చోపెట్టేస్తుంది ! పైగా ఇలాటివేమైనా జరిగితే ప్రతీవాడూ తిట్టేవాడే ” కుదిరింది రోగం..” అంటూ. ఎవరికీ చెప్పుకోలేమూ.

    ఇంత గొడవయినతరువాత చివరకి నిన్న మధ్యాన్నం ఆ డబ్బు రానూ వచ్చిందీ, నేను ఈవేళ వెళ్ళి ఆ ట్రావెల్స్లో ఎడ్వాన్సు కట్టీవచ్చాను. వాళ్ళ ఎవాల్యుఏషన్ రిపోర్టు పంపి, దానితో పాటు ఆ డబ్బుల రసీదుకూడా పంపేను. ఇంత హడావిడయింది ఈ వారం రోజులుగా. ప్రతీ రోజూ పీడకలలే, కోర్టుకివెళ్ళాసొచ్చిందనీ, అన్నిఖర్చులూ తడిపిమోపెడయ్యాయనీ, ఆ డబ్బులు ఇరవైనాలుగ్గంటలలోపల కట్టకపోతే ఆస్థిపాస్థులు వేలం వేస్తారనీ, వెనక్కల బ్యాక్ గ్రౌండులో మ్యూజిక్కోటీ . ఇదండీ కథా కమామీషూనూ. సుఖాంతం.

    ఈమధ్య ఒక కొత్త తెలుగు లింకు దొరికింది ( మా స్నేహితుడి సౌజన్యంతో).

5 Responses

  1. ఇంకం టాక్సు వాళ్ళు వెంట బడేరు ! ఇట్లాంటి వాటికన్నీ టాక్సు కడుతున్నారా లేదా అంటూ !

    చీర్స్
    జిలేబి

    Like

  2. ఫణి బాబు గారూ
    నమస్తే మొత్తానికి. రావలసిన బకాయి .రాబట్టారు సంతోషం.మీ కలలో వచ్చిన కష్టాలు పడే అవస్థ తప్పింది
    ఇకనుంచి అటువంటి క్లిష్టమయిన పరిస్టితి రాకుండా చూసుకోండి.

    ఇంకా నాకు 500/- రావాలి మెయిల్స్ ఇస్తూనే ఉన్నాను
    ఫైనాన్సువాళ్ళని సంప్రదించమని రిప్లయ్ ఇచ్చారు. చూద్దాము

    భక్తీ లింక్ బాగుంది కదూ

    మీ

    శాస్త్రి

    Like

  3. జిలేబీ,

    అంతగా టాక్స్ కట్టాల్సినంత డబ్బులు రావు…

    శాస్త్రిగారూ,

    ఈ ఆనియన్ సైట్స్ వాళ్ళతో వచ్చిన చిక్కే ఇదండీ. డబ్బులు సమయంలో పంపరు. అందుకే, ముందరే ఇమ్మన్నాను. కథ మొత్తానికి కంచికి చేరిందిలెండి. భక్తి లింకు చాలా బాగుంది. అందుకే నా పాఠకులతో పంచుకున్నాను.

    Like

  4. Like a proverbial monkey’s paw in a jar – an educative musing

    Like

  5. డాక్టరుగారూ,

    Absolutely true…

    Like

Leave a comment