బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Santoor Syndrome….


    ఇదివరకటి రోజుల్లో కంపెనీలు తయారుచేసే సరుకులకి ప్రకటనలు మొదట్లో పేపర్లలోనో, పత్రికల్లోనో మాత్రమే చూసే అవకాశం ఉండేది. ఆల్ ఇండియా రేడియో వారు “వ్యాపార ప్రకటనలు” ప్రారంభం చేసిన తరువాత, ఆ ప్రకటనలకి సంగీతం జోడించి రేడియోలో ప్రసారం చేసేవారు.అలాటి ప్రకటనలకి సంగీతం చేసే ఏ ఆర్ రెహ్మాన్ వృధ్ధిలోకి వచ్చాడు. దృశ్య రూపంలో చూడాలంటే ఏ సినిమాయో చూడాలనుకున్నప్పుడు, ఆ థియేటర్ లో ఓ పావుగంట ఈ దృశ్య ప్రకటనలు చూడగలిగేవారం. క్రమక్రమంగా, టీవీ ల ధర్మమా అనీ, ఆ తరువాత శాటిలైట్ టీవీ ధర్మమా అని, మన ఇళ్ళలోకే వచ్చేశాయి ఈ వ్యాపారప్రకటనలు. వీటివలన మార్కెట్ లోకి వచ్చే కొత్తవస్తువు గురించి తెలిసికోగలుగుతున్నాము. మరి తెలిసేసికుని ఊరికే కూర్చుంటే ఎలాగా, వెంటనే మార్కెట్ లోకి వెళ్ళి ఫలానా వస్తువుందా అని, కొట్టువాడిని హోరెత్తేయించేయడం. వాడు ఇంకా ఆ వస్తువు మార్కెట్ లోకి రాలేదు మొర్రో అని మొత్తుకున్నా సరే వినకుండా. ఆ వ్యాపార ప్రకటనల ఉపయోగం ఏమిటయ్యా అంటే ఆ వస్తువు వచ్చేలోపలే అందరికీ brain wash చేసేయడం.

దేనికైతే ప్రకటన చేశారో ఆ వస్తువు గురించి, చాలా చాలానే exaggerate చేస్తూంటారు లెండి. కానీ ఆ విషయం తట్టదుగా. పిల్లల విషయంలో అయితే కొద్దిగా ఎక్కువే చేస్తూంటారు. శలవు రోజొచ్చిందంటే పిల్లలు ఆ టీవీ ముందరేగా కూర్చునేదీ, ఏదో “పొడుగెదగడానికి ” ఫలానా డ్రింకు త్రాగండీ అంటాడు. ఇంక ఆ పిల్లలు తల్లితండ్రుల ప్రాణం తీసేస్తారు, ఫలానా డ్రింకే కావాలీ..లీ..లీ .. అంటూ, అక్కడికేదో రాత్రికి రాత్రే తాటిచెట్టంత పొడుగు ఎదిగేయొచ్చన్నట్టు. డ్రింకులేమిటీ, ప్రతీవస్తువు గురించీ చిలవలూ పలవలూ చేసేస్తారు. ఇంక టూత్ పేస్టులైతే మరీనూ, అదేదో “ఉప్పు” ఉందా అంటాడు ఒకడూ, ప్యూర్ వెజిటేరియన్ అంటాడు ఇంకోడూ, దీనితో ఇంకో కంపెనీ పేస్టు వాడేవాళ్ళు భయపడిపోతారు- “హవ్వ.. హవ్వ.. ఇన్నాళ్ళూ మనం వాడేదాంట్లో “నీచు” ఉందిటే, అందుకే హాయిగా ఏ “కచికో”, “నంజన్ గూడ్” ఎర్ర పళ్ళపొడో వాడమని మొత్తుకుంటాను, వింటారా నా మాటా ఎవరైనా, కలికాలమమ్మా ..కలికాలం..”, సంసారం భ్రష్టు పడిపోయిందన్నట్టుగా అల్లరి చేసేస్తారు.

ఇంక సబ్బుల విషయానికొస్తే అడగనే అఖ్ఖర్లేదు, ఆవిడెవరో ఫలానా సబ్బు వాడుతుందిట, ఈవిడ శరీరం భర్తకి తగిలించేటప్పటికి, ఆ కుర్రాడు కాస్తా, వర్షం వస్తూన్నా ఆ గొడుగు వదిలేసి, డ్యాన్సులు చేస్తాడు. ఇంకో సబ్బులవాడు, ఫలానా సబ్బువాడితే అసలు రోగాలే దగ్గరకు రావంటాడు, మరి లక్షలు పోసి డాక్టరీ డిగ్రీ తెచ్చుకున్నవాళ్ళందరూ ఏ గోదాట్లోకి దిగుతారుటా?

వీటన్నిటిదీ ఓ ఎత్తూ, సంతూర్ వాళ్ళది ఓ ఎత్తూ ! ఆ సబ్బువాడితే అసలు వయస్సే తెలియదుట ! ఈ కంపెనీలవాళ్ళు ఎటువంటి ప్రకటన రిలీజ్ చేసినా సరే చివరకి, ఓ పిల్ల ” మమ్మీ..” అంటూ వచ్చేస్తుందీ, ఆ హీరోయేమో ” అరే ..మమ్మీ..”అంటూంటాడు. ఈ ప్రకటనలో కంపెనీ వారు చెప్పే “నీతి” ఏమిటయ్యా అంటే, ” మా సబ్బు వాడండి, మీ వయస్సు దాచుకోండీ..” అని.

ఉదాహరణకి ఇద్దరు స్త్రీలని చూశామనుకోండి, ఏదో మొహమ్మాటానికి మీరిద్దరూ ” అప్పచెల్లెళ్ళా,,” అని ఆడగ్గానే, మెలికలు తిరిగిపోతూ.. “కాదండీ ఇది మా అమ్మాయి..” అని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్తారు. అంటే ఆ పెద్దావిడ ” సంతూర్” సబ్బే వాడుతోందన్నమాట ! ఇలాటి దానికే Santoor Syndrome అని అంటారు !

ఇదేదో ఆడవారు మాత్రమే అనుభవించే previlege అనుకోకండి. మొగాళ్ళకీ ఇలాటి Santoor feelings వస్తూంటాయి. దానికి ఆ సబ్బే వాడాలని రూలేమీ లేదు. మామూలు “సున్నిపిండి” వాడినా చాలు ! ఏదో బయటకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకబ్బాయి తన కొడుకో, కూతురితోనో కనిపించి పలకరిస్తూ ” అంకుల్ కి నమస్తే చెప్పమ్మా..” అంటాడనుకోండి, ఇద్దరు మనవలూ, ఇద్దరు మనవరాళ్ళకీ “తాత” అయిన తనని ” అంకుల్” అని ఇంకో చిన్నాడు పిలిస్తే, మరి తన వయస్సేదో తగ్గిపోయినట్టుగా అనిపించదూ మరి? అలాగే , తాను ఉద్యోగం చేసి, పదేళ్ళక్రితం రిటైరయిన ఆఫీసులో, ఎవరో పలకరించి, ” ఇంకా ఎన్నేళ్ళు మాస్టారూ మీ సర్వీసూ..” అని అడిగితే సంతోషంగా ఉండదూ మరి?

అలా కనిపించడానికి మనమేమీ క్రీమ్ములూ, సబ్బులూ, రంగులూ వాడఖ్ఖర్లేదు, just positive thinking చాలు అని నా అభిప్రాయం. మనం ఎంత positive గా ఆలోచిస్తే రోగాలు అంత దూరంగా ఉండి, మనల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. సర్వే జనా సుఖినోభవంతూ..

ఈ వారం గోతెలుగు.కాం లో నా వ్యాసం ఒకటి ప్రచురించారు.

Advertisements

4 Responses

 1. మంచి టపా వ్రాసారు. 2012 మే లో “నేస్తం” గారు తన బ్లాగ్ “జాజిపూలు” లో “సంతూర్ సంతూర్” అనే టపా చాలా హాస్య భరితంగా వ్రాసారు. మీ టపా సందర్భంగా “నేస్తం” గారి ఆ టపాని కూడా మరొకసారి గుర్తుచేసుకోవచ్చు.

  Like

 2. నరసింహరావుగారూ,

  మీ స్పందనకి ధన్యవాదాలు..

  Like

 3. Santoor Syndrome – Ha haa! Nice name guruvu gaaroo!

  Like

 4. చందూ,

  సరదాగా మీలాటి వారందరితోనూ connect అవొచ్చుకదా అని అలా పేరు పెడుతూంటాను !! పేరులో ఏముందీ అంటారు కానీ, పేరు కొద్దిగా తమాషాగా పెడితే ఓ లుక్కేస్తారని !! తీరా చదవడం మొదలెడితే ఏముందీ అంతా “డొల్ల”…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: