బాతాఖాని-లక్ష్మీఫణి కబుర్లు– ఎవరో ఏదో అనుకుంటారేమో…


    ఈరోజుల్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో… బాగుండదేమో ..అనే అభిప్రాయాల ధర్మమా అని, ఒక్కొక్కప్పుడు మనకి సాధారణంగా ఉండే consumer rights గురించి కూడా అడగడానికి సంకోచిస్తూంటాము. ఉదాహరణకి ఏదైనా mall కి ఏ సరుకులైనా కొనడానికి వెళ్ళామనుకోండి, అక్కడ వివిధ రకాలైన offers కనిపిస్తూంటాయి. మామూలుగా మనకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ వస్తువు కొనుక్కుంటూంటాము. పైగా ఆ offers కూడా , ఆ యాజమాన్యం వాళ్ళు మనమీద ఏదో అభిమానం కొద్దీ ఇచ్చేవిగా కూడా ఉండవు. ఫలానా సరుకు మరీ అమ్ముడవకపోతే, దానిని ఇంకో ఎక్కువగా అమ్ముడయ్యే సరుకుని కొద్దిగా దాని ఖరీదుకూడా పెంచేసి, ఈ అమ్ముడవకపోయే సరుకుని అంటగట్టేస్తాడు. ఎన్ని చెప్పినా, “ఉచిత” వస్తువులమీద సామాన్య ప్రజానీకానికి ఉండే ప్రీతి వలన, అవసరం ఉన్నా లేకపోయినా, మనమూ ఆ వస్తువుని కొంటామనే మనస్థత్వాన్ని cash చేసికుంటాడు. కొన్నిటిమీద 10 రూపాయలో, అదేదో శాతం(%) తగ్గింపంటాడు.ఏది ఏమైనా సరుకు అమ్ముడవడం ఆ కొట్టువాడి ముఖ్యోద్దేశం.

    ఏ సూపర్ బజారు చూసినా, ఏ మాల్ చూసినా, ఏ బ్రాండెడ్ వస్తువుల కొట్లు చూసినా, ఇవి మామూలే. ఎక్కడ చూసినా పేద్దపేద్ద హోర్డింగులూ, ఎప్పుడో కర్మజాలక మన నెంబరు ఇస్తే ఎస్ ఎం ఎస్సులూ, మెయిళ్ళూ, మన సొసైటీ లెటర్ బాక్సుల్లో పాంఫ్లెట్ట్లూ ఒకటేమిటి కావలిసినంత హడావిడి. మనవైపు పండుగ అమ్మకాలూ, ఆషాఢం సేల్సూ కూడా ఇలాటివే. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తే పెట్టడానికి ఈ ఆషాఢం సేల్స్ లో ఓ పదిచీరలు చవకలో కొనిపెట్టేస్తే, ఏడాదంతా హాయిగా వెళ్ళిపోతుంది.

    మాకు దగ్గరలో రిలయన్సు వాళ్ళ మార్ట్ ఒకటుంది. సాధారణంగా అక్కడికే వెళ్టూంటాను ( ఒక్క్ణణ్ణే అనుకోండి), ఆ మధ్య ఒకసారి, అదేదో సర్ఫ్ ప్యాక్కు ఒకటి మూడో, నాలుగో వందలు పెట్టి, ఇంటికి మోసుకొచ్చాను.ఆ తరువాతి వారంలో మా ఇంటావిడ, ఆ ప్యాక్కుని తెరిచినప్పుడు, దానిమీద bucket pack అని చూసి, బకెట్టేదండీ అంది.నాకేం తెలుసూ, దానితో బకెట్టుకూడా ఉందనీ, ఆ మూడు కిలోల ప్యాక్కుతోపాటు మిగిలిన సరుకులు కూడా ఉండడంతో, ఆ ఖంగారులో చూసిఉండలేదనుకుంటాను. తప్పు నాదే. “పోన్లెండి, ఇన్నిరోజుల తరువాత ఇస్తాడో లేదో, వదిలేయండీ.. మళ్ళీ శ్రమెందుకూ ..” అని వదిలేయమని చెప్పకుండానే చెప్పేసింది. అయినా ఓసారి ప్రయత్నం చేస్తే తప్పేమిటీ, అయినా ఒక్క బకెట్టే కదా అంత బరువూ ఉండదూ, అనుకుని, ఆ వస్తువులుకొన్న రసీదు కోసం వెదికితే అదృష్టంకొద్దీ దొరికింది ! రసీదులూ, ఏటీఏం స్లిప్పులూ ఓ డ్రాయరులో పడేసి, నెలకోసారి ఖాళీ చేయడం అలవాటు. చూశారా ఇలా చెత్తకాగితాలన్నీ పోగేయడంతో ఇంటావిడచేత చివాట్లు తిన్నా, వీటివలన నష్టాలకంటే , ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి. మనల్ని కాదని దులిపేసికుంటే ఏ గొడవా ఉండదు. మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా, క్రమక్రమంగా అలవాటైపోతుంది..( గమనించ ప్రార్ధన). ఇలాటి మంచి అలవాట్లు ఉంటేనే బతికి బట్ట కట్టేది !

    ఏదో మొత్తానికి ఆ రసీదు పట్టుకుని మళ్ళీ ఆ రిలయెన్స్ మార్ట్ కి వెళ్ళాను. ఏదో ఉత్తిచేతుల్తో వెళ్తే బాగుండదుకదా, అనుకుని ఓ బిస్కెట్ ప్యాకెట్టోటీ, దేనిమీదైతే ఆ bucket pack అని వ్రాసుందో ఆ ప్యాక్కూ తీసికుని బిల్లింగుకోసం వెళ్ళి, దీనితో బకెట్టుకూడా ఇస్తారుకదా అని అడిగితే, అవునూ అంది. ప్రస్థుతం నాకు ఈ ప్యాక్కు అఖ్ఖర్లేదూ, ఊరికే అడిగానూ బకెట్టుందా లేదా అని తెలిసికోడానికిమాత్రమే అని చెప్పి, అంతకుముందు వారంలో నేను తీసికున్న ఆ ప్యాక్కుతో, బకెట్టు మర్చిపోయానూ అని చెప్పగానే, రసీదుందా అని అడగ్గానే ఠక్కున తీసి చూపించాను. ఈమధ్య చూడండి, క్రికెట్టులో UDRS ( Umpire Decision Review System) అని ఒకటి మొదలెట్టారు. ముందుగా బౌలర్ వేసిన బాల్ సరీగ్గా ఉందా, లేక నో బాలా అని చూపిస్తారు, ఆ తరువాత ఏవేవో కెమేరాల దృశ్యాలు చూపించి, మొత్తానికి ఆ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనదో కాదో చెప్తారుట. అలాగ మొదటగా రసీదుందా లేదా, ఉందీ.. అయితే ముందుకెళ్ళొచ్చూ… రెండో విషయం… ఎప్పటిదీ… ఓ వారం క్రితం దీ… అలాగా అయితే ఆగు…ఎందుకూ.. నా పైవాడు చెప్పాలీ ఇవ్వొచ్చో, లేదో… సరే .. వాడినే పిలూ…మళ్ళీ వాడితో విషయాలన్నీ రిపీట్... ఏదో అదీ ఇదీ మాట్టాడి బకెట్టు ఇవ్వడం ఎగ్గొడదామనుకున్నట్టు కనిపించాడు, సరే మీ ఫ్లోర్ మేనెజరుని పిలూ… నా Mystery shopping ధర్మమా అని తెచ్చుకున్న ధైర్యం, ఆ మాల్ వాడు మనకేమైనా మేనత్తకొడుకా, మేనమామ కొడుకా వదలడం ఎందుకూ, అనుకుని, మీ మేనేజరుని పిలూ అనడంతో, పక్కనుండే మిగిలిన కస్టమర్లు చూస్తున్నారనే భయం అనండి, నాలాటి తిక్క శంకరయ్యలతో గొడవెందుకూ అనుకున్నాడేమో, మొత్తానికి నేను అడిగినదానికి ఒప్పుకుని, ఆ బకెట్టేదో ఇచ్చాడు.

    ఆ బకెట్టు ఓ చేతిలో పట్టుకుని బయటకు వచ్చాను. ఈ మార్టు పక్కనే ఓ రెండు మూడు ఐటీ కంపెనీలున్నాయిలెండి, చాయ్ త్రాగడానికి ఉద్యోగస్థులు ఆడా, మొగా బయట నుంచుంటూంటారు. అందులో చేతిలో సిగరెట్టు పట్టుకుని నుంచున్న ఓ జంట, నన్నూ, నా చేతిలో బకెట్టునీ చూసి నవ్వినట్టనిపించింది. నా దారిన నేను వెళ్ళిపోతే బాగుండేదిగా, పనేమీలేక, ఆగి వాళ్ళని అడిగాను.. ఎందుకు నవ్వుతున్నారూ అని. దానికి వాళ్ళిచ్చిన సమాధానం.. That bucket in your hand looked a bit odd..uncle.. అన్నారు. నిజమేకదా, కారుల్లో ఎవరికీ కనిపించకుండా, చీపుళ్ళూ, బకెట్లూ తీసికెళ్ళొచ్చుకానీ, మరీ ఇలా పబ్లిగ్గా బకెట్లూ అవీ మోసుకెళ్తే odd గానే కనిపిస్తాయి మరి. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటీ What looks odd today, may be tomorrow’s fashion.. who knows, everybody may carry a bucket..అనగానే వాళ్ళూ నవ్వేసి, నిజమే అంకుల్ అని ఒప్పుకుని, చాయ్ ఆఫరు చేశారు.

    దీనితో అయిపోతే బాగుండేదిగా, ఇంకో రోజు రెడ్ లేబుల్ చాయ్ తీసికుంటే, దానిమీద Rs 10 off అని పెద్దపెద్ద అక్షరాలతో వ్రాసుంది. బిల్లింగయిపోయి ఇంటికి వచ్చేసిన తరువాత చూశాను, MRP ఎంతుందో అంతా వసూలు చేశాడు, నాకు రావలసిన 10 రూపాయల డిస్కౌంటు ఇవ్వలేదు. చెప్పెనుగా కొన్నిటిలో ఊరుకోలేను, దానికి పాతచింతకాయపచ్చడి అనుకోనూవచ్చూ, ఓ పదిరూపాయలకోసం ఇంత గొడవా అనికూడా అనుకోవచ్చు. నిజమే ఉత్తి పదిరూపాయలకోసమూ, ఓ ఉచిత బకెట్టుకోసమూ పెట్రొల్ ఖర్చుపెట్టి వెళ్ళడం అవసరంలేదు, కానీ ఇంటిపక్కనే ఉండే కొట్లలోకి, మళ్ళీ వెళ్ళి అడగడంలో తప్పేమీ లేదనే నా అభిప్రాయం. చివరకి ఆ రిలయెన్స్ మార్టు కి వెళ్ళి, నా రసీదు చూపించి, నాకు రావాల్సిన పది రూపాయలూ తీసికున్నాను.

    సర్వే జనా సుఖినోభవంతూ…

Advertisements

8 Responses

 1. మీరు చాలా ఓపిక గలవారని ఒప్పుకుంటున్నాం.

  Like

 2. గురువు గారూ మీకు చాలా ఓపిక సార్.
  మేము (మా రూం మేట్స్ తో సహా) అసలు బిల్స్ చక్కగా పెట్టుకునే అలావటు లేదు.
  అలా బిల్స్ లేకపోవటం వల్ల మేము కొంచం నష్టపోయాం 🙂

  కానీ… మీకు చాలా ఓపిక గురువు గారూ… !

  చందు

  Like

 3. ఛాలా బాగున్ది ఫణి గారు.

  Like

 4. మనకు చెంద వలసింది ముక్కు పిండైనా వసూలు చెయ్యాలంటారు. నిజమే.

  Like

 5. కిసోర్ వర్మ గారూ,

  ధన్యవాదాలు..

  శ్యామలరావు గారూ,

  ఓపిక అని కాదూ.. ఊరికే ఎందుకు వదులుకోడమూ అని.. పైగా పనేమీ లేదుగా.. అదో కారణం…

  చందూ,

  పైన చెప్పినట్టుగా, ఓపిక అని మరీ పొగిడేయకండి. పనీ పాటూ లేకపోతే ఇలాటివి చేస్తూండడం.. అదో కాలక్షేపం…

  రమణ శర్మగారూ,

  ధన్యవాదాలు..

  డాక్టరుగారూ,

  నిజమే కదా ..ఎందుకు వదులుకోవాలి?

  Like

 6. ఒక బకెట్టు కధ – సినిమా గా తీస్తే పోలా.

  Like

 7. చివర్లో మంచి నీతి కూడా ఉంది:-)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: