బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    పాత ఆంధ్రపత్రికలు దొరకడంతో వాటిని చదివి ఆస్వాదించడంతోనే సరిపోతోంది. వాటికి సాయం ఇంకో లింకు దొరికింది. మిగిలిన వార,పక్ష, అర్ధసంవత్సర,సంవత్సర పత్రికలు అన్నిటి లింకూ.ఇన్నిన్ని మృష్టాన్నాలు ఎదురుగా పెట్టుకుని, టపాలు వ్రాద్దామంటే తీరికుండొద్దూ. గోతెలుగు.కాం వారి ధర్మమా అని, ఇప్పటిదాకా పంపిన నాలుగు వ్యాసాలు ప్రచురించారాయే, దానితో ప్రతీవారం ఒకవ్యాసం వ్రాస్తే బాగుంటుందని భావించాను. తెలుగు బ్లాగులోకంలో నా వ్రాతలు చదివి చదివి ఎలాగూ బోరుకొట్టేసుంటుంది. ఎందుకంటే ఎప్పుడుచూసినా ఒకే మూసలో(monotonous) ఉన్నట్టు అనిపించుంటాయి. ఏం చేయనూ మరీ, నాకొచ్చిన భాష ఆమాత్రమే.

    ఈ పాతపత్రికలు download చేయడం మూలాన, ప్రస్తుతం ఏమౌతోందంటే, మా ఇంటావిడ కంప్యూటరు ముందర కూర్చోడం ఎక్కువైపోయింది. ఇదివరకు ఏదో మెయిల్స్ చూసుకోడానికైనా కూర్చుంటూండేవాడిని. ఈమధ్యన ఓ కొత్త ఫోను ఒకటి కొనుక్కున్నానులెండి, దానితో పనైపోతోంది. ( మీరు అడిగినా అడక్కపోయినా, కొత్త ఫోను సంగతి మీతో చెప్పడం అన్నమాట !!). ఆమధ్యన బస్సులో వెళ్తూంటే, రష్ గా ఉండడంతో, ఇరుకులో నుంచోవలసొచ్చింది, తీరా బస్సు దిగిన తరువాత చూసుకుంటే, నా సంచీలోని కెమేరాకాస్తా, ఎవడో కొట్టేశాడు.దీనితో ఈనెల ఓ సెల్ ఫోనూ,ఓ కెమేరా కొత్తవి కొనుక్కోవాల్సొచ్చింది. ఏదో ఆదివారంనాడు, వారఫలాల్లో “వృశ్చిక రాశి వారికి ఈ వారంలో నూతన వస్తువులు లభిస్తాయీ” అంటే, ఎవరైనా ఇస్తారేమో అనుకున్నా కానీ, మరీ ఇలా నాకునేనే కొనుక్కుంటాననుకోలేదు ఏం చేస్తాం, ఇదివరకటిరోజుల్లో అయితే నానా హడావిడీ చేసేసేవాళ్ళం ! కానీ ఈమధ్యన బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాల్లో చెప్పినట్టు– ” ఆ భగవంతుడు నాకు ఓ వస్తువు ఇచ్చాడు,ఇచ్చినందుకు సంతోషించాలి, అలాగే, నా ముచ్చట తీరినతరువాత, అదే భగవంతుడు, ఆ వస్తువుని ఇంకోడిని సంతోషపెట్టడానికి తిరిగి తీసేసికున్నాడు..”– ఏమో నాకైతే ఈ concept నచ్చింది.అలాగని ప్రతీ వస్తువూ పోగొట్టుకోమని కాదూ, దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా ఏ విలువైన వస్తువైనా పోగొట్టుకున్నా, మరీ ఇల్లూ వాకిలీ ఏకంచేసేసి, ఏడుపులూ, రాగాలూ పెట్టేయఖ్ఖర్లేకుండగా ఇలా సద్దిచెప్పేసుకుంటే బాధ కొద్దిగా dilute అవుతుందేమో !! ఇలాటివన్నీ మనమధ్యలోనే ఉండాలనుకుంటాను, పిల్లల ( అంటే స్కూలుకీ, కాలేజీకీ వెళ్ళేవారు) ఎదురుగా ఇలాటివి చెప్తే ఒక్కొక్కప్పుడు boomerang అయినా అవొచ్చు. ఏదైనా పోగొట్టుకున్నా, వాళ్ళు ఏం ఫరవాలేదూ, మన నాన్న ఫిలాసఫీ మనకు తెలుసుగా, ఏమీ బాధపడరులే, పైగా మనమీద కాకుండగా, దేవుడిమీద పెట్టేసినా పెట్టేయొచ్చు అని వాళ్ళు భావించినా ఆశ్చర్యపడఖ్ఖర్లేదు ! ఎందుకంటే ఈ కాలాప్పిల్లలు ఆవలిస్తే పేగులు లెఖ్ఖెట్టేస్తారు ! అందుచేత నేను చెప్పిన ఫిలాసఫీ కడుపులోనే దాచుకోండి...

    మా ఇంటావిడ ప్రతీనెలా వాళ్ళ ఫ్రెండ్సందరూ కలుస్తారని చెప్పేనుగా. ఏదో నెలకింతా అని వేసికుని, ప్రతీనెలా ఓ చిట్ తీసి డబ్బులు ఏకమొత్తంగా ఎవరోఒకరికి పంచుకుంటూంటారు. పోనీ ఈ విధంగానైనా కొద్దిగా డబ్బులు సేవ్ అవుతున్నాయిలే, అనుకుని క్రిందటి పదిపదిహేను సంవత్సరాలుగా ప్రతీనెలా కొంతమొత్తం exclusively దీనికోసంతీసికుంటూంది. ఏదో ఇన్నాళ్ళూ ఎలాగోలా కానిచ్చేశాము. కానీ ఇప్పుడు ఎక్కడచూసినా “నగదు బదిలీ” పథకాలుకదా. రొక్కంగా పుచ్చుకోడం బాగోలేదట ! మీరు ఇచ్చేదేదో నా ఎకౌంటుకి ‘బదిలీ’ చేసేస్తూండండి. నేను నెట్ లో మీరు బదిలీ చేసేరో, ఎగ్గొట్టేరో చూసుకుంటాను, అని ఓ ప్రకటన చేసేసింది. మరి నెట్ బ్యాంకింగోటుండొద్దూ, దానికోసం ఈవేళ బ్యాంకుకి వెళ్ళి ఆ పనేదో పూర్తిచేసికున్నాం. ఏమిటో రోజులు మారిపోయాయండి, పెద్దవాళ్ళు చెప్పింది, verify చేసికుంటేనే కానీ నమ్మడంలేదు.ఏం చేస్తాం కాలంతో పాటు మనమూ మారాలి…

%d bloggers like this: