బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– L…o…n..g… Drive…

    ఇదివరకటి రోజుల్లో బస్సులు పట్టుకుని, రేవు దాటి రాజమండ్రియో, కాకినాడో దూరం ఓ వందకిలోమీటర్లకి తక్కువే అయినా, అయిదారు గంటలు పట్టేది. తెల్లవారుఝామున బయలుదేరి, గమ్యం చేరేటప్పటికి నిస్త్రాణ వచ్చేసేది. బహుశా ఆ ఇరుకిరుకు బస్సుల్లో ప్రయాణం చేయడం మూలానేమో. అదే ఓ పేద్ద long drive అనుకునేవాళ్ళం. వందకీలోమీటర్లూ ఓ దూరమేనా అని ఈ రోజుల్లో అనిపిస్తోంది. వారాంతం వచ్చిందంటే చాలు, ఈ కాలప్పిల్లలకి ఓ రెండు మూడు వందల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేస్తేనే కానీ, long drive చేసినట్టనిపించదుట ! పైగా వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఆ వర్షంలో వెళ్ళడమే జీవితపరమావధి అనుకుంటూంటారు. ఏమిటో ఎవరి సరదా వాళ్ళకానందం. ఆ వర్షంలో కారులో వెళ్తూన్నంతసేపూ, నాకైతే ప్రాణాలు గుప్పెట్లోనే ఉంటాయి. హాయిగా ఇంట్లో కూచోక, ఎందుకొచ్చిన ప్రయాణాలూ ఇవీ అనిపిస్తుంది. బహుశా అది వయస్సుతో వచ్చిన భయం కావొచ్చు.దానితో మా పిల్లలు ఇలా వారాంతాల్లో వెళ్ళే ఈ లాం…..గు….డ్రైవులకి నేను సాధ్యమైనంతవరకూ వెళ్ళను. దానికి సాయం, అంతంతసేపు కాళ్ళు కదలకుండగా కూర్చోడం కూడా ఒక సమస్య. అన్నిటికీ తోడు నాకు అంత aesthetic sense కూడా తక్కువే. ఈ ప్రకృతులూ, గొడవల్లో నాకేమీ చిత్రవిచిత్రాలు కనిపించవు. చెప్పేనుగా ఎవరి పిచ్చి వాళ్ళకానందం, బయటకు వెళ్ళకపోవడం నాకున్న పిచ్చి ! బయటకు వెళ్ళాలనుకోడం పిల్లలకి సరదా. అలాగని నేనేమీ spoil sport అవడానికీ ఇష్టపడను. మా ఇంటావిడకి ఈ ప్రకృతులూ, అందాలూ, ఆస్వాదించడాలూ అంటే చెవి కోసుకుంటుంది. మా పిల్లలకీ తెలుసు, అందుచేత ఇలాటివాటికెప్పుడైనా వెళ్ళేమాటైతే తనకే ఫోనుచేస్తూంటారు.ఇదండి కథ..

    మొన్న శనివారంనాడు, అబ్బాయి ఫోనుచేశాడు as usual వాళ్ళమ్మకే, “భీమాశంకర్” వైపు వెళ్తున్నామూ, వస్తారా అని. భీమాశంకర్ అనగానే, ” మీ నాన్నగారు కూడా వస్తారేమో అడుగుతానూ..” అని ఆ ఫోను కాస్తా నాచేతిలో పెట్టేసింది. మళ్ళీ నాన్నగారితో లేనిపోని commitment ఎందుకూ అనుకున్నాడేమో, అటువైపు వెళ్తున్నామూ, దైవ దర్శనం వీలునిబట్టి చేసుకోవచ్చూ, రద్దీ అదీ ఉంటే వీలుకావకబోవచ్చూ అని. పోనిద్దూ, ఏదైతేనెం, ద్వాదశజ్యోతిర్లింగం గా ప్రసిధ్ధికెక్కిన భీమాశంకర్ దేవాలయపు గాలి తగిలినా చాలూ అనేసికుని నేనూ వస్తానూ అన్నాను.చెప్పేనుగా, బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాలు విని, విని ఆయన చెప్పినట్టు శిఖరదర్శనం కూడా పుణ్యంలోకే వస్తుందీ అనుకుని, పైగా రోజంతా పిల్లలతో రోజంతా గడపొచ్చూ అని ఓ bonus ఒకటాయె. బయలుదేరాను.

    ప్రొద్దుటే తొమ్మిదింటికి బయలుదేరాము. 200 కిలోమీటర్లలోపే. మహా అయితే నాలుగైదుగంటలు. ఈ లాంగు డ్రైవులంటే ఊరికే ఏదో పేద్ద పనున్నట్టు వెళ్తే మజా ఉండదనుకుంటాను. దారంతా కొండలూ, లోయలూనూ. పైగా వర్షాకాలమొకటీ, మా పిల్లలందరూ జలపుష్పాల్లాటివారూ, ఎక్కడ నీళ్ళు కనబడితే అక్కడే ఆగిపోవడం, ఆ నీళ్ళల్లో ఓసారి ఆడుకోడం, రోడ్డువారనే కొండల్లోంచి చిన్నచిన్న జలపాతాలూ, వాటిని చూసినప్పుడల్లా వావ్..వావ్.. అరుపులూ, కేకలూ ఎక్కడో మధ్యలో ఒకచోట ఆగి అందరూ బయటకెళ్ళారు. నేను మాత్రం కారులోనే ఉండిపోయాను, అంత ఓపిక లేక. చేతిలో అప్పుడెప్పుడో మా అమ్మాయీ, అల్లుడూ ఇచ్చిన Tab ఒకటోటుందిగా, దానితో ఫొటోలు తీద్దామూ అనుకుని కారు బయటకు వచ్చి నిలబడి, టక..టకా నొక్కేసుకుంటూ ఫొటోలు తీయడం మొదలెట్టాను. బయట అంత వెలుగుండడంతో ఆ Tab లో కెమేరా అంటే తెరుచుకుందికానీ, ఫోకసింగూ గట్రా కుదరలేదు.ఓ పదిపదిహేనుదాకా నొక్కేను.

    కారులోకి వెళ్ళి, అన్ని ఫొటోలు తీశానే మన ఘనకార్యం చూసుకోవద్దూ, అనుకుని తీరా ఆ Gallery లోకి వెళ్ళి చూస్తే ఏముందీ, నామొహం !! జరిగిందేమిటయ్యా అంటే, ఆ Tab లో Back బదులుగా Front కెమేరాలో పెట్టి తీసేశానన్నమాట. ఇలా ఉంటాయి తెలివితేటలు ! తెలియకపోతే నోరుమూసుక్కూర్చోవచ్చుగా, అబ్బే ఫొటోలైనా తీసి నా ప్రకృతిసౌందర్య అభిమానాన్ని చాటుకుందామనుకుంటే నా నిర్వాకం ఇలా తగలడింది. వాటిని చూస్తే మా మనవడు అగస్థ్య కూడా వేళాకోళం చేసేస్తాడు… ఆ ఫొటోలన్నీ delete చేసి, మచ్చుకి ఒకటిమాత్రం ఉంచి, పిల్లలకి కూడా తెలియొద్దూ మరీ, పైగా వాళ్ళకీ ప్రయాణమంతా నవ్వుకోడానికి ఓ కాలక్షేపం కూడానూ… మీరుమాత్రం ఏం తక్కువా? మీరూ నవ్వుకోండి…bhimasankar 002

   నా నిర్వాకం అంతా విని వాళ్ళంతా ఆకలికూడా మర్చిపోయి నవ్వుకోవడమే. “ఎందుకొచ్చిన హైరాణా మీకూ ..” అని మా ఇంటావిడ తీసిన ఫొటోలు …1_photo0098bhimasankar 003IMG_20130713_155125

    దారిపొడుగునా విపరీతమైన వర్షం, visibility అన్నదే లేదు, పైగా మేఘాల్లో ప్రయాణం, ఎదురుగుండా కారులోవాడు వేసే tail lamps ధర్మమా అని, మొత్తానికి ఏ హడావిడీ లేకుండగా భీమాశంకర్ చేరేటప్పటికి రెండయింది. విపరీతమైన రద్దీ, దర్శనం కోసం. ముందర అనుకున్నదే కదా, శిఖరదర్శనమే దక్కింది.తిరిగి బయలుదేరి సాయంత్రానికి పూణె చేరాము. ఇదండీ మా weekend l…o…n…g… drive కథా కమామీషూనూ…

%d bloggers like this: