బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ తీయని బాధ…

   ఎప్పుడో రెండున్నరేళ్ళక్రితం అమ్మమ్మలూ నాన్నమ్మలూ అని ఓ టపా పెట్టాను. అప్పుడైతే మా అనుభవాలు వ్రాశాననుకోండి, ఇప్పుడు తాజాగా ఇంకో ఇద్దరు కొత్త తాతలని చూసేటప్పటికి మళ్ళీ ఓ టపా పెడదామనిపించింది. అయినా ఈ అమ్మమ్మల్నీ, నానమ్మల్నీ ఎన్నిసార్లు గుర్తుచేసికుంటే సరిపోతుందీ? వాళ్ళ ఋణం ఎప్పుడూ తీర్చుకోలేము. ఆమధ్యన మా స్నేహితుల ఇంటికి వెళ్ళాము. వారికీ మధ్యన ఓ మనవడు వచ్చాడు. ప్రస్తుతం తనకి ఎనిమిది నెలలు.వాళ్ళ అమ్మా, నాన్నా ఆఫీసులకి వెళ్ళిపోతూ ఆ బాబుని వీళ్ళదగ్గర వదిలేసి వెళ్తూంటారు. వీళ్ళ పనల్లా సాయంత్రందాకా ఆ బాబుని చూడడం.ప్రపంచంలో ఎవరినైనా చూడొచ్చుకానీ, ఈ ఏడాది నిండకుండా ఉండే పిల్లలని చూడ్డం మాత్రం ఓ బ్రహ్మవిద్యే. పాపం అమ్మమ్మలో, నానమ్మలో చూసుకుంటూంటారు, తాతయ్యల పనల్లా, ఆ నానమ్మో, అమ్మమ్మో ఓసారి నడుంవాల్చినప్పుడు, వీడిమీద దృష్టిపెట్టడం.ఏదో పడుక్కున్నాడుకదా అని ఆవిడేమో నడుంవాలుస్తుంది, ఈ తాతయ్యగారు కూడా, “దానికేముందిలేవోయ్, కొద్దిగా రెస్టు తీసికో, నీ ఆరోగ్యంకూడా చూసుకోవద్దూ, నేను చూస్తాలే…” అని ఆశ్వాసన్ ఇచ్చేస్తాడు, వాడు ఎలాగూ నిద్రపోతున్నాడుకదా అని. పాపం ఆ పెద్దావిడ ఆరోగ్యం ఈయనే చూసుకోవాలిగా. అదేం మాయోకానీ, సరీగ్గా అప్పుడే నిద్రలేస్తాడు ఆ బాబు. ఏదో బజారుకెళ్ళి సరుకులు తెమ్మంటే తేగలడుకానీ, పిల్లలని ఊరుకోబెట్టడం ఎక్కడొచ్చూ ఈయనగారికి? తన పిల్లల్ని పెంచలేదా అని అడక్కండి, ఆరోజులు వేరు, ఆ energy levels వేరు. అయినా ఈ తాతలు చేసిన ఘనకార్యమేముందీ, ఆఫీసు పేరుచెప్పి ప్రొద్దుటినుండి, సాయంత్రందాకా ఆఫీసేగా. రోజంతా ఆ పిల్లల్నిచూసింది ఎవరమ్మా? ఈ నానమ్మ/అమ్మమ్మ ఆనాటి అమ్మ రోల్ లో.

ఎవరైనా ఈమధ్యన మా ఇంటికే రావడంలేదేమిటండీ అని అనడం తరవాయి, ఏమిటో తనే ఆ చిన్నపిల్లాడితో హైరాణ పడిపోతున్నట్టుగా ” మనవణ్ణి చూసుకోడంతోటే సరిపోతోందండీ.” అంటాడుకానీ, నిజం మాత్రం ఛస్తే చెప్పడు. అసలు శ్రమ పడిపోతున్న ఆ ఇల్లాలు ఒక్కమాటనదు, ఎందుకంటే, ఎంత శ్రమపడుతూన్నా, ఎవరికోసం, తను నవమాసాలూ కని పెంచిన తన ప్రతిరూపానికి ప్రతిరూపాన్నే కదా రోజంతాచూస్తూన్నదీ. ఇదికూడా ఓ శ్రమేనా అనుకుంటుంది.

ఈ కబుర్లన్నీ ఎప్పుడూ? తమతోటి అమ్మమ్మ/నానమ్మ/తాతయ్యలు వచ్చినప్పుడు. పుట్టింటారి కబుర్లు మేనమామ దగ్గరా అన్నట్టు, ఆ తాతగారు చెప్పేకబుర్లు ఎవరికి తెలియవు?ఎందుకంటే ఈ వచ్చిన తాతకూడా అలాటి కబుర్లు చెప్పినవాడేకదా. అయినా అదో సరదా, వాళ్ళు చెప్పకా మానరూ, వీళ్ళు వినకా మానరూ. ఇలాటి విషయాలు మరీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాట్టాడుకోలేరుగా. అవడం కనిపించడానికి చిన్నపనే అయినా, అందులో ఖర్చయ్యే man hours అలా చేసినవారికే తెలుస్తుంది. ఆ చిన్నపిల్లాడికి స్నానం పానం చేయించడానికి ఓ పనిమనిషుంటుందిలెండి, ఒక్కో కుటుంబంలో అయితే, వారి ఆర్ధిక స్థోమతను బట్టి, ఆడించడానిక్కూడా ఓ మనిషిని పెడతారు. కానీ మనుష్యులుంటే సరిపోతుందా? ప్రస్థుతం, ఒకే పనిమనిషున్న కేసు తీసికుందాం. ఆ స్నానమేదో చేయించి వెళ్ళిపోతుంది.పైన చెప్పినట్టుగా పిల్లాడూ, నిద్రా, నడుంవాల్చడాలూ లాటివుంటాయిగా, ఈ తాతగారికేమో రోజులో ఒక్కమారైనా బయటకి వెళ్ళకపోతే తోచదు. ఏదో వంకపెట్టి బయటకెళ్ళిపోయాడంటే, ఇల్లూ వళ్ళూ గుర్తుండవు. ఈ సంగతి పెద్దావిడకీ తెలుసు, ఎందుకు తెలియదూనలభైఏళ్ళ కాపరం !

ఈ తాతగారికేమో బయటకి వెళ్ళడానికే కుదరదు, దానితో ఆయనకి ఎక్కడలేని చిరాకూ వచ్చేస్తుంది.ప్రతీదానికీ విసుక్కోడం మొదలెడతాడు. అదే ఆ పెద్దావిడ, ఈ విషయం గుర్తించి ఓ గంట బయటకెళ్ళరాదూ అని ఎరక్కపోయి అందా, టింగురంగా అంటూ స్కూటరో, కారో వేసికుని పారిపోతాడు. అదే ఈ అమ్మమ్మ/నానమ్మల్లో ఉన్న గొప్పతనం. బ్రహ్మశ్రీ చాగంటి వారు తన ప్రవచనంలో చెప్పినట్టు, ఓ తల్లికి పదిమంది పిల్లలున్నా, పదకొండో బిడ్డ తన భర్తేట!
ఒకానొక స్టేజ్ లో భర్తనికూడా ఓ కొడుగ్గా చూసుకుంటుందిట!

సాధారణంగా రెండువైపులా grand parents ఉండడం లోకకల్యాణార్ధం చాలా మంచిది. ఆ పసిపిల్లాడికి మాటలొచ్చేదాకా, ఈ పెద్ద జంటలు వంతులు వేసికుని చూస్తూండాలి. ఇందులో కూడా అమ్మమ్మలు, నానమ్మలే ముఖ్యం. ఈ తాతలు buy one get one లోకే వస్తారు. వారివలన అంతగా materialstic ఉపయోగాలుండవు. ఎలాగూ ఒక్కడూ ఉండి ఏం చేసికుంటాడులే పాపం అని, ఆ పెద్దావిడే ఈయన్నికూడా తీసుకొచ్చేస్తూంటుంది.

ఇన్ని ” బాధలు” ఉన్నా అవన్నీ తీపి బాధలు గానే భావిస్తారు కానీ, ఏదో కష్టపడిపోతున్నామనిమాత్రం ఎప్పుడూ అనుకోరు.

హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి ప్రసంగాలు “మన తెలుగు” చదివే ఉంటారు, ఇప్పటిదాకా చదవకపోతే మాత్రం ఒక్కసారి చదివేయండి.మనతెలుగు

ఈవారం కూడా గోతెలుగు.కాం లో నా వ్యాసం త్రిశంకు స్వర్గం ప్రచురించారు.

%d bloggers like this: