బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ప్రతీదీ విమర్శించేయడమే…

    ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఇంకోరిని విమర్శించడం. మీ అందరిగురించీ అంటున్నాననుకోకండి. నా విషయమే చెప్తోంట. ఒక్కటీ చేతకాదు, అయినా సరే ప్రతీ దాన్నీ విమర్శించడమే.ప్రతీదానిమీదా అడిగినవాడికీ, అడగనివాడికీ అభిప్రాయం చెప్పేసేయడమే.పైగా ఏమైనా అంటే, వాక్ స్వాతంత్రం అనోటి. వాక్ స్వాతంత్రం ఉండాలి, కాదనం, కానీ దానికి లిమిట్ ఏమిటీ అన్నది కూడా ఆలోచించాలి అని, ఈసారి భాగ్యనగరంలో శ్రీ వంశీ గారు దర్శకత్వం వహిస్తూన్న సినిమా షూటింగు చూసి అర్ధం చేసికున్నాను. ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

    చెప్పేనుగా శ్రీవంశీ గారు మమ్మల్ని షూటింగు చేస్తున్న లొకేషన్ కే వచ్చేయమన్నారు.సరే అని తొమ్మిదిన్నరకల్లా చేరిపోయాము.అప్పటికే, అవేవో కెమేరాలూ అవీ పెట్టుకుని ఓ ఇంటికప్పుమీద ఇద్దరు ఆ ఎండలో వెయిట్ చేస్తున్నారు, షూటింగు ఎప్పుడు మొదలెడదామా అని.ఆరోజు పాల్గొనే ముగ్గురు అప్పటికే వేషధారణ చేసి, నీడలో కూర్చున్నారు.వీళ్ళంతా ఆ సినిమాలో నటించే హీరో కోసం వెయిట్ చేస్తున్నారు.వీళ్ళ హడావిడిలో వీళ్ళందరూ ఉండగా, శ్రీ వంశీ గారూ, ఎక్కడైతే షూటింగు జరుగుతోందో ఆ ఫార్మ్ హౌస్ యజమానురాలు గారూ, నేనూ, నా స్నేహితుడూ ఓ చెట్టుకింద సెటిలయ్యాము. పరిచయకార్యక్రమాలు పూర్తిచేసికుని, కబుర్లలోకి దిగేము. అంత ప్రఖ్యాత వ్యక్తి ని ప్రత్యక్షంగా చూసేసరికే, నా కడుపునిండిపోయింది, ఇంక కబుర్లెక్కడా?

    చివరకి వాతావరణం తేలికచేయడానికి శ్రీవంశీ గారే మొదలెట్టారు కబుర్లు, నా వివరాలూ, అసలు ఆయన్ని చూడాలని ఎందుకనుకున్నానో వగైరా..ఆయన సినిమాలకంటే, ఆయన వ్రాసిన పుస్తకాలు నాకు చాలా ఇష్టం. అదేమాటన్నాను ఆయనతో.అలాగని ఆయన సినిమాలు నచ్చవని కాదు.ఆ కబురూ, ఈకబురూ చెప్పుకుంటూ, శ్రీవంశీగారు మధ్యమధ్యలో హీరో రాక గురించి అడుగుతూ, మాకు నా కెమేరాలో ఫొటోలు తీయడానికి వారి స్టిల్ ఫొటోగ్రాఫర్ ని పిలవడమూ, ఆరారగా కాఫీ, కొబ్బరి నీళ్ళూ లాటివి ఆరగిస్తూంటే మొత్తానికి ఆ హీరో వచ్చారండి.

    అప్పటిదాకా మాతో బాతాఖానీ చెప్తూన్నటువంటి శ్రీ వంశీ గారు ఏక్ దం “రచయిత” లోంచి “దర్శకుడి” గా మారిపోయారు.ఇంక చూసుకోండి.. టేక్కులూ, కట్లూ..
ఎవరో ఫ్రేమ్ లోకి వస్తున్నారని అరుపులూ, కేకలూ .. ఫలానా పధ్ధతిలో రావాలని ఈయన చెప్పడమూ, ఓహ్.. ఓ జీప్పు రావడం షూట్ చేయడానికి మూడుసార్లు షూట్ చేయడం. ఏదో మొత్తానికి ఆ సీన్ పూర్తిచేసేయగానే, మిగిలిన టెక్నీషియన్లుఅందరూ బిచాణా ఎత్తేసి, అంటే కెమేరాలూ, ఎండపడ్డానికి రిఫ్లెక్టర్లూ, ఎండ మరీ ఎక్కువగా పడకుండా ఉండడానికి గొడుగులూ,వీటన్నిటినీ తీసికెళ్ళడానికి మనుష్యులూ, వీటన్నిటికీ సాయం, ఓ టీవీ మోనిటరోటీ. ఇదివరకటిరోజుల్లోలా కాకుండగా, దర్శకుడు విడిగా కూర్చుని, అక్కడ జరిగే షూటింగు–ఫ్రేమ్ సరీగ్గా ఉందా లేదా, డయలాగ్గు ఈయనకి కావలిసినట్టు “యాస” తో సహా ఉఛ్ఛరిస్తున్నారా లేదా, ముఖకవళికలు సరీగ్గా ఉన్నాయా లేదా చూసుకోడం, అన్నీ సరీగ్గా ఉంటే యాక్షన్.. కెమేరా..రోల్ ..అనడం.. మళ్ళీ ఆ ఉన్న ఇద్దరో,ముగ్గురో నటుల్లో ఎవరో ఒకరిది ఈయననుకున్నట్టుగా రాకపోవడం, ఇక్కణ్ణుంచి ఈయనేమో కట్..కట్..కట్.. అనడం.మళ్ళీ ఈయన అదేదో సరీగ్గాలేదూ, ఇదేదో సరీగ్గాలేదూ అని కరెక్టు చేయడం.. తను కావాలనుకున్నexpression వచ్చేదాకా టేక్కులూ, ..కట్లూ.. తోనే సరిపోయింది. మొత్తానికి అవి వచ్చేక ఫైనల్ చేయడం.

   ఓరినాయనో ఇంత హడావిడా మనం తెరమీద ఓ నిముషం వినే సంభాషణ వెనక్కాల జరిగే తతంగమా అనిపిస్తుంది. ఆ ఎండలో ప్రొద్దుటినుంచీ నుంచుని దర్శకుడి అంచనాప్రకారం చేయాలంటే ఎంత శ్రమ పడాలండి బాబూ? మేము చూసిన షూటింగులో ఇద్దరో ముగ్గురో, అదే ఏ నృత్యం అయినా షూట్ చేయడానికి, జూనియర్ కళాకారులూ వగైరాలందరూ ఉండాలి, వాళ్ళందరి హావభావాలూ synchronise అవాలి, ఎంత హడావిడీ. ఇంతంత శ్రమపడి, చెమటోట్చి ఓ సినిమాలో నటించి, ఇంత గొడవయి మొత్తానికి సినిమాని రిలీజు చేస్తారే, తీరా ఆ సినిమా చూసి, ప్రేక్షకులు తీర్పు చెప్పేస్తారు. ఫలానాది బాగోలేదూ, ఫలానాది ఇలా ఉంటే బాగుండేదేమో అంటూ.. నేను శ్రీ వంశీ గారితో అదేమాటంటే ఆయనన్నారూ, “ప్రేక్షకులకి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉంటుందండీ.. డబ్బులు ఖర్చుపెట్టి ఓ సినిమాకి వచ్చారంటే వారు ఆశించింది అందులో కనిపించకపోతే తిట్టరేమిటీ మరి?”

   “తను మొన్నే వెళ్ళిపోయింది” చిత్ర కథానాయకా, నాయిక లు అజ్మల్, నిఖితానారాయణ్ లతో నేను “దిగిన” ఫొటో...HYD 1405 027

%d bloggers like this: