బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…


   పోయినవాళ్ళెప్పుడూ అదృష్టవంతులే అన్న సూక్తి ఊరికే రాలేదు. మన సైనిక దళాల,మిగిలిన para military వారి ధర్మానా, రక్షింపబడి, డెహ్రాడూన్ దాకా రాగలిగిన యాత్రీకులు, నిన్న మన రాష్ట్ర రాజకీయనాయకుల వీరంగాలు చూసి, అసలు ఎందుకు బ్రతికున్నామురాబాబూ అనుకునుంటారు. అసలు వీళ్ళకి కవరేజ్ ఇచ్చిన మీడియావాళ్ళననాలి,కెమేరాలు ఉన్నాయి కదా అని, ఆ దెబ్బలాడుకునేవాళ్ళూ ఇంకా పేట్రేగిపోయారు. వీళ్ళా మనకి పాలకులూ అనిపిస్తుంది. అసలు విపత్తు జరిగిన స్థలాలకి వెళ్ళనే లేదు. ఏదో సురక్షితంగా ఉండే డెహ్రాడూన్ లో మొదలెట్టారు వీరి నాటకాలు. ఒక్క పార్టీ అనేమిటిలెండి, అందరూ అలాగే తగలడ్డారు. మన “భవిష్య” ప్రదానమంత్రి గారు మాత్రం తక్కువ తిన్నాడా, రక్షింపబడడానికి ప్రాధమిక eligibility గుజరాతీ అయుండాలిట. ఈయనేమో. మొత్తం దేశానికి ప్రధానమంత్రి అవాలని కలలు కంటున్నాడు.ఈవేళ ఇంకో బిజెపీ ప్రముఖనాయకుడు యశ్వంత్ సిన్హా కడిగిపారేశాడు.అసలు విపత్తులని రాజకీయం ఎందుకుచేస్తారో అర్ధం అవదు.ఏదో మన సైనిక బలాలు, ప్రాణాలకు తెగించి, అంత అద్భుతంగా, భాష,రాష్ట్ర, లింగ బేధం లేకుండగా అంతలా రాత్రనకా, పగలనకా శ్రమపడుతున్నారే, ఈ దౌర్భాగ్య రాజకీయనాయకులకి, కనీసం నోరుమూసుకుని కూర్చోవాలనైనా ఎందుకు తట్టదో?

    ఇప్పుడిప్పుడే ఉత్తరాఖండ్ లో జరిగిన “the day after” కథలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ఓమూల ఇంత ఘోరవిపత్తు జరిగి ప్రాణాలు పోగొట్టుకున్న మృతదేహాలనుండి, ఆభరణాలు ఒలిచేస్తున్నవారు కొందరూ, వ్రేలి ఉంగరాలు రాకపోతే, ఏకంగా ఆ వ్రేలినే కోసేసిన దృశ్యం చూస్తూంటే గుండె బేజారెత్తిపోయింది. ఇంక సాధూ సంతుల విషయం అడక్కండి. దోచినంత సొమ్ము దోచుకున్నారు, వారి యోగం బాగోక పట్టుబడిపోయారు. సహాయ కార్యక్రమాలకి వాడుతున్న ప్రెవేట్ హెలికాప్టరు యాజమాన్యం ఒకడైతే ప్రభుత్వం ఇస్తూన్న దానికంటే, ఎక్కువ అడగడం ఎంతో విచారకరం. అందరి రంగులూ ఇప్పుడు బయటపడతాయి. ఎవడికి వాడే దొరికినంత దోచేసికుంటున్నారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలోటీ. ప్రతీవాడూ, సహాయనిధి ప్రారంభించేవాడే, అది ఉత్తరాఖండ్ వరదబాధితులకా, లేక స్వంతానికా అన్నది ఆలోచించాల్సిన విషయం.

    ఈవేళ అదేదో చానెల్ లో విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరుగుతూన్న “అరాచకాల” గురించి ఒక రిపోర్టు చూస్తూంటే, ఆ గుడిలో పూజలు చేయిస్తున్న పూజారుల మీద ఉండే గౌరవం మంటకలిసిపోతుంది. అసలు వాళ్ళకి సెల్ ఫోన్లు ఎందుకంట? ఏ దేవాలయానికి వెళ్దామన్నా ఏదో ఒక గొడవే. హాయిగా ఇంట్లోనే కూర్చుని దేవుణ్ణి పూజించుకుంటే హాయనిపిస్తోంది. బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పనే చెప్పారు, భౌతిక పూజ కంటే మానసిక పూజ ఎంతో ముఖ్యమని!

    ఏదో పేపర్లలో చదువుతూ, ధరలు పెరిగిపోయాయీ అంటే ఏమో అనుకున్నాను. మార్కెట్ లో “అల్లం” ధర కిలో రెండువందల రూపాయలు. చిన్నప్పుడు ఏ దగ్గో , జలుబో వచ్చిందంటే అల్లపురసం ఇచ్చేవారు. ఆరారగా నోట్లో వేసికుని చప్పరించడానికి అల్లపుమురబ్బా చేసేవారు. అంటే ఇటుపైన “అల్లం పెసరట్టు” luxury item అయిపోయిందన్నమాట ! కొత్తిమిర కట్ట 40 రూపాయలు ! అంటే అదేదో garnishing అంటారు, అవన్నీ బంధ్ అన్నమాట ! క్రమక్రమంగా అన్నీ “చరిత్ర” లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంక మిగిలిన వాటి గురించి అడగఖ్ఖర్లేదనుకోండి.

    ఇదివరకటి రోజుల్లో అంటే నాలాటివాళ్ళు చదువుకునే రోజుల్లో 60% వచ్చిందంటే, ఏదో ఘనకార్యం చేసేమనుకునేవాళ్ళం. అలాగని నాకువచ్చాయని అపోహ పడకండి. నేను moderation లో పాసవడానికే ప్రాణం మీదకొచ్చింది ఈవేళ న్యూస్ లో చెప్పారు- ఢిల్లీలో 12th క్లాసు పూర్తయిన తరువాత, కాలేజీల్లో చేరడానికి cut off marks 100% ట ! ఓరినాయనోయ్ మార్కెట్ లో ధరల్లాగ, వీటిల్లో కూడా inflatioనే !!

   మేరాభారత్ మహాన్…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: