బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు మనకి సంతృప్తి అనేది ఉంటుందా…


    ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది, మనకి జీవితంలో అసలు సంతృప్తి అనేది ఉంటుందా అని. ఫలానాది ఉందంటే, ఇంకోటేదో లేదని గోల.ఎవడో ఏదో చేయలేదో అని గోల. ఇంకోడికేదో ఎక్కువగా ఉందని గోల.ఇలా చెప్పుకుంటూపోతే ఈ గోలలకి అంతనేది ఉండదు. అయినా ఆ గోలలన్నీ లేకపోతే ఈపాటికి మహాత్ములైపోయేవాళ్ళం కదూ! అందుకేనేమో ప్రపంచంలో ఏ కొద్దిమందికో తప్పించి, మిగిలినవారందరికీ ఆ భగవంతుడు అలా చేసేశాడేమో.ఇలా ఆలోచించడానికి ముఖ్యకారణం, ఈమధ్య పగలనకా, రాత్రనకా ఆస్వాదిస్తూన్న బ్రహ్మశ్రీ చాగంటివారి ప్రవచనాలేమో.ఆయన చెప్పినట్టుగా, మనం ఆలోచించే పధ్ధతినిబట్టే ఉంటుందనుకుంటాను.

    ఉదాహరణకి ఈమధ్యన “దేవభూమి” అనబడే ఉత్తరాంచల్ లో సంభవించిన ప్రకృతివైపరీత్యం. ఏ ప్రభుత్వమూ కావాలని చేసింది కాదు. It was definetely a major disaster. అందులో సందేహమేమీ లేదు.మనం ప్రతీరోజూ పూజించే దేవుళ్ళందరూ అక్కడే ఉండడం ధర్మాన, దేశంలోని ఎక్కడెక్కడినుంచో శ్రధ్ధాళులు, దైవదర్శనం చేసికోడానికి వేసవికాలం ముగుస్తూండగా అక్కడకి చేరుకుంటారు. వర్షాలు మొదలయ్యే లోపల, యాత్ర పూర్తిచేసికుని, ఇంటికి చేరుకోవచ్చని. మళ్ళీ శీతాకాలం వచ్చేసరికి ఆ దేవాలయాలు మూసేస్తారు.

    ఈ సంవత్సరం చెప్పాపెట్టకుండా వర్షాలు ఓ వారం పదిరోజులు ముందుగా ప్రారంభం అయి, ఓ ప్రళయంలా ముంచుకొచ్చేశాయి. ఇదేమైనా “ముందస్తు ఎన్నికల” లాగ ప్రభుత్వం వారేమైనా ఆహ్వానించారా? ప్రళయం వచ్చింది, దారిలో ఉండేప్రతీదానినీ తుడిచిపెట్టుకు పోయింది. దురదృష్టంకొద్దీ, అందులో ఓ ఆరవైవేల యాత్రికులు చిక్కుపడిపోయారు. అక్కడ యాత్రీకులు పడ్డ కష్టాలు ఊహించుకోవచ్చు.చాలా బాధలు పడుంటారు, ఇంకా పడుతూనే ఉండుంటారు. ఇంతదూరంలో ఉండి, చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ పడినప్పుడే కదా తెలిసేదీ.Its true.

   ఈ విపత్తు సంభవించిందని తెలిసేసరికే రెండురోజులు పట్టింది. ఇంక తెలిసినప్పటినుండీ, నెత్తిమీద తలున్న ప్రతీ తెలుగు చానెల్ వాడూ, వాళ్ళే అంతా చేసెస్తున్నట్టూ, ముందుగా వాళ్ళకే ఈ విపత్తుగురించి తెలిసినట్టూ, వాళ్ళే ఈ rescue operations చేస్తున్నంతగా హోరెత్తించేశారు. ఆ యాత్రీకుల్లో తెలుగువారు తప్పించి, ఇంకోరెవరికీ ఆపదే సంభవించలేదన్నట్టూ హడావిడి చేశారు.కానీ చిక్కుకున్న 60000 మంది యాత్రీకుల్లోనూ తెలుగువారు 3000 మంది. యాత్రలకు వెళ్ళేవారిలో చాలామంది వయోవృధ్ధులే ఉంటారు. మహా అయితే వారితో వెళ్ళిన వారిలో ఏ కొంతమందో చిన్నవారైఉంటారు. మరీ పసిపాపలని తీసికుని వెళ్ళరుగా. వయస్సు పెరిగేకొద్దీ, ఆరోగ్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయనేది ఒప్పుకోవలసిన నిజం.ఇన్ని ప్రతికూల పరిస్థితుల్నీ తట్టుకుని యాత్రలకి వెళ్ళారంటే ఆ భగవంతుడిమీద ఉండే భక్తీ విశ్వాసమూనూ.

    వచ్చిందేమీ మామూలు తుంపరలాటిది కాదు. టీవీల్లో చూస్తూంటే తెలిసింది, పక్కా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.వంతెనలు కూలిపోయాయి. రోడ్లు నామరూపాల్లేకుండా మాయమైపోయాయి. ఇదేమైనా మాములు ఉపద్రవమా? ఇలాటి విపత్కర పరిస్థుతుల్లో rescue operations చేయడానికి,మన సేన, వాయుదళం, ITBP, ఇంకా ఎంతమందో ముందుకువచ్చి, వారు చేయగలిగినంతా చేసి, ఎంతోమంది ప్రాణాలు రక్షించారనడంలో సందేహం లేదు. ఈ Rescue teams వారికి కష్టంలో ఉన్నవారిని సురక్షితప్రాంతానికి తరలించడమే ధ్యేయం. ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువమందిని రక్షించగలిగారనేదే ముఖ్యం.అంతేకానీ, ఈ సురక్షితప్రాంతానికి వచ్చిన తరువాత, “మమ్మల్ని ఇక్కడ పడేశారూ తెచ్చీ..” అనడం భావ్యం కాదు. ఎందుకంటే గత నాలుగురోజులనుండీ మన చానెళ్ళవాళ్ళు అక్కడి survivors తో చేస్తూన్న ఇంటర్వ్యూలు చూస్తూంటే అలాగే అనిపిస్తోంది. ఇక్కడ పడేశారూ అంటున్నారుకదా, అలా కాకుండగా అక్కడే దిక్కూదివాణం లేకుండా, వదిలేసుంటే ఏమయ్యేదిట? జరిగినదానికి భగవంతుడికీ, ఆ rescue teams కీ కృతజ్ఞత చెప్పుకోడంపోయి, ఇలా అనడం బాగోలేదు.

   TV visuals లో చూశాము, రోడ్లూ, వంతెనలూ లేనిచోట పెద్దపెద్ద తాళ్ళకి వేళ్ళాడతీసి రక్షించడం, కొన్నిచోట్ల హెలికాప్టరు ద్వారా రక్షించడమూనూ. ఇంక అన్నపానాదులంటారా, అక్కడ ఏదిదొరికితే అదే పెడతారుకానీ, మాకు మడికట్టుకుని పప్పూ, కూరా పులుసూ వేసి పెట్టాలంటే కుదురుతుందా? బ్రెడ్డు దొరికితే అదీ, లేకపోతే చపాతీలూ. ఇక్కడ కడుపునిండడం ముఖ్యం కానీ రుచీ పచీ కాదు. ఇంకో సమస్య భాష. మనలో చాలామందికి హిందీ రాదూ, వాళ్ళుచెప్పేది వీళ్ళకి అర్ధం అవదూ, వీళ్ళభాష వాళ్ళకర్ధం అవదూ. అన్ని పరిస్థితులూ బావున్నప్పుడు యాత్రలు చేయడం సులభమే. ఆ ట్రావెల్స్ వాడే చూసుకుంటాడు.

    మన చానెళ్ళవాళ్ళు post mortem ల బదులు, జరిగిన సహాయకార్యక్రమాల గురించి చెప్పుంటే బావుండేదేమో. అన్నిటిలోకీ చిత్రం ఈవేళ ఓ చానెల్ వాడు చెప్పేది విని నవ్వొచ్చింది. ఎడాపెడా ఆనకట్టలు కట్టడం వలన వచ్చిందిట అసలు ఈ విపత్తు అంతా. కట్టకపోతే కట్టలేదో అని గోల. కడితే ఎందుకు కట్టారూ అని గోల.ప్రజలందరికీ కావాల్సిన విద్యుఛ్ఛక్తి ఎక్కణ్ణించి తెస్తారుట? న్యూక్లియర్ ప్లాంట్లు పెడితే ఓ గొడవ, అలా కాకుండా coal based పెడితే ఇంకోగొడవ. కాదూకూడదూ గ్యాస్ తో తయారుచేద్దామా అంటే ఆ గ్యాసిచ్చేవాడు లేడాయె.

    సమస్యలనేవి ఎప్పుడూ ఉండేవే. కానీ సంతృప్తి అనేది ఉండకపోతే మనుగడే కష్టం అయిపోతుంది.

6 Responses

  1. నా స్నేహితుడు (.D.S.R.Krishnayya) శ్రీరామకృష్ణయ్య వెళ్ళేరు. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియలేదు.

    Like

  2. mana sree ఆది శాక్రచార్యులు మన అంతరించి పోతున్న సనాతన ధర్మాన్ని పునర్ధరించడం కోసం ఈ చార్ దం యాత్ర సూచించారు దేవా భూమి ఉత్తరాఖండ్ 80 శాతం మంది ఉద్యోగం కోసం వలస వస్తారు మిగతా వృద్దులు స్త్రీ లు పిల్లలు ఉంటారు వీరికి మన లాంటి యాత్రికుల డబ్బు 30 శాతం ఉపాదిగా అందుతుంది ప్రకృతి ని అంచనా వెయ్యడం లో మనం చాల పోరాపడుతున్నాము విపతు విపతేతే బాదితుల కు ఎడిన్ సయం చెయ్యగలిగే స్థితి లో మనం ఎవ్వరవం లేము శివాయ భగవంతుని ప్రార్ధించడం తప్ప

    Like

  3. మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను.మెడికల్ టీములకు నాయకత్వం వహించడం వల్ల అందులో ఇబ్బందులునాకు అనుభవమే.విమర్శించడం సులువే.నిర్వహణే కష్టం.అమెరికాలో కూడా ఇంతకన్న గొప్పగా చెయ్యలేదు.(శాండీ తుఫాను,న్యూఆర్లియన్స్ ముంపు సమయాల్లో ).మన ఆంధ్రప్రదేశ్ కొన్ని గుణపాఠాలు నేర్చుకొన్నతర్వాత ఇప్పుడు సహాయకార్యక్రమాలు అందించడం streamline చేసిందని తెలిసినవారు చెప్తారు.త్వరలో చార్ ధాం బాధితులందరూ సురక్షితంగా ఇళ్ళకి చేరుకొంటారని ఆశిద్దాము. ఐతే ఒకసూచన; ప్రతి రాష్ట్రంలోను ప్రకృతివైపరీత్యాలని ఎదుర్కోడానికి సిద్ధంగా నిధిని,పరికరాలని,బృందాలని ఏర్పాటుచేసుకుంటే మంచిది.(disaster management fund and teams ) .

    Like

  4. శర్మగారూ,
    మీస్నేహితులు క్షేమంగానే ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం….

    ఉమాబాలు గారూ,

    భగవంతుడిని ప్రార్ధించడం ఒక్కటే మనం చేయగలిగింది…

    రమణారావుగారూ,

    అక్కడ బాధలు పడి ఏదోవిధంగా బయటపడ్డవారు తమ ఇంటర్వ్యూలలో అన్నమాటలలో తప్పేమీలేదు. కారణం వారు పడ్డబాధ గట్టుమీదుండేవారు పడలేదుగా.
    వచ్చిన సమస్య ఏమిటంటే, వారు ఇంటర్వ్యూలలో చెప్పినదానికి, మన చానెళ్ళవాళ్ళు, తమ స్వంత పాండిత్యం జోడించి టీకా తాత్పర్యాలు చెప్పడం. మీరు అన్నట్టు, ఎటువంటి సహాయ కార్యక్రమాల్లోనైనా ఇటువంటివి తప్పవు. మీరు సూచించిన టీమ్ములు ఉన్నాయి,కానీ వారు సిధ్ధంగా ఉండరు. ఇలాటి విపత్తులు సంభవించినప్పుడు బయటపడిపోతూంటారు.

    Like

  5. మీరన్నదీ నిజమే.బాధలు పడ్డవారికి తెలిసినట్లు పైనున్నవారికి ఎలా తెలుస్తుంది?ఏమైనా,గుణపాఠాలు నేర్చుకొని ఎప్పుడూ,disaster management ని రాష్ట్రాలూ,కేంద్రమూ improve చెసుకుంటూ ఉండటమే సరియైన మార్గం.స్థానికప్రజలు కూడా సహాయసహకారాలు అందివ్వాలి.

    Like

  6. రమణారావుగారూ,
    కానీ మనదేశంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు లేదు. ఈవేళ పేపరులో చదివాను–పూణె లోని disaster management హెడ్ కి రెండేళ్ళనుండీ జీతం ఇవ్వడంలేదుట ! మినిస్టర్ ఎవడైనా జీతంతీసుకోకుండా, ఒక్క నెలైనా ఆగుతాడా…
    It happens only in India….

    Like

Leave a comment