బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–వర్షాలొచ్చేశాయి…


    చిన్నప్పుడు అంటే, ఋతువులని బట్టి వర్షాలొచ్చే రోజులన్నమాట, వర్షాకాలం వచ్చిందంటే ఎన్నెన్నో previleges ఉండేవి. మరీ గట్టిగా వర్షం వస్తే, స్కూలికే పంపేవారు కాదు. అధవా స్కూల్లో ఉన్నప్పుడు ప్రొద్దుటి చివరి పిరీయడ్ లో వర్షం మొదలెడితే “కంటిన్యూ” పెట్టేవారు. అంటే ఇంకో మూడు పీరియడ్లు పాఠాలు చెప్పేసి, స్కూలుగంట కొట్టేసేవారు. హాయిగా ఉండేది, మళ్ళీ స్కూలుకి రావఖ్ఖర్లేదుగా. కొద్దిగా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళకి ఓ గొడుగూ, మరీ అంతలేకపోతే ఓ గోనె (jute) బస్తా నెత్తిమీద కప్పుకుని, ఇళ్ళల్లో పనిమనుషులూ, పాలు పోసేవాళ్ళూ వచ్చేవారు.కొంతమంది తాటాకు గొడుగులు వాడేవారు. దేని అందం దానిదీ. ఇళ్ళల్లో గొడుగుమీద, ఇంట్లోవాళ్ళు తెల్లదారంతో పేరు కూడా కుట్టేవారు, మళ్ళీ మనగొడుగు మారిపోకుండా. ఆరోజుల్లో వర్షంలో బయటకి వెళ్ళడం అంటే ఓ మజాగా ఉండేది.మరీ పొలాలంబడ మోకాల్లోతునీళ్ళల్లో వెడితే, ఏ జలగో మన కాలికి పట్టుకోడంకూడా తటస్థించేది. అదేమిటో ఈ రోజుల్లో ఆ జలగలూ,వానపాములూ, నత్తలూ కూడా కనిపించడం మానేశాయి. అసలు మట్టనేది ఉంటేగా, ఎక్కడచూసినా సిమ్మెంటే సిమ్మెంటాయె. అప్పుడప్పుడు “గాలివానలు” ( cyclone) కూడా వచ్చేవనుకోండి. ఈ వర్షాల్లో ఇళ్ళల్లో ఎక్కడైనా వర్షంనీరు కారితే, వాటిని గుర్తుంచుకుని, వర్షాలు తగ్గగానే ఇల్లు ఒకసారి ‘నేయించడం” అంటే పైకప్పుమీద ఉండే పెంకులు ఒకసారి సద్దించడం అన్నమాట.

    పెరట్లో ఉండే నూతుల్లో, పై “వర” దాకా నీళ్ళొచ్చేసి, బాల్చీ వేసికోకుండానే నీళ్ళు తోడుకోడం ఓ మధురానుభూతి. అరుగుమీద కూర్చుని కాగితం పడవలు నీళ్ళల్లో వేస్తే, అవి జాయిగా వెళ్ళిపోవడం ఎవరైనా మర్చిపోగలరా? ఇప్పుడో , ఓ ప్లాస్టిక్ టబ్ లో నీళ్ళోసి, కాగితంపడవలు మన పిల్లలకి చూపించవలసిన దుస్థితికి వచ్చాము.

    కాలక్రమేణా, ఈ గొడుగులూ అవీ మోసుకెళ్ళడం నామోషీ అయితేనేమిటిలెండి, హాయిగా ఓ సంచీలో పెట్టుకుని తీసికెళ్ళడానికి సదుపాయంగా ఉండడంచేతనండి, ఫోల్డింగు టైపు గొడుగులొచ్చాయి. వాటి తరువాత రైన్ కోట్లూ, మళ్ళీ అందులో వెరైటీలూ, మొదట్లో పోలీసులకి Duck Back వారు తయారుచేసిన “ప్రత్యేక” రైన్ కోట్లుండేవి. పైన కాన్వాసూ లోపల రబ్బర్ లైనింగుతో, ప్రస్తుతం అవికూడా కనుమరుగైపోయి, రైన్ సూట్లు వచ్చాయి. హాయిగా వాటిని వేసికుని వర్షంవచ్చినా, ప్రళయం వచ్చినా మన పోలీసులు ట్రాఫిక్కు ని నియంత్రిస్తున్నారు.

    స్కూళ్లు తెరిచారంటే, పిల్లలకి ఇళ్ళల్లోనే ఆ రైన్ కోట్ వేసేసో, మరీ వర్షం లేకపోతే, స్కూలు బ్యాగ్గులోనో పెట్టి, వర్షం వస్తే వేసికో అమ్మా అని చెప్పడం, ఇప్పుడు ప్రతీ ఇంట్లోనూ చూసేదే. మన అదృష్టం బావుందా, ఆ రైన్ కోటుతో పిల్ల ఇంటికొస్తుంది, లేదా ” I forgot in the bus/school mummy..” అంటూ ముద్దుముద్దుగా చెప్పేసరికి, ఈ అమ్మలూ, నాన్నలూ లోపల్లోపల ఎంత గింజుకుంటున్నా, పైకి మాత్రం..”no issue baby..” అనేసి, ఇంకో రెండు రైన్ కోట్లు కొనేసి పెట్టుకోడం, ఈరోజుల్లో ప్రతీ ఇంట్లోనూ చూసే దృశ్యం. వచ్చే ఏడాదికి అవి పొట్టైపోతాయి, అది వేరేవిషయం. సరైన సమయంలో వర్షాలొచ్చేవి, పంటలు పండేవి, త్రాగడానికి నీరు సమృధ్ధిగా ఉండేది. ఎక్కడెక్కడో డామ్ములూ అవీ కట్టి, కావలిసినంత విద్యుత్తు ఉత్పాదన కూడా హాయిగా చేసేవారు. కానీ రోజులన్నీ అలాగే ఉండవుగా, జనాభా పెరిగింది, సరిపడేటట్టుగా ఉండడానికి కొంపా గోడూ కట్టుకోవాల్సొచ్చింది. ఇదివరకటి రోజుల్లోలా కాకుండగా, ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడే కట్టేయడం. దానికి ఓ వరసా వావీ లేదు. మొదట్లో నగరాలనండి, గ్రామాలనండి, వర్షాలూ, తదనుగుణంగా వర్షపునీరు భూమిలోకి వెళ్ళడానికో, మరీ ఎక్కువైతే నదిలోకి ప్రవహించడానికో డ్రైనేజీ లు కట్టారు. కానీ, మన భూకబ్జాలవారి ధర్మమా అని, ఈ డ్రైనేజీలమీదే కొంపలు కట్టేశారు. ఎక్కడచూసినా భూకబ్జాలే.

    ఇదివరకటిరోజుల్లో, ఓ నది ఉందంటే, ఆ నదీతీరానికి ఏదో కొన్ని మీటర్ల దూరందాకా, ఏదీ కట్టకూడదనేవారు. కానీ ఇప్పుడో, ఎక్కడ చూసినా, River View, Riverside, Riviera, River Plaza అంటూ పేర్లు పెట్టేసి, ఎక్కడపడితే అక్కడ సముద్రాన్నీ, ప్రవహించే నదినీ అదేదో reclaim చేసేసి, ఆకాశహర్మ్యాలు కట్టేయడం. ఈ కట్టడాలతో పాటే జనాభా, పొల్యూషనూ, దేశంలో ఏ ఒక్కనదైనా స్నానం చేయడానికి శుభ్రంగా ఉందేమో చెప్పండి. పోనీ ప్రభుత్వాలు శ్రధ్ధతీసికోలేదంటారా అంటే అదీ కాదు, గంగమ్మ తల్లిని శుభ్రపరచడానికి ప్రతీ సంవత్సరమూ కోటానుకోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. పనులు చేయడంలేదా అంటే అదీ కాదూ, పదిరూపాయల్లో అయిదురూపాయలు తిన్నా, మిగిలిన అయిదురూపాయలూ శుభ్రపరచడానికి ఖర్చైతే పెడుతున్నారు. ఏమైనా అడిగితే, “జనంలో రావాలీ, నదీతీరాలు శుభ్రంగా ఉంచాలీ అని” అంటారు ప్రభుత్వం వారు. ప్రజలనే ఏమిటిలెండి, పరిశ్రమలూ అలాగే ఉన్నాయి.వాళ్ళ ఫాక్టరీలో ఉండే waste అంతా నదుల్లోకి వదిలేస్తారు. వాళ్ళ సొమ్మేంపోయిందీ, వాడూ వాడి ఫాక్టరీ శుభ్రంగా ఉన్నాయి, ఎవడెలాపోతే వాడికేమిటీ?

    ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్నున్నాయి. ఎవరు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం వారినడిగితే మేము డబ్బులు ఖర్చుచేస్తున్నామూ అంటారు, ప్రజలనడిగితే, మమ్మల్నేం చేయమంటారూ మాకు ఖాళీ స్థలాలు దొరకడంలేదూ అంటారు. అదేదో రాజుగారూ ఏడు చేపల కథలాగ ఏవేవో కారణాలు చెప్పేసి తప్పించేసికుంటున్నారు.

    ఇంక వీళ్ళెవరివల్లా లాభం లేదనుకున్నదేమో ఆ గంగమ్మ తల్లి. చేసేదేదో తనే చేయాలనుకుందేమో, వీళ్ళా ప్రక్షాళనం చేయరూ, పోనీ చేసేవాళ్ళని చేయనిస్తారా అంటే అదీ లేదూ, ఇంకెలాగ మరి? సరే చేసేదేదో మనమే చేసేస్తే వీళ్ళకీ తెలిసొస్తుందనుకుని, “క్లీనింగ్ అభియాన్” పేరుతో, మొత్తం అంతా తుడిచిపెట్టేసింది. ఇంక ఇప్పుడంతా శుభ్రమే కదా. దేనికైనా ఓర్పు అనేది ఉంటుంది. beyond certain limit వెళ్తేనే ఇలాటి ఉపద్రవాలు సంభవిస్తూంటాయి. అలాటివాటిలో ప్రజలకి కష్టాలు కలగడం purely incidental.

    మీకేమిటీ, ఇంట్లో కూర్చుని ఎన్నైనా చెప్పగలరూ, ఆ యాత్రలకి వెళ్ళినవారి కష్టాలు మీకేం తెలుసూ. పాపం చూడండి, మన తెలుగు చానెళ్ళవాళ్ళు, వాళ్ళవల్లే సహాయకార్యక్రమాలు ప్రారంభం అయినట్టు , ప్రతీ చానెల్ వాడూ చెప్పడమే.

    దేశంలో ఉండే ప్రతీ నదీ, ఇలా పుష్కారినికోసారి ప్రక్షాళనా కార్యక్రమం చేబడితేనే కానీ, మనం బాగుపడం...

5 Responses

 1. వానాకాలం చదువుల గురించి ,
  కాగితం పడవుల గురించి ,
  గగుర్పాడు కలిగించే వరదల గురించి
  సమయాను కూలం గా వ్రాసారు.
  నాకు మిర్చి బజ్జీలు గుర్తుకు వస్తున్నాయి

  Like

 2. బాఉంది. కాగితం పడవలు, చిన్నతనం గోదారి గట్టు గుర్తొచ్చేసిందండి బాబు

  Like

 3. భాను ‘ బాణీలు ‘ (మ్యూసింగ్స్ )
  18.6.2013

  (నేను ఎప్పుడో వ్రాసుకొన్న ఈ మ్యూసింగ్స్ ప్రతిరోజు ఒక్కటి మీ ముందు పెడతాను.మీ స్పందనలు తెలియ జేస్తారు గదూ?)

  5

  ప్లాస్టిక్ ముక్కలు
  విసిరేసిన పాలీథీన్ సంచులు
  మూగజీవాలకు తినడానికి తిండి ఎక్కడ?
  పచ్చని భూములన్ని కాంక్రిట్ జంగిల్స్ అయ్యాక!

  6

  ప్రజల కోసం ,ప్రజల చేత , ప్రజల వలన
  ఎన్నుకోబడిన ప్రభుత్వాలు
  ప్రజల కోత , ప్రజల మోత , ప్రజల పాతర
  అన్నట్లున్నాయి ప్రభుత్వాలు

  Like

 4. phano babu gaaru

  mee batakhani chaduvutunnanu. chaalaa bagunaayi. mee punyama ani sri pada gaari anubhavaalu, mumi maanikyam gaari illu illalu, saradrathulu okka rojulo chadivaanu. chaala thanks.pote ee blogs ela telugu lo raayalo kaasta cheppagalara?

  Like

 5. డాక్టరుగారూ,

  మరీ ” వానాకాలం చదువులు” అంటే ఏదోలాఉంది సార్.. మీ గుర్తులు బావున్నాయి…

  శర్మగారూ,

  అలాటి మధురానుభూతులు మర్చిపోగలమా?

  భాను గారూ,

  మీ మ్యూసింగ్స్ బావున్నాయి. నా తపాలు నచ్చుతూన్నందుకు సంతోషం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: