బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సినేమాకి శతవార్షికోత్సవం….ట…

    మన దేశంలో చలనచిత్రాలు అవేనండీ సినేమాలు వచ్చి 100 సంవత్సరాలు పూర్తయాయిట. ఆ సందర్భంలో టీవీల్లో వచ్చే ప్రతీ చానెల్ వాళ్ళూ ప్రత్యేకకార్యక్రమాలు చూపించేస్తున్నారు. ఏదో ప్రాంతీయ చానెళ్ళవాళ్ళు తమప్రాంత చిత్రాలను గురించి కార్యక్రమాలు చేశారంటే అర్ధం ఉంది. కానీ జాతీయ చానెళ్ళలో చూపించే కార్యక్రమాలు అందులోనూ ఇంగ్లీషువాటిల్లో చూపించే ఈ 100 సంవత్సరాల చలన చిత్ర కార్యక్రమాలు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. హిందీ చానెల్స్ హిందీ సినిమాల గురించి చూపించడంవరకూ బాగానే ఉంది. కానీ ఈ so called National Channels లో చూపించేవి చూస్తే, భారతదేశంలో హిందీలోనే సినిమాలు తీస్తారూ, మిగిలిన భాషలలో తీసేవి, ఏదో నామమాత్రంగానే అనే అర్ధం అవుతూంటుంది. కారణం వారం వారం హిందీ సినిమాలగురించి మాట్టాడతారు కానీ, ప్రాంతీయ చిత్రాలగురించి నోరెత్తరు. ఈమాత్రం దానికి వాటిని జాతీయ చానెల్స్ అని పిలుచుకోడం దేనికో?

    పైగా వాటికి TRP లూ, సింగినాదాలూనూ, చానెళ్ళసంగతి అలా ఉంటే, ఇంక ఈ సినిమాల పత్రికల సంగతి అసలు అడగనే అఖ్ఖర్లేదు. హిందీ కాకుండగా, మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల్లోనూ కూడా సినిమాలు తీస్తారని కానీ, ఆ సినిమాలు హిందీ చిత్రాలకి ఎంతమాత్రం తీసిపోవనీ, అసలు వాళ్ళకి తెలుసునంటారా? మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇంగ్లీషులో ఉండే పత్రికలకీ, టివీ చానెళ్ళకీ ఈ “జాతీయ” హోదా కట్టిబెట్టడం. దేశమంతా చదువుతారు అంతవరకూ బాగానే ఉంది, కానీ చలనచిత్రాల విషయం వచ్చేసరికి హిందీ సినిమాల విషయమే మాట్టాడుతారు. గత వంద సంవత్సరాల్లోనూ దేశంలో విడుదలైన ప్రఖ్యాత సినిమాలూ అని మొదలెట్టి ఓ Mother India తో ప్రారంభించి Sholay తో ఆపుతారు. అక్కడకి అవి తప్ప చూడదగ్గ చిత్రమే లేనట్టు. మధ్యలో ఇంకో భాషుందండోయ్ బెంగాలి, సినిమాలగురించి వ్రాసే ప్రతీవాడికీ సత్యజిత్ రే గురించి వ్రాయడం ఓ status symbol. ఆయన గొప్పవాడే ఎవరూ కాదనడంలేదు. కానీ ఆయన తప్ప దేశంలో ఇంకో ప్రముఖవ్యక్తే లేడనే అర్ధం వచ్చేటట్టు వ్రాస్తే చిర్రెత్తుకొస్తుంది.

    ప్రతీ ప్రాంతీయ సినిమా ప్రపంచంలోనూ ఉద్దండులైన దర్శకులూ, నిర్మాతలూ ,నటులూ, నటీమణులూ, సంగీత దర్శకులూ, నేపథ్యగాయకులూ ఉన్నారు, వారిగురించికూడా ఒకసారి formality కోసమైనా ప్రస్తావిస్తే వాళ్ళ సొమ్మేమైనా పోతుందా? అసలు గొడవంతా మనలోనే ఉంది, ఉదాహరణకి తెలుగు సినిమాలు తీసికోండి, తెలుగులో అసలు నటులే లేనట్టు, బయటివాళ్ళని తెచ్చుకోడం, పాటలు కూడా తెలుగేతర గాయకులచేతే పాడించడం, వీటన్నిటినీ తెలుగు ప్రేక్షకుల నెత్తిన రుద్దడం. అప్పుడెప్పుడో లతామంగేష్కర్ చేత, సుసర్ల దక్షిణామూర్తిగారు సంతానం సినిమాలో పాడించారంటే, పోనిద్దూ బాగానే ఉందీ అనుకున్నాము, కారణం ఆరోజుల్లో అదొక novel experiment. కానీ ఈ రోజుల్లో అదో వేలంవెర్రిలా తయారయింది. ఏమైనా అంటే freedom of expression అంటూ అంటూ లెక్చర్లోటి. ఇంక నటీనటుల విషయానికొస్తే, స్వఛ్ఛమైన తెలుగునటులంటే మన నిర్మాతలకి ఎలర్జీ అనుకుంటాను, అందుకే పరభాషానటీమణులకే పెద్దపీట వేస్తారు. పోనీ అదేదో cultural exchange లాటిదనుకుందామా అంటే, హిందీవాళ్ళు మన మొహం కూడా చూడరు. అధవా ఏదైనా పాత్ర ఇచ్చినా, ఏదో సెకండరీదే కానీ, ప్రముఖ పాత్రల్లో ఉండరు. కానీ, మనవాళ్ళు మాత్రం ఎగేసుకుంటూ పోతారు.

    పోనీ ఆ హిందీసినిమాలైనా ఒరిజినలా అంటే అదీకాదు, తెలుగులో హిట్టైన చాలా చిత్రాలు హిందీలోనూ వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడకూడా ఓ తిరకాసుంది, అదృష్టం బాగుండి, ఆ హిందీ సినిమా హిట్టయిందా, ఇంక చూసుకోండి చిలవలూ,పలవలూ చేసేసి పొగిడేస్తారు. ఎక్కడో చివరన ఈ సినిమా ఫలానా భాషనుండి హిందీకరించబడిందీ అంటూ, “తమిళం” అని వ్రాస్తారు తప్ప, తెలుగు అనిమాత్రం ఛస్తే వ్రాయరు. అరే ఇది మన తెలుగు సినిమాలా ఉందే అనుకున్నా, ఎవడికీ పట్టదు. ఇంక మన యువతరం (facebook crowd) ఆ హిందీసినిమా చూసేసి ఆహా..ఓహో.. అనడం, అర్రేబాబా ఇది ఒరిజినల్ గా తెలుగులో తీశారు నాన్నా అన్నా సరే, ” ఊరుకోండి డాడీ, తెలుగులో ఇంత మంచి సినిమాలు కూడా వస్తాయంటే నమ్ముతామేమిటీ, you are joking.. అనడం. ఇలా ఉంది మన తెలుగు సినిమాల పరిస్థితి. ఏదో బావుందనే కదా, హిందీలో తీశారూ, అది ఒప్పుకోడానికేంరోగం?

    అన్ని సంవత్సరాలు బానిసత్వానికి అలవాటు పడిపోయి, ఆ వాతావరణంలోంచి బయటపడలేకపోతున్నారు. ఇదివరకు ఆంగ్లేయులూ, ఇప్పుడేమో హిందీచలనచిత్రరంగం వాళ్ళూనూ. ఎవరినో అని లాభం ఏమిటీ మన బంగారం బాగోనప్పుడు…చూస్తూ కూర్చోడం తప్ప.

    ఇంక పత్రికల విషయానికొస్తే ఏదో ఆ Screen తప్పించి , మిగిలిన వారు Filmfare, Stardust వాళ్ళు దక్షిణభారతీయ చిత్రాలను గురించి ఒక్కమాటైనా వ్రాస్తారేమో చూడండి. కానీ మన పత్రికలవాళ్ళు especially స్వాతి వార పత్రిక లాటివారు మాత్రం పేజీకి ఒక హిందీ తారామణి గురించి వ్రాస్తేనే కానీ నిద్రపట్టదు వాళ్ళకీ. ఇది సరిపోనట్టు ఎవరో ఓ మాయదారి తారగురించి ప్రత్యేక వ్యాసాలోటీ. ఖర్మ ఏం చేస్తాం? భరించాలి మరి !

    వికీపేడియాలో ఒకసారి చూడండి, దేశంలో తయారయ్యే చలన చిత్రాలలో కొన్ని కొన్ని సంవత్సరాల్లో తెలుగు సినిమాలే ఎక్కువ.తెలుగు చలనచిత్రపరిశ్రమలో ఈ వందేళ్ళలోనూ జరిగినవి ఇక్కడ చూడండి. అంతదాకా ఎందుకూ ఆమధ్యన CNN-IBN వాళ్ళు నిర్వహించిన Poll లో మన తె…లు..గు… చిత్రమే ( మాయాబజార్) సర్వోత్కృష్ట సినిమా గా ఎంపికయింది. అంతకంటే ఏం కావాలండీ తెలుగు సినిమా ఘనత చాటడానికీ ? ఓ దేవదాస్ సినిమా అన్ని భాషల్లో తీశారుకదా, తెలుగులో శ్రీ అక్కినేని గారి నటనతో ఇంకోరెవరైనా పోటీకి రాగలరా? అయినా సరే ఆ మాట ఏ “జాతీయ” పత్రికవాడూ, చానెల్ వాడూ ఎత్తడు.

    ఈ సందర్భంలో CARAVAN అనే మాస పత్రికలో వచ్చిన వ్యాసం చదవండి.Century Bazaar

%d bloggers like this: