బాతాఖాని–లక్ష్మిఫణి కబుర్లు–Good..old.. Telegram..R.I.P…

    ప్రస్తుతం తెలుగు బ్లాగులు చదివేవారు, వాళ్ళు పెరిగిపెద్దయే సందర్భంలో, ఒక్కసారైనా ఈ టెలిగ్రాం ని చూసుంటారు. మీ తల్లితండ్రుల గురించి చెప్పఖర్లేదనుకోండి. మీరు పరీక్షలు పాసయినప్పుడు అవొచ్చు, అంతదాకా ఎందుకూ, మీరు పుట్టినట్టు మీ నాన్నగారికి తెలిసింది, ఈ టెలిగ్రాం ద్వారానే, ఒకసారి అడిగిచూడండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏడో నెలకే పురిటికోసం, పుట్టింటికి వెళ్ళిపోయేవారు. అక్కడ శ్రీమంతం తంతు పూర్తిచేసికుని, మళ్ళీ మామగారిదగ్గరనుండి ఈ టెలిగ్రాం వచ్చిన తరువాతే పుట్టిన బాబునో, పాపనో చూడ్డానికి వెళ్ళడం. అంతవరకూ “మేఘసందేశాలే” మరి…

    ఓ శుభవార్తొచ్చినా, అశుభవార్తొచ్చినా ఈ టెలిగ్రాం ద్వారానే. టెలిగ్రాం బంట్రోతు వచ్చేడంటే అందరికీ దడా, వణుకూనూ, ఏం వార్త మోసుకొచ్చిందో అని ! మంచిదైతే ఆ టెలిగ్రాం తెచ్చినవాడికి ఓ పటికబెల్లం ముక్కో ఇంకోటో చేతిలో పెట్టడం. అదే ఏ విచారకరమైన వార్తో వచ్చిందా, వాడెదురుగుండానే గుండెలు బాదుకుంటూ ఏడుపులూ, రాగాలూనూ. ఉరు ఊరంతా తెలియాలన్నమాట, వారి దగ్గరవారెవరో పోయారని. ఇంక పరామర్శలూ వగైరాలు.

    ఇవి కాకుండగా పెళ్ళిళ్ళలో వచ్చే శుభాకాంక్షల టెలిగ్రాములు. దేశంలో తెలిసిన ప్రతీవారికీ ఓ శుభలేఖ వేస్తారుగా, ప్రతీవాడూ ఎక్కడ వస్తాడూ, ఓ గ్రీటింగు టెలిగ్రాం, పెళ్ళి టైముకి అందేటట్టు పంపించేస్తే ఓ గొడవొదిలేది. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఈ టెలిగ్రాం లలో మొదటి ఇన్ని words కి ఇంతా,అటుపైన ప్రతీ word కీ ఇంతంతా అని ఉండేది, ఈ రోజుల్లో ఆటో రిక్షా మీటర్లలాగ.comma, fullstop కి అదనం. ఎడ్రసుకూడా కుదిమట్టం చేసి పంపాల్సొచ్చేది, దాన్ని కూడా లెఖ్ఖలోకి తీసికుంటారుగా. ఆ ఎడ్రసూ, శుభాకాంక్ష సందేశం పూర్తిగా వ్రాసేటప్పటికి తడిపి మోపెడయ్యేది, దానికంటే శలవు పెట్టి పెళ్ళికి వెళ్ళడమే చవక. అందుకోసం ప్రభుత్వం వారు, ఈ Greeting Telegram లకి కొన్ని కోడ్ నెంబర్లు పెట్టారు. ఫలానా నెంబరైతే ఫలానా సందేశం అని. పెళ్ళిళ్ళకైతే 8, 16 ఉండేవనుకుంటాను. మరీ ఎక్కువ టెలిగ్రాం లు లేకపోతే ఆ నెంబరుకి సంబంధించిన సందేశం వ్రాసేవారు, లేదా మన అదృష్టం బాగోపోతే ఆ నెంబరొకటే వేయడం, మనమేమో అదేమిటో తెలిసికోడానికి ఏ టెలిఫోన్ డైరెక్టరీలోనో చూసుకోడం. జీవితంలో సంభవించే ప్రతీ occasion కీ ఓ నెంబరుండేది. వాటి వివరాలు కావలిసిస్తే ఇక్కడ ఓసారి చూడండి.ఆ రోజుల్లో పెళ్ళిళ్ళల్లో ఎన్ని గ్రీటింగు టెలిగ్రాములు వస్తే అంత గొప్పన్నమాట. అబ్బ మా అల్లుడిగారికి ఎంతమంది స్నేహితులో అని మామగారూ, మా వారికి ఎంత పాప్యులారిటీయో అని కొత్త పెళ్ళికూతురూ అనుకోడం, పక్కనే ఉండే పెళ్ళికొడుకు కాలరెగరేసికోడమూనూ. ఆ టెలిగ్రాములు తెచ్చినవాడికి మామూళ్ళు మళ్ళీ మామగారి ఖాతాలోనే…

    ఈ టెలిగ్రాములు పంపడానికి కూడా ఓ పెద్ద తంతు… ఓ ఫారం ఇచ్చేవారు దాంట్లో మనం పంపవలసిన సమాచారం ఏదో కుదించి వ్రాయడం, ప్రతీవారికీ ఆంగ్ల భాష మీద అంత పట్టుండేదికాదుగా, ఏ స్కూలుకెళ్ళేవాడినో పట్టుకుని, వాడిచేత వ్రాయించి, కిటికీకి ఆతలుండే అతనికి ఇవ్వడమూ, అతనేమో కొబ్బరికాయలు లెఖ్ఖెట్టినట్టు ఎన్ని words ఉన్నాయో చూడడం, ఇంతా అని చెప్పి, అదేదో దానిమీద టక..టకా..టక్.. టక్..టక్.. ఠా.. ఠక్కులమారీ.. అంటూ నొక్కేయడం, ఓ రసీదు వ్రాసి మన మొహాన్న కొట్టడమూ, అదేమిటో రెండోదాంట్లోనో, మూడోదాంట్లోనో వేసేవాడు స్టాంపు…

   ఏమిటో ఈ రోజుల్లో వచ్చే SMS ల భాష చూసి, దేశంలో భాష భ్రష్టుపడిపోతోందో అని బాధపడిపోతున్న సాంప్రదాయవాదులు ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఆంగ్ల భాష అప్పటికే భ్రష్టు పడిపోయింది ఈ టెలిగ్రాముల ధర్మమా అని. ఓ అర్ధం పర్ధం ఉండేవికావు, అయినా పనైపోయేది. మళ్ళీ ఇందులో ఒక తిరకాసూ, ఆ ఇచ్చేవాడు సరీగ్గా కొట్టాలి, ఈ రాసుకునేవాడికి అది అర్ధం అవాలి, ఆతావేతా చివరికి అందేవాడి అదృష్టం. ఇంటర్వ్యూలనండి, పరీక్షా ఫలితాలనండి, పైఊళ్ళో ఉండే కొడుక్కో కూతురికో డబ్బులు అవసరమైనప్పుడనండి, అఘమేఘాలమీద సందేశాలు వెళ్ళిపోయేవి. ఆరోజుల్లో బొంబాయిలో మా చుట్టం ఒకరుండేవారు, ఆయన ఒకసారి అస్వస్థతతో ఆసుపత్రిలో చేర్చారు వారి స్నేహితులు, దగ్గరగా ఉండే వారికెవరికైనా తెలియపరచొద్దూ, నేను దొరికాను, ఎప్పుడో మాటల్లో మా బంధువు చెప్పారు, మా అంకుల్ పూనాలో ఉంటున్నారూ అని, ఇంకేముందీ, ఏదో పిల్లనిచ్చే మావే అయుంటాడూ అనుకుని నాకో టెలిగ్రాం ఇచ్చేశారు, పోనీ అదైనా సరీగ్గా ఉందా, అబ్బే .. ఆ ఇచ్చినాయన పేరు లక్ష్మణస్వామి, నాకు ఆ టెలిగ్రాం చేరేటప్పటికి అది కాస్తా ఆకాశవాణి అయిపోయింది ! రేడియో వాళ్ళకి నాతో పనేమిటా అని ఆలోచిస్తే, ఆ టెలిగ్రాం లో సమాచారం చదివినతరువాత తెలిసింది ఈ టెలిగ్రాములవారి నిర్వాకం..
పరీక్షాఫలితాలు తెలిసికోవాలంటే ఏ వాల్తేరులోనో ఉండే వాడిని పట్టుకోడం, ఆ పెద్దమనిషేమో, ఏ రిజిస్టార్ ఆఫీసులోనో తన పరిచయాలు ఉపయోగించి, ఫలితాలు ప్రచురించేముందే , తెలిసికుని ఓ టెలిగ్రాం పంపడం. వీటివల్ల ఓ రెండుమూడు రోజులముందునుంచీ చివాట్లు తగిలేవి, మన రిజల్టు చూసి

    ఉద్యోగరీత్యా నేను వరంగాం లో ఉన్నప్పుడు, మా అమ్మాయి రిజల్టు టెలిగ్రాంద్వారానే తెలిసింది. కానీ అలాటి చిన్న చిన్న కాలనీల్లో, మనకి ఏదైనా టెలిగ్రాం వచ్చిందంటే, మనకంటే ముందుగా ఆ కాలనీలోవాళ్ళకి తెలిసిపోయేది, కారణం– ఆ టెలిగ్రాములు పంచేవాడికి కాలనీఅంతా చుట్టాలే, అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పేయడం. Free publicity అన్నమాట !

    అలా అన్ని రోజులూ, మన జీవితాల్లో సుఖ, దుఃఖాల్లో పాలుపంచుకున్న ఈ టెలిగ్రాము ఇంక కనుమరుగవుతుందని ఈవేళ పేపర్లో చదివితే ఎంతో బాధేసింది.కొత్తనీరొచ్చి పాతనీరుని తీసేస్తుంది నిజమే కానీ నీరు నీరే కదా.

    మనలో చాలామందికి ఈ టెలిగ్రాముల విషయం, కథా కమామీషూ తెలుసును, కానీ తరువాతి తరం వారికి కూడా తెలియాలిగా, మీ ఇళ్ళల్లో ఎప్పటివైనా పాత టెలిగ్రాములు ఉంటే, వాటిని జాగ్రత్తచేసి పిల్లలకి చూపించండి–for posterity.. మహా అయితే నవ్వుకుంటారు so what ?కానీ, ఆ టెలిగ్రాం వచ్చిన రోజున మనజీవితాల్లో పండిన నవ్వుని మళ్ళీతేగలమా?

   1974లో మా అమ్మాయి పుట్టినప్పుడు మా మామగారు ఇచ్చిన టెలిగ్రామూ, మా అమ్మాయి పరీక్షాఫలితాల టెలిగ్రామూ ఇప్పటికీ దాచిఉంచాను… అదో సరదా…

%d bloggers like this: