బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “ఈనాడు” వారి భాషా సేవ

   తెలుగులోనే మాట్టాడాలి, తెలుగుభాషని అభివృధ్ధి చేయాలీ అనే స్లోగన్సే తప్ప, ప్రభుత్వం వారు sincere గా చేసే ప్రయత్నం ఏమీ కనిపించడంలేదు. ఏదో ప్రతీ సంవత్సరమూ, ఒక రోజు ని తెలుగుభాషా దినం, మాతృభాషా దినం అంటూ, రవీంద్రభారతి లోనో ఎక్కడో ఓ సభ ఏర్పాటు చేసేస్తే సరిపోతుందా? మామూలుగా ప్రతీవాళ్ళూ చేసే Fathers Day, Mothers Day, Valetines Day ఇంకో సింగినాదం Day ల్లాగే ఇదీనూ. అక్కడెక్కడో అమెరికాలో జరిగే తానాలూ, ఆటాలూ వగైరాల్లో పాల్గొని, అవేవో “జీవితసాఫల్య ఎవార్డులు ” తీసికోడంతో సరిపోయిందనుకుంటారు మన గౌరవనీయ ప్రభుత్వం వారు.. నాకో విషయం అర్ధం అవదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు సమావేశాలు జరిగినా, ఓ పేద్ద పటాలం వెళ్ళిపోతుంది. వీళ్ళందరి ఖర్చులూ ఎవరు భరిస్తూంటారుట? అయినా మనం అందరం పన్నులు కడుతున్నాము కదా, డబ్బుకి లోటేమిటిలెండి?

    ఓ సెన్సార్ బోర్డనోటుంది.వాళ్ళు సినిమాల్లో చూపించే దృశ్యాలు ఎలాగూ పట్టించుకోడంలేదు, కనీసం ఆ సినిమాల పేర్లైనా తెలుగులో ఉండాలని సూచిస్తే వాళ్ళ సొమ్మేంపోయింది? పైగా సినిమాకి ఏం పేరు పెట్టాలో మేమేం చెప్పగలమూ అంటారు, “పేరు లో ఏముందీ” అంటూ పాటకూడా పాడే సమర్ధులు. ఆ సినిమావాళ్ళూ అలాగే తగలడ్డారు. సినిమాలకి తెలుగులో ఉండే పేర్లు పెడితే అవేవో ఆర్ధికసహాయాలు చేస్తామంటే చాలు, పొలోమంటూ పెట్టేస్తారు. ఆమాత్రం కూడా చేయలేదా ప్రభుత్వం? పక్క రాష్ట్రాలవాళ్ళు చేస్తున్నట్టు చేయడానికి వీళ్ళకేం రోగం? భాషాభివృధ్ధికి ఏమిటేమిటో చేసేస్తున్నామూ అని ఊరికే ప్రసంగాలు చేయడం కాదు. చేస్తున్నట్టు కనిపించాలి కూడానూ.

    ఈ విషయంలో తెలుగుభాషకి కొంతలోకొంత సేవలాటిది చేస్తున్నది రామోజీ ఫౌండేషన్ వాళ్ళేమో అనిపిస్తుంది.ఆయన అంటే రామోజీ గారికి ఎన్ని గొడవలుండనీయండి, భాష విషయంలో మాత్రం సేవ చేయడమే కాదు, వారు చేసేవి అందరికీ అందుబాటులోకి తేవడం. నాకు ఈనాడు పేపరంటే అదేదో అభిమానమేమో అనుకోకండి. వార్తాపత్రికలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకి mouth pieces లే. ఏ పార్టీ అభిమానులకి ఆ పత్రిక నచ్చుతుంది. అందులో వ్రాసినవే వేదాక్షరాల్లాగ కనిపిస్తాయి.

   కానీ పార్టీలకీ, రాజకీయాలకీ అతీతంగా, తెలుగు భాషనే దృష్టిలో పెట్టుకుని, తమకి తోచిన సేవ చేయడంలో ఈనాడు గ్రూప్ వాళ్ళు మాత్రం second to none. వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. ఇదేమిటీ ఈవేళ ఈయన ఈనాడు గురించి ఇంతలా ప్రశంసిస్తున్నారేమిటీ, వాళ్ళు ఏమైనా డబ్బులు కానీ ఇచ్చారా అనుకోవచ్చు. అలాటిదేమీలేదులెండి, ఉన్నదేదో చెప్పాలనే ఈ టపా. అసలు పుస్తకాలు ఎందుకుప్రచురిస్తారుట, నలుగురు చదువుతారూ, అన్ని విషయాలూ తెలుస్తాయీ అనే కదా. ఆ సందర్భంలోనే తెలుగు సాహిత్యాన్ని అందరికీ చేరువలోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఓ రెండు మాసపత్రికలు నడుపుతున్నారు. అవి సరిపోనట్టు ఇంకో మాసపత్రిక కూడా మొదలెట్టారు. దానికి ఓ కొంత వెల పెట్టారు. గత కొన్నేళ్ళగా నెలకీ అతిస్వల్ప (అంటే 10 రుపాయలు) వెలతో, అందరికీ అందుబాటులో పెట్టడానికి ఖలేజా ఉండాలి. మిగిలిన వార మాస పత్రికలన్నీ, ఏదో కారణం చెప్పి ఖరీదులు పెంచేస్తున్న ఈ రోజుల్లో కూడా, ఈనాడు వారు ప్రచురిస్తున్న విపుల, చతుర మాసపత్రికలు ( with so much content) అంత తక్కువ ఖరీదుతో అందరికీ అందుబాటులో ఉంచడం ఈనాడు రామోజీరావుగారికే చెల్లింది. పైగా దేశవిదేశాల్లో అందరికీ లభించవేమో అనుకుని ప్రతీనెలా, ఈ మాసపత్రికల– విపుల చతుర — ల online editions కూడా అందుబాటులో పెట్టారు. డబ్బులే చేసికోవాలంటే ఈనాడు వాళ్ళు ఇలా చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఏదో నలుగురూ చదవాలీ, భాష అభివృధ్ధి చెందాలీ అన్నదే వీళ్ళ ఉద్దేశ్యం.

    ఈమధ్యనే ఇంకొక మాసపత్రిక కూడా మొదలెట్టారన్నానుగా, “తెలుగు వెలుగు” అని, ఏదో అంతర్జాలంలో ఆ పత్రిక గురించి రివ్యూలు చదివి, అరే ఆ పత్రిక ఇక్కడ( పూణె) లో కూడా దొరికితే బావుండేదీ , అనుకుని మా రైల్వే బుక్ స్టాల్ వారిని అడిగాను. ఏదో మా మిత్రుల ధర్మమా అని, ఓ రెండు సంచికలు దొరికేయి పోస్టు/కొరియర్ ద్వారా పంపబడగా, కానీ ప్రతీ నెలా పంపమంటే బాగోదుగా. ఎలాగరా అని ఆలోచిస్తూంటే నిన్నటి గూగుల్ ప్లస్ లో ఎవరో పెట్టిన లింకు గురించి మా ఇంటావిడ చెప్పింది. మొత్తానికి తెలుగు వెలుగు మాసపత్రిక e-edition కూడా పెట్టేశారు.

    ఈనాడు వారు తెలుగుభాషకి చేస్తూన్న ఈ సేవ మాత్రం అభినందనీయం. ఈనాడు యాజమాన్యం వారు ఇంత “బడా దిల్” ప్రదర్సించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. రెండు మూడు పత్రికలు ప్రచురిస్తున్నాము, దాని వెల ఫలానా కావలిసిస్తే కొనుక్కోండి, లేదా సంవత్సర చందా ఇంత, అని చెప్పేసి వదిలేయొచ్చు. కానీ అలా కాకుండగా, తెలుగు భాషాభిమానులందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వారు ఆ మాస పత్రికల e-edition అందుబాటులోకి తేవడం చాలా బావుంది.

    మిగిలిన తెలుగు పత్రికలు కూడా ఇలా చేయగలిగితే కనీసం అంతర్జాలంలోనైనా తెలుగు భాష అభివృధ్ధి చెందుతుందేమో అని ఓ ఆశ. కారణం print editions కి ఎలాగూ కాలదోషం పట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతర్జాలమే.తెలుగులో ప్రచురిస్తున్న మిగిలిన పత్రికలు కూడా అంతజాలంలో వస్తే ఇంకొన్ని పత్రికలు చదువుకోవచ్చని ఓ చిన్న ఆశ…

%d bloggers like this: