బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   సిబీఐ జాయింటు డైరెక్టరు శ్రీలక్ష్మినారాయణ గారి, పదవీకాలం పొడిగించకుండా, మహరాష్ట్ర కి బదిలీ చేయడం నిరసిస్తూ, ఎవరో హైకోర్టులో వ్యాజ్యం వేశారుట. ఎవరి అభిమానం వారిదీ. కానీ అవేవో రూల్సని ఉంటూంటాయిగా, వాటిని కూడా అనుసరించాలేమో అప్పుడప్పుడు. ఈ వ్యాజ్యం వేసినవారనేదేమిటయ్యా అంటే, శ్రీలక్ష్మీనారాయణ, ఆయన ఎందరో ప్రముఖుల్ని– సత్యం రామలింగరాజు,గాలి, వాళ్ళెవరో ఇద్దరు ముగ్గురు మంత్రులూ, మాజీ ముఖ్యమంత్రిగారి పుత్రుడూ, మళ్ళీ ఇంకొందరు మంత్రులూ ఇలా చెప్పుకుంటూ పోతే, పాపం జైళ్ళకెళ్ళిన చాలామంది, శ్రీ లక్ష్మినారాయణ గారి ప్రసాదమే మరి. అయినా ప్రతీదీ ఇలా సీరియస్సుగా తీసేసికుంటే ఎలాగండి బాబూ. ఈ విచారణలూ, అరెస్టులూ ఏదో, ప్రజలని ఊరుకోపెట్టడానికి కానీ, వీళ్ళందరికీ ఏమైనా శిక్షలు పడతాయా ఏమిటీ?

    కేసులు తేలేటప్పటికి కనీసం ఓ పుష్కరమైనా పడుతుంది. ఈలోపులో ప్రభుత్వాలు మారకుండా ఉంటేనూ. కోర్టుల్లోకి వెళ్ళిన కేసులకే దిక్కులేదు, ఉత్తర్ ప్రదేష్ లో పాత కేసులు ఎత్తేయాలని తీరా నిర్ణయం తీసికుంటే, కోర్టువాళ్ళు కోప్పడ్డారుట. 1984 లో జరిగిన అల్లర్ల విషయంలో సజ్జన్ కుమార్, టైట్లర్ లకి చీమైనా కుట్టినట్టులేదు. హాయిగా ఉన్నారు.అంతదాకా ఎందుకూ, మహారాష్ట్రలో జరిగిన అల్లర్లకి బాల్ ఠాక్రే ని ఏం చేశారు? గుజరాత్ లో జరిగిన అల్లర్లకి మోడీ కారణం అన్నారు. తీరా జరిగేదేమిటంటే, రేపెప్పుడో ప్రధానమంత్రి గా బాధ్యతలు చేబట్టినా చేపట్టొచ్చు.

    సోనియాగాంధీ సెక్రెటరీ జార్జి మీద పేద్ద హడావిడి చేసేశారు. తీరా జరిగిందేమిటీ–for insufficient evidence కేసు కొట్టేశారుట.అలాగే రాబర్టు వాధ్వా వ్యవహారమూ అదే గతి పడుతుంది.ములాయంసింగు మీద, మాయావతి మీదా సిబీఐ కేసులున్నాయి. ఉత్తిత్తినే వాటిని బయటకులాగి బెదిరించడానికి ఉపయోగిస్తూంటారు, ప్రభుత్వాలు పడిపోకుండగా, అంతే.ఎవరో ఒక పార్టీవాళ్ళే కాదు, ప్రతీ రాజకీయపార్టీ కీ ఉన్న రోగమే ఇది.

    చెప్పొచ్చేదేమిటంటే, ఓ లక్ష్మీనారాయణ అవనీయండి, లేకపోతే ఇంకో రామలింగయ్య అవనీయండి, ఎవరున్నా ఒక్కటే, ఓపికున్నంతకాలం కేసులు లాగడం, తీరా చివరకి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టివేయబడిందీ..అనేసి అందరి నోర్లూ మూయడం.అప్పుడెప్పుడో ఓ మంత్రిగారు కూతురి పెళ్ళి వ్యవహారంలో, వసూళ్ళు చేశాడన్నారు, ఏమయిందీ ఆ కేసు?

    మొత్తానికి బిజేపీ వాళ్ళు మోడీకి పెద్దపీట వేసేశారు. పాపం ఆ ఆద్వానీగారు, అసలు ఒక్కళ్ళూ తనపేరే చెప్పడంలేదేమిటీ అని ‘అలిగి” గోవా వెళ్ళడం మానేశారు. అలాగని జరిగేదేమన్నా మానిందా, ఊరికే హడావిడిచేసి ఆద్వానీకి లేనిపోని ” అస్వస్థత” ని అంటగట్టారు.ఇప్పుడు బయటపడతాయి అందరి “రంగులూ”. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా, దేశంలో ప్రతీవాడూ తను ఓ నెహ్రూ అనో, ఇందిరాగాంధీ అనో, వాజపేయీ అనో అనుకుంటే హాస్యాస్పదం. ఏదో state level లో ఓ గొప్ప నాయకుడవొచ్చు, National level లో రాణించడానికీ, నెగ్గుకురావడానికీ అదేదో..that.. extra.. bit.. లాటిదేదో కావాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న ఎవరిలోనూ లేవు.మన్మోహన్సింగుగారు రెండు సార్లు ప్రధానమంత్రిగా చేసినా, ఆ ఘనత అంతా సోనియాకే ఇస్తారుకానీ, ఈయన గురించి ఎవడూ మాట్టాడడు.

    అసెంబ్లీ సమావేశాలూ, పార్లమెంటు సమావేశాలూ ప్రారంభం అవుతాయి, అదో కామెడీ షో. జరిగేదేమీ ఉండదు.2014 లో జరగబోయే సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎడా పెడా స్కీమ్ములూ, ప్రాజెక్టులూ వింటాము. అవేమైనా జరిగేవా పెట్టేవా? అదో కాలక్షేపం.

    మధ్యలో రామాయణం లో పిడకలవేటలా, అదేదో IPL Match Fixing ట. అక్కడికేదో కొత్తగా వచ్చినట్టు.ఆరేళ్ళనుండీ జరుగుతోంది, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రతీవాడూ ” హా..శ్ఛర్యాలు..” ప్రకటించేవాడే.

    ఎందుకొచ్చిన గొడవా, హాయిగా మన గొడవలేవో మనం చూసుకుందామూ అనుకుంటారా, ఇదిగో ఇలా హాయిగా మనసారా నవ్వుకోండి. నవ్వడానిక్కూడా ఓ యోగం ఉండాలండీ.

    నవ్వులూ అవీ తరువాత చూసుకుందామూ, హాయిగా నయనానందకారంగా ఏదైనా చూద్దామనుకుంటారా, మా కోనసీమ అందాలు సరిపోవూ …

%d bloggers like this: