బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఈ మధ్యన భారతప్రభుత్వం వారు మనం ఇళ్ళల్లో ఉపయోగించే LPG కీ, ఆధార్ కార్డుకీ లంకె పెట్టారు.మనమేమో కొత్తసిలిండరు తీసికున్నప్పుడు, 900 కి పైచిలుకి ఇవ్వాలిట, ప్రభుత్వం వారు ఇచ్చే subsidy మన బ్యాంకు ఎకౌంటుకు బదిలీ చేస్తారుట. పేపర్లలో చదువుతున్నాము, ఆంధ్రదేశంలో త్వరలో ప్రారంభం అవుతుందని. నిన్నటి పేపర్లో చదివాను, ఇక్కడ మహారాష్ట్రలో కూడా త్వరలో ప్రారంభం అవుతుందని. కొంతవరకూ ఇదిబాగానే ఉంది, కానీ ఒకే పేరుమీద రెండేసి కనెక్షన్లున్నవారి సంగతి ఏమిటీ? ఈ ఆధార్ కార్డులూ, నగదుబదిలీలు( LPG విషయంలో) విన్నప్పటినుంచీ నా గుండెల్లో దడ వచ్చేసింది. కారణం మరేమీ కాదూ, మావద్ద ఉన్న రెండు కనెక్షన్లూ నాపేరే ఉన్నాయి. ఒకటి BP, రెండోది Indane. అన్నేసి కబుర్లు చెబుతారూ, రెండేసి కనెక్షన్లెలా పెట్టుకున్నారూ అని అడగొచ్చు. దానికో పెద్ద కథ ఉంది…

    నా మొదటి కనెక్షను BP ది 43 ఏళ్ళ వయసున్నది, అంటే LPG పూనా లో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు కొనుక్కున్నది.ఆరోజుల్లో సిలిండరు 25 రూపాయలు, డిపాజిట్టు 70 రూపాయలూనూ. పైగా అప్పటికి ఒక్కణ్ణే అవడంవల్ల, ఏడాదికీ రెండంటే రెండే సిలిండర్లతో లాగించేసేవాడిని.పైగా ఆ Burshane ( ఆరోజుల్లో BP ని అలాగ పిలిచేవారు) వాడితో దెబ్బలాట, మరీ అంతతక్కువతీసికుంటే కనెక్షన్ పీకేస్తానని వాడూ, రూల్ససలు ఏమిటీ అని నేనూ, ఆరోజుల్లో ప్రతీ ఏడాదీ ఓ క్యాలెండరోటిచ్చేవారు.ఈ గొడవభరించలేక, ఆరోజుల్లో బ్రహ్మచారినే కదూ, పెళ్ళిళ్ళై కాపరాలు చేసికుంటున్న మా స్నేహితుల్ని కూడా వాడుకోమనేవాడిని, ఆ రోజుల్లో డబుల్ సిలిండర్లుండేవి కాదు.అదంతా గతం…

    ప్రస్థుతానికి వస్తే.. రిటైరయిన తరువాత, మేమందరమూ కలిసి ఉండే రోజుల్లో, Indane వాడు కొత్తగా పూణే లో ప్రారంభించినప్పుడు, కొత్త కనెక్షన్లిస్తున్నారని విన్నాను. పోనీ ఆ కనెక్షనేదో అబ్బాయి పేరనో, ఇంటావిడ పేరనో తీసికోవచ్చుగా, అబ్బే అలాటి ఆలోచనలెందుకువస్తాయీ, గొప్పగా ఆ రెండోది కూడా నా పేరనే తీసికున్నాను. మా రాజమండ్రీ కాపరం సందర్భంలో ఆ కనెక్షనే నన్ను వీధిన పెట్టకుండా చేసింది, అక్కడే దానికో డబుల్ సిలిండరు కూడా తీసికుని, తిరిగి పూణె వచ్చిన తరువాత, ఎలాగూ విడిగానే ఉండడంతో గొడవ లేకపోయింది. ఈ ఆధార్ కార్డులూ, నగదు బదిలిలూ వచ్చిన తరువాత మొదలయ్యాయి నా పాట్లు. రెండు కనెక్షన్లూ నా పేరే, ఉన్నదేమో ఒకే ఆధార్ కార్డాయె, ఎప్పుడో పట్టుకుని ఒకటి పీకేస్తాడు.

    ఇదివరకటి రూల్స్ ప్రకారం తండ్రి పేరుమీద ఉన్న కనెక్షన్ కొడుక్కి బదిలీ చేయొచ్చుట ఎప్పుడూ, ఈ తండ్రి ఫొటోకి దండ పడ్డ తరువాత ! ఇప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ కోసం, మరీ దండ వేయించేసుకుంటే ఎలా? నా అదృష్టం బాగుండి ప్రభుత్వం వారు ఆ రూల్స్ మార్చారు. బతికుండగా కూడా, కొడుకు పేరుమీదకి మార్చుకోవచ్చని. మొత్తానికి ఈ రెండు నెలలూ ఆ BP వాడి చుట్టూరా తిరిగి తిరిగి ఈవేళ నా పేరునున్న కనెక్షన్ మా అబ్బాయి పేరకి మార్చాను.

    మీ గ్యాసు గొడవలన్నీ మాకెందుకూ అనొచ్చు … ఇంకా ఎవరిపేరునైనా రెండేసి కనెక్షన్లుంటే, లక్షణంగా కొడుకు పేర మార్చేసుకోమని చెప్పడానికే ఈ టపా…

    మొత్తానికి శ్రీ నారాయణమూర్తిగారు ఇన్ఫోసిస్ కి తిరిగొచ్చేశారు.ఎంతైనా ఆ కంపెనీకి జన్మదాత ఆయన. ఆయన తిరిగి రావడం అంటే, ప్రస్థుతం ఉన్నవారు అంత సమర్ధులు కారనా, లేక ఆయన దగ్గరున్న షేర్ల విలువ, ఈయన తిరిగిరావడంవల్ల పెరిగిపోతుందనా, ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక !!

    బైదవే మా వేసవి శలవలు అయిపోయాయి.. మా మనవడూ మనవరాలూ వచ్చేశారు.

    ఈవేళ Face Book లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి గురించి ఒక పోస్టు చదివాను. ఆ వివరాలు ఇక్కడ చదవండి.

%d bloggers like this: