బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఒక్కో కొత్తపరిచయం ఎన్నెన్ని జ్ఞాపకాలు తాజా చేస్తుందో…


    మా పూణె లోని ఆంధ్రసంఘం వారు అడపా దడపా చేసే ” మంచి పనుల” లో ఒకటేమిటంటే, వారికి ఏదైనా తెలిసినప్పుడు, “సభ్యులు” అనదగ్గవారందరికీ, వారికి వచ్చిన ఆసక్తికరమైన మెయిల్ ని forward చేసేయడం. ఇదిగో ఇలా నా అదృష్టంకొద్దీ వచ్చినదే మొన్నటి మెయిల్.ఆ మెయిల్ లోని వివరాలు, నాకు ,నేను అంతర్జాలంలో అడుగెట్టినప్పుడే తెలుసు. కానీ వారిచ్చిన లింకుని అంత అమోఘంగా నిర్వహిస్తున్నవారు, ప్రస్తుతం పూణె లోనే ఉంటున్నారని.ఆ మెయిల్ లో ఇచ్చిన వివరాలను బట్టి, ఆయనకి ఓ మెయిల్ పంపిస్తూ, నా నెంబరు ఇచ్చేసి, వారి నెంబరు కూడా పంచుకుంటే సంతోషిస్తానని మొహమ్మాట పెట్టేశాను. మర్నాటికల్లా ఆయనదగ్గరనుంచి ఫోనొచ్చేసింది.

    ఆమాటా, ఈమాటా చెప్పుకుంటూ, మాదీ అమలాపురమే, మీదీ అమలాపురమే తో మొదలెట్టి భూపయ్య అగ్రహారందాకా వచ్చేసింది.ఇంకేముందీ, మా కాలేజీలో చదివిన (ఆరోజుల్లో)వారూ, మాకు స్కూల్లోనూ, కాలేజీలోనూ పాఠాలు చెప్పిన గురువులూ వగైరాలన్నీ దొర్లిపోయాయి.ఆయన నిర్వహిస్తూన్న సైటు గురించి మాట్టాడుకుని, ఎప్పుడో ఒకసారి కలుద్దామని ప్రామిస్సులు చేసేసికుని అక్కడకి ఆ wireless సమావేశం పూర్తిచేశాము.

    నిన్న ప్రొద్దుటే మళ్ళీ ఆయనదగ్గరనుంచి ఫోనూ.. నాతో జరిగిన కొత్తపరిచయం గురించి, వారి మేనమామ గారితో ప్రస్తావించారుట. తీరా ఈయన నా వివరాలు చెప్ప్పేటప్పటికి “అరే.. వాడా.. ఫణిగాడా..” అన్నది మొదటి స్పందనట ! ఎంత సంతోషమనిపించిందో. మరి, కాదండీ, ఎప్పుడో అరవైఏళ్ళక్రితం, కొట్టుకుంటూ, ఆడుకుంటూ, అల్లరి చేస్తూ, రామాలయానికి వెళ్తూ కాలం గడిపిన వారితో మళ్ళీ పరిచయం “తాజా” అయినప్పుడూ? సరే అనేసికుని, వారి ఫోను నెంబరుకూడా తీసికున్నాను.

    తీసేసికోడంతో సరిపోతుందా మరి, ఫోను చేశాను.ముందుగా ఆ పాతరోజులు తిరగతోడి, ఎన్నెన్ని మధుర జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయామో. ఏదో మాట్టాడుతూ, ఎవరిగురించో గుర్తుచేసికోడం,వారి గురించి ఓ నాలుగు మాటలు మాట్టాడుకోడం, మళ్ళీ ఇంకో టాపిక్కులోకి వెళ్ళడం, అలా..అలా.. ఓ ఇరవైనిముషాలు మాట్టాడేసికుని, మరీ ఫోను బిల్లు ఎక్కువైపోతుందని, ఒకరి మెయిల్ ఎడ్రస్ ఒకరు పంచేసికుని, మెయిళ్ళలో అయితే ఖర్చుండదూ అనేసికుని, ఆ గుర్తుచేసికోబడ్డవారి వివరాలు, ఆయన నాకిచ్చేటట్టు ఆస్వాసన్ తీసికుని పెట్టేశాను. మా ఇంటావిడతోనూ, అబ్బాయితోనూ, కోడలితోనూ ఈ వివరాలన్నీ పంచేసికుని, వారితో “ అలాగా..మరి ఇన్నేళ్ళ తరువాత మాట్టాడుకుంటే ఎంత బావుంటుందో కదా..” అని అనిపించేసికుని,“my day is really made..” అని నాకు నేనే అనేసికున్నాను.

    అవునుకదా, మన చిన్నప్పటి జ్ఞాపకాలు అలా అలలు…అలలు…గా గుర్తొస్తూంటే ఎంతబావుంటుందో.ఓ బరువూ, బాధ్యతా ఉండని రోజులు. ఏదో స్కూల్లో చేయవలసిన హోంవర్కు తప్పించి, ఇంకో బాధ్యత ఉండేది కాదు. ఏం కావాల్సొచ్చినా ఇంట్లో అమ్మకో, నాన్న గారికో చెప్పేస్తే సరిపోయేది. ఎవడైనా ఫలానాది తేలేదురా అంటే, వాళ్ళమీద పెట్టేయడం… మా నాన్నగారితో చెప్పడమైతే చెప్పాను, ఆయన తేపోతే నన్నేం చేయమంటారూ… మన పనులు చేయడం తప్ప ఇంకో పనేమీ ఉండదా ఏమిటీ వాళ్ళకి మాత్రం? అయినా అదో సరదా..

    మనం పెద్దయాక, మన పిల్లలు అటువంటి పరిస్థితుల్లో మన గురించి అలా చెప్పినప్పుడు మాత్రం ..” అయ్యొ నీ అఘాయిత్యం కూలా, నిజంగా మర్చిపోయానమ్మా..” అనడం. ఇదేకదా జీవితచక్రం అంటే, మనం మన తల్లితండ్రులతో వేసిన వేషాలన్నీ, మన పిల్లలు మనతో వేయడం, మన అదృష్టం బావుంటే, వారి వారి పిల్లలు అంటే మన మనవలూ, మనవరాళ్ళూ, వాళ్ళ తల్లితండ్రుల్ని అల్లరి పెట్టే దృశ్యాలు చూడ్డం. పక్కనుంచి ఇంటావిడ ” ఎంత సంబడమో..” అని ముసిముసినవ్వులు నవ్వుకోడం. అసలు ఇంత అదృష్టం కలిగించే భాగ్యవిధాత తనే కదా. ఆ ఇల్లాలే లేకపోతే, అసలు ఈ సృష్టి ఎక్కడుండేదీ? ఇంత ఆనందాన్ని మనకి ప్రసాదించిన ఆ భగవంతుడికి మళ్ళీ..మళ్ళీ.. ఠాంక్యూ చెప్పేసికోడం.

    ఇన్ని కబుర్లూ చెప్పి నాకు కొత్తగా పరిచయమయినాయన అద్భుతంగా నిర్వహిస్తూన్న సైటు గురించి చెప్పనే లేదు కదూ.. మామూలుగా ఈ రోజుల్లో అంతర్జాలం ధర్మమా అని, ప్రతీ వారికీ ఫాన్లూ(fans), వాళ్ళకి గ్రూప్పులూ(groups),అన్నీనూ. ఫేస్బుక్కుల్లో గ్రూప్పులు, యాహోల్లో గ్రూప్పులు, అసలువాళ్ళ ప్రతిభా పాటవాలు ఎలా ఉన్నా వీళ్ళ హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఏదో ఖర్మకాలి ఏదో గ్రూప్పులో చేరామా, ఇంక చూడండి, మన ఇన్ బాక్స్ అంతా, ప్రతీ రోజూ వాటితో నిండిపోతుంది.ప్రతీరోజూ ఎవడు చూస్తాడూ ఈ గొడవంతా? ఇవన్నీ ఇప్పటి ” కళాకారుల” గ్రూప్పులూ గట్రానూ. ఎంతైనా గ్రూప్ రాజకీయాలే కదా ప్రస్తుతపు buz word.

    ఇప్పటివాళ్ళ సంగతులు చూడ్డానికి కావలిసినంత మందున్నారు. కానీ మనమధ్య ప్రస్తుతం లేని, ఆనాటి మధుర గాయకుల సంగతి ఎవరు చూస్తారూ? మన తెలుగువారి అమరగాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారంటే అభిమానం ప్రతీ తెలుగువాడికీ ఉంటుంది. కానీ మరీ ఇంత వీరాభిమానమా.. వారి మాటల్లోనే ఇక్కడ 1 2 3 4 వినండి/చూడండి.

    మరి ఇంతటి గొప్పవారితో పరిచయం అవడం,వారిని ఆఫీసులో కలవడం నేనుచేసిన పని ఈవేళ. వారు నిర్వహిస్తూన్న సైటు గురించి చెప్పేలెదు చివరకి…

అది ఏమిటీ అంటే

Visit http://www.ghantasala.info
. అదండీ విషయం…ఎప్పుడో వారింటికి వెళ్ళి ఆయన ఖజానా అంతా చూడాలి…

Advertisements

6 Responses

 1. మాది అమలాపురం మీది అమలాపురం, భూపయ్య అగ్రహారం జ్ఞాపకాల్లోకెళ్ళిపోయి చిన్ననాటి మిత్రులని పట్టేరనమాట.

  Like

  • అ అంటే అమలాపురం
   ఆ అంటే ఆహాపురం
   ఇ అంటే ఇచ్చాపురం

   Like

 2. మీరు అనుభవిస్తున్న అవధులు లేని ఆనందం ప్రతీ పదం లోనూ వ్యక్తమవుతూ మమ్మల్ని అలలుగా తాకుతోందండీ. God bless the people like you…..:-))))))

  Like

 3. శర్మగారూ,

  ఇంతదూరంలో ఇన్నేళ్ళబట్టీ ఉంటూ, ఆమాత్రం ఉండదేమిటీ …

  ఎనానిమస్,

  ఔనుకదూ…

  సాహితీ,

  ఈవేళ మాకు కాలేజీలో ఇంగ్లీషు చెప్పిన ఓ మాస్టారుగారిని కూడా పలకరించాను. నా మెయిల్ కి మా స్నేహితుడు ఇంకో ముగ్గురి వివరాలు తెలియచేస్తూ జవాబిచ్చాడు. ఈవారంలో వాళ్ళ సంగతి చూడాలి. ఎంతైనా 60 ఏళ్ళ తరువాత ఇలా కలవడం నాకైతే చాలా సంతోషమనిపించింది.

  Thanks for the sentiments expressed.

  Like

 4. కొంతమంది మిత్రులు రాసిన ఆర్టికల్స్ అప్పుడప్పుడూ ప్రచురిస్తాను. అలా ప్రచురించినప్పుడు వారి పేరుతోనే ప్రచురిస్తాను.

  Like

 5. మనం పెద్దయాక, మన పిల్లలు అటువంటి పరిస్థితుల్లో మన గురించి అలా చెప్పినప్పుడు మాత్రం ..” అయ్యొ నీ అఘాయిత్యం కూలా, నిజంగా మర్చిపోయానమ్మా..” అనడం. ఇదేకదా జీవితచక్రం అంటే, మనం మన తల్లితండ్రులతో వేసిన వేషాలన్నీ, మన పిల్లలు మనతో వేయడం, మన అదృష్టం బావుంటే, వారి వారి పిల్లలు అంటే మన మనవలూ, మనవరాళ్ళూ, వాళ్ళ తల్లితండ్రుల్ని అల్లరి పెట్టే దృశ్యాలు చూడ్డం. పక్కనుంచి ఇంటావిడ ” ఎంత సంబడమో..” అని ముసిముసినవ్వులు నవ్వుకోడం. అసలు ఇంత అదృష్టం కలిగించే భాగ్యవిధాత తనే కదా. ఆ ఇల్లాలే లేకపోతే, అసలు ఈ సృష్టి ఎక్కడుండేదీ? ఇంత ఆనందాన్ని మనకి ప్రసాదించిన ఆ భగవంతుడికి మళ్ళీ..మళ్ళీ.. ఠాంక్యూ చెప్పేసికోడం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: