బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏంచేస్తే బావుంటుందంటారు……


   ఆమధ్యన ఓ చిన్న కథ లాటిది చదివాను. దాని సారాంశం ఏమిటంటే..ఒక తండ్రి అపురూపరంగా చూసుకుంటున్న తన కొత్త కారు మీద ఓ రాయితో గీతలు పెట్టడం చూస్తాడు. అది చూసి కోపం పట్టలేక, ఆ పిల్లాడిని చడామడా తిట్టేసి, వాడి వేళ్ళమీద ఓ బెత్తంతో కొట్టేస్తాడు. కొట్టడమంటే కొట్టాడు కానీ, మర్నాడు డాక్టరు దగ్గరకి వైద్యం నిమిత్తం తీసికెళ్తాడు.ఎంతైనా సున్నితమైన చేతులాయె, ఈయన దెబ్బలకి ఆ విరిగిపోయిన చేతులకి ఆపరేషను కూడా చేయాల్సొస్తుంది.ఆ తిప్పలేవో పడతాడు.తరువాత తనకొడుకు అసలు ఆ కారుమీద ఏమి గీతలు గీశాడో చూద్దామని కారు దగ్గరకి వెళ్ళి చూస్తే , తాను చూసినది చదివి, గుండెపగిలేలా ఏడుస్తాడు అక్కడ ఆ పిల్లాడు వ్రాసింది…I LOVE YOU DAD అని.పశ్చాత్తాపంతో బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసేసికుంటాడు. ఇదీ కథ.
దీనికి ఒక నీతిని కూడా జోడించారు– “ ఎంత కోపం వచ్చినా సహించాలే కానీ, దండించకూడదూ..” అని.
కథ అయితే హృదయాన్ని కదిలించేస్తుంది. ఇలాటివి తమదాకా వస్తే పాటించే విశాల హృదయం ఉంటుందా అని. ఉంటే గింటే, దానికి threshold ఏమిటీ అని.ఉదాహరణకి ఇంట్లో ఓhyper active పిల్లాడు ఉన్నాడనుకుందాం.ఏదో చిన్నపిల్లాడూ అనుకుని, వాడు చేసే అల్లరంతా భరించాలా, లేక అప్పుడప్పుడైనా దండించాలా? ఈరోజుల్లో తల్లితండ్రుల డిక్షనరీ లో “దండన” అనే మాటే ఉండదు. ఎవరిని అడిగినా వాడు చేసే అల్లరిని learning process అనో ముద్దుపేరు పెడతారు. మా చిన్నప్పుడైతే, అమ్మంటే ముద్దైనా, నాన్నగారు అంటే హడల్. అవే అలవాట్లు, వీళ్ళు, వాళ్ళ పిల్లల విషయంలోనూ పాటించారు. కానీ, 21 వ శతాబ్దం వచ్చేసరికి, playing field అంతా మారిపోయింది. ఎక్కడ చూసినా, మా పిల్లల్ని we treat them as friends అనే మాటే వినిపిస్తోంది.అక్కడకి, వాళ్ళ తల్లితండ్రులు వాళ్ళని శత్రువుల్లా చూసినట్టు .
ఇదివరలో ఒకానొక నా ప్రయాణం లో ఒకాయనని కలుసుకున్నాను. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.ఆయనకి ఒకవైపే వినిపిస్తుంది, ఆయనే చెప్పారు దానికి కారణం- వారి మనవడు చేసిన ఓ అల్లరి పనే దానికి కారణమని.బలవంతం పెట్టి ఈయన చెవిలో ఒక spring action ఉన్న ఓ ఇయర్ ఫోను పెట్టేసి ఆడుకుంటూ, ఏదో అయి, ఆ spring కాస్తా ఆయన ear drum ని pierce చేసేసి, జీవితాంతం వినే శక్తి కోల్పోయారు. ఈ సంఘటనని ఇంకో కోణం లో ఆలోచించి, ఆ పిల్లవాడు కొద్దిగా hyper active అని తెలిసినప్పుడు, తల్లితండ్రులు ముందరినుంచే కట్టడి చేస్తే, ఇలాటి దుర్ఘటన జరిగుండేదే కాదేమో.

ఈ కట్టడులూ, దండన లూ, మన దేశంలో ఉండే పిల్లల తల్లితండ్రులకి మాత్రమే. ఎందుకంటే బయటి దేశాల్లో అసలు పిల్లలమీద చెయ్యెత్తడం మాట దేముడెరుగు, గట్టిగా కోప్పడితేనే, వాళ్ళకి పోలీసులని పిలిచే సౌలభ్యం ఉందని విన్నాను. అప్పుడెప్పుడో నార్వే గొడవ వినలేదూ? అందువలన నచ్చినా నచ్చకపోయినా భరించాల్సిందే. అలాగని అందరు పిల్లలూ ఆకతాయిలనికాదూ. పైగా, చిన్నపిల్లలు చేయాల్సిన వయస్సులో అల్లరే చేయకుండా, మరీ ముంగిలా కూర్చుంటే, మళ్ళీ అదో సమస్యా, ఎదుగుదలలో ఏదైనా లోపం ఉందేమో అని డాక్టర్లదగ్గరకి తీసికెళ్ళాలి. కానీ అల్లరి అనేది ఎంతదాకా భరించాలి? Endurance limit అనేది ఏమిటి?

ఇలాటివన్నీ తెలిసికోడానికి counselling కి వెళ్ళే తల్లితండ్రుల్నీ చూశాము. అసలు మన పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పడానికి, అసలు ఇంకోరి అవసరం ఏమిటీ?ఇప్పుడు దేశంలో జరిగే అత్యాచారాలకి ముఖ్యకారణం, ఇంట్లో పిల్లల్ని కట్టడి చేయకపోవడం ఒకటేమో అని నా అభిప్రాయం. కారణం, ఎక్కడకోప్పడితే కొంప వదిలేసి పారిపోతాడో అని ఓ భయం, కొంతమందైతే ఆత్మహత్యలకి కూడా దిగుతారు. మరి ఇలాటి పరిస్థితుల్లో ఏం చేయడం?

టీవీల్లో వచ్చే చర్చలు ఇలాగే తగలడతాయి. సమస్య ఫలానా అంటారు. ఎవడి నోటికొచ్చినది ( నాలాగ) వాగేస్తారు. ఈ సమస్యకి సమాధానం ఏమిటిరా అంటే, సమాజమే నిర్ణయించాలనీ, చర్చకి టైమైపోయిందనీ చెప్పేసి, ఇంకో కార్యక్రమానికి వెళ్ళిపోతారు. నిన్న hmtv లో ఓ చర్చా కార్యక్రమం వినే “అదృష్టం” కలిగింది.దాంట్లో విషయమేమిటయ్యా అంటే, టీవీ ల్లో వచ్చే డబ్బింగ్ సీరియల్స్ వద్దని కొందరూ, కట్టేస్తే డబ్బింగ్ ఆర్టిస్టుల గతేమిటని కొందరూ ఆందోళన చేస్తున్నారుట, ఓ రెండు చానెళ్ళవాళ్ళు కట్టేయడానికి ఒప్పుకున్నారుట, ఆ ఒప్పుకోని ఒక చానెల్ మీద పదిహేను రోజులక్రితం దాడి చేశారు.

సరేనండీ, పరభాషలోని సీరియళ్ళు, డబ్బింగు చేయొద్దన్నారు,కావలిస్తే ఆ భాషలోని original నే చూడమన్నారు. అచ్చతెలుగు సీరియళ్ళు రాకపోవడం చేత తెలుగు టీవీ కళాకారులు అదేదో లెఖ్ఖ చెప్పారు, వాళ్ళందరూ వీధిన పడతారుట.డబ్బింగులు ఆపేస్తే మరి ఆ డబ్బింగులవాళ్ళ మాటేమిటీ? ఏ చానెల్ వాడు తీసినా ఏదో సామాజిక సేవ చేయాలని కాదు తీసేది, నాలుగు రాళ్ళు చేసికుందామనే కదా.ఏదో మాయదారి దృశ్యాలూ, వగైరాలు చూపించడం, పైగా ప్రజలకోరికమీదే అలా తీస్తున్నామని ఓ దబాయింపూ. ఈ సీరియళ్ళు చూసి, ఆంధ్రదేశంలో అత్తాకోడళ్ళు, ఎవరి పీక ఎవరు నొక్కుదామా అని చూస్తూన్నట్టే అనిపిస్తుంది.మధ్యలో ఓ ఆడపడుచు ఒకర్తీ. మధ్యలో ఇంకా చిత్రవిచిత్ర పాత్రలు కూడా వస్తూంటాయనుకోండి. జీడిపాకంలా సా…గ….తీ..స్తూ.. నే.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూంటాయి.అలాగని హిందీలో ఏదో పొడిచేస్తున్నాయని కాదు, అవీ అలాగే తగలడ్డాయి.అసలు ఈ మాయదారి సీరియళ్ళని ఎత్తేస్తే మంచిదీ అనే ఆలోచన ఎందుకు రాదో అర్ధం అవదు. ఈ శాటిలైట్ చానెళ్ళు వచ్చినతరువాతే మొదలయింది ఈ దరిద్రం అంతా. ఖాళీ టైములో మమ్మల్నేంచేయమంటారూ అని కొందరు ధర్నాలు చేసినా చేయొచ్చు.

3 Responses

  1. అయ్యా ఈ దరిద్రం యెప్పుడూ యేదో‌ఒక రూపంలో ఉన్నదేనండీ.
    మొదట్లో ఇది కాలక్షేపానికి అమ్మలక్కల కబుర్లరూపంలో‌ఉండేది. నోటిదురద మహిళలు కాపురాలు బాగానే కూల్చేవారు తమ ఊహాచాతుర్యాలతోనూ‌ కథాకథనవిన్యాసాలతోనూ. ఆడవాళ్ళకు తరువాత నవలల రూపంలో కాలక్షేపం సరుకు దొరికింది. మాలతీ చందూర్ గారైతే ఒకసారి జవాబులు శీర్షికలో ఒకమ్మాయితో తెలుగు అక్షరాలు నేర్చుకుని ఖాళీగా ఉన్నావా, ఇంకా నవలలు వ్రాయటం మొదలు పెట్టలేదా అన్నారు. ఆ తరువాత సినిమాల కాలక్షేపం ముదిరింది. నవల స్థానంలో‌నేడు TV సీరియళ్ళు వచ్చాయి అంటే. సరుకంతా నేలవిడచిన సాములాంటి వ్యవహారాలే.

    Like

  2. చేసుకున్నవారికి చేసుకున్నంత అని,మరీ మనవడు ఎం ఆడమంటే అలా ఆడితే,చెవేం కర్మ ఇంకా చాలా ప్రమాదాలు జరగొచ్చు…మన చేతుల్లొ లేని ప్రమాదాలను ఎటూ ఆపలేం..తెలిసి తెలిసి అన్నటికి తలాడిస్తే కష్టం …
    మనవల్ల ఇంకొకరికి ఎ విధమైన ఇబ్బంది కలగకూడదు అన్న చిన్న commensense నెర్పించాలి పిల్లలకి చిన్నప్పుడే …I teach that to my 2yr old whenever possible….sure,they do get upset but eventually will learn…being a small kid doesn’t mean,they can rule the world…

    Like

  3. శ్యామలరావుగారూ,

    “సరుకంతా నేలవిడచిన సాములాంటి వ్యవహారాలే…” అక్షరసత్యం మాస్టారూ….

    నిరుపమా,

    “eventually will learn..” నేర్చుకుంటే ఫరవాలేదు. అలాకాకుండా, వాళ్ళే నేర్చుకుంటారులే అన్నప్పుడే అసలు గొడవంతానూ…

    Like

Leave a comment