బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…


    ఈ నెలలో ఈవేళా, రేపూ సారస్వతిక సమ్మెకి వెళ్తున్నామని, almost అన్ని ట్రేడ్ యూనియన్లూ ( కాంగ్రెస్ వారితో సహా) ఎప్పుడో చెప్పారు, దానికి సంబంధించిన నోటీసులూ గట్రాకూడా ఇచ్చేశారు. ఇదేదో అకస్మాత్తుగా వచ్చిందని ఎవరూ అపోహపడఖ్ఖర్లేదు.ఈ సమ్మెలూ అవీ, కార్మికులకున్న ఒకేఒక అస్త్రం. అది ఎవరూ కాదనలేరు, పైగా కాదంటే మళ్ళీ అదో గొడవా..అన్ని యూనియన్లూ కలిసి చేయడం బహుశా ఇదే మొదటిసారేమో. ప్రతీసారీ ఏదో యూనియను వాళ్ళు నోటీసులివ్వడం, ఇంకోరు దాన్ని వ్యతిరేకించడమూనూ. దానితో చాలాసార్లు ఈ సమ్మెలు అంత విజయవంతమయినాయి కావు.

   ఈ సమ్మెల్లో కార్మికులకోరికలు ఓ పెద్ద లిస్టు ఉంటుంది. అందరికీ తెలుసు వాళ్ళు అడిగేవన్నీ ప్రభుత్వమూ ఇవ్వదూ అని, అయినా చావుకి పెడితేనే కానీ లంఖణం లోకి దిగదూ అని ఎడాపెడా అడిగేస్తూంటారు.ఇలాటి సమయాల్లో ప్రభుత్వం వారు కూడా ఓ ప్రకటన చేసేస్తూంటారు–సమ్మె అన్నది న్యాయబధ్ధమైనది కాదూ,ఆ రోజున ఏదైనా కారణం చేత విధులకి హాజరవనివారి మీద క్రమశిక్షణా చర్యలు తీసికోబడతాయీ.. వగైరా.. వగైరా. అలాగని చేసేవాళ్ళు మానా మానరు.వాళ్ళకీ తెలుసు ఇవన్నీ ఉత్తిత్తివే అని. ఏదో మొత్తానికి సాయంత్రానికల్లా మా సమ్మె విజయవంతం అని ట్రేడ్ యూనియన్లూ, కాదూ సమ్మె ప్రభావం ఏమీ లేదు సామాన్యప్రజానీకం మీదా అని ప్రభుత్వం వారూ ప్రకటనలు చేసేస్తారు.

    ఇంక మన టివీ చానెళ్ళవాళ్ళకైతే పండగే పండగ. ఈవేళ్టి సమ్మె ( ఇంకా మొదటిరోజే) లో అక్కడెక్కడో నొయిడా లో జరిగిన హడావిడంతా రోజంతా చూపించారు. అంటే దానర్ధం- ఎక్కడా హింసాత్మకంగా జరగని ప్రదేశాల్లో, ఎలా చేయాలో పాఠాలు నేర్పుతున్నట్టా? పోనీ ప్రభుత్వం వారి దూరదర్శన్ చూద్దామా అంటే, సమ్మె దేశంలో అసలు విజయవంతమే కాదన్నట్టు చూపిస్తారు.ఎవరిని నమ్మాలి?

    ఈ సమ్మెల్లో ప్రభావితం అయ్యేవారు చెప్పాలంటే సామాన్యప్రజానీకం.ఇన్నిన్ని కబుర్లు చెప్తారే ఈ రాజకీయనాయకులూ, వారిని ఎన్నుకున్న సామాన్యప్రజల పట్ల వారికి బాధ్యతలేదా? ఈ సమ్మెల్లో ముందుగా బలైపోయేవి ప్రభుత్వ ఆస్థులు. పైగా ఏమైనా అంటే అసలు ఈ సమ్మెలు price raise గురించేకదా అని ఓ సెర్మనూ.పనీపాటాలేని వారందరికీ ఏదో ఒక వ్యాపకం కావొద్దూ, కనిపించిన ప్రతీదీ తగలెట్టేయడం ఫైరింజన్లతో సహా. వీళ్ళను చెదరగొట్టడానికి పోలీసులూ, భాష్పవాయువులూ, మరీ ఎక్కువైపోతే ఫైరింగూ. మరి అంత హడావిడిలో లాఠీచార్జింగు జరిగితే ఎవరికో ఒకరికి దెబ్బలు తగలకుండా ఉంటాయా? ఫైరింగులో కూడా ఎవరో ఒకరు గాయపడ్డమూ, లేదా మరణించడమూ జరిగిందంటే జరగదా మరి?

   అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే ఇలా గాయపడ్డవారిలోనూ, మరణించినవారిలోనూ ఒక్కడంటే ఒక్క రాజకీయనాయకుడైనా లేకపోవడం ! ఏదో పొద్దున్నే వచ్చేసి నాలుగు కేకలెసేస్తే పోలీసులు వాళ్ళని అరెస్టు చేసేస్తారు. అది వాళ్ళకీ తెలుసు,హాయిగా రోజంతా పోలీసు కస్టడీ లో కూర్చుని, సాయంత్రానికో, మర్నాడో, ఏ తలమాసిన చానెల్ వాడో పిలిస్తే నోటికొచ్చినట్టు పేలడం.ఏమైనా అంటే ఇదంతా నాయకత్వం అని ఓ పేరోటీ!!

    పైగా ఏమైనా అంటే, అప్పుడే పదేళ్ళయింది సమ్మెలు చేసీ, ప్రభుత్వానికి పట్టఖ్ఖర్లేదా, జీతాలు పెంచాలనీ. ఏ పార్టీ అయినా ధరలు పెరగవూ అని ఆస్వాసన్ ఇవ్వగలరా? పోనీ ప్రభుత్వం వారు ఒప్పుకున్నారే అనుకోండి, అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తున్నామూ అని, జరిగేదేమిటీ బడ్జెట్ లో మళ్ళీ ఎడాపెడా పన్నులు. వాళ్ళకి మాత్రం డబ్బులెక్కణ్ణించి వస్తాయీ? మళ్ళీ అధికధరలూ, సమ్మెలూనూ. ఇదో విషస్ సర్కిల్.

    ఇవేమీ సరిపోవన్నట్టు బిజేపీ వారు, ఆ షిందేగారేదో అన్నారుట, ఆ “మాట” వెనక్కు తీసికుని క్షమాపణ చెప్పేదాకా, పార్లమెంటు బడ్జెట్ సెషన్ జరగనీయమూ అని ఈవేళ ఢిల్లీలో ప్రదర్శనలూ గట్రానూ. ఇప్పుడు ఆయనెవరో క్షమాపణ చెప్పినా, అనవలసిన మాటేదో అననే అన్నాడుకదా. ఇప్పుడు ఒరిగేదేమిటిట? ఓవైపున భారత్ బంధ్ జరుగుతూంటే, మళ్ళీ ఈ గొడవేమిటిట? అయినా రాజకీయపార్టీలకి కారణాలే కావాలా ఏమిటీ పార్లమెంటు జరగనీయకుండా ఉండడానికీ, ఏదో ఓ వంక.ఈ ఏడాదంతా సెషన్లు జరగనీయకుండా ఉండడానికి ఎన్నెన్నో కారణాలు చెప్పారు. మొత్తానికి కాలం గడిపేశారు. ఇంకో ఏడాది మహ అయితే. మళ్ళీ ఎన్నికలూ, ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు, మళ్ళీ ఆ నెగ్గనివాళ్ళు మొదలూ.

    ఒక విషయం నిజమే. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాలంలో, UPA లోనే ఎక్కువ స్కామ్ములు “వెలుగు” లోకి వచ్చాయీ అన్నది. అందులో డౌటేమీ లేదు. రోజుకో స్కామ్ము బయటపడుతోంది.తినడం అనేది అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జీవనది లాటిది !

   అసలు జీతాలు సరిపోడంలేదో అని ప్రతీసారీ సమ్మెలు చేస్తారే, దానికి సగం కారణం మనమే కదా! ఈ సందర్భంలోనే అప్పుడెప్పుడో ఒక టపా పెట్టాను. గవర్నమెంటులో నేనూ పనిచెసినవాడినే. వాళ్ళిచ్చే జీతం సరిపోతోందా లేదా అనే విషయం కొద్దిగా నాకూ అవగాహన ఉంది. కానీ ఇచ్చేజీతానికి బాధ్యతగా పనిచెసేవారెంతమంది? మళ్ళీ అలాటివి అడక్కూడదు.అడిగితే, ఇంతేసి ధరలతో సంసారం గడపడమెలాగా, మీరోజుల్లో అయితే ఇంతంత ఖరీదులుండేవా ఏమిటీ అంటారు. నిజమే కాదనం, కానీ ధరలు ఇలా ఆకాశాన్నంటడానికి కూడా మనమే కారణం కదా.మనుష్యుల మనస్థత్వాల్లో మార్పు రానంతవరకూ, జీతాలెంతంత వచ్చినా ఇంకా..ఇంకా.. కావాలనే ఉంటుంది.

    ఈ సమ్మె ధర్మమా అని ప్రభుత్వరంగబ్యాంకుల వాళ్ళూ రెండు రోజుల సమ్మెట.మొన్న SBH కి ఓ పనిమీదవెళ్ళాను. ఆరోజు system down ట, రెండోరోజు శివజయంతి శలవుట, తరువాత రెండురోజులూ సమ్మెట.. తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు.ఇదీ పరిస్థితి.ఇలాటివవుతూనే ఉంటాయి, ప్రతీదానికీ ఇలా కడిగేస్తూంటే ఎలాగా అంటారు. ప్రెవేట్ రంగంలో వాళ్ళెవరైనా సమ్మె చేస్తారేమో చూడండి, సమ్మె అంటే ఓ నెలజీతం చేతిలోపెట్టి కొంపకెళ్ళమంటారు. అలాగని మన హక్కు ఉపయోగించొద్దూ అని కాదు, ఏదో ఒక రోజైతే పరవాలేదు, కాలక్షేపం చేసేస్తారు. కానీ రెండురోజులు ఎక్కువేమో. పైగా ఆయనెవడో చెప్పనేచెప్పాడు, మా కోరికల్లో ఏ ఒకటో రెండో ఒప్పేసికుని, మిగిలిన చిఠ్ఠాలోవాటికి సంప్రదింపులు చేస్తామూ అన్నా కానీ ఒప్పెసికుంటామూ అన్నాడు.This shows how serious this strike is.. మళ్ళీ ఎల్లుండినుంచి మామూలే.. పెట్రొల్ ధరా పెరగొచ్చు అలాగని గాడీలు మానేశారా? రైళ్ళ టిక్కెట్టు ధరలూ పెరగొచ్చు అలాగని ప్రయాణాలు మానేస్తామా? ఈ వంకలు పెట్టి ప్రతీవాడూ ధరలు పెంచేసేవాడే.

    Life goes on… మేరా భారత్ మహాన్...

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: