బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అప్పుడే యాభైఏళ్లు పూర్తయ్యాయి…


    టపా శీర్షిక చూసి ఆ యాభై ఏళ్ళన్నది నా వయస్సుకి సంబంధించింది కాదూ, ఈ పూనా నగరానికి వచ్చీ అని మనవి చేసికుంటున్నాను. అయితే ఏమిటిట అనిమాత్రం అనకండి. అవేవో పాతిక్కీ, యాభైలకీ, వందలకీ పండగలు చేసికుంటారే, ఇదీ అలాగే. ఎంత చెప్పినా యాభైఏళ్ళంటే మాటలాండీ? పుట్టి పెరిగిన కోనసీమలో ఉన్నది 18 సంవత్సరాలే. కానీ, జీవితానికి సరిపడేనన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నిజంచెప్పాలంటే, ఆ జ్ఞాపకాల పునాదిలమీదే కదా, ఇక్కడి ప్రస్థానం మొదలెట్టింది ! ఇప్పటికీ , ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉంటే, టక్కున ఆనాటి జ్ఞాపకాలు తాజా చేసికున్నప్పుడల్లా, మళ్ళీ పుంజుకుంటూంటాను.

   1963 లో పూనా వచ్చినప్పుడు, అప్పటిదాకా రైలంటే తెలియని అమాయక అర్భక ప్రాణిని, అలాగని ఇప్పుడేదో పేద్ద గొప్పవాడినైపోయాననికాదు. బ్రతుకుతెరువేదో నేర్చుకున్నాను. ఈ ప్రస్థానంలో ఎంతోమంది మిత్రుల్ని ఉద్యోగరీత్యా సంపాదించుకోగలిగాను.అలాటిది ఎప్పుడో పుట్టిపెరిగిన చోటుకి, ఇన్నేళ్ళ తరువాత వెళ్ళి, మళ్ళీ జీవితంప్రారంభించడం కొద్దిగా శ్రమౌతుందేమోననే భయం ఓటీ. ఆరోజుల్లో మనసహాధ్యాయులూ ఎవరూ ఉండరూ, ఉన్నవాళ్ళెవరికీ మన సంగతి పట్టదూ, ఏదో డబ్బూదస్కం ఉంటే సంగతి వేరనుకోండి, ఏవేవో సామాజికసేవలు (పుట్టిపెరిగిన ఊరికి) చేస్తూ, ఏదో నలుగురినోళ్ళలోనూ బతికేయొచ్చు.కానీ అలాటి ఆర్ధిక స్థోమతుండాలికదా. పెన్షన్లమీద బతికే మాలాటివారికి అది కష్టమైన పని.

   ఏదో “ఎత్తిపెట్టినట్టు” గా ఇన్నేళ్ళూ తిండిపెట్టిన ఉన్న ఊరిని వదిలేసి, ఏవో సెంటిమెంట్ల పేరుతో, అక్కడేదో ఉధ్ధరించేద్దామనుకోడం బుధ్ధితక్కువేమో అని నా అభిప్రాయం. పైగా సామాజికంగా కూడా ఊర్లు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా ” నువ్వు మాకేమిస్తావూ..” అనే కానీ, ఇంకో ఆలోచన ఉండడంలేదు. వీటికి కారణాలు లెఖ్ఖలేనన్నున్నాయి.ఎక్కడ చూసినా “కులం.. కులం…”. ఆ మధ్యన ఎప్పుడో మనవైపు బస్సులో వెళ్తున్నప్పుడు, ఓ పెద్దమనిషి, “మీరేమిట్లండీ..” అని అడగడంతో షాకయ్యింది.నేనేమిటైతే ఆ పెద్దమనిషికెందుకూ అసలూ, వల్లకాట్లో రామలింగయ్యని.ఇలాటివి ఆరోజుల్లో లేవా అని కాదు, ఉండేవి, కానీ మరీ ఇంత ఉధృతంగా కాదు.ఎక్కడచూసినా (including piligrim centres ) కులప్రాతిపదికమీద సత్రాలూ, హాస్టళ్ళూ. ఇలా కులం పేరుతో ప్రజానీకాన్ని polarise చేసేశారు.దీనంతటికీ ముఖ్యదోషులు రాజకీయనాయకులే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఓట్ల రాజకీయాల పేరుతో జనాలమధ్య లేనిపోని శత్రుత్వాలు పెంచేశారు. వీటికి సాయం గత రెండుమూడేళ్ళుగా సాగుతున్నప్రాంతీయ రాజకీయాలోటీ. ఎప్పుడేం గొడవొస్తుందో తెలియదు, ఏ రోజు బస్సెళ్తుందో, ఏరోజు రైలు రోకో ఉంటుందో తెలియదు. వీటన్నిటికీ ఎవరి కారణాలు వాళ్ళు చెప్తారనుకోండి.

    ప్రస్థుతం ఆంధ్రదేశంలో ఉంటున్నవాళ్ళందరూ పడడంలేదా ఈ అవస్థలన్నీ, వాళ్ళు మాత్రం బతకడంలేదా అనొచ్చు. కరెక్టే. కానీ హాయిగా ఏ గొడవలూ లేకుండా బతికేస్తూ, లేనిపోని చిరాకులు తెచ్చుకోడం అంత అవసరమంటారా? ఇదివరకటి రోజుల్లా కాదు,ఇప్పుడు పూణే లోకూడా మనప్రాంతాల్లో దొరికే ప్రతీ వంటకమూ, కూరా నారా, చదువుకోడానికి అచ్చతెలుగు పుస్తకాలూ, ఆంధ్రదేశంలో రిలీజైన రోజే చూడ్డానికి తెలుగుసినిమాలూ, ఆ థియేటర్లలో అభిమాన నటుడు తెరమీదకొచ్చినప్పుడు వేసే ఈలలూ, కేకలతో సహా ఇక్కడే దొరుకుతున్నాయి.కరెంటు కోతలు లేవు.రోజుకో బందుచొప్పున లేవు.ప్రతీ ఏడాదీ వంతుతప్పకుండా వచ్చే తుఫాన్లూ, సైక్లోన్లూ లేవూ.

    వెదకాలేకానీ, తెలుగుమాట్టాడేవారు ఓ అయిదులక్షలమందిదాకా ఉన్నారు. తెలుగు స్నేహితులంటరా, ఓ పదిపదిహేనుమందుంటే చాలదండీ? మా ఫ్రెండెవరో చెప్పినట్టుగా “అవసరానికి” ఓ నలుగురుంటే చాలుట ! నిన్ననే ఓ కొత్త స్నేహితుడితో పరిచయం అయింది. ఆయన ఇక్కడ ముఫై ఏళ్ళనుండీ ఉంటున్నారుట, ఇన్నాళ్ళకి పరిచయం చేసికునే యోగం పట్టింది.

    ఇంక రాజకీయాల ప్రభావం అంటారా, ప్రతీచోటా ఉండేదే.కానీ ప్రత్యేకత ఏమిటంటే దాని ప్రభావం సామాన్యమానవుడి మీద, మన రాష్ట్రంలో ఉన్నంత కాదు. మన దారిని మనముంటే, ఎవడూ మన జోలికి రాడు, మరాఠీవారిదీ, మనదీ పంచాంగం ఒక్కటే కావడంతో, పండగలూ, పబ్బాలకీ కూడా తేడా లేదు. ఏదో డెభ్భైల్లో శివసేన వాళ్ళేదో దక్షిణభారతీయులమీద గొడవలు పెట్టారు కానీ, ఇప్పుడలాటిదేమీ కనిపించదు.Live and let live అనే పధ్ధతిమీదే నడుస్తోంది.

   కానీ ఇన్నేళ్ళలోనూ జరిగిన మార్పేమిటంటే, ఇదివరకటి రోజుల్లో పూనా ని “ Pensioners’ Paradise” అనే వారు, ప్రశాంతవాతావరణమూ, ఎక్కడ చూసినా సైకిళ్ళూ, చాలామంది నెత్తిమీద టోపీలూMaharashtian Topi, అలాటిది ఈరోజుల్లో ఏ అన్నా హజారే గారి నెత్తిమీద తప్ప అస్సలు టోపీలే కనబడవే ! అలాగే ఇదివరకటి పర్ణకుటీరాల స్థానంలో స్కై స్క్రేపర్లూ, రో హౌస్సులూ, గేటెడ్ కమ్యూనిటీలూ, ఫ్లైఓవర్లూ, ఒకటేమిటి అన్నినగరాల్లోనూ ఉండే అవలక్షణాలూ పూణే మహానగరాన్నీ వదిలిపెట్టలేదు. జనాభా పెరుగుదలతో ఇవి ఓ occupational hazardలాటివి.

   అలాగని మిగిలిన విషయాల్లో ఇదేమీ UTOPIAN అనడంలేదు.కానీ మిగిలిన మహానగరాలతో పోలిస్తే పూణె చాలా..చాలా.. మంచిదీ అనొచ్చు. అన్ని ఊళ్ళూ తిరిగొచ్చారా అంటే, లేదూ అనే సమాధానం. అయినా అక్కడుంటేనే కానీ తెలియదా ఏమిటీ, దినదినప్రవర్ధమానం చెందుతున్న మన చానెళ్ళూ, పేపర్లూ చాలవూ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూందో క్షణాల్లో చెప్పడానికీ…

   ఇంతలా ఉన్నాకానీ, పునర్జన్మంటూ ఉంటే ఆ భగవంతుణ్ణి కోరుకునేదేమిటంటే, ఆ పుట్టేదేదో ఈ జన్మిచ్చిన తల్లితండ్రుల కడుపునే, మళ్ళీ ఆ సుందర కోనసీమ లోనే పుట్టించమనీ..మళ్ళీ ఆ జన్మలోకూడా, ఈ “ఇంటావిడ” తోనే కలపమనీ….

9 Responses

 1. అప్పుడే ఏబయేళ్ళయిందా! వయసొచ్చాకా అందరి కోరికలూ ఒకలాగేఉంటాయా!!శుభకామనలు, మీకు, చెల్లాయికి, మీ కుటుంబానికీ.

  Like

 2. చాల బాగా రాసారు మాస్టారు మీ అనుభవాలు. మీ పూణే ముచ్చట్లు అన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. కోనసీమ లో పుట్టి పూణే లో స్థిరపడిన మీరు తెలుగు లో ఇలాంటి బ్లాగు నడుపుతున్నందుకు అభినందనలు. మీకు యాభై ఏళ్ళు నిండినందుకు శుభాకాంక్షలు.

  Like

 3. అభినందనలు . యాబై సంవత్సరాలు అదీ ఊరు కాని ఊళ్ళో, బాష రాని ఊళ్ళో , నిలబడి జీవితం లో నెగ్గుకొచ్చి నందుకు.
  మీ బ్లాగ్ ప్రయాణం , జీవిత ప్రయాణం ఇంకా successful గా కొనసాగాలని కోరుకుంటూ…

  Like

 4. శర్మగారూ,

  “వయసొచ్చాకా అందరి కోరికలూ ఒకలాగేఉంటాయా!” కదా !! ధన్యవాదాలు…

  నవజీవన్,

  అనుకున్నంతా అయింది !! నాక్కాదండి యాభైఏళ్ళు, నేనిక్కడకు వచ్చి యాభై ఏళ్ళయింది ! మీ అభినందలకి ధన్యవాదాలు…

  వెంకట్,
  భగవంతుని దయతో నెగ్గుకొచ్చాననే భావిస్తున్నాను.

  “మీ బ్లాగ్ ప్రయాణం , జీవిత ప్రయాణం ఇంకా successful గా కొనసాగాలని కోరుకుంటూ” thanks…

  Like

 5. Chala manchidandi.

  Like

 6. పుణ్య నగరిలోచేరి యాభై ఏళ్ళు నిండిన సంధర్భంగా శుభాకాంక్షలు.
  నాకు ఆరేళ్ళ జీవితాన్ని మా అమ్మాయిని , తన అమ్మాయిని ( మా మనమరాలని)
  ఇచ్చిన మరువలేని, మా మంచి ఊరు పూణే నగరం.

  Like

 7. అరుణ,

  థాంక్స్…

  డాక్టరుగారూ,

  పుణ్య నగరి మీద మీ అభిప్రాయం కూడా వ్యక్తపరచినందుకు ధన్యవాదాలు…

  Like

 8. ఆఖరి లైను నాకు నచ్చలేదు.. మళ్ళి జన్మ అంటూ వుంటే మీకు పొట్ట కూటి కోసం ఆశ్రయమిచ్చి, మీ పిల్ల పోషణకి, చదువుకి కావలసినంత జీతమిచ్చి.. మీ జీవితాలకి భద్రతని, స్వేచ్చని ఇచ్చిన పూనా లోనే మీరు మళ్ళి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను… యాభై ఏళ్ళుగా పూనా గాలి పీల్చారు, నీళ్ళు తాగారు, జేబు నింపుకున్నారు… పుట్టడం తప్ప కోనసీమ ఏమిచ్చింది మీకు.. మనకున్న ఈ ప్రాంతీయ అభిమానాల వల్లనే మీరు రాసిన ఇక్కడ గొడవలకి మూల కారణం.. మేరా భారత్ మహాన్.. మహాన్.. మహాన్..

  Like

 9. శంకర్ వోలేటి గారూ,

  మీరు చెప్పిందీ కరెక్టే కొంతవరకూ..కానీ ఈ జన్మలో పుట్టినట్టే ఆ తల్లితండ్రుల కడుపునే పుట్టాలనుకుంటే, కోనసీమే వెళ్ళాలికదా !! మళ్ళీ వాళ్ళని పూణే నగరానికి రమ్మంటే రారేమో.. అదీ చూడాలిగా…
  కోనసీమ ఏమిచ్చిందని అడుగుతున్నారు– జన్మిచ్చింది చాలదా మాస్టారూ?

  ఇంక ప్రాంతీయాభిమానమంటారా.. అదొకటే అందరిలోనూ ఉండే బలహీనత…

  ఆంధ్రదేశంలోని గొడవలకి మూలకారణం రాజకీయనాయకులు, జనాలు కాదు. వాళ్ళలో ప్రాంతీయాభిమానాలు రెచ్చకొట్టి, లేనిపోని గొడవలు తెస్తున్నారు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: