బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అవతలివాడు బాగుపడిపోతున్నాడేమో…..


    కొంతమందుంటారు, వాళ్ళకి ఎప్పుడూ ఒకటే ధ్యాస.. అవతలివాడు, మనకంటే ఏదో బాగుపడిపోతున్నాడేమో అనే ఏడుపు!దానితో అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాటనడమో, అడిగినవాడికీ, అడగనివాడికీ దండోరా వేయడమో.అవతలివారు, ఏదో తమ దారిన తాము వెళ్తున్నారుగా, అసలు ఈ “పక్షుల” కి ఎందుకూ అంట? ఆ పక్షులు మొగాళ్ళవొచ్చు, ఆడాళ్ళవొచ్చు.ఏడవడం వచ్చేసరికి లింగవివక్షతనేదుండదు.మనం చేయలేనిదేదో, అవతలివాడు చేస్తున్నాడూ, వాళ్ళకి తాటాకులుకట్టడం మన పనీ, అంతే!దానికి ఓ అర్ధం పర్ధం ఉండదు.

ఇదివరకటి రోజుల్లో , ఇదివరకేమిటిలెండి, ఈమధ్యదాకా, అంటే ప్రభుత్వం వారు పే కమీషను వేసి, ప్రభుత్వోద్యోగులకీ జీతాలు పెంచేదాకా, కుటుంబ పరిస్థితులవలననండి, లేదా, ఇంట్లో సౌఖ్యం, శాంతీ ఉండకపోవడంవలననండి, ఏదో ఒక కారణంచేత, ఉద్యోగానికి సాయంగా, ఆఫీసునుంచి వచ్చేసిన తరువాత, అక్కడినుంచే direct గానో, ఇంటికొచ్చి ఓ కాఫీయో, చాయో తాగేసి, ఓ రెండు మూడు గంటలపాటు ఓ part time job చేసేవారు.ఏ రాత్రి తొమ్మిదింటికో, పదింటికో కొంపకు చేరేవారు. మళ్ళీ ప్రొద్దుటే లేవడం, ఆఫీసూ వగైరా..ఇలా వచ్చిన పైసంపాదన తనుసంపాదిస్తున్న జీతభత్యాలకి వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలాగ ఉపయోగపడేది.అదేమీ తప్పేం కాదు.చూసేవాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.

ఇంటిమగాడు, ఏదో రెండుమూడు బట్టల దుకాణాల్లోనో, కిరాణా దుకాణాల్లోనో పద్దులు వ్రాయడం, వాళ్ళ ఎకౌంట్లు చూడ్డం చేసేవారు. వాటినే ఈ రోజుల్లో data entry అని ఓ sophisticated పేరు పెట్టేరనుకోండి, అది వేరే విషయం.మా ఫ్రెండొకాయనుండేవాడు, తెలుగువాడే, ఫాక్టరీ లో షిఫ్టులని బట్టి, ఓ ఆటో నడుపుకునేవాడు.అది తప్పని ఎలా అనగలమూ? ఇళ్ళల్లో ఆడవారు,ఏ బ్యుటీషియన్ కోర్సో చేసి, హాయిగా ఇంట్లోనే ఓ పార్లరు లాటిది తెరిచి పని చేసేవారు. కాదూ కూడదూ అనుకుంటే, హాయిగా బట్టలు కుట్టడం నేర్చుకోడం, కాలనీలో వాళ్ళకి కుడుతూండడం. అలా అలవాటై చేసినవాళ్ళే ఇప్పుడు, బొటీక్కులూ అవీ ప్రారంభించారు.లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు.

కానీ, వీళ్ళందరూ ఆ part time joబ్బులు ప్రారంభించినప్పుడు, మన ” పక్షులు” న్నారే, వాళ్ళు ఎంతంతగా యాగీ చేసేవారో- “విన్నావుటే.. ఫలానా ఆవిడ బట్టలు కుడుతోందిట, మన ఇంటా వంటా ఎక్కడైనా విన్నామా.. ఫలానా ఆవిడ అదేదో బ్యూటీ శలూన్ అని పేరెట్టి, అడ్డమైన పనులూ చేస్తోందిటా…ఏమిటో కలికాలమూ...”.మరి ఈరోజుల్లో లేడీస్ టైలర్లూ, బ్యూటీ శలూన్ లూ లేకుండా జరుగుతోందా? ఎవరికిష్టమున్నది వారు నేర్చుకుంటారు. అలాగే వంటలూ, వార్పులూనూ, ఈరోజుల్లో క్యాటరింగుకీ, హోటెల్ మానేజ్మెంటుకీ కాలేజీలూ అవీనూ… అదే ఇదివరకేమనేవారూ.. ” అయ్యో..అయ్యో.. వంటమనిషిగా చేస్తోందిట…”. ఏ పనైనా సరే dignity of labour చూడాలి కానీ, తాము చేయలేనిదేదో, అవతలివారు చేసేస్తున్నారో బాగుపడిపోతున్నారో అని ఏడవకూడదు.

ఈ రోజుల్లో వారివారి ఆసక్తులనిబట్టి ఆడవారూ, మగవారూ కూడా ఎన్నెన్నో రంగాల్లో part time jobs చేస్తున్నారు. ఉదాహరణకి కాలేజీకెళ్ళే పిల్లలు, శలవలొచ్చాయంటే, pocket money కోసం, ఏదో ఒక పని చేస్తారు, బుధ్ధిమంతులైనవాళ్ళు- ఓ న్యూసుపేపరు డెలివరీ కావొచ్చు,లేదా ఏ Mcdonalds, Pizza Hut, Dominos లోనో డెలివరీ బాయ్ కింద. అలాచేస్తున్నాడు కదా అని, ఏదో చేయరాని పని చేస్తున్నట్టు చెవులు కొరుక్కోడం బాగుండదు.

ఈరోజుల్లో ఎక్కడ చూసినా Corporate Colleges, Management Institutes..కావలిసినన్నున్నాయి, అదీ పెద్ద పెద్ద నగరాల్లో అయితే మరీనూ. వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకన్నా, part time వాళ్ళంటేనే ఆసక్తి చూపిస్తారు. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి- రెగ్యులర్ వాళ్ళైతే పిఎఫ్ లూ, శలవలూ, యూనియన్లూ గొడవానూ, హాయిగా గంటకింతా అని, ఎవరినో engage చేసేసికుంటే, వాళ్ళ పనీ అవుతుంది,ఆ చెప్పేవాళ్ళ అవసరమూ తీరుతుంది. ఉభయతారకం.

ఎంత పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారైనా, ఏదో అవసరాన్నిబట్టో,టైం పాసుకో,కాదూకూడదూ అంటే, చిన్నప్పటినుండీ అవకాశాలు రాక నిద్రాణమైన కోరిక తీర్చుకోడానికో, ఏ వీకెండుకో ఏదో ఒక కాలేజీలోనో, లేక ఏదో ఒక Management Institute లోనో పాఠాలు చెప్పడానికి చేరతారు. అదేదో తిన్నతిండరక్క కాదు.పోనీ అవన్నీ ఏమైనా Cake walk లా ఏమిటీ, ఎంతంత శ్రమ పడాలి, ఇంట్లో భర్తా పిల్లలనీ చూసుకోవాలి, అక్కడ తీసికున్నపనికి న్యాయం చేయాలి. ఇంత కార్యక్రమం ఉంది. కానీ, పనీ పాటాలేని, రోజంతా టీవీ సీరియళ్ళలోనో, కిట్టీ పార్టీల్లోనో కాలం గడిపేవారికి ఇలాటివి somehow they just can not digest. ఛాన్సు దొరికినప్పుడల్లా ఏదో ఒక మాటనడం.అవతలివారిని బాధపెట్టడం. అదో sadistic pleasure.

అంతదాకా ఎందుకూ, నేను నా కాలక్షేపం కోసంచేసే Mystery Shopping ల విషయంలోనే ఇలాటి “పక్షుల” నుండి, ఎన్నెన్నో విమర్శలు విన్నాను. మొదట్లో కొద్దిగా బాధేసీది. నేనేమైనా వాళ్ళని అప్పడిగానా, కాదూ నాకు బ్రాండెడ్ బట్టలు కొనిపెట్టమన్నానా, పోనీ మా ఇంట్లోకేదైనా తెచ్చిపెట్టమన్నానా, నా దారిన నేనేదో చేసుకుంటూంటే నా గొడవ అసలు వాళ్ళకెందుకూ అనుకునేవాడిని. వారిదారిన వారు “సలహాలు” (unsolicited) ఇచ్చేవారు, ఈ వయస్సులో మీకెందుకండీ ఇంత “యావ” అనేవారు కూడానూ.విన్నాను.. విన్నాను.. ఇంక ఇదికాదు పనీ అనుకుని, in no uncertain terms.. చెప్పేయవలసొచ్చింది.. mind your business.. అని.తిట్టుకునేవాళ్ళు తిట్టుకున్నారు,పోనిద్దూ వాడి ఖర్మ వాడిదీ అనుకునేవాళ్ళూ ఉన్నారు, ఏది ఏమైనా, నా దారిన నన్ను వదిలేశారు..

అసలు నేను ఈ Mystery Shopping ఎందుకు చేస్తున్నానో కూడా చెప్పాను. I simply love and enjoy it.సంఝాయిషీ చెప్పుకోవలిసినది కట్టుకున్నవాళ్ళకి తప్ప ఇంకోళ్ళకి కాదు. భార్య భర్తకీ, భర్త భార్యకీ ఇంక మిగిలినవారంతా to hell..ఇష్టముంటే,మాట్టాడతారు లేకపోతే.. ఏమీ గొడవలేదు.పోనీద్దూ అని వదిలేస్తారా, అబ్బే, కడుపులో దాచుకున్నది కక్కొద్దూ.. ఎప్పుడైనా, కొత్త షూసూ, కొత్త బట్టలూ వాటికి సాయం ఓ టోపీ కూడా పెట్టుకుని కనిపించడం తరవాయి, ” హల్లో.. ఏమిటీ ఈమధ్య కొత్తపెళ్ళికొడుకులా తయారైపోతున్నారూ.. ఇవన్నీ వాళ్ళెవరో ఇచ్చినవేనా..” అంటూ. అక్కడికేదో నేను సంభావనలకి వెళ్తున్నట్టూ, అక్కడేదో సంపాదించినట్టూ..మరీ వాళ్ళంతకిందకు దిగజారలేక, ఓ నవ్వు నవ్వేసూరుకుంటాను.

ఈ “పక్షులు” అస్తమానూ విసిరే మాటల తూటాలు భరించలేక ఒకరు నన్నడిగారు, ఇలాటివారిని ఎలా deal చేయాలీ అని. నేను మూడు మార్గాలు చెప్పాను…

ఒకటి Do not react.. మనం react అయ్యీకొద్దీ, అలా మాట్టాడేవారు ఇంకా రెచ్చిపోతారు…

రెండు ఓపికుందా నాలుగు ఝణాయించి చెప్పు. మళ్ళీ నోరెత్తరు…

మూడు.. అన్నిటిలోకీ ఉత్తమం… just ignore.. చెప్పి చెప్పి వాళ్ళే విసుగెత్తి మానేస్తారు…
సర్వేజనా సుఖినోభవంతూ….

Advertisements

8 Responses

 1. కొత్త పెళ్ళికొడుకు మాట మనకెందుగ్గానీ మీకు పెళ్ళైనప్పుడు మాత్రం ఇలా తయారయ్యారేవిటీ? 🙂 అవును, ఏమిటి సంగతీ, ఈమధ్య కొత్తపెళ్ళికొడుకులా తయారైపోతున్నారూ? 😉

  Like

 2. ఫణిగారూ,

  మీరేమో మూడు మార్గాలని చెప్పారు. కాని తీరా చూస్తే రెండే కనిపిస్తున్నాయండీ. ఒకటి Do not react అన్న దానికీ మూడు.. అన్నిటిలోకీ ఉత్తమం… just ignore అన్న దానికీ వ్యత్యాసం యేమిటో బోధపడటం లేదండీ. ఈ‌రెండూ ఒకటేననుకుంటున్నాను నేను.

  మహాభారతంలో‌ ధర్మరాజులవారు చెప్పినట్లు ప్రపంచంలో‌అన్నింటి కన్నా తేలికైన పని ఇతరులకు ఉబోసలు (ఉచిత బోడి సలహాలు) ఇవ్వటం. యుగాలు మారినా మానవతత్వం లోని యీ కోణంలో వీసమంతైనా‌ మార్పు రాదు గాక రాదు.

  అందు చేత పిన్నయినా పెద్దయినా ప్రతివారూ తమకు చేతనైన విధానంలో‌ సమయాన్ని సద్వినియోగ పరచుకోవటంలో తప్పు యేమీ లేదని గ్రహించితే చాలుగదా. నోటిదురదరాయుళ్ళను పట్టించుకోనవుసరం లేదు. మీ మతమే నాదీను.

  Like

 3. Sir, keep doing what you are doing. We can’t win everybody, especially jealous people. Some people just want to bring you down.

  Like

 4. sunnA,

  అనుకున్నా.. ఇలాటిదేదో వింటానని.. మా ఇంటావిడ అభిమానంతో తీసిందికదా అని ఆ ఫుటో పెట్టాను…

  శ్యామలరావుగారూ,

  Do not react -విన్నా స్పందించొద్దనీ, ignore అంటే, అసలు వినే వద్దనీ అర్ధంలో మూడన్నాను. నా “మతం” తో ఏకీభవించినందుకు ధన్యవాదాలు…

  Mkp,

  అనే అనుకుంటున్నాను. ఎవరో ఏదో అనుకుంటారేమో అనుకుంటూంటే, మనం చేద్దామనుకునే పనులు చాలా చేయలేము. కొన్నికొన్నింటిని అసలు పట్టించుకోకూడదని నా “మతం” ( పైన శ్రీ శ్యామలరావుగారి ఉవాచ !)

  Like

 5. 🙂 చాల సాధారణం. మీ మిస్టరీ షాపింగ్ గురించి వాళ్ళకి అర్ధం అవనప్పుడు, వాళ్ల మాటలు మీకు కొంత అర్ధం కావు.
  నిడివి పరం గా టపా లో ఇడ్లి తక్కువా, పచ్చడి ఎక్కువా అనిపిస్తుంది నాకేనా ?
  ఫోటో బాగుంది అండీ

  ( పక్షి భాష ):
  ౧. అసలు ఫోటో పెట్టడం కోసం టపా వ్రాసారా 🙂

  Like

 6. మౌళీ,

  నిఝంగా అందుకే వ్రాశాను. మిస్టరీ షాపింగులో నాకు ఎంత ఆనందం కలుగుతోందో అందరికీ చెప్పడానికి !!!

  Like

 7. తాతయ్య..మీరే చెప్పకపోతే నాకు ఈ విషయం తెలిసేది కాదు.. అయినా పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కాదు కదా:)

  Like

 8. మనవరాలా,

  థాంక్స్…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: