బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొత్తరకం protesట్టులు…


    సంసారాలన్నతరువాత, భార్యమీద భర్తకీ, భర్తమీద భార్యకీ మాటతేడా రావడమూ, ఒకరి మీద ఇంకోరికి పీకలదాకా కోపం వచ్చి మాట్టాడుకోడం మానేయడం పేద్ద విచిత్రమేమీ కాదు. అస్సలు ఇలాటి అలకలు లేకుండా, కాపరాలు చేస్తే అందులో మజా ఏమిటండీ? పెళ్ళైన కొత్తలో భార్య అలిగితే, ఆ వెర్రి అమాయక భర్తే రాజీకి వచ్చేవాడు. ఓ పిల్లో, పిల్లాడో పుట్టుకొచ్చేసరికి, వాళ్ళని మధ్యలో పెట్టుకుని ఏదో లాగించేసేవారు.

    ఇంటిపెద్దాయన రిటైరయిన తరువాత మళ్ళీ వీళ్ళిద్దరే ( భార్యాభర్తలు) మిగులుతారు.మాటతేడాలకేమిటీ, కావల్సినన్నుంటాయి..వెదకాలేకానీ ఆవిడమాటాడే ప్రతీ మాటలోనూ పెడార్ధం తీసి, కావలిసినంత కోపం తెచ్చేసికోవచ్చు.ఇంటావిడ చేసే పనులో, ఆవిడ మనకి చెప్పిన పనులో, లేదా ఒక్కరోజూ మర్చిపోకుండా చేసే జ్ఞానబోధ లో, అదో కాలక్షేపమూ.. ప్రాణహాని లేనంతవరకూ ఏదైనా ఫరవాలేదనేది నా సిధ్ధాంతం.

    ఏ పనీపాటా లేకపోతే ఎప్పుడో నలభై ఏళ్ళక్రితం జరిగిందేదో గుర్తుకు తెచ్చేసికుని.. “అప్పుడు గుర్తుందా ఫలానా రోజున మనం బయటకెళ్ళాలని రెడీ అవుతూంటే, నన్ను వేళాకోళం చేశారు, అందరెదురుగుండానూ.. అప్పుడు నాకెంతకోపం వచ్చిందో తెలుసా..మా అమ్మ దగ్గర ఎంత ఏడిచేశానో తెలుసా.. ఫరవాలేదమ్మా కొత్తకదా.. అలా ప్రతీదానికీ కోపం తెచ్చేసికూడదూ,మా బంగారుతల్లివి కదూ..” అని సముదాయించడం వలన వదిలేశాను.ఆనాటి కాలమానపరిస్థితులలాటివి మరీ.. ఈరోజుల్లో అలాటి వేషాలేస్తే నలభై ఏళ్ళదాకా ఆగడం అవీ ఉండవు, మర్నాడే ” hi dear whats your problem..” అనేసి, తాడో పేడో తేల్చేయడమే.అందరూ అలా ఉంటారని కాదూ, అక్కడక్కడ!

    ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందో… ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళడం, పని ఒత్తిళ్ళూ..ఇంట్లో పనిమనిషో, వంటమనిషో రాకపోవడంవల్ల వచ్చేవో.. చెప్పేనుగా వెదకాలే కానీ కావలిసినన్నీ..పోనీ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళకి ఇలాటివుంటాయీ, హాయిగా పెన్షను తీసికుంటూ, పిల్లలతో హాయిగా ఉండక, లేనిపోని కోపాలూ, తాపాలూ ఎందుకండీ అని అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు గొడవంతా, చాగంటి వారు చెప్పినట్టు ” ఇక్కడే మీరు పట్టుకోవాలి”.నన్నేదో అనకుండగా ఆవిడకీ రోజెళ్ళదు, ఆవిడమీద గయ్యిమనకుండా నాకూ రోజెళ్ళదు. ఏమిటో రిటైరయినప్పటినుండీ అలవాటు పడిపోయాము. పైగా విడిగా ఉంటున్నామాయే. ఊరికే మాటా మంతీ లేకుండా ఒకరు టీవీ దగ్గరా, ఇంకోరు కంప్యూటరుదగ్గరా కూర్చుంటే మజా ఏముంటుందీ? అదేదో mourning లా ఉంటుంది. హల్ చల్ ఉండొద్దూ, అలాటివి కావాలంటే ఒకళ్ళనొకళ్ళు మాటనుకోవాలి, కోపాలు తెచ్చేసికోవాలి, ఏదో కారణం ఉండొద్దూ నాకు, బయటకి వెళ్ళిపోడానికీ.. ఏమిటో అర్ధం చేసికోరూ.. ఎంత కథా కమామీషూ..

    ఆమధ్యన గురువారాలు గోమాతకి రొట్టెలు పెట్టడం మొదలెట్టానులెండి, వాటికీ నా బ్రేక్ ఫాస్టుకీ కలిసొస్తుందని మా ఇంటావిడేమో ఓ పది రొట్టెలు( అవేవో పుల్కాలంటారుట) చేస్తుంది. నాకు పెట్టేవాటిల్లోనైనా ఓ నూనె చుక్కో, నేతి చుక్కో వేస్తే, ఆవిడ సొమ్మేంపోయిందిటా? ఆ పుల్కాలేమో నాకు నవలడానికి వీలుండదూ ( కారణం అస్తమానూ చెప్పఖ్ఖర్లేదు!),ఈవిడ చూసేసరికి నేను, చాగంటి వారి ప్రవచనం వింటూ, బలవంతగా నోట్లో కుక్కుకుంటున్నాను. అంతే ఏమయ్యిందీ అంటూ కొశ్చనూ.. మరీ పొడిపొడిగా ఉన్నాయీ అని నా నోటివెంట వచ్చిందో లేదో, నిన్ననే వెన్న కాచి ఉంచిన ( ఇంకా పేరుకోలేదుకూడానూ) నెయ్యి తెచ్చి నా ప్లేటులో నాలుగు చెంచాలు వంచేసింది. మరీ అంత కోపగించుకోవాలా?

    ఒక్కొక్కప్పుడు, నేను బయటకెళ్ళాను కదా అని, ఇంట్లో తుడుపులూ, తడిగుడ్డతో తుడవడాలూ చేసికుంటూంటుంది. అదేదో శాపం పెట్టినట్టుగా, ఆవిడ ఇల్లు పూర్తిగా తడిగుడ్డతో తుడిచేసి, ఆరుతుంది కదా అని ఫ్యాను వేయడం, ఠింగురంగా మంటూ నేను ప్రత్యక్షం. అదేమిటండీ.. మామూలుగా పన్నెండున్నరకి కదా కొంపకు చేరేదీ,ఇప్పుడే రెక్కలు పడిపోయేలా ఇల్లు తుడిచానూ..అంటూ “అసలు ఎవడు రమ్మన్నారు ఇంటికీ ” అనే అర్ధంలో విసుక్కుంటే, మరి నాకు కోపం వచ్చిందీ అంటే రాదు మరీ.. ఇంట్లో ఆవిడ చేసే పనులకేమైనా live coverage ఉందా ఏమిటీ, నాకు తెలియడానికీ?

    ఈమధ్యన గోధుంపిండి, గోధుమలు కొని, మరపెట్టించి తెమ్మన్నప్పుడల్లా, ఈ గొడవంతా ఎవడు పడతాడూ, అనుకుని కొట్టువాడికే చెప్తూంటాను. వాడసలు ఏం గోధుమలు మర పట్టిస్తాడో ఏమిటో, ఆ పిండికి రుచీ పచీ ఉండదు. ఏదో మోతతప్పుతుందికదా అని కానీ, నాకేమైనా సరదా ఏమిటీ,అంత డబ్బూ ఇచ్చి ఆ గోధుంపిండి తెప్పించడానికీ? ఏదో ఒకసారి చెప్పింది సరిపోదూ, ఈసారి దగ్గరుండి చేయిస్తానులే అని అనేస్తాను. ఈవిడకేమో, ఏ Topiక్కూ లేనప్పుడు, ఆ గోధుంపిండి గుర్తుకొస్తుంది, మళ్ళీ మొదలూ.. ఒకటి మాత్రం చెప్పుకోవాలి- ఆవిడకి మాత్రం Topiక్సు కి లోటులేదు. ఎప్పుడు చెప్పినా కొత్తగా చేసినదేమో అన్నంత fresh గా చెప్పేస్తూంటుంది. నిజమే కాబోలనుకుంటాను అమాయక అర్భక ప్రాణిని.

    ఈమధ్యన ఇలాటికోపాలు వచ్చి “అర్ధదిన నిరసనలు” జరిగేటప్పుడు, ఏదో ఎవరి పని వారైనా చేసికునేవాళ్ళం.ఆవిడకి కొత్తగా ఫోను వచ్చినప్పటినుండీ ఓ కొత్త పధ్ధతి మొదలెట్టింది. సాయంత్రాలు అదేదో ఈవెనింగ్ వాక్కులకి వెళ్తూంటుంది.మామూలుగా తను వెళ్ళడం, ఓ అరగంట తరువాత నేనేమో వెళ్ళి ఆవిడతో కలిసి కొంపకు చేరడం.ఈ కోపాలూ, తాపాలూ వచ్చినప్పుడు, మరి మాట్టాడకూడదుగా, మరి నాకెలా చెప్పడం, బాల్కనీలోకి వెళ్ళి తెలుగులో ఓ మెయిల్ పంపించేస్తుంది..ఇదో hi tech protesట్టూ..బయటకు వాకింగు కి వెళ్తున్నానూ.. ఆలశ్యం అయితే కుక్కరు పెట్టేయండీ… అంటూ. అదేదో నోటితోనే చెప్పొచ్చుగా, పెట్టనంటానా ఏమిటీ? ఈవిడ మెయిల్స్ కాదుకానీ, వాటితోనే నా inbox అంతా నిండిపోతోంది!!

    అఛ్ఛా నాకో విషయం చెప్పండీ– ఆ కొత్త ఫోనూ, ఆవిడ wi-fi విన్యాసాలతోటీ, నా desk top మరీ నత్తనడకైపోయింది. అదేదో బోరింగు నూతులు తవ్వినప్పుడు, ఒకరికంటే ఇంకోరు లోతుగా తవ్వేసికుని, అవతలివారికి నీళ్ళు రానీకుండా చేస్తూంటారూ, అలాగ నా modem నుంచి వచ్చే సిగ్నల్స్ ఏమైనా ఈ కొత్త ఫోను హడప్చేసేసికుంటోందా ఏమిటీ?

   అమ్మాయిచ్చిన టాబ్బూ, ఈవిడ కొత్త ఫోనూ కలిపి నన్నూ, నా సిగ్నల్స్ నీ రోడ్డెక్కించేశారు!

Advertisements

6 Responses

 1. ఎప్పుడూ రోజులు మనవే కావు మాస్టారూ 🙂

  Like

  • అమ్మమ్మ మీదా మీ కోపం..?!! అదేదో బోరింగు నూతులు తవ్వినప్పుడు, ఒకరికంటే ఇంకోరు లోతుగా తవ్వేసికుని, అవతలివారికి నీళ్ళు రానీకుండా చేస్తూంటారూ, అలాగ నా modem నుంచి వచ్చే సిగ్నల్స్ ఏమైనా ఈ కొత్త ఫోను హడప్చేసేసికుంటోందా ఏమిటీ? 😀 😀

   Like

 2. శర్మగారూ,
  ఔను కదూ…

  మనవరాలా,

  ఇంకోరెవరిమీదైనా కోపాలు తెచ్చుకుంటే ఊరుకుంటారా తల్లీ…

  Like

 3. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళు వచ్చాయి అండీ, చివరి పార్టు అయితే సూపరు. అసలు మేమే ప్రొటెస్ట్ చేద్దాం అనుకొంటున్నాం, లక్ష్మి గారికి ఇంటర్నెట్ టైము మీరు సరిగా ఇవ్వడం లేదనీను (తగిన టపాలు మీ బ్లాగులో పడ్డా కూడా ,పోనిలే అని మవునం వహించామంటే మాకెంత సహనమో !!!)

  ఫోన్ కొనడం ఆలస్యం చేసిన బాకీ వడ్డీ తో సహా తీర్చుకొంటున్నారన్న మాట !!!! ( చివరి రెండు పేరాలు అదుర్స్, వన్స్ మోర్ 🙂 )

  ఇద్దరికీ అభినందనలు 😉

  Like

 4. మౌళీ,

  చాలా చాలా thanks… ఏదో మనస్సులో పెట్టుకుని కక్ష తీర్చుకున్నట్టే కనిపిస్తోంది….

  Like

 5. సరదాగా

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: