బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అడిగితే బావుండదేమో…..


   ఒక్కొక్కప్పుడు కొన్ని విషయాలు అవతలివారిని అడిగితే బావుండదేమో అనిపిస్తూంటుంది. కొన్నైతే చాలా delicate గా కూడా ఉంటూంటాయి. ఉదాహరణకి ఎవరైనా మనింటికి వస్తామంటారనుకోండి, వారికిష్టమైనప్పుడు రానీయాలి కానీ, ఎప్పుడు వస్తారూ అని మాటిమాటికి అడగలేము.అసలు ఈ అడగడం అనేదెందుకంటే, మనవైపు అయితే ఫరవాలేదు, కానీ ఈ పెద్దనగరాల్లో దూరదూర ప్రాంతాల్లో ఉంటూంటామాయె, ఎప్పుడో “మూడ్” కుదిరి, ఆ వద్దామనుకున్నవారు, మన ఇంటికి బయలుదేరి వచ్చారే అనుకోండి, అప్పుడు మనం, వాళ్ళు అదే రోజున వస్తారని తెలియక బయటకు వెళ్ళుండొచ్చు, అలాటప్పుడు ఇద్దరికీ బావుండదు.

    అలాగే ఈ రోజుల్లో ఎవరైనా స్నేహితులో, చుట్టాలో వచ్చారనుకోండి, మరీ వాళ్ళు టాక్సీ లోంచో, ఆటో లోంచో దిగకుండానే, గుమ్మంలోనే నిలబెట్టి, తిరుగు ప్రయాణం ఎప్పుడూ అని అడగలేము కదా. అలా కాకుండా, ఆ వచ్చినవాళ్ళే తిరుగుప్రయాణానికి కూడా టికెట్లు బుక్ చేసేసికుంటే గొడవే లేదు. ఉభయ తారకం. అలా కాకుండా, ఎప్పుడో వాళ్ళు తీరిగ్గా, ఇంక బయలుదేరుతామూ, టిక్కెట్లున్నాయేమో చూడూ అన్నప్పుడే గొడవొస్తూంటుంది.మేము ఇదివరకటి రోజుల్లో, అంటే ఈ online లూ అవీ లేనప్పుడన్నమాట, తణుకు వెళ్ళాల్సొచ్చినప్పుడల్లా, మా మామ గారికి ముందుగానే తెలియపరచేవాళ్ళం, ఫలానా రోజుకి వస్తున్నామూ, ఫలానా రోజుకి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వు చేసుంచండీ అని.

    కొంతమంది ఏదో ఫలానా ఉద్యోగానికి apply చేస్తున్నామనో, చేశామనో చెప్తూంటారు. విషయం ఏమైందని మనం అడిగితే ఏమనుకుంటారో అని భయం, అసలు అలాటప్పుడు వాళ్ళు మనకెందుకు చెప్పారూ అని కూడా అనిపిస్తూంటుంది. అడిగితే, ఓ గొడవా, అడక్కపోతే ఇంకో గొడవా. పైగా కొంతమంది విసుక్కుంటూంటారు కూడానూ,ఏదైనా result వస్తే మేము చెప్పమా ఏమిటీ? చూస్తూంటే మాకంటే మీకే ఆత్రుతగా ఉన్నట్టుందే అంటూ అక్షింతలు కూడా పడొచ్చు.
పెళ్ళిసంబంధాల విషయాల్లోనూ ఇలాటి అనుభవాలు కలుగుతూంటాయి. ఏదో దగ్గరి వారు కదా అని అడిగామా, అన్నీ బావుంటే
సరైన సమాధానం వస్తుంది.ఏదో అటూ ఇటూ గా ఉన్నప్పుడే గొడవ.అవతలివారు చెప్పే సమాధానాన్ని బట్టి, ఒక్కొక్కప్పుడు, ఇంటావిడచేతిలోనూ చివాట్లు పడుతూంటాయి.. ” అస్సలు మీకెందుకండీ వాళ్ళ గొడవా.. ఊళ్ళోవాళ్ళ విషయాలన్నీ కావాలి.. అదే శ్రధ్ధ ఇంటి విషయాల్లో పెడితే ఎంత బావుండేదీ.. ” అని.

   ఆమధ్య, నాకు తెలిసిన వారి భార్య స్వర్గస్థులయ్యారు. నేనూ, నా ఫ్రెండూ మాకు దగ్గరలో ఉన్న ఓ పూజారిని, కర్మకాండలకోసం ఎరేంజ్ చేసి, ఆ అవతలివారిని direct గా,బాడీ తీసికుని వచ్చేయమన్నాము. నేనూ, నా ఫ్రెండూ వాళ్ళువచ్చే ముందరే, అక్కడకి చేరుకున్నాము. అప్పటికే ఆ పూజారి కూడా వచ్చేసున్నారు. మమ్మల్ని చూడగానే, “అరగంట అయిందీ వచ్చి, ఇంకా ఎంతసేపూ బాడీ తీసుకురావడానికీ..” అంటూ, మామీద కోప్పడ్డంమొదలెట్టాడు. మా ఫ్రెండు, పోనీ ఫోనుచేద్దామా, బయలుదేరారో లేదో తెలుస్తుందీ, అని ఒకసారి ధైర్యం చేసి ఫోను చేసి, పది నిముషాల్లో బయలుదేరుతారూ అనే విషయం తెలిసికున్నాడు. ఇలాటివాటిల్లో ఓ టైమూ అవీ keep చేయడం కూడా కష్టమే కదా, అలాగని మాటిమాటికీ ఫోను చేసి అడగడమూ భావ్యం కాదు. చాలా delicate situation.ఎదురుగుండా ఉంటే, ఆ పూజారి మమ్మల్ని అడగడం మానడూ, ఇలా కాదని కొంచం దూరంలో వెళ్ళి నుంచున్నాము, ఇతని గొడవేనా తప్పుతుందని. ఓ 45 నిముషాల తరువాత వచ్చారనుకోండి.

    ఇలాటివి జరుగుతూంటాయి. సమయస్పూర్తితో విషయం చక్కబెట్టడం తప్పించి చేసేదేమీ లేదు…

8 Responses

  1. పూజారిగారు మండి పడటం భావ్యంగా అనిపించలేదు. అలాంటి దుఃఖ సమయాల్లో సమయం ఎలా పాటిస్తారు! దూరంగా నించుని మంచి పని చేసారు! నేనైతే గోడవపడేదాన్ని పూజారిగారితో!

    Like

  2. ఉద్యోగ బాధ్యతల్లో ఓ యేడాదిన్నర పాటు ప్రవాసాంధ్రుడనై నిన్ననే తిరిగి వచ్చాను. కొద్ది కాలమేనని కొంత, మా అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండటం చేత కొంత కుటుంబాన్ని కదిలించలేదు. నేను లేని ఈరోజుల్లో నాకోసమే నిరీక్షిస్తూ రెండు వుత్తరాలు వచ్చి వున్నాయి. ఒకటి గిరి నుండీ వచ్చింది. మరోటి సుందరం నుండి వచ్చింది. రెండూ రెండు చేతుల్లో పట్టుకుని అలాగే చూస్తూ ఆలోచిస్తున్నాను. ఇంతలో కాఫీ కప్పు టేబుల్ పై పెట్టి వెళుతూ మా ఆవిడ “ఆ వుత్తరాలు వచ్చి చాలాకాలమైంది. మీ ఫ్రెండు గిరి కూడా ఒకటి రెండు సార్లు ఫోన్ చేసారు మీగురించి వాకబు చేస్తూ. మీ చిరునామా, ఫోను నంబరు ఇస్తానంటే వద్దులేమ్మా ఎందుకు వాడిని డిస్త్రబ్ చేయటం, తర్వాతే కలిసి మాట్లాడతానని నంబరు కూడా తీసుకోలేదు” అని చెప్పి వెళ్ళి పోయింది.

    Like

  3. మనం ఎంతో ప్రాక్టికల్ అనుకునేవి, ఆవతలివాళ్ళు చాలా కాజువల్‌గా తీసుకుని పట్టించుకోరు చాలా సందర్భాలలో. ఇంతకంటె చీకాకు పెట్టేది, మనం ప్రాక్టికల్ అనుకునేవి ఆవతలివాడు సిల్లీ అనుకోవటమే కాకుండా మన మొహానే చెప్పటం. కొద్ది సమయంలోనే, మనం ప్రాక్టికల్ గా అనుకుని చెప్పినది వినక, సిల్లీ అన్నవాడు కష్టాల్లో పడ్డప్పుడు, మన ఖర్మ కొద్దీ వాడిమొహం మనం చూడవలసి రావటం. వాడు మన మొహం చూడలేక పైగా మన మీద కోపం తెచ్చుకోవటం, వీలైతే అన్నీ అపశకునాలే మీరు చెప్పేవి అని ఆక్షేపించటం. ఏమైనా ప్రాక్టికల్‌గా ఆలోచించేవాళ్ళను అర్ధం చేసుకునే వాళ్ళు తక్కువ. పైగా అపార్ధం మాత్రమే చేసుకోవటానికి మటుకు దాదాపు అందరూ సిధ్ధంగా ఉంటారు, అందునా తెలుగు వాళ్ళు మరీనూ.

    Like

  4. తను ఉత్తమ, ఎదుటి వాడు మధ్యమ,
    అవతలి వాడు తృతీయ(అధమ) అని రంగరించి
    మూలాలలో నిశ్చయించుకున్న వారికి,
    ఎదుట వాడి కష్టాలు అర్థం కావు లెండి.
    అయినా, నొప్పింపక తాన్నోవ్వక
    నడచువాడు నేర్పరి కదండీ.

    Like

  5. బిందు గారు,

    మొదట మీరన్నది సబబు గానే తోచింది, కాని పూజారి అక్కడికి వచ్చింది బిజినెస్ కోసమే కదా? అతనికి ఎంతమాత్రం లాభాదాయకమో మనకి తెలిదు . అయినా,దుఃఖ సమయాల్లో సమయం పాటించలేము నిజమే, కాని చనిపోయిన వ్యక్తిని ఇంటికి తీసికొని వచ్చాక పూజారికి కబురంపితే బాగుండేది. పూజారి కోప్పడ్డాడంటే కోప్పడడూ 🙂

    ఫణిబాబు గారు, మీరు బాగా మేనేజ్ చేసారు.

    Like

  6. బిందూ,

    అప్పుడు నాకనిపించిందేదే చేశాను…

    శివరామప్రసాదు గారూ,

    మీరన్నవన్నీ నూటికి నూరు పాళ్ళూ నిజాలే.. కానీ, మనలాటివాళ్ళకుందే అదే..”అత్యుత్సాహం”– దీనితోనే అసలు గొడవంతానూ.. పోనిద్దూ అని ఊరుకోనూలేమూ.. అలాగని అవతలివారు react అయినప్పుడు ఇలా బ్లాగుల్లో పెట్టుకోకుండానూ ఉండలేమూ.. ఎప్పటికి బాగుపడతామో కదూ…

    డాక్టరుగారూ,

    అదే best policy అనుకుంటాను…

    మౌళీ,

    వామ్మోయ్… మొట్టమొదటిసారిగా నేను చేసినదీ రైటేనన్నారు…ఇదిచాలు…

    Like

  7. పూనా లో ఒకాయన ఉన్నారు. ఆయన మీ ఊరు వస్తున్నానని ఇప్పటికి మూడు మాట్లు చెప్పారు. రాలేదు. ఆయన్ని మళ్ళి అడిగితే బాగుంటుందా?

    Like

  8. సుబ్రహ్మణ్యంగారూ,

    పాపం ఆ పూనా ఆయనకి ఏదో కారణం ఉండేఉంటుందేమో, ఊరికే ఎందుకూ ఇరుకులో పెట్టడం ?

    Like