బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఈ sms లతో వచ్చిన తంటా…..


    మా రోజుల్లో రైళ్ళల్లో ప్రయాణం చేయాలంటే, స్టేషనుకి వెళ్ళి, ఓ టిక్కెట్టు కొనుక్కునేవాళ్ళం. ఆ రోజుల్లో రిజర్వేషన్లూ గట్రా ఉండేవేమో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన కోనసీమ కీ రైళ్ళకీ చుట్టరికం లేక పోవడం వల్ల.ఎప్పుడైనా ఏ మెడ్రాసో, వాల్టేరో వెళ్ళవలసివచ్చినా, ఏ రాజమండ్రీ కో వెళ్ళి నాన్నగారు స్టేషనుకి వెళ్ళి, ఓ టిక్కెట్టు తెచ్చి ఓ సిట్లో కూర్చోబెట్టేవారు, అక్కడకి వెళ్ళిన తరువాత ఎవరో ఒకరు వచ్చి దింపుకునేవారు.మొట్టఒదటి సారి పూణె లో ఉద్యోగం లో చేరిన తరువాత, హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చినప్పుడు మాత్రమే మొట్టమొదటిసారిగా టికెట్టు కొనుక్కున్నది ! ఆ రోజుల్లో ఓ బుల్లి టిక్కెట్టు( cardboard) ది, ఎదురుగుండా ఉండే ఓ ర్యాక్కు లోంచి తీసి, దేనికిందో పెట్టి ఓ నొక్కు నొక్కి చేతిలో పెట్టేవాడు. ప్రయాణంలో టిటి కూడా చెక్ చేసి, ఓ సంతకం పెట్టేవాడు.

    కాలక్రమేణా, ఆ టిక్కెట్ట్లు పోయి, స్టేషన్లూ, కోటాలూ ప్రారంభం అయ్యాయి. మేము తణుకొచ్చినప్పుడల్లా, పాలకొల్లో, అత్తిలో వెళ్ళి తీసికోవల్సొచ్చేది టిక్కెట్టు. తణుకు కోటాలో ఎప్పుడూ దొరికేవి కావు.అవి కూడా ఓ పుస్తకంలో కార్బన్ పేపరు పెట్టి, నాలుగు కాపీలు తీసి అందులో, ఏమీ కనిపించని కాపీ మనకిచ్చేవాడు!! తరువాత్తరువాత కంప్యూటరు రిజర్వేషన్లూ వగైరా ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత , అసలు స్టేషనుకే వెళ్ళఖ్ఖర్లేకుండా, online booking ప్రారంభం అయింది. మళ్ళీ వాటిలో శాస్త్రోక్తంగా ఉండి, ఇంటికే వచ్చే e-ticket, అలా కాకుండా ఓ print out తీసేసికుంటే పనైపోయే i-ticket వచ్చాయి. అదేమిటో మొదట్లో ఈ i-ticket చూస్తే అదోలా ఉండేది! రైల్లో వాడు నమ్ముతాడా దీన్నీ, మరీ మామూలు టిక్కెట్లా లేదూ అని ఓ భయం ! ఏదో మొత్తానికి అలవాటు పడ్డాననుకోండి, గత అయిదు సంవత్సరాలుగా అసలు టిక్కెట్ల క్యూలో నుంచుంటే ఒట్టూ !! పైగా ఎవరైనా రిజర్వేషనుకోసం, స్టేషను కి వెళ్తున్నానంటే, పేద్ద పోజు పెట్టేసి, “అదేమిటండీ, హాయిగా ఇంట్లోనే కూర్చుని చేసికోవచ్చుగా” అంటూ !! అవతలి వాడికి రానిదేదో మనకొచ్చేసినట్టు ఓ తుత్తీ...ఇలాటివే కదండీ, బుల్లి బుల్లి సంతోషాలూ!! అవతలాయన మనల్ని online లో టిక్కెట్టు బుక్ చేసేయమంటే, వచ్చే సంతోషం ఇంకెక్కడ దొరుకుతుందీ?రాజమండ్రీలో ఉన్నప్పుడు, ఒకరిద్దరికి పరోపకారం చేశానులెండి !

    అక్కడిదాకా బాగానే ఉంది. ఈమధ్యన, మా స్నేహితుడొకరు, వాళ్ళమ్మాయి వివాహానికి, మేము రావేమో ( ఏదో వంక పెట్టి !!) అనుకుని, పాపం ఆయనే టిక్కెట్లు బుక్ చేసేశారు. అప్పటికీ చెప్పాను, “ఇదేమీ బాగోలేదండీ, మా టిక్కెట్ట్లు మీరు తీసికోడమేమిటీ”, అంటే ఆయనన్నారూ, “మా ఇంట్లో పెళ్ళికి మిమ్మల్ని శ్రమపెట్టకుండా, తీసికెళ్ళడం నా బాధ్యతా..”, అని. ఏదో నెట్ లో స్కాన్ చేసేసి, ఓ ఫోను చేసే పెళ్ళిపిలుపులున్న ఈ రోజుల్లో, ఇలా ప్రయాణం కూడా సౌకర్యంగా ఉండాలని ఏసీ లో టిక్కెట్లు బుక్ చేసే వారు చాలా అరుదు. అరుదేమిటీ, ఇప్పటిదాకా చూడలేదు.పైగా అదీ కూతురి పెళ్ళికి.అసలే అమ్మాయి పెళ్ళంటే ఖర్చుతో కూడిన పని. దానికి సాయం, ఇలా టిక్కెట్లు కూడానా !! Hats off !!

    ఆ మధ్యన సడెన్ గా ఓ sms వచ్చింది, irctcవాళ్ళదగ్గరనుంచి. దాంట్లో ట్రైను నెంబరూ, pnr నెంబరూ, మా బెర్తుల నెంబర్లూ ( మామూలుగానే అన్నిటిలోకీ పై బెర్తులే !!) వివరాలతో. నాకేం తెలుసూ,e-ticket,i-ticket లతో పాటు ఈ sms ఆప్షన్ కూడా పెట్టారని. ఇంకా ఎప్పుడో e-ticket వస్తుందిలే అని చూశాను. అప్పుడు ఓసారి , మా స్నేహితుడికి ఫోను చేస్తే చెప్పారు, ఆ ఎస్ ఎమ్ ఎస్సే మీ టిక్కెట్టండి బాబూ అని. మామూలుగా, నేను sms లు డిలీట్ చేసేస్తూంటాను.వామ్మోయ్ దీన్ని డిలీట్ చేయకూడదా అనుకుని, రెణ్ణెల్లనుంచీ ఆ sms ని అతి భద్రంగా జాగ్రత్తచేసికున్నాను! అసలు ఈ sms లు ఏమిటండి బాబూ?ప్రతీ సెల్ ఫోనుకీ రెండేసీ, మూడేసీ సిమ్ములున్న ఈ రోజుల్లో, ఏ సిమ్ములో ఉందో జ్ఞాపకం పెట్టుకోవడం,అలా కాకుండా, ఆంధ్రా కి వెళ్ళినప్పుడో సెల్లూ, ఇక్కడుండేటప్పుడు ఓ సెల్లూ ఉంచుకుంటున్న ఈ రోజుల్లో, అసలుది మర్చిపోతే కష్టమే కదా!మన ఖర్మ కాలి ఆ టిక్కెట్టున్న సెల్లులో ఛార్జి అయిపోతేనో… ఏమిటో అన్నీ అనుమానాలే … ఇన్నిన్ని టెన్షన్లతో అసలు ప్రయాణాలు చేయడం ఎందుకో నాకర్ధం అవదు.

    ఏదో మొత్తానికి, ఈ రెణ్ణెల్లూ టెన్షను తో బతికి, ఆ sms ని ప్రాణప్రదంగా కాపాడుకుని. మొన్న గురువారం నాడు, కొణార్క్ ఎక్కాము. ఏదో ఓ గొడవొదిలిపోతుందిలే అనుకుంటే, ఆ TT మాహానుభావుడు రాడాయే, ఓ గంట తరువాత ఆ పెద్ద మనిషి వచ్చీరాగానే,ఓ పోజు పెట్టేసి, నా సెల్లుని అతని మొహంలో పెట్టేసి, అతను లిస్టులో మా పేర్లు చూసి టిక్కు పెట్టేసికున్న తరువాత అమ్మయ్యా అనుకున్నాను.ఇంక ఆ sms తీసేయొచ్చులే అనుకుంటూంటే చెప్పారు పక్కవాళ్ళు, స్టేషనులో గేట్ దగ్గర అడిగితే చూపించొద్దా అని.అవును కదూ !

    ఈమధ్యన ఈ sms ల గొడవెక్కువయ్యింది. ఏవేవో వస్తూంటాయి, ఓసారి చదివేసి డిలీట్ చేసేయడం. కానీ ఈ మధ్యన ఓ చిత్రం జరుగుతోంది. ఓ sms రావడం, దాంట్లోనేమో మా అమ్మాయిదో, అబ్బాయిదో పేరుండడం. తీరా చూస్తే అదేదో రిలయెన్స్ వాడిదో, ఇంకో కంపెనీదో, వాళ్ళ ఆఫర్లూ గట్రానూ. వీళ్ళెందుకు పంపుతున్నారూ ఇలాటివీ, అనుకున్నా, పోన్లే వాళ్ళకొచ్చినవి forwardచేశారేమో అనుకునేవాణ్ణి. ఆ మధ్యన ఒకసారి మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండగా, ఇలాటిదే ఓ sms వచ్చింది, అమ్మాయి పేరుతో. ఇదివరకు చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. అడిగితే, నేనెందుకు పంపుతాను డాడీ అనేది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించినా ఇదే మాట. అవును కదూ, వాళ్ళకేం పనిలేదా ఏమిటీ? మొన్న కొణార్క్ లో వెళ్తున్నప్పుడు, మాతో ప్రయాణం చెస్తున్న వాళ్ళు ఒకరు CTS లోనూ, ఒకరు Infy లోనూ, ఇంకోరు TCS లోనూ పని చేస్తున్నారు. ఈ సెల్ కంపెనీలకి software ఇచ్చేది ఈ కంపెనీల్లో వాళ్ళే కదా, పోనీ ఈ గొడవేదో వీళ్ళకి తెలుస్తుందేమో అనుకుని అడిగితే, మాకు తెలియదు పొమ్మన్నారు. నాకు మాత్రం ప్రతీ రోజూ ఈ దిక్కుమాలిన sms లు మాత్రం రావడం మానడంలేదు, అదీ మా పిల్లల పేరుతో !! మీలో ఎవరికైనా దీనికి నివారణోపాయమార్గం తెలిసినా, అసలు అలా ఎందుకు వస్తున్నాయో తెలిసినా ఓ సారి చెప్పండి....

    ఈవేళ నాకు ఓ ఆసక్తికరమైన మెయిల్ వచ్చింది. చదవండి ఇక్కడ .

5 Responses

  1. hahahaha…..

    Like

  2. :D. Superb..మీ మెయులు ఇంకా చూడలేదు. Mail access lekapovadam valla. Sorry తాతయ్య. Chusina ventane reply chesthanu.

    Like

  3. చిన్న correction.e-ticket ని i-ticket ని మార్చి రాశారు.

    Like

  4. @శర్మగారూ,

    థాంక్స్..

    @మనవరాలా ( దీపా),

    మెయిల్ లో అడిగిన వివరాలేవో త్వరగా పంపు తల్లీ….

    @శ్రీనివాస్,

    ఏదో ఒకటీ పోనిస్తురూ… అర్ధమయ్యింది కదా … నా ప్రాణానికి అన్నీ ఒకటే…

    Like

Leave a comment