బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ऍक दम् down to earth వాళ్ళు అరుదుగా కనిపిస్తారు…

    పైన పెట్టిన శీర్షిక అంటే ऍक दम् down to earth గా ఉండేవారిని చాలా అరుదుగా చూస్తూంటాము. కారణం మరేమీ లేదు, మనలో(including me..) చాలా మంది ఇంట్లో ఒకలాగా, బయటకు వెళ్ళినప్పుడు ఇంకోలాగానే ఉండడానికి ప్రయత్నిస్తూంటాము. లేకపోతే మన ” బండారం” బయట పడిపోదూ? వాటికి మొట్టమొదటగా చెప్పవలసింది రాజకీయ నాయకులూ, సినిమా వాళ్ళూనూ, వాళ్ళు మారరు. అయినా వాళ్ళ గొడవెందుకులెండి, ఎప్పుడూ ఉండేదే. ప్రస్తుతం మన అంటే, అచ్చం మనలాటివాళ్ళ సంగతికొద్దాము.

    ఎప్పుడైనా ట్రైనులోనో, బస్సులోనో ఓ చిన్న పాప కనిపించిందనుకోండి, ఎక్కడలేని ప్రేమా, అభిమానమూ పుట్టుకొచ్చేస్తుంది. ఊరికే ముద్దులూ, బుగ్గ నిమరడాలూ, నాలుకలు బయట పెట్టడాలూ, ళ్ళొ ..ళ్ళొ.. అనడాలూ, అడక్కండి మనం వేయని వేషాలుండవు. ఆ పిల్ల తల్లో తండ్రో కూడా ఎంతోమురిసిపోతాడు తన పిల్ల ఎంత ముద్దొస్తోందో అనుకుంటూ… “నమస్తే బోలో బేటా…అంకుల్ కో..” అంటూ బలవంత పెట్టేస్తారు. మరీ నానా, దాదా అంటే బావుండదేమో అని అంకుల్ అనేస్తాడు. అప్పుడు ఈయనకూడా ” పర్వా నహీ మైభీ చార్ బచ్చే కో దాదా/నానా హూ… ” అంటూ చెప్ప్తాడు. ఎలాగా ఆ పాపకి మాటలు రావూ, గొడవే లేదు. అక్కడదాకా బాగానే ఉంటుంది. వచ్చిన గొడవల్లా మనతోపాటు ఉండే ఇంటావిడ తోనే. ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేస్తుంది. ఓర్నాయనోర్నాయనోయ్.. ఎంతంత యాక్షన్ చేసేస్తున్నాడీయనా, ఇంట్లో, ఓ పావుగంట నడుం వాలుస్తానూ, ఓ సారి మనవణ్ణి చూడండీ అంటే ఎంత గొడవ చేసేస్తాడూ, అలాటిది బయట పిల్లలంటే ఇంత అభిమానమా, ఈసారి చెప్తానీయన సంగతి అనుకుంటుంది.

    అలాగే ఏ ట్రైనులోనో, పక్కన ఒంటరిగా, పిల్లలతో ప్రయాణం చేస్తున్న ఏ ఆడవారినైనా చూసేసరికి, ఎక్కడలేని chivalry వచ్చేస్తుంది.ఆవిడకి సంబంధించిన సామానంతా ఒబ్బిడిగా సద్దేయడం, అవసరమైతే పై బెర్తుమీద కూడా ఎత్తి పెట్టేయడం. వామ్మోయ్ వామ్మోయ్, అక్కడ గిన్నె ఇక్కడ పెట్టడానికి కూడా చిరాకు పడే మా ఇంటాయనే ఇంతంత చేసేస్తున్నాడూ… అనుకుంటుంది ఈ chivalrous భర్త గారి ఇల్లాలు…అక్కడే మరి అసలు సంగతంతా.. మనలో ప్రతీవారికీ నూటికి తొంభై మందిలో చూస్తూంటాము.అలాగని ఇదేమీ తప్పనడం లేదు. ఇంట్లో ఎవడు చేస్తాడండి బాబూ, ఒక్క రోజు చేసేమంటే జీవితాంతం ఓ unpaid slave లా బతకాలి. ఎప్పుడో అప్పుడప్పుడు ఇలా చేస్తే, పుణ్యానికి పుణ్యమూ, పేరుకి పేరూనూ !! స్వతహాగా ఎవరూ చెడ్డవారు కారు. ఏ నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప.

    అలాగే ఎవరింటికో వెళ్ళామనుకోండి, ఏదో వాళ్ళింట్లో వచ్చిన సమస్య చెప్తారనుకోండి, ఏదో వినేసూరుకోవచ్చా, అబ్బే ఎక్కళ్ళేని ఉచిత సలహాలూ ఇచ్చేయడం.అలా చేయకుండా ఉండవల్సిందండీ, ఓ టాక్సీ యో, ఆటో నో పిలిస్తే సరిపోయేదిగా, ఈమధ్యన ఓ ఫోను చేస్తే చాలు ఇంటికొచ్చేస్తుందీ… అంటూ, తన దగ్గరున్న ఫోను నెంబరుకూడా ఇచ్చేస్తాడు. మనతో ఉన్న ఇల్లాలనుకుంటుందీ..ఇక్కడకు రావడానికి ఓ ఆటో పిలిస్తే పోదా అన్నదానికి, నాకు నానా జ్ఞానబోధలూ చేసి, పడుతూ లేస్తూ బస్సులో తీసికొచ్చాడే ఈయనా, ఇదేమిటీ ఇలా సలహాలిచ్చేస్తున్నాడూ… అనుకుంటుంది…

    ఇప్పుడు అసలు విషయం లోకి వద్దాము. ఈ రోజుల్లో ఎంతమందికి ఉన్నదున్నట్టుగా మాట్టాడే ధైర్యం ఉంటుందండీ? వాళ్ళనేదో calling spade a spade అంటారుట. ఈమధ్యన ఎక్కడో అక్కడక్కడ తళుక్కుమంటూంటారు.Its a rare breed.

   ఈరోజుల్లో ప్రతీ వారికీ ” అందంగా కనిపించడం” అనేది ఓ obsession అయిపోయింది. ఇంట్లో ఎలా ఉన్నా సరే బయటకి వచ్చేటప్పటికి మాత్రం ఛకాఛక్ గా కనిపించాలి. వాటికోసం ప్రతీవారూ ఎంత ఖర్చైనా భరిస్తారు. డబ్బులున్నవాళ్ళైతే ప్లాస్టిక్ సర్జరీలూ గట్రా.సాదా సీదా జనాలైతే, అన్నిటిలోకీ జుట్టుకి రంగేసికోడం చాలా చోట్ల చూస్తూంటాము. అవునూ వేసికుంటారూ, మీకేం నష్టం, కావలిసిస్తే మీరూ Dye చేసికోండీ, లేదా మీ dieఏదో మీరు డయ్యండి అనకండి. ఎందుకంటే ఈవేళ్టి టపా ఆ విషయం గురించే మరి.

    ఈ రంగులేసికునేవారి కష్టాలు అడక్కండి. మొగాళ్ళకైనా, ఆడవారికైనా సరే, ఒక్కసారి మొదలెట్టారంటే జీవితాంతం చేసుకోవాలి. మొగాళ్ళ సంగతే తీసికోండి ఏదో అవసరార్ధం జుట్టు తీయించుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, పాపం మరీ కష్టం. తీయించుకున్నరోజు బాగానే ఉంటుంది. మర్నాటినుంచే, పెసలు నానబెట్టినప్పుడు వచ్చే మొలకల్లాగ, తెల్ల వెంట్రుకలు తొంగి చూస్తూంటాయి.

    భార్యాభర్తలిద్దరికీ ఈ అలవాటుంటే గొడవే లేదు.Made for each other అనేసికుంటారు. విడివిడిగా కొనుక్కోనఖ్ఖర్లేకుండా కలిసొస్తుంది. అదో సదుపాయం. ఇలాటి వారింటికి ఫోను చేయకుండా వెళ్ళకూడదుట. మనం వస్తున్నామని ఫోను చేస్తే, ఇప్పుడు పన్లో ఉన్నానూ, ఓ గంటాగి రండీ అనేస్తారు. ఏమిటో ఎవరి గొడవ వాళ్ళదీ. ఈ టపా ఎవరి మనోభావాలూ కించపరచాలని వ్రాసింది కాదు. పైనే చెప్పినట్టు ఎవరిష్టం వారిదీ. ఎవరికీ ఇంకోరిని విమర్శించే హక్కు లేదు. కానీ చెప్పానుగా నా ఈ రోజు టపా దానికి సంబంధించినదే. ఏదో సందర్భం వచ్చింది కదా అని వ్రాశాను.

    నిన్న మా ఇంటావిడ కిచెన్ కిటికీ లోంచి చూసేసరికి, మెట్ల మీద ఒకావిడ కూర్చుని ఉన్నారు. పక్కవారింటికి వచ్చారేమో అనుకుని లోపలకి వచ్చి కూర్చోమంది. నేనేదో కంప్యూటరు బ్రౌజు చేస్తూన్నవాడిని, ఎవరో వచ్చారూ అని హాల్లోకి వచ్చాను. మా పక్కనుండే ఆయనకి అక్కో/చెల్లెలో ట.హల్లో అన్నాను.మాటల్లో చెప్పారు ఆవిడ, ” I am working at Ordnance Factory….” అని. ఓహో మన జాతి పక్షేనన్నమాటా అనుకుని అక్కడే ఇంకో కుర్చీలో సెటిలైపోయాను, బోరు కొట్టడానికి ఓ బక్రా/ క్రీ దొరికిందిరా అనుకుంటూ… ఒకటా రెండా నలభైరెండేళ్ళ నిర్వాకం. వినేవాళ్ళుండాలే కానీ, కావలిసినన్ని కబుర్లు చెప్తాను.ఆ కబురూ ఈ కబురూ చెప్పి అన్నారావిడా..” I am retiring Next year.. .” అని. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, ఇదేమిటీ అంత వయసున్నట్టు లేదూ అప్పుడే రిటైర్మెంటంటోందీ ఈవిడా అనుకుని, ” You dont look like that...” అన్నాను. మామూలుగా అయితే “సంతూర్” యాడ్ లో లాగ, మెలికలు తిరిగిపోతారు. కానీ ఆవిడ చెప్పింది విని floor అయిపోయాను. అంత candid గా ఉంది..ఆవిడ చెప్పింది. ” Dont get carried away by color of my hair. I dye it.And its a pain to maintain it. Just waiting for my retirement day, I will just go and get it bobbed and stop dyeing..” అంతలా down to earth గా ఉండేవాళ్ళని ఎంతమందిని చూస్తాము? అందుకే ఈ టపా. అప్పుడప్పుడు అలాటివారుకూడా ఎదురవుతూంటారు… Life goes on....

    రంగులేసికోడం విషయంలో ఎవరినైనా కించపరిచినట్టు భావిస్తే క్షంతవ్యుణ్ణి ఏం చేస్తానూ ఏదో ఒకటి వ్రాయాలని ఆత్రం. అప్పటికీ మా ఇంటావిడ అంటూనే ఉంది. మీకెందుకండీ ఇంకోళ్ళ గొడవా? ఏమైనా అనుకోరూ వాళ్ళూ… అని.

%d bloggers like this: