బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– We get what we deserve…..

    ఈ టపాకి పెట్టిన శీర్షిక, ఆయనెవరో పెద్దాయన చెప్పారుట. నిజమే కదూ ! ఏదో పెద్దాయన చెప్పారని కాకపోయినా, ఒప్పుకోడానికి కొంచం కష్టమనుకోండి.అయినా నిజం నిజమే కదా ! ఉదాహరణకి చూడండి, నిన్నా మొన్నట్లో భాగ్యనగరం ఎడతెరిపి లేని వర్షానికి బలైపోయింది. కాలనీలకి కాలనీలు అతలాకుతలం అయిపోయాయి. ఎపార్టుమెంట్ల బేస్మెంట్లలోకి నీళ్ళొచ్చేసి, కార్లు కొట్టుకుపోయాయిట. పల్లంలో ఉండే చిన్న చిన్న ఇళ్ళల్లోకి నీళ్ళొచ్చేసి అపార నష్టాన్ని రుచి చూపించింది.ఇంక ప్రతీ వాళ్ళు టివీ ల్లోకి వచ్చేసి అయ్యోయ్ నాయనోయ్ మా బ్రతుకులిలా అయిపోయాయో అని గోల పెట్టేవారే. ఛాన్సు దొరికితే చాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టే ప్రతిపక్షాలు ఎప్పుడూ ఉండేవే. వాళ్ళు అధికారంలోకి వచ్చినా కొత్తగా ఒరిగేదేమీ లేదు.ప్రతీ వర్షాకాలంలోనూ సంవత్సరాల తరబడి మనందరమూ చూస్తూనే ఉన్నాము.ఈ ప్రభుత్వాలని ఎన్నుకున్నదీ మనమే కదా, ఇప్పుడేమీ చేయడం లేదో అని గోల పెట్టడం దేనికీ? అలాగని మనం మాత్రం చేస్తున్నదేమిటీ? ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జా చేసేయడం, ఓ డ్రైనేజీ మీద ఓ జోపిడీ వేసేసికోవడం, లేక ఇంకో రియల్ ఎస్టేట్ వాడు ఓ ఎపార్ట్మెంటు సముదాయం కట్టేయడం, మనమేమో ఎగేసుకుపోవడం మరి వర్షాలొచ్చినప్పుడు, ఆ నీళ్ళన్నీ ఎక్కడకి పోతాయిట? ఏదో underground drainage లాటివి కట్టి, ఎప్పుడైనా అవి choke అయితే దాన్ని బాగుచేయడానికి రోడ్లమీద manholes లాటివి కట్టారు. మనజనాలు చేసేదేమిటీ, అదేదో dust bin అనుకుని, చెత్తా చెదారమూ వాటిల్లో religeous గా పారేస్తూంటారు.మరి ఆ నీళ్ళు పైకి రోడ్లమీదకి కాక ఏ గంగలోకి వెళ్తాయి?
కార్పొరేషన్ వాళ్ళేమీ చేయలేదో అని గోలోటీ పైగా! మన పని మనం సరీగ్గా చేసికుంటే అన్నీ బాగానే ఉంటాయి. అందుకే We get what we deserve….

    అలాగే ఇదివరకటి ప్రముఖ రచయితలు ఈ మధ్యన అసలు వ్రాయడమే లేదో అని ఓ ఉవాచ. ఔనండీ వాళ్ళు వ్రాయరు. వారిలో ఉండే ఆ ఇఛ్ఛ ని చంపేసింది ఎవరూ, మనమే. ఇప్పుటి రోజుల్లో ఎక్కడ చూసినా ఈ బుక్కులూ, ఇంకోటీనూ. ఎవరికీ పుస్తకం కొని చదివే ఓపిక ఎవరికీ లేదు.ఆ మధ్యన మాకు తెలిసిన ఓ ప్రముఖ రచయితని అడిగాను, ఏమిటి సార్ మీ రచనలేవీ కనిపించడం లేదూ ఈ మధ్యనా అంటే ఆయనిచ్చిన సమాధానమే ఇది. ఓ పుస్తకం ప్రచురించాలంటే మామూలు విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడిన పని అది. పబ్లిషర్ కి వాటా ఉంటుంది, అమ్మేవాడికి వాటా ఉంటుంది, అన్నీ పోయిన తరువాత ఇంక ఆ రచయితకి మిగిలేది ఏమిటీ చిప్ప !!తన వాటాకొచ్చిన పుస్తకాలు, వాళ్ళింటికొచ్చిన మిత్రులకి ఓ సంతకం పెట్టి తాంబూలంలా ఇవ్వడమో, ఆయన్ని ఏ సన్మానికో పిలిచినప్పుడు, ఆ ఆర్గనైజర్లకి ఇచ్చుకోడమో. పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ రివ్యూలు వ్రాయించుకోడానికి ప్రతీ పత్రిక వాడికీ ఓ కాంప్లిమెంటరీ కాపీ పంపించుకోడం, పైగా వాటి పోస్టల్ ఖర్చులూ. ఇవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ళావిడ చేత చివాట్లూ, ఏమిటండీ ఇంటినిండా ఈ పుస్తకాలూ, ఇవేమైనా తిండి పెడతాయా అంటూ… ఇన్ని గొడవలు భరించడం కన్నా హాయిగా వ్రాయడమే మానేస్తే హాయీ అనుకుంటాడాయన. ఇంగ్లీషులో పుస్తకాలు మరీ వందల్లో ఉన్నా, పాపం మన తెలుగు పుస్తకాలు ఇంకా వందలోపే. అయినా పుస్తకాలు కొని చదివే ఓపికా సహనం ఎవరికీ లేదు.అలాగని వీళ్ళు ఓ సినిమాకి వెళ్ళి పెట్టే ఖర్చులో పాతిక శాతం కూడా ఉండదు.అందుకనే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీరమణ గారు, మీరు నవలలు ఎందుకు వ్రాయరూ అంటే, మొహమ్మాటానికి ఈ రోజుల్లో పెద్ద నవలలు వ్రాస్తే చదవడానికి పాఠకులెక్కడండీ అన్నారు.ఆయన ఉద్దేశ్యం అసలు కొనేవాళ్ళెక్కడండీ అని!అందుకే హాయిగా “కాలం” లో సెటిల్ అయిపోయారు. పొనీ కొనుఖ్ఖోనఖ్ఖర్లేదు, హాయిగా మీకు కావలిసిన పుస్తకాలు మీ ఇంటికే తెచ్చి ఇస్తామూ అని, ఓ లైబ్రరీ పెట్టి అందులో తెలుగు పుస్తకాలుంచితే, ఎవరో కొందరు పుస్తక ప్రియులు తప్ప, వాటి మొహమే చూడ్డానికి టైమే లేదు, మా పూణె లోని తెలుగు వారికి! అందుకే We get what we deserve….

   ఇవన్నీ ఓ ఎత్తూ, ఈమధ్యన ఓ ప్రముఖ బ్లాగరు, తెలుగులో ” మంచి” బ్లాగులు రావడం లేదని రెండు భాగాల్లో ఓ టపా వ్రాశారు. ఆ టపా మీద మన intellectual readers అందరూ తమ తమ అభిప్రాయాల్ని వ్యక్త పరిచారు. వాటిని చదివిన తరువాత నిజం చెప్పాలంటే నవ్వొచ్చింది.ఎవరికి వారే–
” ఏమిటోనండీ ఈ మధ్యన అసలు ఏగ్రిగేటర్లు చూడాలంటేనే విసుగొస్తోందీ, ఎక్కడ చూసినా కాపీ పేస్టులూ, వార్తాపత్రికల్లోని విషయాలూ, ఏవేవో సినిమా కబుర్లూ etc..etc..” అని ఒకరూ.ఇంకా ఏవేవో అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఎవరిష్టం వారిదీ. కానీ ఇందులో పాఠకుల పాత్ర ఎంతవరకూ ఉందనేది కూడా ఆలోచించుకోవాలి. మూడేళ్ళనుండీ వ్రాస్తున్నాను కాబట్టి, నేనూ ఓ అభిప్రాయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను.

    తమ తమ అనుభవాలూ, అభిప్రాయాలూ వ్యక్త పరిచి మిగిలిన వారితో పంచుకోవాలని ప్రతీ వారికీ ఉంటుంది. ఏదో మన పేరు బ్లాగుల్లో కనిపిస్తే ఈ virtual world లో కనిపిస్తే బావుంటుందీ అనుకుని ఓ బ్లాగు మొదలెడతారు. మొదట్లో పాఠకులందరి దగ్గరనుంచీ స్పందనలు వచ్చేస్తాయి. ” బ్లాగులోకంలోకి స్వాగతం” ” మీలాటి పెద్దవారు చెప్పే విషయాలు ఎంతో బావుంటాయీ..” ” మీరు వ్రాసినవి చదువుతూంటే, ఏదో మా బాబయ్యో, పెదనాన్నో, మావయ్యో మాట్టాడుతున్నట్టే ఉంటుందీ…” etc..etc…. అడక్కండి ఎత్తేస్తారు… ఇంక అ వ్రాసే పెద్దమనిషి కూడా, ఓహో మనం ఇంత బాగా రాస్తామన్న మాట, ఎంతమంది చదువుతున్నారో కదూ అనుకుంటూ, ప్రతీ రోజూ పొద్దుటే లేవగానే పళ్ళేనా తోముకోకుండా మెయిళ్ళు చూడ్డం, తను ముందు రోజు వ్రాసిన టపాకి ఏమైనా స్పందనలు వచ్చాయా అని. ఏదో ఓ ఏడాదివరకూ బాగానే ఉంటుంది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. పేకాట ఆడేవాళ్ళని చూడండి, లేదా తాగే వాళ్ళని చూడండి, చుట్టుపక్కలుండేవాళ్ళే అసలు పురెక్కిస్తారు. నషా నెత్తికెక్కేస్తుంది.ఈ ఆడేవాడి చావు వాణ్ణి చావనీయండి అనుకుని, చల్లగా జారుకుంటారు.వీడికేమో చేతిలో బాటిలో, లేక పేకముక్కలో మిగులుతాయి.తుపాగ్గుండుకోడూ కనిపించడు.

    అలాగే ఈ బ్లాగుల “మత్తు” లో పడ్డవాడు రాసుకుంటూ పోతాడు. అలాగని ఈ టపాలేమైనా ఊరికే వస్తాయా ఏదో విషయం గురించి ఆలోచించాలి, వాటికో అక్షర రూపం తేవాలి, వాటిని ” కొత్త టపా” లో పేస్టు చేసికోవాలి, మళ్ళీ వాటికి అలంకారాలు చేయాలి, ఎంతో కొంత సమయం కేటాయించాలి కదా.ఈ పడ్డ శ్రమకంతా ఆశించేది ఏమిటీ, టపాలు చదివేవారి దగ్గరనుంచి ఓ స్పందన, ఓ స్మైలీ.. బస్.. అదికూడా ఎక్కువేనంటారా? చెప్పొచ్చేదేమిటంటే, ఎక్కువ సంఖ్యల్లో వ్యాఖ్యలు చూడ్డానికి అలవాటు పడ్డ ప్రాణం, ఒక్కసారిగా nil comments చూసి, దిగాలు పడిపోతాడు.పాపం ఓ టపా వ్రాసుకుంటాడు ఏమిటో ఈమధ్య నా టపాలు నచ్చడంలేదేమో , పోనీ రాయడం మానేస్తే బాగుంటుందేమో అని. మళ్ళీ వ్యాఖ్యలొచ్చేస్తాయి. — ” అయ్యో మీ టపాలు చదువుతూనే ఉంటామండీ, ఎప్పుడూ ఒకే రకమైన కామెంటే పెట్టాలీ ” సూపర్..” అని,మళ్ళీ మళ్ళీ పెట్టేదేమిటిలే అని మానేస్తూంటామూ…” అని. అదేదో సామెత చెప్పినట్టు లేదూ– ఊళ్ళో ఉన్న ప్రతీ వాడినీ ఓ బిందెడు పాలు తెచ్చి పోయమంటే, ఒకడనుకున్నాడుట, నేనొఖ్ఖాణ్ణీ నీళ్ళు పోస్తే తెలుస్తుందా అనుకుని, నీళ్ళు తెచ్చి పోశాడుట.అలాగే ఎవడికి వాడే అనుకుని చివరకి అందరూ నీళ్ళే పోశారుట ! అలా ఉంది బ్లాగుల్లోని టపాల పరిస్థితి !

    అవతలివాడు ఏదో చెప్తూంటే మన స్పందన కూడా ఉండాలి. అప్పుడే రాసేవాడికీ ఉత్సాహంగా ఉండి ఇంకా వ్రాయకలుగుతారు. అంతే కానీ, పాఠకులు స్పందించడం మానేసి, బ్లాగులు బావుండడంలేదో అనడం బావుండలేదు. పోనీ అలాగని చదవడంలేదూ అనడానికీ వీల్లేదూ, dashboard లోకి వెళ్ళి చూస్తే, ఎంతమంది చదివారో తెలుస్తుంది. చివరకి ఏమౌతుందీ, ఇంతమంది చదివినా ఒక్కళ్ళకీ నచ్చలేదూ అనుకుని, ఆ రచయితకి నిరుత్సాహం వస్తుంది. అలా టపాలు వ్రాయడం మానేసిన వారెందరో ఉన్నారు. ఇలాటప్పుడు, మంచి టపాలు రావడం లేదో అనడం ఎంతవరకూ సమంజసం ? అందుకే We get what we deserve…..

%d bloggers like this: