బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఏమిటో ఈ మధ్య అమ్మవారు ఓ వారం ముందుగానే వచ్చేస్తున్నారు…

    క్రిందటేడాది వరలక్ష్మీవ్రతం రోజుకి ఇక్కడ పూణె లో ఉండడం లేదని, మా ఇంటావిడ అమ్మవారిని ఓ వారం ముందుగానే ఆహ్వానించేసింది. ఆవిడా వచ్చేసి, మమ్మల్నందరినీ ఆశీర్వదించేశారు. ఆవిడకీ ఈ పధ్ధతీ బాగుండినట్టే అనిపించింది కాబోలు, ఈ సంవత్సరం కూడా అలాగే కానిమ్మన్నట్టున్నారు.వరలక్ష్మి వ్రతం ( 27-07-2012) రోజున మా మకాం భాగ్యనగరంలో. నలభై ఏళ్ళనుంచీ ( మధ్యలో ఓ రెండు సంవత్సరాలు తప్పించి) ఏది చేసినా, చేయకపోయినా, వరలక్ష్మి వ్రతం మాత్రం ఆనవాయితీ తప్పకుండా చేసికుంటోంది.ఆ సందర్భంలో నిన్నంతా బిజీ బిజీ గా ఉన్నాము. ఇందులో నేను చేసేదేమీ లేకపోయినా, పాపం ఆ వెర్రిల్లాలు మాకోసమే కదా చేస్తున్నదీ అనుకుని, ఏదో నాకు తోచిందీ, తెలిసినవీ చేశాను.అంటే పేద్ద ఏమీ లేదు, తనకి కావలిసిన పూజా సామగ్రి, ప్రసాదాల్లోకి కావలిసిన సామాన్లూ, ఓ లిస్టు రాసేసికుని, Rama is a good boy… లాగ, ఓ రెండ్రోజులు ముందుగానే తెచ్చి పెట్టేశాను. ఏదైనా మర్చిపోయినా, దగ్గరలో ఉన్న దుకాణాలకి వెళ్ళి తేవొచ్చూ అని. ఆ తెచ్చిన సామాన్లన్నీ, విడిగా ( మడిగా) పెట్టుకుంటుందేకానీ, అన్నీ తెచ్చానా లేదా అని మాత్రం చూసుకోదు. పైగా ఏమైనా అంటే, ” చూసుకోడం ఎందుకండీ, నాకు తెలుసుగా మీరు అన్నీ తెస్తారనీ….” అంటూ డయలాగ్గోటీ. ఏదో అదృష్టం బాగుండి, ఈ విషయంలో మాత్రం నామీద పేద్ద నమ్మకం లెండి.ఏదో వెళ్ళిపోతోంది …..

    పెళ్ళైన కొత్తలో చెప్పారుట మా అమ్మగారు, మా ఇంట్లో తొమ్మిది రకాల ప్రసాదాలూ చేయడం ఆనవాయితీ అని. మా ఇంటావిడ కూడా మా కోడలు శిరీషకి చెప్పేసింది ఈ విషయం. దానితో మాకు ఈ తొమ్మిది పిండివంటలకి మాత్రం లోటు లేదు!పాపం ఆ అమ్మాయి కూడా, తెల్లారకట్ల మూడింటికల్లా లేచి, లెఖ్ఖ కట్టి మొత్తం తొమ్మిదీ తయారుచేస్తుంది. ఈసారి మాత్రం ఓ చిత్రం జరిగింది.

    మా ఇంటావిడ చెప్పేనుగా అర్ధరాత్రి దాటిన దగ్గరనుంచీ మొదలుపెడుతుంది, పన్లు. మనవడికిష్టం కదా అని క్యారెట్టు హల్వా మాత్రం తప్పకుండా చేస్తుంది. ఇంకో మనవడికిష్టం అని గులాబ్ జామ్ములూ. క్యారెట్టు హల్వా అంటే, ఆ క్యారెట్లు తురుముకోడం అవీ ఉంటాయి గా. ఇదివరకటి రోజుల్లో అయితే ఈ క్యారెట్లూ లేవూ, హల్వాలూ లేవు. కాలక్రమేణా వచ్చినా, వాటిని తురుము చేసికోడానికి,, అవేవో ఎండు కొబ్బరి తురిమే ఓ చిన్న స్టీలు దానితో పనైపోయేది. కానీ, ఈ కొత్త కొత్తగా, మార్కెట్ లోకి వచ్చే Food Processor ల ధర్మమా అని, ఆ క్యారెట్లన్నీ పై స్కిన్ తీసేసి, ఆ Food Processor లో వేసేస్తే హాయిగా నిమిషాల్లో పనైపోతోంది. ఈ మధ్యనే, మా పాత Food Processorమరీ ఎక్కువ చప్పుడు చేసేస్తోందని ( 12 సంవత్సరాలు విశ్వాసంగా పనిచేసింది, ఇంకా ఓపికుంది, అయినా ..) దానికి రిటైరుమెంటిచ్చేసి, ఓ కొత్తది Kenstar తీసికున్నాము. దానికేం వచ్చిందో ఠక్కు మని జామ్మైపోయింది. ఆ బ్లేడు రాదూ, దాన్ని తీయకుండా పనీ జరగదూ, పోనీ తురుమేనా సరీగ్గా అయిందా అంటే, నా అంత ముక్కలు. పైగా ఇంకా రుబ్బుకోవలసినవి ఇంకా ఉన్నాయి.

    పాపం పాతవి పాతవేనండీ అది ఓ మనిషవనీయండి, ఓ వస్తువవనీయండి. ఆపత్కాలంలో మనకి అవసరానికి వచ్చేసి, పని కానిచ్చేస్తాయి. వచ్చిన గొడవల్లా, మనం ఆ విషయం గుర్తించకపోవడమే!! మొత్తానికి, మా పాతది అటకమీద గుమ్ముగా పడుక్కున్న దానిని బయటకు తీసి, మొత్తానికి నిర్విఘ్నంగా పని చేసేసికుంది. చిత్రం ఏమిటంటే సాయంత్రం, మా ఇంటికెళ్ళినప్పుడు తెలిసిందీ, మా కోడలుక్కూడా ఇదే అనుభవం !Moral of the story ఏమిటంటే, మార్కెట్లో ఏవేవో వస్తున్నాయి కదా అని, అన్నాళ్ళూ పనిచేసిన వాటిని మరీ బయట పారేయఖ్ఖర్లేదు. ఓ అటకమీదో ఎక్కడో పడేస్తే దానిదారినది పడుంటుంది. ఎవరి కాళ్ళకీ చేతులకీ అడ్డం రాదు.అవసరానికి ఉపయోగపడేవి అవే !!!

    మొత్తానికి ప్రొద్దుట ఎనిమిదింటికల్లా, పూజ పూర్తిచేసికుని, తొమ్మిది రకాల ప్రసాదాలూ నైవేద్యం పెట్టేసికంది. పదకొండు గంటలకి అమ్మాయి వచ్చి, భోజనం చేసి వెళ్ళింది. మా ఇంటావిడ స్నేహితురాలు ఒకావిడ వచ్చి, వీళ్లిద్దరూ సాయంత్రం సౌందర్య లహరీ, లలితా సహస్రనామాలూ పారాయణ చేసికుని కార్యక్రమం పూర్తిచేసికున్నారు. సాయంత్రం మా ఇంటికి వెళ్ళి. మా ఇంట్లో కోడలు పూజ చేసికున్న అమ్మవారిని కూడా దర్శించుకుని, తనిచ్చిన తొమ్మిది ప్రసాదాలూ తీసికుని, మా లక్ష్మీదేవి ( మా మనవరాలు నవ్య), ‘ ఈవేళ రాత్రి నానమ్మ్త తోనే ఉంటానూ అనడం తో..” ఆ ముచ్చటకూడా తీర్చేసికుని, ఇంకో మనవరాలు తాన్యా, ఇంకో మనవడు ఆదిత్యలతో గడిపి, అగస్థ్య తో కబుర్లు చెప్పి ఇంటికొచ్చాము.

    కింద పెట్టిన తొమ్మిది ప్రసాదాలూ, ఏదో file photo అనుకోకండి. పైన ఇచ్చిన లింకులో చూస్తే తెలుస్తుంది… కిందటేడాది రవ్వ లడ్డూలూ, మైసూరు పాక్ ఈ ఏడాది లేదు… అదండీ విషయం వాటి బదులుగా బూరెలూ, కజ్జికాయలూనూ…

   ఏదో ఆ అమ్మవారి ధర్మమా అని కాలక్షేపం చేసేస్తున్నాము……

%d bloggers like this: